Munugode By-Election 2022: Telangana PCC Chief Revanth Reddy Emotional Words At Munugode - Sakshi
Sakshi News home page

నన్ను ఒంటరి చేసేందుకు కుట్ర.. కన్నీటి పర్యంతమైన రేవంత్‌రెడ్డి

Published Fri, Oct 21 2022 2:12 AM | Last Updated on Fri, Oct 21 2022 10:41 AM

Telangana PCC Chief Revanth Reddy Emotional Words at Munugode - Sakshi

సాక్షి, మునుగోడు: కాంగ్రెస్‌లో తనను ఒంటరి చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన మునుగోడు మండలం కొంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు పీసీసీ పదవి వచ్చినందుకు సీనియర్‌ నాయకులు కక్ష పెంచుకొని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా.. అందరూ అప్రమత్తం కావాలి. మునుగోడులో పెద్ద కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీని ఖతం చేసే ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులను చిత్తు చేసేందుకు, పార్టీని బతికించుకునేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలి. నేను కూడా పోలీసు తూటాలకు సైతం ఎదురు నిలబడతా..’’అని పేర్కొన్నారు.

పీసీసీ పదవి నుంచి తొలగించేందుకు..
దేశంలో కాంగ్రెస్‌ పార్టీని చంపేందుకు సీఎం కేసీఆర్‌ సుపారీ తీసుకున్నాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకోసం పదిరోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో రహస్య భేటీలు జరిపారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనను తొలగించాలనే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్‌ పేర్కొన్నారు. తనకు పదవులు అవసరం లేదని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. తనకు పీసీసీ పదవి వచ్చిననాటి నుంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు అనేక ఒత్తిళ్లు చేస్తున్నాయన్నారు.

నిర్వాసితులను నిరాశ్రయులను చేశారు  
మర్రిగూడ: తాతలు, ముత్తాతల నుంచి వస్తున్న తరతరాల ఆస్తిని రిజర్వాయర్‌ పేరుతో కాజేసి కేసీఆర్‌ భూనిర్వాసితులను పూర్తిగా నిరాశ్రయులను చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలోని కుదాభక్ట్‌పల్లి, రాంరెడ్డిపల్లి, మర్రిగూడలలో గురువారం రాత్రి జరిగిన రోడ్‌షోలలో మాట్లాడారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి బిడ్డగా, మీ ఆడబిడ్డగా నన్ను గెలిపించాలని కొంగుచాచి అడుగుతున్నానని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి ఓటర్లను వేడుకున్నారు.  

దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్‌ పార్టీనే..
►మీడియా సమావేశంలో ఉత్తమ్, మధుయాష్కీ
సాక్షి, హైదరాబాద్‌: కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే అపురూప ఘట్టమని పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూస్తుంటే దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్‌ పార్టీనే అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అర్థమవుతుందని అన్నారు.

గురువారం ఇక్కడి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావిద్‌ తదితరులతో కలిసి మాట్లాడారు. భారత్‌ జోడో యాత్ర ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా తెలంగాణలో సక్సెస్‌ అవుతుందని అన్నారు. 23వ తేదీ నుంచి నవంబర్‌ 7 వరకు సాగే పాదయాత్రలో ప్రజలు, మేధావులు, రాజకీయాలకు అతీతంగా ఉన్నవారు రాహుల్‌తో సమాలోచనలు జరుపుతారని చెప్పారు.

దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని, ఆ విషయం మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికకావడంతో మరోసారి తేటతెల్లమైందన్నారు. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్‌ మరింత బలోపేతం అవుతుందని, ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రెట్టింపు అయిందన్నారు. ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాస్కీ మాట్లాడుతూ దేశంలో కుల, మత బేధాలు లేకుండా అందరినీ కలిపేందుకే యాత్ర జరుపుతున్నారని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement