బుధవారం మీడియాతో మాట్లాడుతున్న రేవంత్. చిత్రంలో కోమటిరెడ్డి, ఉత్తమ్, మధుయాష్కీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల అవినీతిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద పూర్తి సమాచారం, ఆధారాలు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్న అదృశ్య శక్తితో ఉన్న ఒప్పందం ఏంటని నిలదీశారు. దీనిని బట్టే కేసీఆర్ అవినీతిలో బీజేపీ నేతల భాగస్వామ్యం ఏంటో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌లతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అనేకసార్లు చెప్పారని, అయితే ఇప్పటివరకు సీబీఐ, సీవీసీ, ఈడీ, ఆదాయపన్ను శాఖకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన వివరాలు హోంశాఖకు ఎందుకు ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌తో కలిసి బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాజకీయ రాక్షస క్రీడకు రైతులు బలి
రాష్ట్రంలో వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం వేస్తున్నాయని రేవంత్ విమర్శించారు. గల్లీల్లో వీధి నాటకాలు చాలవన్నట్టు, ఢిల్లీలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల పరువును తీశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తనపై తాను నమ్మకం కోల్పోయి సునీల్ అనే రాజకీయ వ్యూహకర్తను కన్సల్టెంట్ గా నియమించుకున్నారని రేవంత్ అన్నారు. రాజకీయ వ్యూహకర్తల చక్రబంధంలో, టీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం, ప్రయోజనం కోసం అమిత్ షా డైరెక్షన్‌లో కేసీఆర్ నటిస్తున్నారని చెప్పారు. రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ డ్రామాను కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ‘రైతులతో రచ్చ బండ’ పేరుతో గ్రామగ్రామాన ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి: ఉత్తమ్
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అసమర్థత కారణంగా ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. హంగు, ఆర్భాటాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్... రైతుల కోసం రెండు, మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించలేరా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ఇప్పటివరకు ఒక్క ఎకరాకు నీరు ఇచ్చినట్టు నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.
రూ.18 వేల కోట్ల కుంభకోణం: మధుయాష్కీ
తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని మధుయాష్కీ ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండానే రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని కొని, ఆ తర్వాత ఎఫ్‌సీఐకి ఎంఎస్పీకి అందిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ వ్యవహారం కారణంగా ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment