Gadipalli kavitha
-
జెడ్పీకి గుడ్‌బై..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2014 ఆగస్టు 7వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఆమె సుమారు 54 నెలలపాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. కవిత రాజీనామా జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా టీడీపీలో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీలో ఉన్నంతకాలం తుమ్మల అనుచరురాలిగా ఉన్న కవిత.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా) జెడ్పీటీసీగా గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో.. టీడీపీలో అప్పుడు కీలకంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో అనూహ్యంగా కవితను ఆ పదవి వరించింది. తన రాజకీయ గురువుగా భావించే తుమ్మల నాగేశ్వరరావుతోపాటే ఆమె 2014 సెప్టెంబర్‌లో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మధిర ‘అసెంబ్లీ’పై ఆసక్తి చూపి.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి ప్రదర్శించారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిత్వం లింగాల కమల్రాజుకు ఖరారైంది. శాసనసభ ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక తనకు రాజకీయ అండదండలు అందించిన వ్యక్తి ఓటమి చెందడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు కవిత శనివారం తనను కలిసిన విలేకరులకు వివరించారు. వెంకటాపురం జెడ్పీటీసీ పదవికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి తాను రాజీనామా చేశానని, అయితే టీఆర్ఎస్ పార్టీలో ఇక మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తానని రాజీనామా చేయడానికి రాజకీయ కారణాలతోపాటు కొన్ని వ్యక్తిగత కారణాలు సైతం ఉన్నాయని ఆమె వివరించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సాధారణ కార్యకర్తగా నిరంతరం కృషి చేస్తానన్నారు. చైర్‌పర్సన్‌గా తనను ఆదరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడా పదవి ఎవరికి..? జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పదవి ఎవరిని వరిస్తుంది..? ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ వరకు జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీ కాలం ఉంది. ఈలోపే జెడ్పీ చైర్పర్సన్ పదవికి కవిత రాజీనామా చేయడంతో పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఉన్న వారు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరఫున ఎన్నికై తుమ్మల నాగేశ్వరరావుతోపాటు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మల సన్నిహితుడిగా పేరొందిన బరపటి వాసుదేవరావును జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జిల్లా పరిషత్ పదవీ కాలం ముగిసే లోపు చైర్మన్ రాజీనామా చేస్తే వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీనేనని.. అదే తరహా సంప్రదాయం కొనసాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుపొందడంతో గడిపల్లి కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం లభించింది. 2014లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. పలు కీలక మండలాల జెడ్పీటీసీ పదవులను కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ కొనసాగుతోంది. మిగిలిన పదవీ కాలం రెండు నెలలే.. రెండునెలల్లో జిల్లా పరిషత్ పదవీకాలం ముగుస్తుండటంతో కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా.. వైస్ చైర్మన్‌కు చైర్మన్‌గా బా§ధ్యతలు అప్పగించే అవకాశం సైతం లేకపోలేదని చర్చ జరుగుతోంది. 2014లో 46 మండలాల జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు జరగ్గా.. రాష్ట్ర విభజన అనంతరం ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో 41 మండలాల జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి పలువురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరడంతో జిల్లా పరిషత్‌లో టీఆర్ఎస్ మెజార్టీ కలిగి ఉంది. వాసుకు చైర్మన్ గిరి దక్కేనా? పాల్వంచరూరల్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి గడిపల్లి కవిత రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌కు ఆ పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడు బరపటి వాసుదేవరావు ప్రస్తుతం జెడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 2014లో పాల్వంచ జెడ్పీటీసీగా టీడీపీ నుంచి విజయం సాధించిన ఆయన తుమ్మల నాగేశ్వరరావుతోపాటే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. తుమ్మలకు సన్నిహితుడనే పేరు కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. -
టీఆర్ఎస్కు షాక్.. జెడ్పీ ఛైర్పర్సన్ రాజీనామా
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గడిపల్లి కవిత పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్నన్‌కు అందజేశారు. గత కొంతకాలంగా పార్టీలో ఆమెకు సరైన ప్రాధ్యాన్యత ఇవ్వక పోవడంతో రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మధిర స్థానంలో పోటీ చేయాలని ఆమె భావించారు. కానీ మధిర టికెట్‌ను ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ వర్గానికి చెందిన లింగాల కమల్ రాజ్‌కు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీ చైర్‌పర్సర్‌గా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల ముందు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ కూడా పార్టీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. -
అమ్మ వద్దన్నా.. ధైర్యం చేశా...
ఉన్నత విద్యను అభ్యసించింది.. ఉపాధ్యాయురాలిగా వృత్తి ధర్మం నెరవేర్చింది.. విద్యావంతులుగా తీర్చిదిద్దింది.. ఈ క్రమంలోనే రాజకీయంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఎన్నో అవమానాలు, అవాంతరాలను అధిగమించి.. జిల్లాస్థాయిలో కీలక పదవికి చేరుకున్న ఆమె.. కష్టం, అవమానాలు, ఏవగింపు మాటలకు బెదరకుండా మరింత కసి.. పట్టుదలతో రాజకీయాలను చాలెంజ్‌గా తీసుకున్నానని చెబుతున్న జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం సాక్షిప్రతినిధి, ఖమ్మం: చైర్పర్సన్ గడిపల్లి కవితతో ‘సాక్షి’ ప్రతినిధి ముఖాముఖి. మహిళగా మీ రాజకీయ ప్రవేశం సాహసమేనా? పెద్దగా రాజకీయ నేపథ్యం లేని కుటుంబం మాది. పైగా సంప్రదాయాలు, కట్టుబాట్లకు నెలవైన కుటుంబ నేపథ్యం తో నేను రాజకీయాల్లోకి రావడమే సాహసంగా మారింది. చదువుకున్న మహిళగా.. రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి చేయాలని.. సమాజం కోసం పాటుపడాలని అంతర్లీనంగా ఎక్కడో ఒక ఆకాంక్ష నాలో విద్యార్థి దశనుంచే దాగి ఉండేది. బహుశా ఆ ఆకాంక్షే కట్టుబాట్లను, చివరికి అమ్మమాటను సైతం తోసి పుచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. రాజకీయ ఉన్నతికి మీకు తోడుగా నిలిచింది ఎవరు..? రాజకీయాల్లో నిరాదరణకు గురైనప్పుడు కనుచూపు మేరలో ఎదిగే అవకాశాలు కనపడనప్పుడు.. ఒక మెట్టు ఎక్కేందుకు మహిళగా నా శక్తినంతా కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించడం మానేసి కిందకు లాగే ప్రయత్నం చేసినప్పుడు అందరూ అన్నట్లుగానే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశామా..? అన్న భావన కలిగేది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం, ఆయన ఇచ్చిన భరోసా రాజకీయంగా ఎదగడానికి టానిక్‌లా పనిచేసింది. నా రాజకీయ ఎదుగుదలలో అడుగడుగునా కనిపించేది మంత్రి తుమ్మలే. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కోసం సాక్షాత్తు చంద్రబాబుతో ఖరాఖండిగా చెప్పడం వంటి అనేక రాజకీయ పరిణామాలు నన్ను రాజకీయ నేతగా నిలబెట్టాయి. భర్త కృష్ణప్రసాద్ ఇచ్చిన తోడ్పాటుతోపాటు ఏ అవకాశం వచ్చినా మహిళగా నన్ను ప్రోత్సహించిన మంత్రి తుమ్మలతోనే ఈ రాజకీయ ఉన్నతి సాధ్యమైంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఉంటూ కుటుంబానికి మీరు ఇచ్చే సమయం..? జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి కచ్చితంగా బాధ్యతాయుతమైన పదవే. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు కుటుంబం కూడా అత్యంత ముఖ్యం. మహిళగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తా. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తూ ఉంటా. అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోతే నేనే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ అనేకమంది డాక్టర్ కోసం వేచి ఉంటే నేను ప్రజాప్రతినిధిని అన్న భావన లేకుండా అమ్మను వరుస క్రమంలో చూసే దాక వేచి ఉన్నా. రాజకీయాలు సరిపడవని అన్నదెవరు..? దాని నేపథ్యం ఏమిటి..? మా కుటుంబానికి పెద్దగా రాజకీయ నేపథ్యం లేదు. నాన్న కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో తిరిగే వారు. నాకు వివాహం అయిన తర్వాత నా భర్త కృష్ణప్రసాద్ కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. సింగరేణి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడిన చరిత్ర మా మామగారికి ఉంది. ఆ ధైర్యం, ఆ వారసత్వం పునరుద్ధరించాలనే రాజకీయాల్లోకి రావాలని నా భర్త కృష్ణప్రసాద్ తోడ్పాటును అందించారు. ఇక అమ్మ నా రాజకీయ ప్రవేశాన్ని ససేమిరా వద్దన్నది. అమ్మమాటను తోసిపుచ్చొద్దని అనుకున్నా.. అత్తింటి వారి తోడ్పాటుతో ఎంతటి అవాంతరాన్నైనా ఎదుర్కోవచ్చునన్న ధైర్యం నాలో కలిగింది. భర్తతో పాటు అత్తింటి వారు, మా బావగారు డాక్టర్ కనకరాజు అందించిన ప్రోత్సాహం అమ్మకు వివరించా. రాజకీయ ప్రవేశానికి ముందు మీరేం చేసేవారు..? నా రాజకీయ రంగ ప్రవేశం 2000లో అనుకోకుండా జరిగింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో అనూహ్యంగా నా పేరు టీడీపీ తరుపున తెరపైకి వచ్చింది. అప్పటి వరకు నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నా. ఆ ప్రాంతంలో సుపరిచితురాలిగా ఉండటం. మా కుటుంబానికి మంచి నేపథ్యం ఉండటం వంటి సానుకూల కారణాలు నన్ను చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ ఎంపిక చేసేందుకు కారణాలుగా నిలిచాయి. మంత్రి తుమ్మల నన్ను ప్రోత్సహించి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీచేయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయా. అప్పటినుంచి రాజకీయ కష్టాలను అధిగమించే పనిలోనే నిమగ్నమయ్యా. 2014లో కాని నాకు మళ్లీ మంత్రి తుమ్మల ఆశీస్సులతోనే జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశం రాలేదు. దాదాపు 13 సంవత్సరాలు రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కోక తప్పలేదు. ఆదరించే వారి కన్నా.. అవమానించే వారే రాజకీయాల్లో ఎక్కువగా ఉంటారని ఒక్కోసారి ఆవేదన కలిగేది. రాజకీయంగా మీ భవిష్యత్ కార్యాచరణ..? రాజకీయాల్లో అనుకున్నవి జరగడం.. ఆశించిన పదవులు రావడం అనేది ఎవరికీ జరిగే పనికాదు. నిబద్ధతతో రాజకీయాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తే అవకాశాలు అవే వస్తాయని నమ్మే వారిలో నేను ముందు వరుసలో ఉంటా. ఇందుకు నా రాజకీయ జీవితమే ఉదాహరణ. అవకాశాల కోసం వెంపర్లాడకుండా.. చెప్పిన పని చేసుకు పోవడమే అర్హత ఏమోనని అనుకున్నా. భవిష్యత్తులో సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తా. రాజకీయ పయనం ఇంతటితో ఆపాలని లేదు. టీడీపీ, టీఆర్ఎస్ల్లో ఎందులో మీరు సౌకర్యంగా ఉన్నారు..? రాజకీయాల్లో ఏ పార్టీలో ఉండే సౌకర్యం ఆ పార్టీలో ఉంటుంది. టీడీపీలో నా కోసం పోరాడిన నాయకులు ఉండటం నాకు ఒక వరం లాంటిది. అదే నాయకులు పార్టీ మారదాం. పరిస్థితులు మారాయని నచ్చజెపితే కాదనలేకపోయా. నా రాజకీయ భవిష్యత్ ఎవరిపై ఆధారపడి ఉందో వారే పార్టీ మారే అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆనందంగా అంగీకరించా. కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో లక్ష్మణరేఖ దాటడం తప్పదు. అలాగే నేను కూడా ఇంట్లో వారి మాట కాదని మంత్రి తుమ్మల సూచన మేరకు పార్టీ మారాను. -
వీఐపీ రిపోర్టర్ : గడిపల్లి కవిత
-
కష్టానికి ఫలితం దక్కింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను...టీచర్ వృత్తి మానేసి 14 ఏళ్ల పాటు పార్టీలో సేవ చేశాను. పార్టీ ఏ పని అప్పజెప్పినా... ఎన్ని కష్టాలొచ్చినా స్పోర్టివ్‌గా తీసుకుని పనిచేశా. నా కష్టానికి ఫలితం లభించింది. కష్టపడితే విజయం తథ్యం అని నాకు నమ్మకం ఏర్పడింది... ఐ యామ్ సో హ్యాపీ..’ అంటున్నారు జిల్లా తొలి మహిళ, జడ్పీ చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికయిన గడిపల్లి కవిత. తానేంటో పార్టీలోని అందరు నాయకులకు తెలుసని, తనకు మొదటి నుంచీ అండదండగా ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకుని జిల్లా అభివృద్ధికి కోసం కృషి చేస్తానని అంటున్నారు ఆమె. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా నుంచి కేబినెట్ హోదా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన కవిత జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయిన అనంతరం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలివి... సాక్షి: జిల్లా తొలి మహిళగా, జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. బాధ్యతలు కూడా స్వీకరించారు... మీ అనుభూతి ఎలా ఉంది? జడ్పీ చైర్పర్సన్: తెలంగాణ రాష్ట్రంలోనే మా పార్టీ నుంచి తొలి జడ్పీచైర్మన్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తాను. సహచర జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా ప్రజానీకం సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలోనికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా. సాక్షి: మంచి విద్యార్థిగా ఉన్నత చదువులు చదివారు... గృహిణిగా సమర్థ బాధ్యతలు నిర్వహించారు.. లెక్చరర్‌గా, టీచర్‌గా ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించారు.. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు....ఈ ప్రస్థానం మీకు ఎలా సాధ్యమైంది? జడ్పీ చైర్పర్సన్: నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. మా మామయ్య ట్రేడ్ యూనియన్ నాయకులు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ఉన్నా. నా భర్త నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మా కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. టీచర్ వృత్తి వదిలేసి పార్టీలో 14 ఏళ్లుగా పనిచేస్తున్నాను. గతంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాను. ఆ తర్వాత పార్టీలో అన్ని విషయాలు నేర్చుకున్నాను. లోటుపాట్లు తెలుసుకున్నాను. పార్టీ ఏ పని అప్పగించినా... ఎన్ని కష్టాలొచ్చినా స్పోర్టివ్‌గా తీసుకుని పనిచేశాను. మొదట్లో రాజకీయాలు కొంత ఇబ్బందిగా.. కష్టంగా అనిపించినా... ఆ తర్వాత అలవాటయిపోయింది... 14 ఏళ్ల అజ్ఞాతం తర్వాత పదవి వచ్చినట్టు ఫీలవుతున్నాను. నా కష్టానికి తగిన ఫలితం లభించింది... కష్టపడితే విజయం వచ్చి తీరుతుందన్న నమ్మకం కలిగింది. ఐ యామ్ సో హ్యాపీ. సాక్షి: చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కొంత టెన్షన్‌గా కనిపించారు. ఎన్నిక కాగానే రిలాక్స్ ఫీలయినట్టున్నారు.. మళ్లీ బాధ్యతలు స్వీకరించినప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు... మీరు సున్నిత మనస్కులని భావించవచ్చా..? జడ్పీ చైర్పర్సన్: అలా ఏమీ లేదండీ... నేనేమీ టెన్షన్ ఫీల్ కాలేదు. పార్టీలో నాయకులందరికీ నేనేంటో తెలుసు కాబట్టి... నన్నే చైర్పర్సన్ చేస్తారని అనుకున్నా. రిలాక్స్డ్గానే ఉన్నా... పార్టీకి చేసిన సేవకు మంచి గుర్తింపు ఉంటుందని భావించా... అయితే బాధ్యతల స్వీకరణ సమయంలో ఆనందాన్ని తట్టుకోలేక ఉద్వేగానికి లోనయి ఆనందభాష్పాలు రాల్చాను. సాక్షి: జిల్లా అభివృద్ధిలో మీ ప్రథమ ప్రాధాన్యాలేంటి? ఏయే అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తారు? జడ్పీ చైర్పర్సన్: విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే నా ప్రథమ ప్రాధాన్యత. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తా. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కనీసం రహదారి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల పక్షాన నిలబడతా. గిరిజన ఉపప్రణాళిక, ఐటీడీఏ నిధులతో ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేస్తా. -
జడ్పీ చైర్పర్సన్ టీడీపీకే పీఠం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అనుకున్నదే అయింది.. జిల్లా పరిషత్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకుంది. గురువారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జరిగిన జడ్పీ పాలకవర్గ ఎన్నికలలో జడ్పీ చైర్‌పర్సన్‌గా గడిపల్లి కవిత (వెంకటాపురం), వైస్ చైర్మన్‌గా బరపాటి వాసుదేవరావు (పాల్వంచ)లు ఎన్నికయ్యారు. సీపీఐకి చెందిన ఒకరు, సీపీఎం పక్షాన గెలిచిన ఇద్దరు సభ్యులు టీడీపీకి మద్దతివ్వడంతో మొత్తం 22 ఓట్లు పొంది కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి వాసు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, టీడీపీకి మద్దతిచ్చినందుకు గాను సీపీఐ, సీపీఎంలకు చెరో కో-ఆప్షన్ పదవి లభించింది. మహ్మద్ మౌలానా (సీపీఐ), సయ్యద్ జియావుద్దీన్ (సీపీఎం)లు జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, జడ్పీ సీఈవో జయప్రకాశ్ నారాయణ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఎన్నిక ప్రక్రియను న్యూడెమోక్రసీ సభ్యులు ముగ్గురు బహిష్కరించగా, వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు తటస్థంగా ఉన్నారు. మొత్తంమీద జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎనిమిదిగంటల పాటు ఎన్నిక ప్రక్రియ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు జిల్లా పరిషత్ సభ్యులు గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగా ఉదయం 8 గంటల సమయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి సమావేశమందిరానికి చేరుకున్నారు. ఆ తర్వాత కో-ఆప్షన్ పదవులకు సీపీఐ, సీపీఎం అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రక్రియలో మొత్తం 39 మంది సభ్యులు పాల్గొన్నారు. రెండు పదవులకు రెండే నామినేషన్లు రావడంతో ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఆ తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం భోజన విరామం తర్వాత మళ్లీ మూడుగంటలకు సమావేశం ప్రారంభమయింది. అప్పుడు కూడా 39 మంది సభ్యులు హాజరయ్యారు. చైర్పర్సన్ పదవికి గుడిపల్లి కవిత (టీడీపీ), జాడి జానమ్మ (కాంగ్రెస్)లు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. అయితే, ఈ సమయంలోనే ఎన్డీ సభ్యులు పోలవరం ముంపు ప్రాంతాల కింద ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. ఆ తర్వాత కవితకు మద్దతుగా 19 మంది టీడీపీ, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ సభ్యుడు చేతులు లేపారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జానమ్మకు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు చేతులు లేపారు. దీంతో మొత్తం 22 ఓట్లు సాధించిన కవిత జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు. వెంటనే కాంగ్రెస్, వైఎస్సార్సీపీ సభ్యులు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇక, ఆ తర్వాత జడ్పీ వైస్‌చైర్మన్‌గా పాల్వంచ జడ్పీటీసీ వాసు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన కూడా ఎన్నికయినట్టు కలెక్టర్ చెప్పారు. అనంతరం ఇద్దరికీ డిక్లరేషన్ పత్రాలు ఇచ్చి, ప్రమాణం చేయించిన అనంతరం నాలుగు గంటల సమయంలో సమావేశం ముగిసినట్టు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాణ స్వీకారంలో గందరగోళం జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కొంతసేపు గందరగోళం నెలకొంది. సభ్యులందరూ ఒక్కొక్కరుగా ప్రమా ణం చేయాల్సి ఉండగా, ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ అందరితో సామూహిక ప్రమాణం చేయించారు. ఈ సందర్భం గా తొలుత అందరూ కూర్చునే ప్రమాణం చదువుతుండగా, కొందరి సూచన మేరకు కలెక్టర్‌తో సహా జడ్పీటీసీ సభ్యులంద రూ నిల్చుని ప్రమాణం చేశారు. అయితే, అప్పుడు కేవలం టీడీపీ సభ్యులు మాత్రమే సామూహికంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రమాణం చేయదల్చుకున్న వారు రావాలని కలెక్టర్ ఆహ్వానించడంతో సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమొక్రసీ, టీడీపీ కి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన టీడీపీ సభ్యులు మాత్రం సామూహిక ప్రమాణంతోనే సరిపెట్టారు. అసలు సామూహిక ప్రమాణం చేసే పద్ధతి సరైందేనా అనేది ఈ సందర్భంగా అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. సండ్ర, బాలసాని హవా జడ్పీ పాలకవర్గం ఎన్నికలలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణల హవా కనిపించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే జడ్పీ కార్యాలయంలో హడావుడి చేసిన ఎమ్మెల్యే సండ్ర పార్టీ తరఫున విప్ జారీ చేశారు. ఉదయం నుంచి మీడియాకు ఇంటర్వ్యూలతో పాటు అధికారులతో చేయాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేసిన సండ్ర.. ఎన్నిక ప్రక్రియ సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, బాలసాని పూర్తిగా తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఉదయం తుమ్మల నివాసం నుంచి జడ్పీటీసీ సభ్యులతో ఉన్న ఆయన వారిని జడ్పీ కార్యాలయానికి తోడ్కొని వచ్చారు. పార్టీ సభ్యులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను వివరిస్తూ కనిపించారు. ఇక, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్సీపీ), రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య (కాంగ్రెస్)లు హాజరుకాగా, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ (వైఎస్సార్సీపీ), సున్నం రాజయ్య (భద్రాచలం), జలగం వెంకట్రావు (కొత్తగూడెం) హాజరు కాలేదు. ఇక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలెవరూ సమావేశానికి రాలేదు.