minister Thummala Nageswara Rao
-
నాలుగేళ్లలో 3,155 కి.మీ. రోడ్లు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి రాష్ట్ర జాతీయ రహదారుల సగటు 2.2 కిలోమీటర్లు. అది జాతీయ రహదారుల సగటు (2.84 కిలోమీటర్లు) కంటే తక్కువ. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రహదారుల నిర్మాణానికి నడుం బిగించారు. పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అలా ఎన్నో రహదారులను సాధించుకున్నాం. కేంద్రం నుంచి వచ్చిన అనుమతులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు 4.1 కిలోమీటర్లకు చేరింది. నాలుగేళ్లలో 3,155 కిలోమీటర్ల నిడివి ఉన్న జాతీయ రహదారులు రాష్ట్రానికి వచ్చాయి’’అని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పలు రహదారులకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం హైదరాబాద్ రానున్నారని చెప్పారు. శుక్రవారం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి మెదక్ 765డీ జాతీయ రహదారిపై 62.92 కిలోమీటర్ల నిడివి గల రహదారికి గడ్కరీ శంకుస్థాపన చేస్తారు. ఆ రహదారి నిర్మాణం అంచనా రూ.426.52 కోట్లు. భూ సేకరణకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. దీనివల్ల హైదరాబాద్–నర్సాపూర్–కౌడిపల్లి–అప్పాజిపల్లి–రాంపూర్–మెదక్ పట్టణాల అనుసంధానం జరుగుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. మెదక్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ఆవలంబనకు దోహదపడుతుంది’’అని వివరించారు. ప్రాంతీయ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు హైదరాబాద్–బెంగళూరు 44వ జాతీయ రహదారిపై ఆరాంగఢ్–శంషాబాద్ మధ్య 10 కిలోమీటర్ల నిడివి గల రహదారిని ఆరు వరుసలుగా నిర్మిస్తామని తుమ్మల తెలిపారు. ఇది రాష్ట్ర రాజధానికి విమానాశ్రయాన్ని కలిపే అతి ముఖ్య రహదారని పేర్కొన్నారు. అంబర్పేట్ కూడలి వద్ద నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తామని వెల్లడించారు. హైదరాబాద్–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, హైదరాబాద్‌లో కోఠి–ఉప్పల్ మధ్య సిటీ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉప్పల్‌లో హైదరాబాద్–భూపాలపట్నం 202వ జాతీయ రహదారిపై 6.25 కిలోమీటర్ల నిడివిగల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తామని తెలిపారు. ప్రాంతీయ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని, సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, జగదేవ్‌పూర్, చేవెళ్ల, శంకర్పల్లి తదితర 330 కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుందని వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఇందుకు ఖర్చు కానుందని చెప్పారు. సెంట్రల్ రోడ్ ఫండ్ కింద రూ.వెయ్యి కోట్లు అడిగినట్లు తెలిపారు. గోదావరి తీరం వెంబడి పలు ప్రాజెక్టులను కలిపేలా రహదారి నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖలో రిటైరైన వారిని తీసుకోవడంపై విలేకరులు ప్రశ్నించగా, కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఙులను తీసుకుంటున్నామని తెలిపారు. కోదండరాం ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై వ్యాఖ్యానించడానికి తుమ్మల నిరాకరించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతిరెడ్డి పాల్గొన్నారు. నేడు నగరంలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన రూ.1,523 కోట్ల పనులకు శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనిలో భాగం గా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.1,523 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో హైదరాబాద్–బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్ 765డి లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచ డం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులున్నాయి. వీటికి గడ్కరీ శంకు స్థాపన చేస్తారు. రామంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు. -
ఆ ఐదూళ్లు తిరిగివ్వండి..!
‘మా నుంచి తీసుకున్నఐదూళ్లు తిరిగి ఇవ్వండి’అంటూ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను కోరుతోంది. ఈ ప్రతిపాదనతో కూడిన ఓ విన్నపాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. పోలవరం ముంపు మండలాలుగా పేర్కొంటూ గతంలో ఏపీ డిమాండ్‌తో తెలంగాణ నుంచి విడిపోయిన భూభాగంలోనే ఈ ఐదూళ్లు ఉన్నాయి. ఈ తాజా ప్రతిపాదనకు, ఆ ఏడు మండలాలు తరలిపోయిన వివాదానికి సంబంధం లేదు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. దేవాలయంతోపాటు భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ గ్రామాల అవసరం వచ్చింది. దీంతో వాటిని తెలంగాణకు తిరిగి కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను కోరింది. సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో మాడవీధులు, గాలి గోపురాలు.. పూర్తి కొత్త రూపు ఇవ్వనున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 27న శంకుస్థాపన..? ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ నెల 27న శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా అష్టమి.. నవమి తిథుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇష్టపడరు. ఇలాంటి సెంటిమెంట్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా శ్రీరామనవమి మరుసటి రోజు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. 26న జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ భద్రాచలం వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం పట్టాభిషేక మహోత్సవాలను తిలకించి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత కోసం ఉగాది రోజున సీఎంను కలసి చర్చించాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు నిర్ణయించారు. భద్రాచల శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రిక, పోస్టర్‌ను ఇద్దరు మంత్రులు ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ ఈఎన్సీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. 27న సీఎంతో లేదా ముఖ్యమంత్రి ఆదేశిస్తే చినజీయర్‌స్వామితో శంకుస్థాపన కార్యక్రమం కొనసాగుతుందని మంత్రులు పేర్కొన్నారు. ఐదు గ్రామాలను కలుపుకుని అభివృద్ధి.. భద్రాచలం పట్టణానికి టెంపుల్ టౌన్ హోదా ఇవ్వాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. దీనికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయముంది. ఇప్పుడు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందున పనిలోపనిగా టెంపుల్ టౌన్‌గా మార్చాలన్న ప్రతిపాదన సీఎం పరిశీలనకు వచ్చింది. అయితే భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్తగా స్థలం అవసరమైతే సేకరించటం కష్టంగా మారింది. భద్రాచలానికి ఓవైపు గోదావరి ఉండగా, మిగతా రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ భూభాగమే ఉంది. దీంతో ఆ రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని ఊళ్లను తమకు ఇవ్వాలంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరింది. ఎటపాక, లక్ష్మీపురం, పురుషోత్తమపట్నం, పిచుకలపాడు, కన్నాయి గూడెం గ్రామ పంచాయతీలను తెలంగాణ కోరింది. వీటితోపాటు గుండాల అనే ఆవాస ప్రాంతాన్ని కూడా కోరింది. యాదాద్రి తరహాలో చేపడతాం.. భద్రాచలం ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. వీటితో పనులు మొదలవుతాయి. భవిష్యత్తులో ఇతర పనులు జోడిస్తే బడ్జెట్ పెరుగుతుంది. యాదాద్రి తరహాలో ఎంత ఖర్చయినా సరే పనులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే ఈ నెల 27నే పనులు మొదలవుతాయి’ – మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
అమ్మ వద్దన్నా.. ధైర్యం చేశా...
ఉన్నత విద్యను అభ్యసించింది.. ఉపాధ్యాయురాలిగా వృత్తి ధర్మం నెరవేర్చింది.. విద్యావంతులుగా తీర్చిదిద్దింది.. ఈ క్రమంలోనే రాజకీయంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎన్నో అవమానాలు, అవాంతరాలను అధిగమించి.. జిల్లాస్థాయిలో కీలక పదవికి చేరుకున్న ఆమె.. కష్టం, అవమానాలు, ఏవగింపు మాటలకు బెదరకుండా మరింత కసి.. పట్టుదలతో రాజకీయాలను చాలెంజ్‌గా తీసుకున్నానని చెబుతున్న జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం: చైర్పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి’ ప్రతినిధి ముఖాముఖి. మహిళగా మీ రాజకీయ ప్రవేశం సాహసమేనా? పెద్దగా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం మాది. పైగా సంప్రదాయాలు, కట్టుబాట్లకు నెలవైన కుటుంబ నేపథ్యం తో నేను రాజకీయాల్లోకి రావడమే సాహసంగా మారింది. చదువుకున్న మహిళగా.. రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని.. సమాజం కోసం పాటుపడాలని అంతర్లీనంగా ఎక్కడో ఒక ఆకాంక్ష నాలో విద్యార్థి దశనుంచే దాగి ఉండేది. బహుశా ఆ ఆకాంక్షే కట్టుబాట్లను, చివరికి అమ్మమాటను సైతం తోసి పుచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. రాజకీయ ఉన్నతికి మీకు తోడుగా నిలిచింది ఎవరు..? రాజకీయాల్లో నిరాదరణకు గురైనప్పుడు కనుచూపు మేరలో ఎదిగే అవకాశాలు కనపడనప్పుడు.. ఒక మెట్టు ఎక్కేందుకు మహిళగా నా శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించడం మానేసి కిందకు లాగే ప్రయత్నం చేసినప్పుడు అందరూ అన్నట్లుగానే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశామా..? అన్న భావన కలిగేది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం, ఆయన ఇచ్చిన భరోసా రాజకీయంగా ఎదగడానికి టానిక్‌లా పనిచేసింది. నా రాజకీయ ఎదుగుదలలో అడుగడుగునా కనిపించేది మంత్రి తుమ్మలే. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కోసం సాక్షాత్తు చంద్రబాబుతో ఖరాఖండిగా చెప్పడం వంటి అనేక రాజకీయ పరిణామాలు నన్ను రాజకీయ నేతగా నిలబెట్టాయి. భర్త కృష్ణప్రసాద్ ఇచ్చిన తోడ్పాటుతోపాటు ఏ అవకాశం వచ్చినా మహిళగా నన్ను ప్రోత్సహించిన మంత్రి తుమ్మలతోనే ఈ రాజకీయ ఉన్నతి సాధ్యమైంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉంటూ కుటుంబానికి మీరు ఇచ్చే సమయం..? జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కచ్చితంగా బాధ్యతాయుతమైన పదవే. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు కుటుంబం కూడా అత్యంత ముఖ్యం. మహిళగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తా. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ ఉంటా. అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే నేనే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ అనేకమంది డాక్టర్ కోసం వేచి ఉంటే నేను ప్రజాప్రతినిధిని అన్న భావన లేకుండా అమ్మను వరుస క్రమంలో చూసే దాక వేచి ఉన్నా. రాజకీయాలు సరిపడవని అన్నదెవరు..? దాని నేపథ్యం ఏమిటి..? మా కుటుంబానికి పెద్దగా రాజకీయ నేపథ్యం లేదు. నాన్న కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో తిరిగే వారు. నాకు వివాహం అయిన తర్వాత నా భర్త కృష్ణప్రసాద్ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సింగరేణి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడిన చరిత్ర మా మామగారికి ఉంది. ఆ ధైర్యం, ఆ వారసత్వం పునరుద్ధరించాలనే రాజకీయాల్లోకి రావాలని నా భర్త కృష్ణప్రసాద్ తోడ్పాటును అందించారు. ఇక అమ్మ నా రాజకీయ ప్రవేశాన్ని ససేమిరా వద్దన్నది. అమ్మమాటను తోసిపుచ్చొద్దని అనుకున్నా.. అత్తింటి వారి తోడ్పాటుతో ఎంతటి అవాంతరాన్నైనా ఎదుర్కోవచ్చునన్న ధైర్యం నాలో కలిగింది. భర్తతో పాటు అత్తింటి వారు, మా బావగారు డాక్టర్ కనకరాజు అందించిన ప్రోత్సాహం అమ్మకు వివరించా. రాజకీయ ప్రవేశానికి ముందు మీరేం చేసేవారు..? నా రాజకీయ రంగ ప్రవేశం 2000లో అనుకోకుండా జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో అనూహ్యంగా నా పేరు టీడీపీ తరుపున తెరపైకి వచ్చింది. అప్పటి వరకు నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. ఆ ప్రాంతంలో సుపరిచితురాలిగా ఉండటం. మా కుటుంబానికి మంచి నేపథ్యం ఉండటం వంటి సానుకూల కారణాలు నన్ను చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ ఎంపిక చేసేందుకు కారణాలుగా నిలిచాయి. మంత్రి తుమ్మల నన్ను ప్రోత్సహించి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీచేయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయా. అప్పటినుంచి రాజకీయ కష్టాలను అధిగమించే పనిలోనే నిమగ్నమయ్యా. 2014లో కాని నాకు మళ్లీ మంత్రి తుమ్మల ఆశీస్సులతోనే జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశం రాలేదు. దాదాపు 13 సంవత్సరాలు రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కోక తప్పలేదు. ఆదరించే వారి కన్నా.. అవమానించే వారే రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారని ఒక్కోసారి ఆవేదన కలిగేది. రాజకీయంగా మీ భవిష్యత్ కార్యాచరణ..? రాజకీయాల్లో అనుకున్నవి జరగడం.. ఆశించిన పదవులు రావడం అనేది ఎవరికీ జరిగే పనికాదు. నిబద్ధతతో రాజకీయాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తే అవకాశాలు అవే వస్తాయని నమ్మే వారిలో నేను ముందు వరుసలో ఉంటా. ఇందుకు నా రాజకీయ జీవితమే ఉదాహరణ. అవకాశాల కోసం వెంపర్లాడకుండా.. చెప్పిన పని చేసుకు పోవడమే అర్హత ఏమోనని అనుకున్నా. భవిష్యత్తులో సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తా. రాజకీయ పయనం ఇంతటితో ఆపాలని లేదు. టీడీపీ, టీఆర్ఎస్ల్లో ఎందులో మీరు సౌకర్యంగా ఉన్నారు..? రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండే సౌకర్యం ఆ పార్టీలో ఉంటుంది. టీడీపీలో నా కోసం పోరాడిన నాయకులు ఉండటం నాకు ఒక వరం లాంటిది. అదే నాయకులు పార్టీ మారదాం. పరిస్థితులు మారాయని నచ్చజెపితే కాదనలేకపోయా. నా రాజకీయ భవిష్యత్ ఎవరిపై ఆధారపడి ఉందో వారే పార్టీ మారే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆనందంగా అంగీకరించా. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో లక్ష్మణరేఖ దాటడం తప్పదు. అలాగే నేను కూడా ఇంట్లో వారి మాట కాదని మంత్రి తుమ్మల సూచన మేరకు పార్టీ మారాను. -
సీఎం మహోన్నత లక్ష్యానికి ఊపిరి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత లక్ష్యానికి పాలేరు నియోజకవర్గం ఊపిరిలూది 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చుకున్న తొలి నియోజకవర్గంగా గుర్తింపు పొందిందని, కృష్ణ, గోదావరి నదుల అనుసంధానానికి సైతం ఖమ్మం జిల్లాలోనే అంకురార్పణ జరిగిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు వద్ద భక్తరామదాసు రెండోదశ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నీటిని విడుదల చేశారు. కాకరవాయిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం బృహత్తరమైందని, ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం ద్వారా తొలి దశలోనే నీరందించనున్నామని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పటి వరకు కృష్ణా జలాలతో నిండిన చెరువులకు.. గోదావరి జలాలు సైతం వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కావాలని పార్టీలు ఆందోళన చేయడం సహజమని, కాంగ్రెస్ పార్టీ మాత్రం సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ.. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలంటూ రైతులను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల పనులు సాగుకుం డా న్యాయ స్థానాలను ఆశ్రయించి రైతాంగం నోటి కాడి ముద్ద లాక్కునే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. సీతారా మ ప్రాజెక్టునకు ఈ నెలలోనే కేంద్ర ప్రభు త్వం నుంచి అటవీ అనుమతులు తీసుకొస్తామని, వచ్చేనెల వన్యప్రాణుల అనుమతులు, ఆపై పర్యావరణ అనుమతులు తీసుకు వస్తామని హరీశ్‌రావు వివరించా రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయం అంటే తెలియని సన్నాసులు ప్రభుత్వంపై పస లేని విమర్శలు చేస్తూ ప్రజల్లో పలచన అవుతున్నారని విమర్శించారు. సభలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, మదన్‌లాల్, కోరం కనకయ్య పాల్గొన్నారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతాం చెన్నారావుపేట(నర్సంపేట): కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వర్షాకాలంలోపు పూర్తి చేసి ఆ నీటితో రైతుల కాళ్లు కడుగుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లిలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి చే పట్టిన ‘పల్లె ప్రగతి’లో శుక్రవారం పా ల్గొన్నా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నెల రోజుల్లో కొత్త పంచాయతీలు సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 500కు పైగా జనాభా గల గ్రామాలు, గిరిజన తండాలు వచ్చే నెల రోజుల్లో గ్రామ పంచాయతీలుగా మారబోతున్నాయని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శుక్రవారం మంత్రులు తుమ్మ ల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు హరీశ్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. త్వరలో ఏర్పడే కొత్త పంచాయతీలను కలుపుకొని కొద్ది రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేందు కు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. -
తుమ్మల కాన్వాయ్కి తప్పిన ప్రమాదం
కూసుమంచి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్కి సోమవారం ప్రమాదం తప్పింది. ఆయన ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కూసుమంచిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో మతిస్థిమితంలేని ఓ వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ మంత్రి కారును పక్కకు తీసుకెళ్లాడు. మంత్రి కాన్వాయ్ స్పీడుగా వస్తుండటంతో హఠాత్ పరిణామంతో భద్రతా సిబ్బంది, స్థానికులు కంగుతిన్నారు. అనంతరం మంత్రి హైదరాబాద్ వెళ్లిపోగా.. సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అన్నం ఫౌండేషన్‌కు అప్పగించనున్నట్లు ఎస్ఐ రఘు తెలిపారు. -
కమ్మ జాతి పటిష్టతకు కలిసికట్టు కృషి
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం న్యూశాయంపేట : కమ్మ జాతి పటిష్టత, కులస్తుల అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ గార్డెన్లో కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ మాస సకుటుంబ సమారోహ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మందడి కోటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పౌరుషానికి మారుపేరైన కమ్మ కులస్తులు.. ఒంటరిగా ఉన్నప్పుడు గొప్పగా, అందరూ కలిస్తే బలహీనంగా ఉంటారని చమత్కరించారు. అందరూ కలిసి పనిచేస్తూ భవిష్యత్‌లో అన్ని సంఘాలకు మార్గదర్శకంగా పనిచేయాలన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎన్నోసార్లు ఎన్నికల్లో తనకు మనోధైర్యాన్ని ఇచ్చిన ఘనత కమ్మసంఘం వారేనని తెలిపారు. తన సీడీఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు సంఘం భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటగా, శరత్ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అలాగే, వివిధ రంగాల్లో సేవలందించిన వారిని సన్మానించిన మంత్రి కమ్మ సంఘం వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బాలకోటేశ్వర్రావు, చేకూరి కాశయ్య, కార్పోరేటర్ మాడిశెట్టి అరుణ, కమ్మసంఘం నాయకులు శ్రీరామకృష్ణ ప్రసాద్, రాంబాబు, పోలయ్య, హరిబాబు, సుబ్రమణ్యం, గోపాల్, గరికపాటి హన్మంతరావు, త్రిపురనేని గోపీచంద్, భాస్కర్‌రావు, కృష్ణారావు పాల్గొన్నారు. -
ఫ్లైఓవర్ ప్రారంభించిన తుమ్మల
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో నూతనంగా రూ. 31 కోట్లతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనను శుక్రవారం రోడ్డు రవాణా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం రూ.34 కోట్లోతో ఐటీడీఎ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన యువజన శిక్షణ కేంద్రాన్ని ఆయన ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. (బెల్లంపల్లి) -
కేంద్రం నుంచి అదనపు విద్యుత్‌కు కృషి
కేంద్రమంత్రి దత్తాత్రేయ కుషాయిగూడ : కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మరో 500 మెగావాట్ల అదనపు విద్యుత్ కేటాయించేలా కృషి చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం చర్లపల్లిలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు ఆయన రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పట్నం మహేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 24 గంటలు విద్యుత్ అందించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ శాఖవద్ద నున్న 5 లక్షల 25 కోట్ల ఈపీఎఫ్ నిధుల్లోంచి ప్రతి కార్మికునికి గూడు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు దీటుగా మౌలాలి, చర్లపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘తెలంగాణాకు ఎవరితో పోటీలేదు..ప్రధాని మోదీ గతంలో పాలించిన గుజరాత్ రాష్ట్రంతోనే పోటీపడుతుంది.. ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్నా నాలుగు సంవత్సరాల్లో మొదటి స్థానానికి చేరుకుంటాం’ అని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు చర్లపల్లి నుంచి బోగారం వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి రూ:95 కోట్లు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మూడోదశ కృష్ణాజలాలు నగరవాసులకు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రాంచందర్‌రావు, ఐలా ప్రతినిధులు మనోహర్‌రాజు, కట్టంగూర్ హరీష్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు గణేష్ ముదిరాజ్, కాసుల సురేందర్‌గౌడ్, నర్సింగ్‌రావు, లక్ష్మణ్‌గౌడ్, నాధం, ఆనంద్‌గౌడ్, వెంకులు, రజనీకాంత్‌రెడ్డి, రాములు యాదవ్, కడియాల పోచయ్య, రుద్రగోని రాంచందర్‌గౌడ్, బొడిగె రాజు తదితరులు పాల్గొన్నారు. -
'మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేశారు'
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా ఉన్నసమయంలో తెలంగాణకు అన్నివిధాలా అన్యాయం చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదివారం ఆరోపించారు. ఆదివారం మంత్రి తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. తన పదవిని కాపాడుకునేందుకే పొన్నాల లక్ష్మయ్య పాదయాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాదయాత్రలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా టీకాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మంత్రి తుమ్మల మండిపడ్డారు.