సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను...టీచర్ వృత్తి మానేసి 14 ఏళ్ల పాటు పార్టీలో సేవ చేశాను. పార్టీ ఏ పని అప్పజెప్పినా... ఎన్ని కష్టాలొచ్చినా స్పోర్టివ్‌గా తీసుకుని పనిచేశా. నా కష్టానికి ఫలితం లభించింది. కష్టపడితే విజయం తథ్యం అని నాకు నమ్మకం ఏర్పడింది... ఐ యామ్ సో హ్యాపీ..’ అంటున్నారు జిల్లా తొలి మహిళ, జడ్పీ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికయిన గడిపల్లి కవిత.
తానేంటో పార్టీలోని అందరు నాయకులకు తెలుసని, తనకు మొదటి నుంచీ అండదండగా ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకుని జిల్లా అభివృద్ధికి కోసం కృషి చేస్తానని అంటున్నారు ఆమె. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా నుంచి కేబినెట్ హోదా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన కవిత జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయిన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
విశేషాలివి...
సాక్షి: జిల్లా తొలి మహిళగా, జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బాధ్యతలు కూడా స్వీకరించారు... మీ అనుభూతి ఎలా ఉంది?
జడ్పీ చైర్‌పర్సన్: తెలంగాణ రాష్ట్రంలోనే మా పార్టీ నుంచి తొలి జడ్పీచైర్మన్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. సహచర జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా ప్రజానీకం సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలోనికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా.
సాక్షి: మంచి విద్యార్థిగా ఉన్నత చదువులు చదివారు... గృహిణిగా సమర్థ బాధ్యతలు నిర్వహించారు.. లెక్చరర్‌గా, టీచర్‌గా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించారు.. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు....ఈ ప్రస్థానం మీకు ఎలా సాధ్యమైంది?
జడ్పీ చైర్‌పర్సన్: నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మా మామయ్య ట్రేడ్ యూనియన్ నాయకులు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ఉన్నా. నా భర్త నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మా కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. టీచర్ వృత్తి వదిలేసి పార్టీలో 14 ఏళ్లుగా పనిచేస్తున్నాను. గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను.
ఆ తర్వాత పార్టీలో అన్ని విషయాలు నేర్చుకున్నాను. లోటుపాట్లు తెలుసుకున్నాను. పార్టీ ఏ పని అప్పగించినా... ఎన్ని కష్టాలొచ్చినా స్పోర్టివ్‌గా తీసుకుని పనిచేశాను. మొదట్లో రాజకీయాలు కొంత ఇబ్బందిగా.. కష్టంగా అనిపించినా... ఆ తర్వాత అలవాటయిపోయింది... 14 ఏళ్ల అజ్ఞాతం తర్వాత పదవి వచ్చినట్టు ఫీలవుతున్నాను. నా కష్టానికి తగిన ఫలితం లభించింది... కష్టపడితే విజయం వచ్చి తీరుతుందన్న నమ్మకం కలిగింది. ఐ యామ్ సో హ్యాపీ.
సాక్షి: చైర్‌పర్సన్ ఎన్నిక సమయంలో కొంత టెన్షన్‌గా కనిపించారు. ఎన్నిక కాగానే రిలాక్స్ ఫీలయినట్టున్నారు.. మళ్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు... మీరు సున్నిత మనస్కులని భావించవచ్చా..?
జడ్పీ చైర్‌పర్సన్: అలా ఏమీ లేదండీ... నేనేమీ టెన్షన్ ఫీల్ కాలేదు. పార్టీలో నాయకులందరికీ నేనేంటో తెలుసు కాబట్టి... నన్నే చైర్‌పర్సన్ చేస్తారని అనుకున్నా. రిలాక్స్‌డ్‌గానే ఉన్నా... పార్టీకి చేసిన సేవకు మంచి గుర్తింపు ఉంటుందని భావించా... అయితే బాధ్యతల స్వీకరణ సమయంలో ఆనందాన్ని తట్టుకోలేక ఉద్వేగానికి లోనయి ఆనందభాష్పాలు రాల్చాను.
సాక్షి: జిల్లా అభివృద్ధిలో మీ ప్రథమ ప్రాధాన్యాలేంటి? ఏయే అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తారు?
జడ్పీ చైర్‌పర్సన్: విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే నా ప్రథమ ప్రాధాన్యత. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తా. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీసం రహదారి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల పక్షాన నిలబడతా. గిరిజన ఉపప్రణాళిక, ఐటీడీఏ నిధులతో ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తా.
కష్టానికి ఫలితం దక్కింది
Published Fri, Aug 8 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement