సాక్షి, కొత్తగూడెం: జిల్లాల పునర్విభజన తరువాత ఆవిర్భవించనున్న సరికొత్త జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ రెండున్నర సంవత్సరాలుగా జిల్లా, మండల పరిషత్‌లు ఉమ్మడిగానే ఉన్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుండడంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయినప్పటికీ మరికొన్ని మండలాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోకి వెళ్లాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, వాటిలో భద్రాచలం, కొత్తగూడెం మండలాలు పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నాయి.
మిగిలిన 21 మండలాల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు, ఆయా మండలాల పరిధిలోని మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 21 మండలాలకు గాను జెడ్పీటీసీలు ఎస్టీ జనరల్‌కు 05, ఎస్టీ మహిళలకు 05 కేటాయించారు. జనరల్ 05, జనరల్ మహిళకు 06 రిజర్వ్ చేశారు. మొత్తం మహిళలకు 11 రాగా, జనరల్‌కు 10 వచ్చాయి. బీసీ, ఎస్సీలకు ఒక్క జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఇక మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్టీ జనరల్‌కు 09, ఎస్టీ మహిళలకు 09, జనరల్‌కు 01, జనరల్ మహిళకు 01, ఎస్సీ మహిళకు 01 కేటాయించారు. ఎంపీపీ పదవుల్లో మహిళలకు 11, జనరల్‌కు 10 వచ్చాయి. వీటిలో ఎస్టీ కోటాలోనే మొత్తం 18 ఎంపీపీలు వచ్చాయి. బీసీలకు ఒక్క ఎంపీపీ కూడా రాలేదు.
జెడ్పీటీసీలపైనే అందరి దృష్టి..
మండల ప్రజాపరిషత్‌లు సింహభాగం ఎస్టీలకు రిజర్వు కావడంతో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 21 జెడ్పీటీసీల్లో 10 ఎస్టీలకు రిజర్వు కాగా, 11 జెడ్పీటీసీలు జనరల్‌కు వచ్చాయి. వీటిల్లో 05 జనరల్, 06 జనరల్ మహిళలకు కేటాయించారు. జిల్లాలో గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి విజయం సాధించింది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఓట్లపరంగా ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ ఎన్నికలపై పకడ్బందీగా దృష్టి పెట్టాయి. అయితే తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ హవా నడిచింది. సింహభాగం పంచాయతీలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లోనూ జోష్ వచ్చింది.
ఇక భద్రాద్రి జిల్లాలో వామపక్షాలు స్థానికంగా గట్టి ప్రాబల్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు సైతం తగినన్ని జెడ్పీటీసీలు, మండల పరిషత్‌లు గెలుచుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ పీఠం సాధించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 11 సాధించే విషయంలో ప్రతి జెడ్పీటీసీ స్థానం కీలకమే. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పీఠం కోసం సైతం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఇక మండల ప్రజాపరిషత్‌ల అధ్యక్ష పదవుల విషయంలో రాజకీయం మరింత రసవత్తరంగా ఉండనుంది. కొన్ని మండలాల్లో 4 ఎంపీటీసీ స్థానాలు, మరొకొన్ని మండలాల్లో 5 ఎంపీటీసీలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఒక్క ఎంపీటీసీ గెలుచుకున్నవారు సైతం ఎంపీపీ రేసులో ముందు వరుసలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, మండల పరిషత్‌ల పోరు రసవత్తరంగా మారనుంది.
జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల జనాభా, రిజర్వేషన్లు..
మండలం | మొత్తం జనాభా | జెడ్పీటీసీ స్థానాలు | రిజర్వేషన్ |
ఆళ్లపల్లి | 12268 | 1 | ఎస్టీ జనరల్ |
అన్నపురెడ్డిపల్లి | 21130 | 1 | జనరల్ మహిళ |
చండ్రుగొండ | 27911 | 1 | జనరల్ |
చర్ల | 42947 | 1 | ఎస్టీ మహిళ |
చుంచుపల్లి | 42290 | 1 | జనరల్ |
దుమ్ముగూడెం | 46802 | 1 | ఎస్టీ జనరల్ |
గుండాల | 15857 | 1 | ఎస్టీ మహిళ |
జూలూరుపాడు | 33395 | 1 | ఎస్టీ మహిళ |
కరకగూడెం | 15221 | 1 | ఎస్టీ జనరల్ |
లక్ష్మీదేవిపల్లి | 38093 | 1 | జనరల్ మహిళ |
మణుగూరు | 40026 | 1 | జనరల్ |
ములకలపల్లి | 34794 | 1 | ఎస్టీ జనరల్ |
పాల్వంచ | 33673 | 1 | జనరల్ |
పినపాక | 33155 | 1 | జనరల్ మహిళ |
టేకులపల్లి | 47879 | 1 | ఎస్టీ జనరల్ |
ఇల్లందు | 57302 | 1 | ఎస్టీ మహిళ |
అశ్వాపురం | 43067 | 1 | జనరల్ మహిళ |
బూర్గంపాడు | 36910 | 1 | జనరల్ మహిళ |
దమ్మపేట | 58444 | 1 | జనరల్ |
సుజాతనగర్ | 27989 | 1 | ఎస్టీ మహిళ |
మొత్తం | 768805 | 21 |
Comments
Please login to add a commentAdd a comment