జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండంత్రాల బంగ్లల బేతాలు డుంటున్నడు. ఎటూ పొద్దుబోక టీవీ జూస్కుంట గూసున్నడు. విక్రమార్కుడు బొందల గడ్డకు బోయిండు. బేతాలుని ఇంటి ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతాలుడు ఇంట్ల కెల్లి ఇవుతల కొచ్చిండు. మోటరెన్క సీట్ల గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు.
‘‘నన్ను గూసుండ బెట్టుకోని ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతవు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు తిక్క లేవొచ్చు. కోపం రావొచ్చు. యాస్ట లేకుంట ఉండె తంద్కు నీకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ అని మోటరెన్క సీట్ల గూసున్న బేతాలుడన్నడు.
‘‘నీకు కత జెప్పుడు, నాకు ఇనుడు అల్వాటే గద’’ అని మోటర్ నడ్పుతున్న విక్రమార్కుడన్నడు.
‘‘గీనడ్మ తెలంగానలున్న కమ్మం పట్నంల తెలుగు దేసం శంకు సప్పుడు సబ బెట్టింది. గాడ కిష్నుని యేసంల శంకమూదుతున్న ఎన్టీఆర్ కటౌట్ బెట్టిండ్రు. పచ్చ జెండలు ఎగిరేసిండ్రు. పచ్చ తోర్నాలు గట్టిండ్రు. బుక్క గులాల్లెక్క తెలుగు దేసమోల్లు ఒకల మీద ఒకలు పస్పు జల్లుకుండ్రు. శంకు సప్పుడు సబ కాడ రెండేల్లు సూబెడ్తున్న చెంద్రబాబు కటౌట్ గుడ్క బెట్టిండ్రు. ‘తెలుగుదేసం పిలుస్తున్నది కదలిరా. సైకిల్ పంపు దీస్కోని ఉర్కిరా’ అని రాసి ఉన్న బ్యానర్లను గట్టిండ్రు’’ అన్కుంట బేతాలుడు ఇంకేమొ జెప్పబోతుంటె –
‘‘సైకిల్ పంపు దీస్కోని వొచ్చుడెందుకు?’’ అని విక్రమార్కుడు అడిగిండు.
‘‘గాలిబోయిన టీడీపీ సైకిల్ల గాలిగొట్టెతంద్కు. శంకు సప్పుడు సబకు చెంద్రబాబొస్తుంటె జెనం గాయిన మీద పస్పు జల్లిండ్రు. నందమూరి సుహాసిని పస్పుతోని గాయినకు బొట్టు బెట్టింది. కడ్మ టీడీపీ ఆడి లీడర్లు గాయినకు మంగలార్తి ఇచ్చిండ్రు. పచ్చంగి దొడుక్కున్న గాయిన గాల్లకు రెండేల్లు సూబెట్టిండు. ‘తెలుగుదేసం జిందాబాద్, చెంద్రబాబు జిందాబాద్’ అని తెలుగు దేసపోల్లు లాసిగ వొల్లుతుండగ గాయిన స్టేజ్ ఎక్కిండు. ముందుగాల పచ్చ రంగు శంకం దీస్కోని ఊదిండు. గని జెర్ర సేపటికే గాయినకు దమ్మొచ్చింది. ఇక దాంతోని శంకమూదుడాపి గాయిన గిలాస నీల్లు దాగిండు.’’
‘‘తెలుగుదేసంను ఇడ్సిపెట్టి పోయిన తెలుగు తమ్ముండ్లూ మల్లొక్కపారి మీ ఇంటికి రాండ్రి. సైకిల్ పంపుచర్లు జుడాయించి గాలి గొట్టుండ్రి. టీడీపీ తెలంగానలనే పుట్టింది. తెలంగానలనే పెరిగింది. (‘తెలంగానలనే సచ్చింది’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు)
నేను ఒక్క తీర్గ బత్మిలాడంగ బత్మిలాడంగ బిల్స్ గేట్స్ పట్న మొచ్చిండు. కుద్దు నేనే గాలి మోటర్ అడ్డంకు బోయి గాయినకు మంగలార్తి ఇచ్చిన. మూడు నచ్చత్రాల హోటల్ల ఉంచి కుద్దు నేనే ఒక కోపుల చాయ్ ఇచ్చిన. గాయినకు ఒక్క తీర్గ మస్క గొట్టి హైటెక్ సిటీ దెచ్చిన. గాలి మోటర్ల దునియ అడ్డను నేనే గట్టిపిచ్చిన. నేను జెయ్యబట్కెనే ఇయ్యాల పట్నంల కరోన టీక తయ్యారైంది. తెలంగాన, ఆంద్ర నాకు రొండు కండ్లు. గీ రొండు కండ్లు ఒక్కటి గావాలని సిగ్గు శరం లేనోల్లు అంటున్నరు. ఏ కన్నుకు ఆ కన్ను ఉంటెనే నాకు మల్ల ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్తది. టీడీపీ సైకిల్ ఒక గిర్రల ఆంద్ర తమ్ముండ్లు గాలిగొడ్తున్నరు. ఇంకొక గిర్రల తెలంగాన తమ్ముండ్లూ గాలి గొట్టుండ్రి. మీరు గాలిగొడ్తెనే నా సైకిల్ నడుస్తది. నా సైకిల్ నడుస్తనే బీజేపీ కాడికెల్లి అన్ని పార్టిలు నా దిక్కు జూస్తయి. నాతోని సోపతి జేస్తయి అన్కుంట చెంద్రబాబు సుత్తిగొట్టిండు.’’
‘‘తెలంగానలనే గాకుంట ఆంద్రల గుడ్క చెంద్రబాబు సబలు బెట్టిండా?’’
‘‘గిదేం కర్మ రాస్ట్రంకు సబలు బెట్టిండు. ముక్యమంత్రి కుర్సి పోయిన కాన్నుంచి నాకు బువ్వ దిన బుద్దయితలేదు. కన్ను మలుగుతలేదు. కన్ను మల్లకుంటె కలలు యాడబడ్తయి. కలలు బడక ఆకర్కి కలల గుడ్క ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్త లేదు. ఫికర్ తోని బక్కగైన. నన్ను ముక్యమంత్రిని జేస్తిరా అంటె అందరి ఇండ్లకు పచ్చ రంగేపిస్త. ఇండ్లకే గాకుంట బళ్లకు, గుళ్లకు, సర్కార్ దప్తర్లకు పచ్చరంగు ఏపిచ్చి ఆంద్రప్రదేస్‌ను బంగారి రాస్ట్రం జేస్త. గిదేం కర్మ రాస్ట్రంకు...’’ అని గాయిన ఇంకేమొ మాట్లాడబోతుంటె –
‘నువ్వే కర్మ రాస్ట్రంకు’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు.
చెంద్రబాబుతోని ముచ్చట బెట్టెటప్పుడు బిల్‌గేట్స్ తప్పిజారి గూడ గాయిన ఈపు ఎందుకు సూబెట్టలేదు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ టైర్లల్ల గాలి బోతది’’ అని బేతాలుడన్నడు.
‘‘ఈపు గిన గండ్లబడ్తె చెంద్రబాబు యాడ ఎన్నుపోటు పొడుస్తడోనని బిల్‌గేట్స్ బయపడ్డడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు.
ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంటి దిక్కు బోయిండు. (క్లిక్ చేయండి: కొంపలు ముంచే కొత్త దుక్నాలు)
- తెలిదేవర భానుమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment