సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనను టీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించగా.. రాత్రి 10 గంటలకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు కొత్త గూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పరిసరాల్లో రాఘవ ఉన్నట్టు సమాచారం అందిందని.. దమ్మ పేట మీదుగా రాజమండ్రికి వెళ్తున్న రాఘవ వాహనాన్ని పోలీసులు వెంబడించి పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడి వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాఘవను పాల్వంచకు తరలించామని.. ప్రాథమిక విచారణ పూర్తిచేశాక కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.
పరారీపై ప్రచారాల మధ్య..
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నాగ రామ కృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తెలు సాహిత్య, సాహితితో కలిసి ఈనెల 3న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తమ ఆత్మహత్యలకు రాఘవ కారణమంటూ చనిపోయే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ఈ నెల 6న వైరల్‌గా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. అప్పటి నుంచే రాఘవ పరారీలో ఉన్నారు. ఆయనను ఆరో తేదీనే కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని, శుక్రవారం రాత్రి వరకు రాఘవ పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగింది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతోపాటు పాత కేసులకు సం బంధించిన స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసి రౌడీషీట్ తెరుస్తామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్ ప్రకటించా రు కూడా. ఇది జరిగిన మరుసటి రోజే రాఘవను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించ డం గమనార్హం. అయితే శని, ఆదివారాలు కోర్టుకు సెలవులని.. రాఘవకు బెయిల్ రాకుండా ఉండేం దుకే శుక్రవారం రాత్రి అరెస్ట్ చూపారనే ప్రచారం జరుగుతోంది. రాఘవ వ్యవహారాలన్నింటినీ తిరగదోడిన పోలీసులు.. కేసుల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.
పోలీసుల అదుపులో మరో నలుగురు
రాఘవ అక్రమాల వివరాలు తెలుసుకునేందుకు రెండు రోజుల క్రితమే ఆయన అనుచరులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వస నీయంగా తెలిసింది. పాల్వంచకు చెందిన ఇద్దరు, లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణానికి చెందిన ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం. వారిలో ఇద్దరు అప్రూవర్‌గా మారినట్టు తెలిసింది.
కొత్తగూడెం బంద్
రాఘవను వెంటనే అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల నేతలు శుక్రవా రం కొత్తగూడెం నియోజకవర్గ బంద్ నిర్వహించారు. ఆందోళనకు దిగిన పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాత కేసులో ఎమ్మెల్యే ఇంటిగోడకు నోటీసు
పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టూ, బెయిల్‌పై ఉన్న రాఘవను విచారణ రావాలం టూ పోలీసులు శుక్రవారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా ఇంటి గోడకు నోటీసు అంటించడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు గతేడాది జూలై 29న తన చావుకు రాఘవ, మరో 42 మంది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. పురుగుల మందు తాగాడు. విచారణలో ఉన్న ఆ కేసుకు సంబంధించి రాఘవ ముందస్తు బెయిల్‌పై ఉన్నారు.
నోరువిప్పుతున్న రాఘవ బాధితులు
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య అనంతరం నెలకొన్న పరిస్థితులు, చోటు చేసుకుంటోన్న పరిణామాలను చూసి రాఘవ బాధితులు ఒక్కరొక్కరుగా తెరపైకి వస్తున్నారు. బాధిత మహిళలు కొందరు శుక్రవారం ‘సాక్షి’తో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో పాటు ఉన్నతాధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి ఉంటే రాఘవ దాష్టీకాలకు అప్పుడే తెరపడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయం కోసం వెళితే డాక్యుమెంట్లు చింపేశారు..
నవభారత్ (పాల్వంచ)లో రూ.50 లక్షల విలువైన స్థలాన్ని రాఘవ అనుచరులు 2020 ఏప్రి ల్‌లో కబ్జా చేశారు, న్యాయం కోసం వెళ్తే రాఘవ నా వద్ద ఉన్న స్థలం డాక్యుమెంట్లు చించివేశారు, తర్వాత నాతో పాటు నా అన్నపైనా ఆయన అనుచరులు దాడి చేశారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే ఫిర్యాదు కూడా తీసుకోలేదు. నన్ను, నాన్న, అన్నను అకారణంగా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. చివరకు రెవెన్యూ అధికారులూ నా గోడును పట్టించుకోలేదు. దీంతో పురుగుల మందు తాగి ఎలాగో బయటపడ్డా. అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఈ రోజు పచ్చని కుటుంబం బతికి ఉండేది.
– జ్యోతి, పాల్వంచ
వారసత్వ భూమిని కాజేశారు..
పాల్వంచ పట్టణంలోని కాంట్రాక్టర్ కాలనీలో మా మామ గారికి మూడెకరాల ఖాళీ స్థలం ఉంది. అది నా భర్త జాన్‌రాంకుమార్‌కు వారసత్వ ఆస్తిగా వచ్చింది. 2020 మార్చిలో ఆ భూమిని చదును చేస్తుంటే రాఘవ.. అనుచరులు, పోలీసులతో అక్కడికి వచ్చాడు. ఆ భూమి తనదని బెదిరించాడు. పోలీసులు ఏ విషయం ఆరా తీయకుండా నన్ను, నా భర్తను జీపులో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు భూమి కాగితాలతో రాఘవ ఇంటికి వెళ్తే ఆయన దుర్భాషలాడారు. ఆ స్థలం జోలికి వస్తే చంపుతానని బెదిరించారు. ఇప్పటికీ ఆ భూమి రాఘవ అధీనంలోనే ఉంది.
– శ్రీదేవి, పాల్వంచ
Comments
Please login to add a commentAdd a comment