
వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు.
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావుపై ఇప్పటివరకూ 12 కేసులున్నట్లు కొత్త గూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. రాఘవ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.
నిన్న(శుక్రవారం) దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ.. అతని డ్రైవర్ మురళీ, అనుచరుడు గిరీష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రోహిత్‌రాజ్ స్పష్టం చేశారు. రాఘవ డబ్బులే కాకుండా రామకృష్ణ భార్యను కూడా ఆశించినట్లు సెల్ఫీ వీడియోలో ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.