
సాక్షి, నల్లగొండ: చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు తగలబడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
చండూరులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థ/లు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అన్నారాయన. పార్టీ ఆఫీస్‌పై దాడి చేసి దిమ్మెలు కూల్చినా.. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రేవంత్ స్పష్టం చేశారు. మా కేడర్‌ను బెదిరించాలని టీఆర్‌ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వాళ్లపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే.. ఎస్పీ ఆఫీస్ ముందు తానేస్వయంగా ధర్నాలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు అల్టిమేటం జారీ చేశారు.
ఇక ఈ ప్రమాదంపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎవరో కావాలనే ఈ పని చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఘటనపై అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఘటనకు కారణం ఎవరో బయటపెట్టాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారామె. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలతో కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరు. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాలి కానీ ఇలాంటి చిల్లర పనులు చేయడం బాధాకరం అని పాల్వాయి స్రవంతి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మునుగోడు కోసం బహుముఖ వ్యూహాలతో బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment