ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. జిల్లాలో ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ విడుదల చేయనున్నారు. గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన ప్రకారం జిల్లాలోని 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైనందున భద్రాచలం నియోజకవర్గంలో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బుధవారం నుంచి ఈనెల 9 వరకు (ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యన) నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. ఉపసంహరణకు 12 వరకు అవకాశమిస్తారు. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించి, మే 16న ఫలితాలు వెల్లడిస్తారు.
ఏర్పాట్లు పూర్తి ....
ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంతా్రంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికల పరిశీలకులతో పాటు ఖర్చుల నమోదుకు కూడా పరిశీలకులను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వృద్ధ, వికలాంగ ఓటర్ల కోసం ర్యాంప్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. భద్రాచలం డివిజన్‌లో ఆరు పోలింగ్ సెంటర్లలో శాటిలైట్ ద్వారా ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారు.
ఈ డివిజన్‌లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్‌ను ఉపయోగించుకునేందుకు కూడా ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 19,71,797 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 9,75,432 మంది మహిళలు, 9,96,254 మంది పురుషులు, 111 మంది ఇతరులు ఉన్నారు. అయితే గత నెల 31 వరకు దరఖాస్తు చేసుకున్న అర్హత గల వారికి కూడా ఓటు హక్కు రానుండడంతో ఓటర్ల సంఖ్య పెరగనుంది.
డిపాజిట్ల వివరాలిలా..
పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీచేసే అభ్యర్థులు రూ. 25 వేలు, అసెంబ్లీకి పోటీచేసే వారు రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ అభ్యర్థులు రూ.5 వేలు, పార్లమెంట్ అభ్యర్థులు రూ.12,500 చెల్లించాలి.
నామినేషన్లు వేసేది ఇక్కడే...
జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేష్ వ్యవహరించనున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి కలెక్టరేట్‌లో, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వరంగల్ కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. పినపాక అసెంబ్లీకి మణుగూరు తహశీల్దార్ కార్యాలయంలో, ఇల్లందు నియోజకవర్గానికి ఇల్లందు తహశీల్దార్ కార్యాలయంలో, ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో, పాలేరు నియోజకవర్గానికి ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో, మధిర నియోజకవర్గానికి మధిర తహశీల్దార్ కార్యాలయం, వైరా నియోజకవర్గానికి వైరా తహశీల్దార్ కార్యాలయం, సత్తుపల్లి నియోజకవర్గానికి సత్తుపల్లి తహశీల్దార్ కార్యాలయం, కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో, అశ్వారావుపేట నియోజకవర్గానికి అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయంలో, భద్రాచలం నియోజకవర్గానికి భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
నేడు ‘సార్వత్రిక’ నోటిఫికేషన్
Published Wed, Apr 2 2014 2:41 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement