Palvai Sravanthi Reddy Emotional Words In Munugode Nomination Rally - Sakshi
Sakshi News home page

Munugode Bypoll: కొంగుచాచి అడుగుతున్నా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమోషనల్‌

Published Sat, Oct 15 2022 1:36 AM | Last Updated on Sat, Oct 15 2022 10:09 AM

Palvai Sravanthi Reddy Emotional Talk in Munugode Nomination - Sakshi

∙ప్రచారంలో కంటనీరు పెట్టుకుంటున్న అభ్యర్థి స్రవంతి. చిత్రంలో ఉత్తమ్, భట్టి విక్రమార్క

 సాక్షి, నల్లగొండ: మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు స్రవంతిని మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే, ఆ ఆడబిడ్డను ఓడించాలని మోదీ, అమిత్‌షా, కేసీఆర్, కేటీఆర్, మంత్రులు చూస్తున్నారని టీపీసీసీ అధ్య్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించడానికి ఇంతమందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజగోపాల్‌రెడ్డిని ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. స్వార్ధం కోసం దుష్మన్‌ చెంత చేరి కన్న తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని చంపాలని బొడ్డులో కత్తి పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ఆ వ్యక్తి అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. చేతులెత్తి అడుగుతున్నా.. ఎన్నికల్లో స్రవంతిని గెలిపించి, ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చండూరులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్‌ మాట్లాడారు.  

ముగ్గురూ మాయగాళ్లే.. 
ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మద్యం, డబ్బు పంచి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నా యని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ ఇప్పుడు మునుగోడు దత్తత అంటున్నారని, 2018 ఎన్నికల్లో ఇతర జిల్లాలతో పాటు తనను ఓడించాలని కొడంగల్‌ను కూడా దత్తత తీసుకుంటామని ప్రకటించారని, కానీ అక్కడ గెలిచినా రోడ్లపై పడిన గుంతల్లో తట్ట మట్టి పోయలేదని విమర్శించారు. ఇక సీఎం కేసీఆర్‌ వచ్చి అభివృద్ధి చేస్తా.. కుర్చీ వేసుకొని కూర్చుంటా.. మీ దగ్గరికే సముద్రం తెస్తా అంటూ హామీ ఇస్తారని, ఎన్నికల తర్వాత ఫాంహౌస్‌లో పడుకుంటారని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్‌ కట్టుకథలు నిజమని చెప్పేందుకు హరీశ్‌రావు వస్తున్నారని, ముగ్గురూ మాయగాళ్లేనని విమర్శించారు. స్రవంతక్కను గెలిపిస్తే సమ్మక్క సారలక్కలాగా ములుగు సీతక్కతో కలిసి మునుగోడు ప్రజల గొంతుకై అసెంబ్లీలో కొట్లాడుతుందని రేవంత్‌ చెప్పారు. 

స్రవంతిని గెలిపించండి: ఉప ఎన్నికల్లో స్రవంతిని గెలిపించి, మును గోడు ప్రజలు అమ్మకానికి సిద్ధంగా లేరని నిరూపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ప్రజలను అన్నింటా మోసం చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పుడు డబ్బు, లిక్కర్‌తో ఓట్ల కోసం వస్తోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తామని జోష్‌లో చెప్పడం కాదని, బూత్‌లో స్రవంతికి ఓటు వేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి విజ్ఞప్తి చేశారు.  పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులను, సేవలను ఒకసారి గుర్తు చేసుకు ని స్రవంతిని గెలిపించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ కోరారు.  

తండ్రిని తలచుకొని కంటతడి 
కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన స్రవంతి, తండ్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని తలచుకొని కంటతడి పెట్టారు. పేద ప్రజల కోసం ఆయన పడిన తపన, చేసిన కృషిని వివరిస్తూ తన తండ్రి ఆశయాల సాధన కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. సభలో మాట్లాడే సమయంలోనూ స్రవంతి కన్నీటి పర్యంతమయ్యారు. కొద్ది క్షణాలు మౌనంగా దుఖించిన ఆమె ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.

కొంగుచాచి అడుగుతున్నా ఓట్లేయండి: స్రవంతి 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని స్రవంతి విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను మోసం చేయడం వల్లే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ధర్మ యుద్ధంలో ఒంటరి పోరాటం చేస్తున్న తాను కొంగుచాచి అడుగుతున్నానని, ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సభలో మాజీ మంత్రి జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement