సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఉదంతంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన తల్లి సూర్యావతి, అక్క మాధవితోపాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్‌రావు పెట్టిన బాధలను ఆ వీడియోలో వివరించారు. చనిపోయే ముందు తన కారులో కూర్చొని 8:55 నిమిషాల నిడివి గల వీడియో తీసిన రామకృష్ణ తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక క్షోభను వివరించారు. ఇది అందరినీ కలచివేస్తోంది.
వీడియోలో రామకృష్ణ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే...
►వాళ్లుండేది (తల్లి, అక్క) సొంతిళ్లు.. రూ. పది వేల అద్దె వస్తుంది. వాళ్లకు సంవత్సరానికి పంట కౌలు వస్తుంది. నాకు పొలం మీద ఆదాయం రాదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేను వనమా రాఘవేందర్‌రావు గారి వద్దకు వెళ్లా. ఈ సమస్య తేలాలంటే నీ భార్యను తీసుకొని హైదరాబాద్‌కు రా. పిల్లలు లేకుండా. అప్పడు నీ సంగతి చూస్తా. అప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాదు. ఎక్కడికి వెళ్లినా ఎవరూ ఏమీ చేయలేరు. నయాపైసా నీకు రాకుండా చేస్తానని రాఘవేందర్‌రావు నాతో చెప్పారు.
►సాయం కోసం వెళ్తే నా భార్యను పంపాలన్న ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలి? కనీసం డబ్బు రూపంలో అడిగినా నేను ఇచ్చేవాడిని. కానీ నా భార్యను కోరుకున్నాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయా (ఈ విషయం నా భార్యకు తెలియదు). వీళ్లతో పోరాడే స్థితిలో నేను లేను. రాజకీయ, ఆర్థిక అండదండలూ లేవు. నేనొక్కడినే ఏదైనా చేసుకుంటే రేపు నా భార్య పరిస్థితి ఏంటి? ఆమెను అసలు వీళ్లు ఏం చేస్తారో, నా పిల్లలు ఏమైపోతారో కూడా అర్థంకావడం లేదు. నడిరోడ్డుపై వదిలేసి నా దారి నేను చూసుకోవడం బాధ్యత కాదు. కాబట్టి నాతోపాటే వారినీ తీసుకెళ్లిపోతున్నా.
►నా జీవితం ఎలాగైనా ఫర్వాలేదు. ఇంకా వేరే కుటుంబాలు పాడవకుండా ఊళ్లో మిగిలిన పెద్దలు, నాయకులంతా కలిసి నా తండ్రి ద్వారా నాకు వచ్చే ఆస్తిని.. నాకు ఆర్థికసాయం చేసిన వారికిచ్చి నా అప్పు తీర్చండి. మిగిలింది వారి (అమ్మ, అక్క)కే వదిలేయండి.
►రాఘవేందర్‌రావు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఇంకా చాలా కుటుంబాలు నాశనమవుతాయి. ఈ మధ్య కాలంలోనే పాల్వంచలో ఒకతను ఆయన పేరు రాసి చనిపోయాడు. నెల రోజులు ఎక్కడో దాక్కొని ఆ తర్వాత వచ్చాడు. మూడు, నాలుగు నెలల్లోనే మళ్లీ ఇలా దురాగతాలు చేస్తోంటే సామాన్యులు ఎలా బతుకుతారు?
కుదిపేసిన సెల్ఫీ వీడియో...
ఎమ్మెల్యే తనయుడిపై రామకృష్ణ చేసిన ఆరోపణలు ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. అజ్ఞాతంలో ఉన్న రాఘవను అరెస్ట్ చేసి శిక్షించాలంటూ మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ శ్రేణులు గురువారం ఆందోళనను ఉధృతం చేశాయి. పాల్వంచలోని ఎమ్మెల్యే నివాసాన్ని బీజేపీ నాయకులు ముట్టడించగా పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తగూడెంలో వనమా రాఘవ దిష్టిబొమ్మను దహనం చేశారు. వామపక్ష నేతలు శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు.
రాఘవేందర్‌పై ఆరు కేసులు..
వనమా రాఘవేందర్‌రావుపై పాల్వంచ పట్టణం, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులున్నాయి. 2013లో పాల్వంచ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి చీరలు పంపిణీ చేసిన ఘటనలో ఐపీసీ 336, 353, 171, 188 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
►2017లో పాల్వంచలోని కేటీపీఎస్ సెంటర్‌లో ఆర్టిజన్లకు ఉద్యోగాలు కల్పించాలని ఆందోళన చేస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఐపీసీ 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
►2020లో ఓ స్థల వివాదంలో రాఘవేందర్ అనుచరులు గిరిజన మహిళపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో రాఘవపై ఐపీసీ 158, 307 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్లడం సంచలనంగా మారింది.
►2020లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది.
►2021లో పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. అందుకు కారకుల్లో రాఘవ పేరు కూడా ఉండటంతో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు.
►తాజాగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో రాఘవేందర్‌పై 302, 307, 306 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన ఏ2గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment