ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘బాధ్యతలను పంచుకుందాం.. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం... ఈ ప్రాంత ప్రజల ఆరు దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్రం నేడు సాకారమైంది.. సుదీర్ఘ పోరాటాలు.. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది’ అని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మహోద్యమంలో పాల్గొని అమరులైన వారందరికీ జోహార్లు అర్పించారు. ప్రజల చిరకాల వాంఛ సాకారమైనందున తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు, ఆయన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనులకు తెలంగాణ పుట్టినిల్లని, భిన్నజాతులు, కులాలు, వేషభాషలు, సంస్కృతి కలిగిన ప్రజలు ఉన్నారని చెప్పారు. కృష్ణ, గోదావరి, మానేరు, మంజీరా, మూసీ వంటి ఎన్నో నదులు, వాగులు, సహజ వనరులు కలిగిన ఈ ప్రాంతంలో కాకతీయులు తవ్వించిన చెరువులు ఇప్పటికీ రైతుల పాలిట కల్పతరువుగా ఉన్నాయని వివరించారు. అపార ఖనిజ నిల్వలు ఈ ప్రాంతానికి సొంతమని, చేనేత, శిల్పకళ, వెండి నగిషీలు, చిత్రకళ వంటి కళారూపాలు తెలంగాణకు గొప్ప కీర్తిని తెచ్చాయని అన్నారు.
బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపాలని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు, ఆలంపురం నుంచి కోటిలింగాల వరకు ఎన్నో దేవాలయాలు పురాణ ప్రసిద్ధి పొందాయని తెలిపారు. దేశమంతటా తమ గొంతుకలు వినిపించిన వేద ఘనాపాటీలు తెలంగాణలో ఉన్నారన్నారు. పలు చారిత్రక కారణాలతో ఈ ప్రాంతం కొంతకాలం పరాయి పాలనలో ఉందని, స్వాతంత్య్రానంతరం నిజాం ప్రభుత్వం నుంచి విమోచనకు ఈ ప్రాంత వాసులు కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించిందని, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిందని చెప్పారు. తిరిగి 1969లో తెలంగాణ ఉద్యమం రూపుదాల్చిందని, ఆ పోరాటంలో 400 మంది అమరులయ్యారని తెలిపారు.
అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయన్నారు. 2001లో కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైందని.. నాటినుంచి నేటివరకు జరిగిన పరిణామాలను సోదాహరణంగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లాకు విశిష్టస్థానం ఉందని, ఉద్యమాల ఖిల్లాగా ఖ్యాతిని ఆర్జించిందని తెలిపారు. 1969లో అన్నాబత్తుల రవీంద్రనాధ్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టి ఉద్యమానికి పురుడు పోశారని అన్నారు. ఈ దీక్షతో కవులు, రచయితలు, మేథావులు, కళాకారులు, ఉద్యోగులు, సకలజనులు ఒక్కటై ముందుకు కదిలారని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేనేత, పాడి పరిశ్రమ, బొగ్గు గనులు, విద్యుత్, శిల్ప, స్వర్ణకారుల పరిశ్రమ ఎదగడానికి ఇక్కడ వనరులు ఉన్నాయని వివరించారు.
తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు నిబద్ధతతో సేవలందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టేందుకు పూర్తి సహకారం అందించాలన్నారు. కాళోజీ, జయశంకర్ సార్‌లను స్మరించుకుంటూ ఆదర్శవంతమైన తెలంగాణగా తయారు చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లాలోని అన్ని వర్గాల వారికి ఆయన అభినందనలు తెలిపారు. జేసీ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది చిరకాల స్వప్నం నెరవేరిందని, ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఎందరో త్యాగధనులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ పక్షాల కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
పాల్వంచలో త్వరలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో బొగ్గుగనులు, హెవీవాటర్ ప్లాంట్, గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అడవులు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందుండేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రణాళికలు రచించుకుని ఆ దిశగా పనిచేయాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సుకు అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలు సాగవుతాయని, ఆ దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాకు రెండు నెలల్లో స్టీల్ ప్లాంట్ వస్తుందని, రూ.30 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చెప్పారు.
దీంతో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది రూ.30 లక్షల విలువైన స్టీలు వస్తుందన్నారు. రెండు, మూడేళ్లలో స్టీల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు, రాజీవ్ యువశక్తి లబ్ధిదారులకు క లెక్టర్ రుణాలు అందజేశారు. ఇంకా ఈ సభలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రా జేందర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వర్‌రావు తదితరులు ప్రసంగించగా, వివిధ శాఖల అధికారులు, జిల్లా ప్రముఖలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
బాధ్యతలను పంచుకుందాం
Published Tue, Jun 3 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement