సాక్షి ప్రతినిధి, ఖమ్మం : అనుకున్నదే అయింది.. జిల్లా పరిషత్‌లో అత్యధిక స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ పదవులను దక్కించుకుంది. గురువారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జరిగిన జడ్పీ పాలకవర్గ ఎన్నికలలో జడ్పీ చైర్‌పర్సన్‌గా గడిపల్లి కవిత (వెంకటాపురం), వైస్ చైర్మన్‌గా బరపాటి వాసుదేవరావు (పాల్వంచ)లు ఎన్నికయ్యారు. సీపీఐకి చెందిన ఒకరు, సీపీఎం పక్షాన గెలిచిన ఇద్దరు సభ్యులు టీడీపీకి మద్దతివ్వడంతో మొత్తం 22 ఓట్లు పొంది కవిత చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ పదవికి వాసు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక, టీడీపీకి మద్దతిచ్చినందుకు గాను సీపీఐ, సీపీఎంలకు చెరో కో-ఆప్షన్ పదవి లభించింది. మహ్మద్ మౌలానా (సీపీఐ), సయ్యద్ జియావుద్దీన్ (సీపీఎం)లు జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. ఇలంబరితి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, జడ్పీ సీఈవో జయప్రకాశ్ నారాయణ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఎన్నిక ప్రక్రియను న్యూడెమోక్రసీ సభ్యులు ముగ్గురు బహిష్కరించగా, వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు తటస్థంగా ఉన్నారు. మొత్తంమీద జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎనిమిదిగంటల పాటు ఎన్నిక ప్రక్రియ
పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు జిల్లా పరిషత్ సభ్యులు గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగా ఉదయం 8 గంటల సమయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్.కె.ఇలంబరితి సమావేశమందిరానికి చేరుకున్నారు. ఆ తర్వాత కో-ఆప్షన్ పదవులకు సీపీఐ, సీపీఎం అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రక్రియలో మొత్తం 39 మంది సభ్యులు పాల్గొన్నారు.
రెండు పదవులకు రెండే నామినేషన్లు రావడంతో ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఆ తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం భోజన విరామం తర్వాత మళ్లీ మూడుగంటలకు సమావేశం ప్రారంభమయింది. అప్పుడు కూడా 39 మంది సభ్యులు హాజరయ్యారు. చైర్‌పర్సన్ పదవికి గుడిపల్లి కవిత (టీడీపీ), జాడి జానమ్మ (కాంగ్రెస్)లు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. అయితే, ఈ సమయంలోనే ఎన్డీ సభ్యులు పోలవరం ముంపు ప్రాంతాల కింద ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కవితకు మద్దతుగా 19 మంది టీడీపీ, ఇద్దరు సీపీఎం, ఒక సీపీఐ సభ్యుడు చేతులు లేపారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి జానమ్మకు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ సభ్యులు చేతులు లేపారు. దీంతో మొత్తం 22 ఓట్లు సాధించిన కవిత జడ్పీచైర్‌పర్సన్‌గా ఎన్నికయినట్టు కలెక్టర్ ప్రకటించారు. వెంటనే కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఇక, ఆ తర్వాత జడ్పీ వైస్‌చైర్మన్‌గా పాల్వంచ జడ్పీటీసీ వాసు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన కూడా ఎన్నికయినట్టు కలెక్టర్ చెప్పారు. అనంతరం ఇద్దరికీ డిక్లరేషన్ పత్రాలు ఇచ్చి, ప్రమాణం చేయించిన అనంతరం నాలుగు గంటల సమయంలో సమావేశం ముగిసినట్టు కలెక్టర్ ప్రకటించారు.
ప్రమాణ స్వీకారంలో గందరగోళం
జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కొంతసేపు గందరగోళం నెలకొంది. సభ్యులందరూ ఒక్కొక్కరుగా ప్రమా ణం చేయాల్సి ఉండగా, ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న కలెక్టర్ అందరితో సామూహిక ప్రమాణం చేయించారు. ఈ సందర్భం గా తొలుత అందరూ కూర్చునే ప్రమాణం చదువుతుండగా, కొందరి సూచన మేరకు కలెక్టర్‌తో సహా జడ్పీటీసీ సభ్యులంద రూ నిల్చుని ప్రమాణం చేశారు.
అయితే, అప్పుడు కేవలం టీడీపీ సభ్యులు మాత్రమే సామూహికంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రమాణం చేయదల్చుకున్న వారు రావాలని కలెక్టర్ ఆహ్వానించడంతో సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమొక్రసీ, టీడీపీ కి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మిగిలిన టీడీపీ సభ్యులు మాత్రం సామూహిక ప్రమాణంతోనే సరిపెట్టారు. అసలు సామూహిక ప్రమాణం చేసే పద్ధతి సరైందేనా అనేది ఈ సందర్భంగా అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.
సండ్ర, బాలసాని హవా
జడ్పీ పాలకవర్గం ఎన్నికలలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణల హవా కనిపించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే జడ్పీ కార్యాలయంలో హడావుడి చేసిన ఎమ్మెల్యే సండ్ర పార్టీ తరఫున విప్ జారీ చేశారు. ఉదయం నుంచి మీడియాకు ఇంటర్వ్యూలతో పాటు అధికారులతో చేయాల్సిన కార్యక్రమాలను సమన్వయం చేసిన సండ్ర.. ఎన్నిక ప్రక్రియ సమయంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, బాలసాని పూర్తిగా తెరవెనుక మంత్రాంగం నడిపారు.
ఉదయం తుమ్మల నివాసం నుంచి జడ్పీటీసీ సభ్యులతో ఉన్న ఆయన వారిని జడ్పీ కార్యాలయానికి తోడ్కొని వచ్చారు. పార్టీ సభ్యులు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలను వివరిస్తూ కనిపించారు. ఇక, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ), రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, కోరం కనకయ్య (కాంగ్రెస్)లు హాజరుకాగా, పాయం వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ (వైఎస్సార్‌సీపీ), సున్నం రాజయ్య (భద్రాచలం), జలగం వెంకట్రావు (కొత్తగూడెం) హాజరు కాలేదు. ఇక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలెవరూ సమావేశానికి రాలేదు.
జడ్పీ చైర్‌పర్సన్ టీడీపీకే పీఠం
Published Fri, Aug 8 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement