ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులకు సూచించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జూన్ 1న అర్ధరాత్రి బాణసంచా పేల్చి స్వాగతం పలకాలని, ఆ తర్వాత తెలంగాణ గీతాలు ఆలపించాలని చెప్పారు. 2వ తేదీ ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్‌లో పావురాలు ఎగురవేసి, భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు.
కళాక్షేత్రం వద్ద బెలూన్‌లు ఎగురవేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు, స్వశక్తి సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ పాఠశాలల ఉపాధ్యాయులకు, అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చురుకుగా పనిచేసిన సిబ్బందిని, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులను సన్మానించనున్నట్లు వివరించారు. ఇందుకోసం అర్హులైన వారి జాబితాలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇదే రోజున భక్తరామదాసు కళాక్షేత్రంలో బతుకమ్మ, తదితర తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొని బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కోరారు. సమావేశంలో జేసీ కె.సురేంద్రమోహన్, ఆర్డీవో సంజీవరెడ్డి, మెప్మా పీడీ వేణుమనోహర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భానుప్రకాష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జగన్‌మోహన్‌రెడ్డి, హౌసింగ్ పీడీ భాస్కర్, జేడీ (ఎ) భాస్కర్, ఎల్‌డీఎం శ్రీనివాస్, డ్వామా పీడీ వెంకటనర్సయ్య, సమాచార శాఖ సహాయ సంచాలకులు ఎం.వెకంటేశ్వర ప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మరియన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘తెలంగాణ’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
Published Thu, May 29 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement