ఖమ్మం జెడ్పీసెంటర్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్ తొలి సమావేశం ఈనెల 29న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న సమావేశంలో జిల్లా అభివృద్ధిపై కొత్త పాలకవర్గం ఎలాంటి చర్యలు చేపడుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2011 మే 24న అప్పటి చైర్‌పర్సన్ గోనెల విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం జరిగింది.
అనంతరం ఆమె పదవీకాలం పూర్తికావటం, అప్పటి నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించక పోవటంతో సమావేశం జరిగే అవకాశం లేకుండా పోయింది. అయితే గత నెల 7న జిల్లా పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఆ వెంటనే సమావేశం నిర్వహిస్తారని అందరూ భావించినా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తొలి సమావేశం నిర్వహించేందుకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత ఆమోదం తెలపటంతో ఈ నెల 29న ముహూర్తంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తారు. అనంతరం జరిగే సర్వసభ్య సమావేశంలో వాటిని ఆమోదిస్తారు.
కొత్త పాలకులపై కోటి ఆశలు..
కొత్త పాలకవర్గమైనా తమ సమస్యలు పరిష్కరిస్తుందా అని జిల్లా ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇంతకాలం జడ్పీ చైర్మన్, సభ్యులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగలేదు. గ్రామ, మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో జిల్లా పరిషత్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు మళ్లించారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
సమస్యలపై చర్చ జరిగేనా...
ఒక వైపు నూతన రాష్ట్రంలో అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధి చెందుతుందనే ఆశ, మరో వైపు జిల్లా నుంచి ఏడు మండలాలు ఆంధ్రలో కలవడం, గోదావరి వరదలు, పంటనష్టం తదితర అంశాలు ప్రజలు, రైతులకు ఇబ్బందికరంగా మారాయి. దీంతో అందరి దృష్టి జిల్లా పరిషత్ నూతన పాలక వర్గం తొలి సమావేశంపైనే ఉంది. జిల్లా సమస్యలపై చర్చిస్తారా.. లేక స్థాయీ సంఘాల ఏర్పాటుతోనే సమావేశం ముగుస్తుందా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. జిల్లాలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ, గోదావరి వరదలతో నష్టపోయిన వారికి పరిహారంపై చర్చించి తీర్మానాలు చేస్తే అన్నదాతలకు ఉపయోగం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మంత్రులు హాజరయ్యేనా..?
జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి ఎవరూ లేకపోవడంతో తొలి జడ్పీ పాలక వర్గ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. మంత్రులు ఎవరైనా వస్తే జిల్లాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. ఇక ఈ సమావేశానికి 39 మంది జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోఅప్షన్ సభ్యులు హాజరుకానున్నారు.
స్థాయీ సంఘాలు ఇవే....
1 ప్రణాళిక, ఆర్థిక కమిటి, 2 గ్రామీణాభివృద్ధి కమిటి, 3 వ్యవసాయ కమిటి, 4 విద్యవైద్యం సేవల కమిటి, 5 స్త్రీ శిశు సంక్షేమ కమిటి ,6 సాంఘిక సంక్షేమ కమిటి, 7 పనుల కమిటీలను నియమించనున్నారు. ప్రాధాన్యత గల ప్రణాళిక, ఆర్థిక, పనుల కమిటీలలో చోటు కోసం పలువురు జడ్పీటీసీ సభ్యులు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
ముహూర్తం వచ్చేసింది
Published Tue, Sep 23 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement