
సాక్షి, ఖమ్మం: పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.
తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారన్నారు. వనమా.. నా భార్యను హైదరాబాద్ తీసుకొస్తేనే నా సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులు వనమా ఇంటిని ముట్టడించారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు?