పాల్వంచ: ‘మా ఆస్తుల పంపకాల విషయంలో వనమా రాఘవేందర్‌రావును కలిశాం. కానీ ఆయన ఏం మాట్లాడాడో మా తమ్ముడికే తెలుసు. మాతో చెబితే పరిష్కారమార్గం ఆలోచించే వాళ్లం. కానీ ఇం టికి పెద్దదిక్కుగా ఉండాల్సిన తమ్ముడే ప్రాణా లు తీసుకున్నాడు. భార్యాపిల్లల్ని కూడా చంపుకున్నాడు..’అని రామకృష్ణ సోదరి కొమ్మిశెట్టి లోగ మాధవి చెప్పారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
‘మా నాన్న విధి నిర్వహణలో భాగంగా తహసీల్దార్ ఎక్కిన జీపులో ప్రయాణిస్తుండగా నక్సల్స్ మందుపాతరలో చనిపోయారు. మరో తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త కూడా ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఇక మిగిలింది మా అమ్మ, నేను, రామకృష్ణ. మా కుటుంబంలో మగదిక్కు తమ్ముడే. మాకు ఏం కావాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయనే చూసుకుంటాడనుకున్నాం. అయితే రామకృష్ణకు వ్యాపారాల్లో నష్టం వచ్చి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చి మిగిలిన ఆస్తుల పంపకాన్ని చూసుకోవాలని భావించినా సాధ్యపడలేదు. మా నాన్న ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబం బాగా తెలుసు.
అందుకే వనమా వెంక టేశ్వరరావుతో మాట్లాడేందుకు వెళ్తే ఆరోగ్యం బాగో లేకపోవడంతో రాఘవేందర్ మాట్లాడాడు. అయితే ఆయ నేం మాట్లాడాడో.. మా తమ్ముడు ఎలా క్షోభకు గురయ్యాడో మాకు తెలియదు. తెలిస్తే మా సమస్యను మరోలా పరిష్కరించుకునే వాళ్లం. ఆస్తుల పంపకాలు కూడా నాలుగైదు రోజుల్లోనే సెటిల్ అయ్యేవి. ఇంతలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంత మానసిక బాధ పడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.’అంటూ మాధవి విలపించారు.
కావాలనే రాఘవను ఇరికిస్తున్నారు
పాల్వంచ: ‘ఆస్తి పంపకాల విషయంలో పెద్ద మనిషి అని వనమా రాఘవేందర్‌రావును కలిశాం. ఆయన మా మేలు కోరి పలు సూచనలు చేశాడు. కానీ ఎవరో కావాలనే ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో నా కొడుకును ప్రేరేపించి తప్పుదోవ పట్టించి చావుకు కారణమయ్యారు..’ అని రామకృష్ణ తల్లి సూర్యావతి కన్నీటి పర్యంతమయ్యారు. పాత పాల్వంచలో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆస్తి కోసం కుమారుడు రామకృష్ణ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. చాలాచోట్ల అప్పులు చేసిన అతను ఒకే సారి రూ.లక్షల్లో అప్పు ఉందని చెప్పాడని తెలిపారు. రాఘవతో మాటల సందర్భంగా జరిగిన విషయాలేవీ మా వద్ద ప్రస్తావించకుండా భార్య, పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. తన భర్త నక్సల్స్ పేల్చిన మందుపాతరలో చనిపోతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని, కలెక్టర్ స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment