ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంట్, 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 20,17,030 మంది ఓటర్లు ఉండగా, 2,291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి 27 మంది, జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 143 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు 15, 362 మంది సిబ్బందిని నియమించారు. వీరికి రెండు విడతల్లో ఎన్నికలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బ్యాలెట్ అందజేశారు. వీరితో పాటు మరో 374 మంది సర్వీస్ ఓటర్లు , ఎన్నికల విధులో పాల్గొంటున్న సిబ్బంది 14,097 మంది ఉండగా, వారిలో 12,547 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను మే 16వ తేదీ ఉదయం 7.55 నిమిషాలలోపు అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.
ఎన్నికల తీరును పరిశీలించేందుకు 243 రూట్లను ఏర్పాటు చేసి 232 మంది సెక్టార్ అధికారులను నియమించారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది మంగళవారం ఉదయం రెవెన్యూ డివిజన్ కేంద్రాల నుంచి సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని తరలించేందుకు 328 ఆర్టీసీ, 279 ప్రైవేట్ బస్సులు, సెక్టార్ అధికారులకు 243 కార్లు ఏర్పాటు చేశారు. కాగా పోలింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు.
వెబ్‌కాస్టింగ్‌తో చిత్రీకరణ...
ఈ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 1,209 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 1388 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, లెక్చరర్లకు శిక్షణ ఇచ్చారు. వీరంతా ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా చిత్రీకరించనున్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఆయా మండల కేంద్రాల్లో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కమ్యూనికేషన్ లేని ప్రాంతాల్లో సైతం శాటిలైట్ ద్వారా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మరికొన్ని చోట్ల సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశారు. వీరు ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగానికి అందజేస్తారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 281 అతి సమస్యాత్మక, 424 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. కాగా, జిల్లాలో 248 కేంద్రాలు ఎల్‌డబ్ల్యూ ఈ ప్రాంతాలలో ఉన్నాయి.
నియోజకవర్గాల వారీగా సిబ్బంది...
ఎన్నికల నిర్వహణకు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,082 మంది పీవో, ఏపీవోలతో పాటు 10,288 మంది ఇతర సిబ్బందిని నియమించారు. ఓటర్లను క్యూలో ఉంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బందితో పాటు ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్స్ 500 మందిని నియమించారు. ఈసారి ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటరు స్లిప్‌లను బీఎల్‌వోలు పంపిణీ చేశారు. ఈ స్లిప్‌లు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఆరుగురు ఎన్నికల సిబ్బందితో పాటు పోలీస్, ఇతర సిబ్బందిని నియమించారు. పినపాక నియోజకవర్గంలో 436 మంది, ఇల్లెందులో 484 మంది, ఖమ్మంలో 550, పాలేరు 530, మధిర 522, వైరాలో 434, సత్తుపల్లిలో 540, కొత్తగూడెంలో 514, అశ్వారావుపేటలో 452, భద్రాచలంలో 620 మంది పీవో, ఏపీవోలను నియమించారు.
ఈవీఎంలు సిద్ధం....
10 నియోజకవర్గాలకు గాను 10,200 బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, 5530 కంట్రోల్ యూనిట్లు కేటాయించారు. జిల్లాకు కేటాయించిన ఈవీఎంలన్నీ అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించినవి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 1610 కంట్రోల్ యూనిట్లు, 3,220 బ్యాలెట్ యూనిట్‌లు ఏర్పాటు చేశారు. ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో 250 కంట్రోల్ యూనిట్లు, 500 బ్యాలెట్ యూనిట్‌లను ఏర్పాటు చేశారు. ఇక మిగితా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్ల వివరాలిలా ఉన్నాయి. పినపాకలో 199, ఇల్లందులో 218, భద్రాచలంలో 264, పాలేరులో 241, వైరా 198, సత్తుపల్లి 246, కొత్తగూడెం 234, అశ్వారావుపేట 206 ఈవీఎంలను కేటాయించారు.
మొత్తం ఓటర్లు 20,17,030 మంది...
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 20,17,030 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 9,97,366 మంది పురుషులు,10,19,538 మంది మహిళలు, 126 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 2,64,024 మంది ఓటర్లు, అత్యల్పంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,67,493 మంది ఉన్నారు.
పోరు నేడే
Published Wed, Apr 30 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement