ఉన్నత విద్యను అభ్యసించింది.. ఉపాధ్యాయురాలిగా వృత్తి ధర్మం నెరవేర్చింది.. విద్యావంతులుగా తీర్చిదిద్దింది.. ఈ క్రమంలోనే రాజకీయంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎన్నో అవమానాలు, అవాంతరాలను అధిగమించి.. జిల్లాస్థాయిలో కీలక పదవికి చేరుకున్న ఆమె.. కష్టం, అవమానాలు, ఏవగింపు మాటలకు బెదరకుండా మరింత కసి.. పట్టుదలతో రాజకీయాలను చాలెంజ్‌గా తీసుకున్నానని చెబుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చైర్‌పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి’ ప్రతినిధి ముఖాముఖి.
మహిళగా మీ రాజకీయ ప్రవేశం సాహసమేనా?
పెద్దగా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం మాది. పైగా సంప్రదాయాలు, కట్టుబాట్లకు నెలవైన కుటుంబ నేపథ్యం తో నేను రాజకీయాల్లోకి రావడమే సాహసంగా మారింది. చదువుకున్న మహిళగా.. రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని.. సమాజం కోసం పాటుపడాలని అంతర్లీనంగా ఎక్కడో ఒక ఆకాంక్ష నాలో విద్యార్థి దశనుంచే దాగి ఉండేది. బహుశా ఆ ఆకాంక్షే కట్టుబాట్లను, చివరికి అమ్మమాటను సైతం తోసి పుచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది.
రాజకీయ ఉన్నతికి మీకు తోడుగా నిలిచింది ఎవరు..?
రాజకీయాల్లో నిరాదరణకు గురైనప్పుడు కనుచూపు మేరలో ఎదిగే అవకాశాలు కనపడనప్పుడు.. ఒక మెట్టు ఎక్కేందుకు మహిళగా నా శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించడం మానేసి కిందకు లాగే ప్రయత్నం చేసినప్పుడు అందరూ అన్నట్లుగానే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశామా..? అన్న భావన కలిగేది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం, ఆయన ఇచ్చిన భరోసా రాజకీయంగా ఎదగడానికి టానిక్‌లా పనిచేసింది. నా రాజకీయ ఎదుగుదలలో అడుగడుగునా కనిపించేది మంత్రి తుమ్మలే. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి కోసం సాక్షాత్తు చంద్రబాబుతో ఖరాఖండిగా చెప్పడం వంటి అనేక రాజకీయ పరిణామాలు నన్ను రాజకీయ నేతగా నిలబెట్టాయి. భర్త కృష్ణప్రసాద్ ఇచ్చిన తోడ్పాటుతోపాటు ఏ అవకాశం వచ్చినా మహిళగా నన్ను ప్రోత్సహించిన మంత్రి తుమ్మలతోనే ఈ రాజకీయ ఉన్నతి సాధ్యమైంది.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉంటూ కుటుంబానికి మీరు ఇచ్చే సమయం..?
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి కచ్చితంగా బాధ్యతాయుతమైన పదవే. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు కుటుంబం కూడా అత్యంత ముఖ్యం. మహిళగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తా. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ ఉంటా. అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే నేనే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ అనేకమంది డాక్టర్ కోసం వేచి ఉంటే నేను ప్రజాప్రతినిధిని అన్న భావన లేకుండా అమ్మను వరుస క్రమంలో చూసే దాక వేచి ఉన్నా.
రాజకీయాలు సరిపడవని అన్నదెవరు..? దాని నేపథ్యం ఏమిటి..?
మా కుటుంబానికి పెద్దగా రాజకీయ నేపథ్యం లేదు. నాన్న కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో తిరిగే వారు. నాకు వివాహం అయిన తర్వాత నా భర్త కృష్ణప్రసాద్ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సింగరేణి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడిన చరిత్ర మా మామగారికి ఉంది. ఆ ధైర్యం, ఆ వారసత్వం పునరుద్ధరించాలనే రాజకీయాల్లోకి రావాలని నా భర్త కృష్ణప్రసాద్ తోడ్పాటును అందించారు. ఇక అమ్మ నా రాజకీయ ప్రవేశాన్ని ససేమిరా వద్దన్నది. అమ్మమాటను తోసిపుచ్చొద్దని అనుకున్నా.. అత్తింటి వారి తోడ్పాటుతో ఎంతటి అవాంతరాన్నైనా ఎదుర్కోవచ్చునన్న ధైర్యం నాలో కలిగింది. భర్తతో పాటు అత్తింటి వారు, మా బావగారు డాక్టర్ కనకరాజు అందించిన ప్రోత్సాహం అమ్మకు వివరించా.
రాజకీయ ప్రవేశానికి ముందు మీరేం చేసేవారు..?
నా రాజకీయ రంగ ప్రవేశం 2000లో అనుకోకుండా జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో అనూహ్యంగా నా పేరు టీడీపీ తరుపున తెరపైకి వచ్చింది. అప్పటి వరకు నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. ఆ ప్రాంతంలో సుపరిచితురాలిగా ఉండటం. మా కుటుంబానికి మంచి నేపథ్యం ఉండటం వంటి సానుకూల కారణాలు నన్ను చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ ఎంపిక చేసేందుకు కారణాలుగా నిలిచాయి. మంత్రి తుమ్మల నన్ను ప్రోత్సహించి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీచేయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయా. అప్పటినుంచి రాజకీయ కష్టాలను అధిగమించే పనిలోనే నిమగ్నమయ్యా. 2014లో కాని నాకు మళ్లీ మంత్రి తుమ్మల ఆశీస్సులతోనే జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యే అవకాశం రాలేదు. దాదాపు 13 సంవత్సరాలు రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కోక తప్పలేదు. ఆదరించే వారి కన్నా.. అవమానించే వారే రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారని ఒక్కోసారి ఆవేదన కలిగేది.
రాజకీయంగా మీ భవిష్యత్ కార్యాచరణ..?
రాజకీయాల్లో అనుకున్నవి జరగడం.. ఆశించిన పదవులు రావడం అనేది ఎవరికీ జరిగే పనికాదు. నిబద్ధతతో రాజకీయాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తే అవకాశాలు అవే వస్తాయని నమ్మే వారిలో నేను ముందు వరుసలో ఉంటా. ఇందుకు నా రాజకీయ జీవితమే ఉదాహరణ. అవకాశాల కోసం వెంపర్లాడకుండా.. చెప్పిన పని చేసుకు పోవడమే అర్హత ఏమోనని అనుకున్నా. భవిష్యత్తులో సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తా. రాజకీయ పయనం ఇంతటితో ఆపాలని లేదు.
టీడీపీ, టీఆర్‌ఎస్‌ల్లో ఎందులో మీరు సౌకర్యంగా ఉన్నారు..?
రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండే సౌకర్యం ఆ పార్టీలో ఉంటుంది. టీడీపీలో నా కోసం పోరాడిన నాయకులు ఉండటం నాకు ఒక వరం లాంటిది. అదే నాయకులు పార్టీ మారదాం. పరిస్థితులు మారాయని నచ్చజెపితే కాదనలేకపోయా. నా రాజకీయ భవిష్యత్ ఎవరిపై ఆధారపడి ఉందో వారే పార్టీ మారే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆనందంగా అంగీకరించా. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో లక్ష్మణరేఖ దాటడం తప్పదు. అలాగే నేను కూడా ఇంట్లో వారి మాట కాదని మంత్రి తుమ్మల సూచన మేరకు పార్టీ మారాను.
Comments
Please login to add a commentAdd a comment