Telidevara Bhanumurthy: సిత్రాలు సూడరో శివుడో శివుడా! | Telidevara Bhanumurthy Satire on Political Parties Campaign in Munugode Bypoll | Sakshi
Sakshi News home page

Telidevara Bhanumurthy: సిత్రాలు సూడరో శివుడో శివుడా!

Published Sat, Oct 29 2022 4:48 PM | Last Updated on Sat, Oct 29 2022 4:48 PM

Telidevara Bhanumurthy Satire on Political Parties Campaign in Munugode Bypoll - Sakshi

జిద్దు ఇడ్వని విక్రమార్కుడు ఎప్పటిలెక్కనే మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగటాపి హారన్‌ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ‘‘నువ్వు ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్‌ నడ్పుతనే ఉంటవు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. బల్రు అడ్డం రావొచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతె నీకు తిక్కలెవ్వొచ్చు. నువ్వు బేచైన్‌ గాకుంట ఉండెతంద్కు మునుగోడు ముచ్చట జెప్త ఇను’’ అన్నడు.
‘‘ఊకూకె మునుగోడు, మునుగోడు అంట వేంది?’’ అని విక్రమార్కుడు అడిగిండు.

‘‘ఎందుకంటె అందర్కి ఒక్క దినమే దివిలె. ఎలచ్చన్ల జాత్ర జెయ్యబట్కె మునుగోడు జెనంకు దినాం దివిలెనే. దినాం దావత్లే. దినాం మందుల తేలకుంట మున్గుడే. అన్ని పార్టిల లీడర్లు ఒక్క తీర్గ చక్కర్లు గొడ్తున్నరు.’’
‘‘కల్లమున్న కాడ బిచ్చగాల్లు. ఓట్లున్న కాడ లీడర్లు’’

‘‘కాంగ్రెస్‌ దిక్కుకెల్లి నిలవడ్డ పాల్వాయి స్రవంతి ప్రచారం జేస్కుంట బోతుంటె బీజేపోల్లు అడ్డమొచ్చి శేర్‌ పటాకులు గాల్సిండ్రు. కాల్లల్ల కట్టె పెట్టినట్లు జేసిండ్రు.’’
‘‘కాంగ్రెసోల్లు ఊకున్నరా?’’

‘‘ఎందుకూకుంటరు. తమ్ల పాకుతోని గీల్లంటె తల్పు చెక్కతోని గాల్లన్నరు. బీజేపీ దిక్కుకెల్లి పోటీ జేస్తున్న రాజగోపాల్‌రెడ్డి జీపు ముంగట కాంగ్రె సోల్లు ఒక్క తీర్గ భూచెక్రాలు గాల్సి అడ్డం బడ్డరు. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు మందు బోస్తున్నయి. పైసలిస్తున్నయి. నరకాసురుని మీద్కి బానాలిడ్సిన సత్యభామ అసువంటిది మా స్రవంతి అని రేవంత్‌ రెడ్డి అన్కుంట గామెతోని బీజేపీ, టీఆర్‌ఎస్‌ల దిక్కు రొండు రాకిట్లు ఇడిపిచ్చిండు’’.

‘‘టీఆర్‌ఎసోల్లు పటాకులు గాల్వలేదా?’’
‘‘గాల్సిండ్రు. సంస్థాన్‌ నారాయన్‌పురంల 18 వేల కోట్ల స్టిక్కర్‌ తోని తయారు జేసిన పటాకులను మంత్రి గంగుల కమలాకర్‌ గాల్సిండు. రాజ గోపాల్‌రెడ్డి బోతుంటె టీఆర్‌ఎసోల్లు అడ్డం దల్గి బాంబులు గాల్సిండ్రు. నాకే అడ్డం దల్గుతరా? మీ తోడ్కల్‌ దీస్త అన్కుంట గాయిన కప్పగంతులు ముట్టిచ్చిండు. ఇగ టీఆర్‌ఎస్‌ దిక్కుకెల్లి పోటి జేస్తున్న కూసుకుంట ప్రభాకర్‌ రెడ్డి లక్ష్మిబాంబు బత్తి ముట్టిచ్చిండు. గది ధన్‌మనకుంట తుస్సు మన్నది’’.

‘‘గీ మూడు పార్టీలే గాకుంట కడ్మోల్ల ప్రచారం సంగతేంది?’’
‘‘కడ్మోల్లు అంటె ఇండిపెండెట్గ నిలవడ్డ కె.ఎ.పాల్‌ ప్రచారం గురించి రొండు ముచ్చట్లు జెప్త. గాయిన గుర్తు ఉంగ్రం. ఏలుకున్న ఉంగ్రం సూబెట్టుకుంట ఓట్లడ్గుతుంటె మాకు బంగారి ఉంగ్రం జేపిచ్చిస్తవా అని కొందరడిగిండ్రు. నన్ను గెలిపిస్తె మునుగోడును అమెరిక జేస్త. గాలి మోటర్‌ అడ్డ బెట్టిపిస్త అని పాల్‌ అన్నడు. రాంగ్‌ సైడ్ల కొస్తున్నవని ఒక పోలీసాయిన మోటరాపితె నేనంటె ఎవ్వరనుకుంటున్నావు, కాబోయె తెలం గాన ముక్యమంత్రి ననుకుంట పాల్‌ బెదిరిచ్చిండు. అందరు సూస్తుండంగ ఇంకోతాన చెంగడ బింగడ డ్యాన్సు జేసిండు.’’

‘‘మునుగోడు ఎలచ్చన్ల ప్రచారంల కొత్త సంగతేమన్న ఉన్నదా?’’
‘‘ఇంతకుముందు ఎన్నడు లేని తీర్గ గీ బై ఎలచ్చన్ల పోస్టర్ల జంగ్‌ నడుస్తున్నది. మీ అభిమాన సత్యం థియేటర్లో నేడే బ్రహ్మాండమైన విడుదల. మునుగోడు కాంతి స్రవంతి. పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి బిడ్డ నీతి నిజాయితీల అడ్డ. దర్శకత్వం: విరాట్‌ కొహ్లీ అసుంటి రేవత్‌ రెడ్డి అని కాంగ్రెస్‌ పోస్టర్‌ ఏసింది. నేడే విడు దల. అమిత్‌ షా ప్రొడక్షన్స్‌ వారి పద్దెన్మిది వేల కోట్ల రూపాయలు. దర్శకత్వం: కోవర్టు రెడ్డి. నర్తకి 70 ఎం.ఎం. థియేటర్‌ అని టీఆర్‌ఎస్‌ పోస్టర్‌ అంటిచ్చింది. బండి సంజయ్‌ దర్శకత్వంలో నేడే విడు దల రాజన్న రాజినామా. ముక్యమంత్రి, మంత్రుల బ్యాంకు కాతాలల్ల బడ్డ నిర్వాసితుల బకాయిలు. గొల్రు కొనెతంద్కు గొల్ల కురుమలకు రూపా యలు. కడ్మ సిన్మ ఎండి పర్ద మీద సూడుండ్రి అని బీజేపీ ఏసింది. కానీ గీ ఎలచ్చన్ల ఎవలు గెల్సినా పరకేం బడదు. జెనం బత్కులేం మారయి. పెట్రోలు, గ్యాస్‌ బండ దరలు మొగులు మీద్కి బోతనే ఉంటయి. రూపాయి బక్కగైతనే ఉంటది. ఎన్కట రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు గదే రూపాయి బిల్ల మీద బొటనేలు బొమ్మ ఎందుకున్నది. గీ సవాల్‌కు జవాబ్‌ జెప్పకుంటివా అంటే నీ మోటర్‌ బిరక్‌ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు.

‘‘ఎన్కట అందర్కి బువ్వ దొర్కుతుండె బట్కె రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు బువ్వ దొర్కకుండ బట్కె బొటనేలు చీక్కుంట బత్కుండ్రి అని గిప్పటి రూపాయి బిల్ల మీద బొమ్మ జెప్తున్నది’’ అని విక్రమార్కుడు అన్నడు.

ఇంతల బొందల గడ్డొచ్చింది. విక్రమార్కుడు మోటరాపిండు. బేతాలుడు మోటర్ల కెల్లి దిగి బంగ్ల దిక్కు బోయిండు.

- తెలిదేవర భానుమూర్తి
సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement