Telidevara Bhanumurthy
-
చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు?
పొద్దు మీకింది. ఎప్పటి తీర్గనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బ కాడ్కి బోయిన. పాన్ డబ్బ మా అడ్డ. దినాం పొద్దు మీకంగనే మా దోస్తు లందరు గాడ జమైతరు. నాత్రి తొమ్మిది గొట్టె దాంక ముచ్చట బెడ్తం. నేను బోకముందు మా దోస్తులు ఏం మాట్లాడుకుండ్రో నా కెర్క లేదు. గని నేను బోయినంక గీ తీర్గ ముచ్చట బెట్టిండ్రు. ‘‘మొన్న ఓటర్ల దినాన మా వాడ కట్టు ఓటర్లు మీటింగ్ బెట్టిండ్రు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘మీటింగ్ బెట్టి ఏం జేసిండ్రు’’ అని సత్నారి అడిగిండు. ‘‘తీర్మానాలు జేసిండ్రు’’ ‘‘గయేంటియో జర జెప్పు’’ ‘‘గ్యాస్ బండ దర బెంచిండ్రు. బస్ చార్జిలు బెంచిండ్రు. కరెంటు చార్జిలు గుడ్క బెంచిండ్రు. మనం గుడ్క ఓటు దర బెంచాలె. ఓటును అగ్వ దరకు అమ్మే సవాల్ లేదు. ఉద్దెర నడ్వదు. అంత నగతే. గిట్ల నగతిస్తె గట్ల ఓటేస్త మనాలె. గుండు గుత్త ఓట్ల కోసం కుల పెద్దకు రూపాయ లిచ్చినమని లీడర్లు జెప్తె నమ్మొద్దు. ఓటరు అంటె ఎవడు. దేవునసుంటోడు. దేవునికి ఏ తీర్గ పూజలు జేస్తరో గదే తీర్గ లీడర్లు ఓటర్‌కు పూజలు జెయ్యాలె’’ అని యాద్గిరి ఇంకేమొ జెప్పబోతుంటె ఇస్తారి అడ్డం దల్గి – ‘‘నోటుకు ఓటు గాకుంట ఇంకేమన్న తీర్మానాలు జేసిండ్రా?’’ అని అడిగిండు. ‘‘చేసిండ్రు. ఓటు ఏసెతంద్కు బోయెటోల్లని మోటర్ల దీస్క బోవాలె. లైన్ల శానసేపు నిలబడే పనిబడ్తె కాల్లు నొవ్వకుంట తలా ఒక కుర్సి ఏసి కూసుండ బెట్టాలె. ఎండ దాకకుంట షామియానాలు ఎయ్యాలె. షామియాన ఏసేటి మోక లేకుంటె తలకొక ఛత్రి బట్టే సౌలత్ బెట్టాలె. ఎండ కాలంల ఓట్లేసే పని బడ్తె సల్లటి సోడలు తాపియ్యాలె. గదే సలికాలమైతె ఛాయ్, కాఫి ఇయ్యాలె’’ అని యాద్గిరి జెప్పిండు. ‘‘కూట్లె రాయి దీయనోడు ఏట్లె రాయెట్ల దీస్తడు అని బీఆర్ఎస్ లీడర్లు అంటుంటరు. గని గాల్లే గురువింద ఇత్తు అసుంటోల్లన్న సంగతిని యాది మరుస్తున్నరు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గా సంగతేందో జెర జెప్పు’’ అని సత్నారి అన్నడు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్ల ముంగట దలిత బందు పద్కం బెట్టిండ్రు. ఎట్లన్న జేసి గెల్వాలని గా నియోజక వర్గంల అమలు జేసిండ్రు. వాసాల మర్రిల 75 మంది దళితులకు గీ పద్కం కింద తలా పది లచ్చల రూపాయ లిచ్చిండ్రు. అటెంకల నియోజక వర్గంకు 500 మందికి దలిత బందు పద్కం కింద తలా పది లచ్చలు ఇస్తమన్నరు. మల్ల గిప్పుడు 200 మందికే ఇస్తమంటున్నరు. బడ్జెట్ బెట్టి యాడాదైంది. గని పోయిన పది నెలలల్ల ఒక్కడంటె ఒక్క నికి గుడ్క ఈ పద్కం కింద రూపాయలియ్య లేదు. బీఆర్ఎస్ సర్కారొస్తె దేసమంత దలిత బందు పద్కం బెడ్త మని కేసీఆర్ అన్నడు. రాస్ట్రంలనే అమలు జెయ్యనోడు దేసంల అమలెట్ల జేస్తడు’’ అని ఇస్తారి అన్నడు. ‘‘హాత్ సే హాత్ యాత్ర సంగతేంది?’’ ‘‘వొచ్చె నెల ఆరో తారీకు కెల్లి రాస్ట్రంల హాత్ సే హాత్ జోడో యాత్ర జేస్తమని కాంగ్రెస్ లీడర్లు అంటున్నరు. ముందుగాల చబ్బీస్ జన్వరి కెల్లి గీ పాదయాత్ర జేద్దామను కున్నరు. రాహుల్ గాంది బారత్ జోడో పాదయాత్ర కశ్మిర్లకు బోయింది. గని జమ్ముల చబ్బీస్ జన్వరి దినాన గాకుంట ముప్పై తారీకు రాహుల్ జెండ ఎగిరేస్తడట. బారత్ జోడో కతమైన చబ్బీస్ జన్వరి దినాన్నే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర షురువు జేద్దామని కాంగ్రెస్ లీడర్లు అను కున్నరు. గని జమ్ముల రాహుల్ పబ్లిక్ మీటింగ్ వాయిద బడ బట్కె తెలంగానల పాదయాత్ర గుడ్క వాయిద బడ్డది. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘హాత్ సే హాత్ జోడో అంటె చెయ్యితోని చెయ్యి గల్పుడు. చెయ్యి తోని చెయ్యి ఎప్పుడు గల్పుతరు. కుస్తి పట్టేటి ముంగట గల్పుతరు. చెయ్యి తోని చెయ్యి గల్పుడు అంటె చెయ్యిచ్చుడు. గీ రొండిట్ల ఏం జేస్తమని కాంగ్రెస్ జెప్తున్నది’’ అని సత్నారి అడిగిండు. ‘‘కోడి గుడ్డు మీద బూరు బీక్తున్నవు. పస్కలొచ్చినోనికి దునియంత పచ్చగనే కండ్ల బడ్తదట’’ అని ఇస్తారి అన్నడు. ‘‘గాంది బవన్కు వొచ్చేటి సవాల్ లేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీనడ్మ గాంది బవన్కు వొచ్చిండు. రేవంత్ రెడ్డిని గల్సిండు. ఇద్దరం గల్సి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర జేద్దామన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లప్పుడు కాంగ్రెస్ కిలాఫ్ మాట్లాడిన వెంకట్ రెడ్డి మీద డిసిప్లినరీ యాక్షన్ దీస్కోవాలెనని కొండా సురేక అంటున్నది. ముందుగాల్ల లీడర్ సే లీడర్ జోడో అయినంకనే హాత్ సే హాత్ జోడో అంటె బాగుంటది’’ అని సత్నారి అన్నడు. ‘‘ఆది శంకరాచార్య అందరి కన్న ఫస్టు కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండ్రు. మల్ల గిప్పుడు శంకరాచార్య తీర్గనే రాహుల్ గాంది గుడ్క కన్యాకుమారి కెల్లి కశ్మీర్ దాంక పాదయాత్ర జేసిండని కశ్మీర్ మాజి ముక్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఒక్క తీర్గ తారీఫ్ జేసిండు. గాయిన శంకరాచార్య అనంగనే రాహుల్‌కు ముగ్గురు దేవులల్ల ఒక్కడైన శంకరుడు యాది కొచ్చిండు. యాదికి రాంగనే గాయిన చెయ్యి సూబెట్టిండు. బారత్ జోడో యాత్ర అనేటి తపస్సు జేసిన. చేసినంకనే మీకు అరచెయ్యి అంటె అభయ ముద్ర సూబెడ్తున్న అని రాహుల్ గాంది అన్నడు’’ అని యాద్గిరి జెప్పిండు. నాత్రి తొమ్మిది గొట్టినంక ఎవలింటికి గాల్లు బోయినం. (క్లిక్ చేయండి: మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?
పొద్దుగాల ఛాయ్ దాక్కుంట గూసున్న. యాద్గిరి మామొచ్చిండు. ‘‘ఊల్లె అందరు బాగుండ్రానె.’’ ‘‘అందరెట్ల బాగుంటరురా? కొంత మందే బాగున్నరు. (మామ రాజకీయాలు మాట్లాడుడు షురువు జేసిండని మనసుల అనుకున్న.) మన ఊల్లె ఏంది. దేసంలనే పది మంది కోట్లు కమాయించి మజా జేస్తుంటె కడ్మ జెనం ఆకలితోని సస్తున్నరు’’ అని అన్నడు. ‘‘సంటర్ సర్కార్ బీదోల్లకు ఐదు కిలల వొంతున బియ్యం ఫిరీగ ఇస్తున్నది. ఇంకేం జెయ్యాలెనే?’’ ‘‘బియ్యం ఫిరీగ ఇయ్యంగనే అయిపాయెనా? గ్యాసు బండ దర మూడింతలు బెర్గె. సంక్రాంతి పండ్గ దినాన వందే బారత్ రేల్ గాడిని షురువు జేసిండ్రు. లష్కర్ కెల్లి ఎన్మిదిన్నర గంటలల్ల విశాకపట్నం బోతది. గని గాడి ఛార్జిలే మొగులు మీదున్నయి. ఎగ్జిక్యూటివ్ కిలాస్ టికిట్ దర 3,170 రూపా యలు. గని గాలి మోటర్ టికిట్ దర 3,900. గాల్లు, గీల్లతో పండ్గ నాడు సీట్లు నిండినయి. ఆవలి దినం కెల్లి సగం కన్న ఎక్వ సీట్లు కాలిగున్నయి. ఒక్క దినం యేసానికి మూతి మీసం గొరిగిచ్చుకున్న తీర్గున్నది గీ రేల్ గాడి సంగతి.’’ ‘‘మామా రాహుల్ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?’’ ‘‘నెహ్రూ ప్రతాని అయినప్పుడు గాయిన పెండ్లాం లేదు. ఇందిరా గాంది ప్రతాని కుర్సి మీద గూసున్నప్పుడు గామె మొగడు లేడు. మొరార్జి దేశాయ్ ప్రతాని అయినప్పుడు గాయిన పెండ్లాం లేదు. గదే తీర్గ పీవీ నరసింహారావు ప్రతాని కుర్సి మీద గూసున్నప్పుడు గాయిన పెండ్లాం లేదు. వాజపేయి అయితే పెండ్లే జేస్కోలేదు. మోదీకి పెండ్లాం ఉన్నా లేనట్టే లెక్క. పెండ్లాం లేకుంటనే ప్రతాని అయ్యేటి మోక దొర్కుతదని రాహుల్ గాంది పెండ్లి జేస్కోలేదు. పెండ్లాం లేకుంటె ఎంత లాబమో ఒకపారి వాజపేయి జెప్పిండు. రొండు దినాలల్ల పోక్రాన్ అను పరీచ్చ జేస్తరనంగ అబ్దుల్ కలాం అప్పటి ప్రతాని వాజపేయి దగ్గరకు బోయిండు. అనుపరీచ్చ జేస్తమన్న సంగతిని మనద్దరికి తప్పిడ్సి ఎవ్వల్కి ఎర్క గాకుంట సూడుండ్రి అన్నడు. మీకు పెండ్లాం లేదు, నాకు పెండ్లాం లేదు. గసు వంటప్పుడు గీ సంగతి మనిద్దరికి దప్పిడ్సి కడ్మోల్లకు ఎట్ల ఎర్కైతది వయా అని వాజపేయి అన్నడు.’’ ‘‘కేసీఆర్ సంగతేంది మామా?’’ ‘‘కమ్మంల కేసీఆర్ బీఆర్ఎస్ పుట్టుక సబ బెట్టిండు. నగరమంత గులాబి జెండలు ఎగిరేసిండ్రు. సబకొచ్చిన లీడర్ల కోసం అర్వై మూడు తీర్ల తెలంగాన వొంటకాలను జేపిచ్చిండ్రు. నాటుకోడి కూర, బొమ్మి డాయిల పుల్సు, కొర్రమీను కూర, రొయ్యల ఫ్రై, బిర్యాని అసుంటియి గూడ ఉన్నాయి. ఏడు తీర్ల స్వీట్లను గుడ్క జేపిచ్చిండ్రు. సబకు వొచ్చినోల్ల గురించి ఎన్మిది లచ్చల మంచినీల్ల సీసలు బెట్టిండ్రు. నూట నల్వయి ఫీట్ల పొడ్గు, అర్వై ఫీట్ల ఎడల్పుతోని పెద్ద స్టేజి గట్టిండ్రు. కేరల ముక్యమంత్రి విజయన్, డిల్లీ ముక్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముక్యమంత్రి బగవంత్ మాన్, యుపి మాజీ సీఎం అకిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రతాన కార్యదర్శి డి. రాజా గీ సబకొచ్చిండ్రు. విజయన్, డి.రాజా అంగ్రేజీల స్పీచ్ గొడ్తె కడ్మోల్లు హిందిల మాట్లాడిండ్రు. గాల్ల మాటలు అర్తం గాక జెనం లొల్లి బెట్టిండ్రు. గిప్పుడు మనది జాతీయ పార్టీ, ఏ బాస ఎవ్వలు మాట్లాడినా లొల్లి బెట్టకుంట ఇనాలె అని కేసీఆర్ అన్నడు.’’ ‘‘కేసీఆర్ ఏమని స్పీచ్ గొట్టిండే?’’ ‘‘వొచ్చేటి లోక్‌సబ ఎలచ్చన్ల మోదీ ఇంటికి బోతడు. మనం డిల్లికి బోతం. దేసమంత రైతు బందు, దలిత బందు పద్కాలు బెడ్తం. 70 వేల టీఎంసీల నీల్లు దొర్కుతున్నా 20 వేల టీఎంసీల నీల్లు వాడుతున్నం. కాలేశ్వరం అసువంటి ప్రాజెక్టులు లేకపోయె బట్కె దేసంల 50 వేల టీఎంసీల నీల్లు ఫుజూల్గ బోతున్నది. బీఆర్ఎస్ సర్కారొస్తె దేసమంతట కాలేశ్వరం అసువంటి ప్రాజెక్టులు గట్టిపిస్తది అన్కుంట కేసీఆర్ స్పీచ్గొట్టిండు. చింతకాని మండలంల వందనం అనేటి ఊరున్నది. గా ఊరుకు బోరుతోని నీల్లు ఇస్తున్నరు. బోరు నడ్సెతందుకు వాడేటి కరెంటును బీఆర్ఎస్ పుట్టుక సబకు మల్పిండ్రు. దాంతోని తాగెతందుకు నీల్లు లేక వందనం ఊరోల్లు తిప్పలబడ్డరు. యాడాదిల ప్రతాని అవుడెట్ల అనేటి వయ్యి గురించి కేసీఆర్ ఒక్క తీర్గ లెంకుతున్నడు. వొస్తరా’’ అన్కుంట మా యాద్గిరి మామ బోయిండు. (క్లిక్ చేయండి: రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్ తథా క్యాడర్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్ తథా క్యాడర్
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. రొండంత్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. ఆకలైతున్నా బేతాలునికి వొండుకోబుద్ది గాలేదు. నాబి కాడ సల్ల బడితె నవాబ్ కైన జవాబ్ జెప్పొచ్చు అనుకోని ఆన్లైన్ల చికెన్ బిర్యాని దెప్పిచ్చుకుండు. తిన్నంక కతల వయ్యి సద్వుకుంట గూసున్నడు. సరింగ నాత్రి ఒకటి గొట్టంగ, విక్రమార్కుడు హారన్ గొట్టిండు. బేతాలు డింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ఎప్పటి లెక్కనే విక్రమార్కుడు మోటర్ నడ్పలేదు. ఎన్కకు దిర్గి సకినాలు, నూల ముద్దలు ఇచ్చిండు. ‘‘గియెందుకిస్తున్నవ్?’’ అని బేతాలుడు అడిగిండు. ‘‘సంక్రాతి పండ్గని.’’ ‘‘లీడర్లు బిర్యాని పొట్లాలు ఇచ్చిన తీర్గ ప్రేమతోని నువ్వు గివ్వి నాకిచ్చినందుకు శెనార్తిలు. ఏం పండ్గనో ఏమో! ఒక్క దినం ఏసంకు మూతి మీసం గొర్గిచ్చుకును డెందుకో! అన్ని పండ్గలేమొ గని సంక్రాతి పండ్గకు అందరు సంత ఊర్లకు బోవాలనుకుంటరు. మోకేకా ఫాయిదా ఉటాయించి బస్సు చార్జిలు డబల్, త్రిబల్ జేస్తరు. రేల్ గాడిలల్ల నిలబడెతంద్కు గూడ జాగ దొర్కదు. భారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది పాద యాత్ర జేస్తున్నడు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బీహార్ ముక్యమంత్రి నితీశ్ కుమారే గాకుంట యువగళం పేరు మీద లోకేశ్ గుడ్క పాదయాత్రలు జేస్తమంటున్నరు. గాల్ల తీర్గనే పాదయాత్ర జేస్కుంట పండ్గకు ఊర్లకు బోతె బాగుంటదని జెన మనుకుంటున్నరు. యథా లీడర్ తథా క్యాడర్.’’ ‘‘ముగ్గుల సంగతేంది?’’ ‘‘కిసాన్ సర్కార్ అన్కుంట బీఆర్ఎస్, రామరాజ్జెమన్కుంట బీజేపీ, ఇందిరమ్మ సర్కార్ అన్కుంట కాంగ్రెస్ జెనంను ముగ్గుల దించెతంద్కు ఒక్క తీర్గ కోషిస్ జెయ్యబట్టినయి.’’ ‘‘పతంగులెక్కిస్తున్నరా?’’ ‘‘ఫాంహౌస్‌ల సుతాయించిన మాంజతోని బీఆర్ఎస్ పతంగు లెక్కిస్తున్నది. ఈడీ, సీబీఐ మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నది. సర్పంచుల మాంజ సుతాయించి కాంగ్రెస్ పతంగులెక్కి స్తున్నది. మేడినిండియా మాంజ అనుకుంటనే చైన మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నదని అను కుంట ఆల్ పిరీ మాంజతోని ఆప్ పతంగులెక్కి స్తున్నది. సీపీఐ, సీపీఎం తోక పతంగులు ఎక్కిస్తున్నయి. బీఆర్ఎస్, బీజేపీ పతంగుల నడ్మనే పేంచి నడుస్తున్నది’’ అని బేతాలుడన్నడు. ‘‘రాజకీయ బోగి మంటలు గిన ఉన్నయా?’’ ‘‘ఎందుకు లెవ్వు. లీడర్లు దినాం జెనంల మంటలు బెడ్తున్నరు. గీ నెలల కమ్మంల బీఆర్ఎస్ లచ్చల మందిల మంట బెడ్తది. బీజేపీ గుడ్క గిదే నెలల లష్కర్ల లచ్చల మందితోని మంటలు షురువు జేస్తనని జెప్పింది. జన సేన, టీడీపీ గల్సి ఆంద్రల మాటల మంటలు బుట్టిస్తమంటున్నయి. అమెరికల డల్లాస్ల గుడ్క తెలుగోల్ల నడ్మ కులం, రాజకీయ మంటలు లేసినయి.’’ ‘‘రాజకీయ కోడి పందాల సంగతేంది?’’ ‘‘సంక్రాంతనంగనే కోడి పందాలే యాదికొ స్తయి. కోల్ల కాల్లకు చిన్న కత్తులు గట్టి దంగల కిడుస్తరు. గవ్వి ఒక్క తీర్గ ఫైటింగ్ జేస్తయి. గా కోల్ల మీద కోట్ల రూపాయలు బిట్టు గడ్తరు. గీ నడ్మ ఆన్లైన్ కోడి పందాలు షురువు జేసిండ్రు. గివ్వి యాడాదంత నడుస్తనే ఉంటాయి. లీడర్ల నడ్మ దినాం తిట్ల పందా లుంటయి. గీ రాజకీయ కోల్ల నాల్కలే కత్తులు. అసల్ కోడి పందాలల్ల రెండు కోల్లు ఉంటె ఒకటి సస్తది. రాజకీయ కోల్ల పందాలల్ల ఒక కోడి ఓడి పోతె ఇంకొక కోడి గెలుస్తది. గియ్యాల ఓడిన కోడి రేపు గెల్సినా గెలుస్తది. సంక్రాతి దినాలల్ల నోములు జేసేటి ఆడోల్లు వాడకట్టుల సకినాలు, నూల ముద్దలు బంచుతరు. కుర్సి నోములు జేసేటి లీడర్లు కొత్త కొత్త పద్కాలు బెట్టి జెనంకు రూపాయలు బంచుతరు. నిండ ముంచుతరు.’’ ‘‘వహవ్వా, ఏం చెప్పినవ్ బేతాలా!’’ ‘‘గది గంట్లుండ నియ్యి. ఉప్పరిపల్లి మూసీ నది ఒడ్డుకు మొసల్లు ఎందుకొచ్చినయి. గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతా లుడన్నడు. ‘‘బేతాలా! సంక్రాతిని మకర సంక్రాంతంటరు. మకరము అంటె మొసలి. రాజకీయ మొసల్లు ఎట్లున్నయో అర్సుకునేతంద్కు పండ్గ నాడు అసలు మొసల్లు మూసీ నది ఒడ్డుకొచ్చినయి’’ అని విక్రమార్కుడు జెప్పిండు. చౌరస్తల రెడ్ సిగ్నల్ బడ్డది. మోటరాగింది. ఎన్క తలుపు దీస్కోని కిందికి దిగిన బేతాలుడు బొందలగడ్డ దిక్కు ఉర్కిండు. (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: ఆ ఏడు పోతేమి... ఈ ఏడు వస్తేమి?
కొత్త యాడాదొచ్చింది. యాడాదే గాకుంట బోన్గిరి కెల్లి మా యాద్గిరి మామ గుడ్క ఇంటికొచ్చిండు. ఎప్పుడు మాట్లాడినా రాజకీయాల గురించే మాట్లాడ్తుంటడు. రామాయనం, బారతం గూడ రాజకీయాలే అంటడు. రామునికి కైక వెన్నుపోటు పొడ్వబట్కె పద్నాల్గేండ్లు అడ్విలల్ల దిర్గిండు. పార్టి ఫిరాయించ బట్కె విబీషనుడు లంకకు రాజైండు. వెన్నుపోటు, గోడదుంకుడు ఎప్పటి సందో ఉన్నయని జెప్తుంటడు. ఊరంత ఒక దిక్కైతె ఊసు కండ్లోడు ఒక దిక్కు. అందరు ఎడ్డెం అంటె గాయిన తెడ్డెం అంటడు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్ మామా’’ అన్న. చిన్నగ నగిండు. ‘‘కొత్త యాడాదిల సంతోసంతోని ఉండుమంటె ఎక్కిరిచ్చిన తీర్గ నవ్వుతవేందే?’’ అని అడ్గిన. ‘‘కొత్త క్యాలండర్ రాంగనే అంత యాడనన్న కొత్తగైతదార! సూర్యు డేమన్న కొత్తగున్నడా? మొగులు మీది కెల్లి చెంద్రుడు కిందికి దిగొచ్చిండా?’’ ‘‘శానమంది మందు గొట్టిండ్రు. డాన్స్ జేసిండ్రు. కేకులు గోసిండ్రు. అందరు జోష్ మీదుంటె నువ్వు హోష్ గురించి మాట్లాడ్తవేంది?’’ ‘‘కొత్త యాడాదిని మనాయించె తంద్కు నడి నాత్రి దన్క పబ్‌లను, బార్లను తెర్సి ఉంటెతంద్కు పర్మిసన్ ఇచ్చిండ్రు. తెలంగాన 215 కోట్ల మందు గొడ్తె ఆంద్రల 142 కోట్ల రూపాయల మందు గొట్టిండ్రు. సర్కార్ ఎవ్వలితోని నడుస్తున్నదో ఎర్కెనార? మందుతోని నడుస్తున్నది.’’ ‘‘వహవ్వా! క్యా ఖూబ్’’ ‘‘తొమ్మిదేండ్లు చెంద్రబాబు ముక్యమంత్రి కుర్సి మీద గూసున్నడు. ఏడేండ్లు అపొజిషన్ లీడర్ కుర్సి మీద గూసోని రికార్డ్ బిటాయించిండు. ఆక్రి మోక ఇయ్యుండ్రి. మల్ల ముక్యమంత్రిని జెయ్యుండ్రి అన్కుంట జెనంను బత్మిలాడుతున్నడు. గిదేం కర్మ రాస్ట్రంకు అన్కుంట మీటింగ్‌లు బెట్టి పల్ల పల్ల ఏడుస్తున్నడు. గా నడ్మ కందుకూరుల సన్నటి బాటల మీటింగ్ బెట్టిండ్రు. దాంతోని మెస్లెతందుకు గుడ్క జాగ లేక జెనం ఒగల మీద ఒగలు బడి ఎనిమిది మంది సచ్చిండ్రు. గిదే పెద్ద కర్మ రాస్ట్రంకు అయ్యింది. చెంద్రబాబు హన్మంతున్ని జెయ్యబోతె బోడ కోతి అయ్యింది. కొత్త యాడాది పస్టు తారీకు గుంటూర్ల టీడీపీ చెంద్రన్న కానుకలు పంచుడు ప్రోగ్రాం బెట్టింది. చెంద్రబాబు స్టేజి ఎక్కుతున్నప్పుడే గాదాని ఒక తంతె కూలింది. తంతెను బాగ జేసినంకనే గాయిన స్టేజ్ ఎక్కిండు. కానుకల కోసం ఆడోల్లు ఒగల నొగలు నూక్కున్నరు. కొందరు కింద బడ్డరు. కింద బడ్డోల్లను తొక్కుకుంట బోయిండ్రు. దాంతోని ముగ్గురు ఆడోల్లు సచ్చిండ్రు. పోయిన యాడాది ఆక్రిల చెంద్ర బాబు బెట్టిన మీటింగ్‌ల తొమ్మిది మంది సస్తె కొత్త యాడాదిల బెట్టిన మీటింగ్‌ల ముగ్గురు సచ్చిండ్రు. గివన్ని జూస్తె పచ్చ మీటింగ్‌ల కర్మేంది రాస్ట్రంకు అని జెనం అన్కుంటున్నరు. కొత్త యాడాదొచ్చినా బాబు మారలే. గాయిన కర్మ మీటింగులు సుత మారలే’’ ‘‘పప్పు లోకేశ్ సంగతేందే?’’ ‘‘అందరు పాదయాత్ర జేస్తున్నరు. ఎన్కట మా నాయిన గుడ్క పాదయాత్ర జేసిండు. బారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది గూడ పాదయాత్ర జేస్తున్నడు. ఇయ్యాల గాకున్నా రేపన్న ముక్యమంత్రిని గావాలంటె పాదయాత్ర జెయ్యాలె. నడిస్తినా అంటే తిన్నది అర్గుతది. బొర్ర రాకుంట ఉంటుంది అని లోకేశ్ అన్కుండు. అయ్యగారి తాన్కి బోయిండు. మంచి మూర్తం బెట్టిచ్చు కుండు. 27 తారీకున కుప్పం కెల్లి ఇచ్చాపురం దాన్క పాదయాత్ర జేస్తనని జెప్పిండు. యువ గలం పేరు మీద 400 దినాలు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర జేస్తనన్నడు. యెంబడి పస్పు బస్తలు గూడ గొంచ బోతనని జెప్పిండు. జెనం మీద పస్పు సల్లుకుంట పాదయాత్ర జేస్తనన్నడు. పాదయాత్ర జేస్కుంట టీడీపీని ‘బలవంతం’ జేస్తడు, గిదేందని అడ్గకురా గాయిన ‘బలవంతం’ అంటె ‘బలోపేతం’ అని అనుకుంటడు.’’ (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!) ‘‘మామా! సలికాలం గూడ ఉబ్బరిస్తున్నదెందుకే?’’ ‘‘కొత్త యాడా దొచ్చిందని సలి గూడ మందు గొట్టి గరమైందిరా. రేల్ గాడి సైమమయింది వొస్తరా’’ అన్కుంట యాద్గిరి మామ ఊరికి బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండంత్రాల బంగ్లల బేతాలు డుంటున్నడు. ఎటూ పొద్దుబోక టీవీ జూస్కుంట గూసున్నడు. విక్రమార్కుడు బొందల గడ్డకు బోయిండు. బేతాలుని ఇంటి ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతాలుడు ఇంట్ల కెల్లి ఇవుతల కొచ్చిండు. మోటరెన్క సీట్ల గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ‘‘నన్ను గూసుండ బెట్టుకోని ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతవు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు తిక్క లేవొచ్చు. కోపం రావొచ్చు. యాస్ట లేకుంట ఉండె తంద్కు నీకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ అని మోటరెన్క సీట్ల గూసున్న బేతాలుడన్నడు. ‘‘నీకు కత జెప్పుడు, నాకు ఇనుడు అల్వాటే గద’’ అని మోటర్ నడ్పుతున్న విక్రమార్కుడన్నడు. ‘‘గీనడ్మ తెలంగానలున్న కమ్మం పట్నంల తెలుగు దేసం శంకు సప్పుడు సబ బెట్టింది. గాడ కిష్నుని యేసంల శంకమూదుతున్న ఎన్టీఆర్ కటౌట్ బెట్టిండ్రు. పచ్చ జెండలు ఎగిరేసిండ్రు. పచ్చ తోర్నాలు గట్టిండ్రు. బుక్క గులాల్లెక్క తెలుగు దేసమోల్లు ఒకల మీద ఒకలు పస్పు జల్లుకుండ్రు. శంకు సప్పుడు సబ కాడ రెండేల్లు సూబెడ్తున్న చెంద్రబాబు కటౌట్ గుడ్క బెట్టిండ్రు. ‘తెలుగుదేసం పిలుస్తున్నది కదలిరా. సైకిల్ పంపు దీస్కోని ఉర్కిరా’ అని రాసి ఉన్న బ్యానర్లను గట్టిండ్రు’’ అన్కుంట బేతాలుడు ఇంకేమొ జెప్పబోతుంటె – ‘‘సైకిల్ పంపు దీస్కోని వొచ్చుడెందుకు?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాలిబోయిన టీడీపీ సైకిల్ల గాలిగొట్టెతంద్కు. శంకు సప్పుడు సబకు చెంద్రబాబొస్తుంటె జెనం గాయిన మీద పస్పు జల్లిండ్రు. నందమూరి సుహాసిని పస్పుతోని గాయినకు బొట్టు బెట్టింది. కడ్మ టీడీపీ ఆడి లీడర్లు గాయినకు మంగలార్తి ఇచ్చిండ్రు. పచ్చంగి దొడుక్కున్న గాయిన గాల్లకు రెండేల్లు సూబెట్టిండు. ‘తెలుగుదేసం జిందాబాద్, చెంద్రబాబు జిందాబాద్’ అని తెలుగు దేసపోల్లు లాసిగ వొల్లుతుండగ గాయిన స్టేజ్ ఎక్కిండు. ముందుగాల పచ్చ రంగు శంకం దీస్కోని ఊదిండు. గని జెర్ర సేపటికే గాయినకు దమ్మొచ్చింది. ఇక దాంతోని శంకమూదుడాపి గాయిన గిలాస నీల్లు దాగిండు.’’ ‘‘తెలుగుదేసంను ఇడ్సిపెట్టి పోయిన తెలుగు తమ్ముండ్లూ మల్లొక్కపారి మీ ఇంటికి రాండ్రి. సైకిల్ పంపుచర్లు జుడాయించి గాలి గొట్టుండ్రి. టీడీపీ తెలంగానలనే పుట్టింది. తెలంగానలనే పెరిగింది. (‘తెలంగానలనే సచ్చింది’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు) నేను ఒక్క తీర్గ బత్మిలాడంగ బత్మిలాడంగ బిల్స్ గేట్స్ పట్న మొచ్చిండు. కుద్దు నేనే గాలి మోటర్ అడ్డంకు బోయి గాయినకు మంగలార్తి ఇచ్చిన. మూడు నచ్చత్రాల హోటల్ల ఉంచి కుద్దు నేనే ఒక కోపుల చాయ్ ఇచ్చిన. గాయినకు ఒక్క తీర్గ మస్క గొట్టి హైటెక్ సిటీ దెచ్చిన. గాలి మోటర్ల దునియ అడ్డను నేనే గట్టిపిచ్చిన. నేను జెయ్యబట్కెనే ఇయ్యాల పట్నంల కరోన టీక తయ్యారైంది. తెలంగాన, ఆంద్ర నాకు రొండు కండ్లు. గీ రొండు కండ్లు ఒక్కటి గావాలని సిగ్గు శరం లేనోల్లు అంటున్నరు. ఏ కన్నుకు ఆ కన్ను ఉంటెనే నాకు మల్ల ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్తది. టీడీపీ సైకిల్ ఒక గిర్రల ఆంద్ర తమ్ముండ్లు గాలిగొడ్తున్నరు. ఇంకొక గిర్రల తెలంగాన తమ్ముండ్లూ గాలి గొట్టుండ్రి. మీరు గాలిగొడ్తెనే నా సైకిల్ నడుస్తది. నా సైకిల్ నడుస్తనే బీజేపీ కాడికెల్లి అన్ని పార్టిలు నా దిక్కు జూస్తయి. నాతోని సోపతి జేస్తయి అన్కుంట చెంద్రబాబు సుత్తిగొట్టిండు.’’ ‘‘తెలంగానలనే గాకుంట ఆంద్రల గుడ్క చెంద్రబాబు సబలు బెట్టిండా?’’ ‘‘గిదేం కర్మ రాస్ట్రంకు సబలు బెట్టిండు. ముక్యమంత్రి కుర్సి పోయిన కాన్నుంచి నాకు బువ్వ దిన బుద్దయితలేదు. కన్ను మలుగుతలేదు. కన్ను మల్లకుంటె కలలు యాడబడ్తయి. కలలు బడక ఆకర్కి కలల గుడ్క ముక్యమంత్రి అయ్యేటి మోక దొరుక్త లేదు. ఫికర్ తోని బక్కగైన. నన్ను ముక్యమంత్రిని జేస్తిరా అంటె అందరి ఇండ్లకు పచ్చ రంగేపిస్త. ఇండ్లకే గాకుంట బళ్లకు, గుళ్లకు, సర్కార్ దప్తర్లకు పచ్చరంగు ఏపిచ్చి ఆంద్రప్రదేస్ను బంగారి రాస్ట్రం జేస్త. గిదేం కర్మ రాస్ట్రంకు...’’ అని గాయిన ఇంకేమొ మాట్లాడబోతుంటె – ‘నువ్వే కర్మ రాస్ట్రంకు’ అని ఎన్కకెల్లి ఎవడో లాసిగ వొల్లిండు. చెంద్రబాబుతోని ముచ్చట బెట్టెటప్పుడు బిల్‌గేట్స్ తప్పిజారి గూడ గాయిన ఈపు ఎందుకు సూబెట్టలేదు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ టైర్లల్ల గాలి బోతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఈపు గిన గండ్లబడ్తె చెంద్రబాబు యాడ ఎన్నుపోటు పొడుస్తడోనని బిల్‌గేట్స్ బయపడ్డడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంటి దిక్కు బోయిండు. (క్లిక్ చేయండి: కొంపలు ముంచే కొత్త దుక్నాలు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: కొంపలు ముంచే కొత్త దుక్నాలు
తెలంగానకు బోక శానొద్దు లైంది. ఒక్కపారి గా రాస్ట్రంకు బోయొస్తె బాగుంటదని నారదుడు అనుకుండు. తిట్టేటి నోరు, తిరిగేటి కాలు ఊకుండయి. నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట నారాయన, నారాయన అనుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. పట్నం దిక్కు గాయిన రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు ఎదురైంది. ‘‘యాడికి బోతున్నవ్ నారదా’’ అని అడిగింది. ‘‘తెలంగాణల ఏమైతున్నదో ఎర్క జేస్కునే తంద్కు బోతున్న. నా సంగతి కేంగని నువ్వు పట్నం ఎందుకు బోయినవు’’ అని నారదుడు అడిగిండు. ‘‘మా దున్నపోతుల సంగం ఎలచ్చన్లు ఉంటె ఒక్క తీర్గ రమ్మని నన్ను బిలిస్తె బోయుంటి.’’ ‘‘మీ సంగం ఎలచ్చన్లు ఎట్లయినయి?’’ ‘‘సూద్దామని బోయిన నన్ను సుట్ట కుదురును జేసినయి. దున్నపోతుల సంగం ప్రెసిడెంటును జేసినయి.’’ ‘‘నర్క లోకం దున్నపోతును ప్రెసిడెంట్ నెట్ల జేస్తరని తెలంగాన దున్నపోతులు లొల్లి బెట్టలేదా?’’ ‘‘లొల్లి బెట్టెతంద్కు మా దున్నపోతులేమన్న కాంగ్రెస్ పార్టీయా?’’ ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అసువంటి రాజకీయ పార్టీల గాలి దాక్తె దున్నపోతులల్ల గుడ్క రాజకీయాలు షురువైతయేమో!’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు తక్వోనివి గావు నారదా! మా దాంట్ల రాజకీయాలు షురువైతె మేము మేము కొట్లాడు కుంటుంటె సూసి మురుద్దామనుకుంటున్నవు. గీ నడ్మ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త దుక్నాలు దెర్సినయి. ఇంతకుముందు తెలంగానల టీఆర్ఎస్ అనేటి కిరాన దుక్నముండేది. గా దుక్నంను హోల్‌సేల్ దుక్నం జేసి డిల్లిల దెర్సిండ్రు. బీఆర్ఎస్ అని పేరు బెట్టిండ్రు. దుక్నంల కేసీఆర్ గూసుండు. వాస్తు జూసి మంచి మూర్తంల దుక్నం దెర్వబట్కె గిరాకి మంచి గైతదని గాయిన అనుకుండు. గని గాయిన ఒకటను కుంటె ఒకటైంది. కుమార స్వామి, అఖిలేశ్ యాద వ్లే దుక్నం కాడ్కి వొచ్చిండ్రు. గాల్లది ఉద్దెర బ్యారమే. గాల్లు దప్పిడ్సి డిల్లిల ఎవ్వలు గా దుక్నం గురించి ముచ్చట బెట్టలే.’’ ‘‘కాంగ్రెస్ దుక్నాల సంగతేంది?’’ అని నారదుడు అడిగిండు. ‘‘గిప్పుడున్న అంగడిల ఒకల్లను జూసి ఒకల్లు ఓరుస్త లేరు. కండ్లల్ల మన్ను బోసుకుంటున్నరు. భారత్ జోడో యాత్ర జేస్కుంట ప్రేమ దుక్నాలు దెరుస్తున్న. గీ దుక్నాలు కడ్మ దుక్నాల సుంటియి గాదు. గిన్వి ఎవ్విటిని అమ్మయి, కొనయి. అందర్కి ప్రేమను పంచిస్తయి. బువ్వబెడ్తె అర్గిపోతది. బట ్టలిస్తె చిన్గిపోతయి. గని నా ప్రేమ అర్గేది గాదు అని రాహుల్ గాంధి అన్నడు.’’ ‘‘ఇంతకు గాయిన ప్రేమ నెట్ల పంచుతున్నడు?’’ ‘‘కాంగ్రెస్సోల్లు గండ్లబడ్తె గాలియెంబడి ముద్దు లిస్తున్నడు. చిన్న పోరనికి చెప్పులేస్తున్నడు. బుడ్డ పోరగాన్ని ఎత్తుకోని ముక్కు చీమిడి దీస్తున్నడు. కాలేజి పోరగాల్లకు సేకెండిస్తున్నడు. ఛాయ్ దాక్కుంట ముసలోల్ల మంచి చెడ్డ లర్సుకుంటు న్నడు. రాహుల్ గాంధి భారత్ జోడో అన్కుంట పాదయాత్ర జేస్తుంటే పార్టీ తోడో అన్కుంట తెలం గానల కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుకుంటున్నరు’’ అని దున్నపోతు అన్నది. ‘‘ఎందుకు కొట్లాడుకుంటున్నరు?’’ అని నార దుడు అడిగిండు. ‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన కాడికెల్లి తెలంగాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట మండుతున్నరు. మునుగోడుల కాంగ్రెస్ ఓడిపోంగనే గాయిన మీద్కి లేసిండ్రు. టీపీసీసీ కమిటీలు ఎయ్యంగనే రేవంత్‌ను తిట్టుకుంట గాల్లు శిగమూగ బట్టిండ్రు. భట్టి విక్రమార్క ఇంట్ల కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజ నర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ప్రేంసాగర్ రావు అసువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మీటింగ్ బెట్టిండ్రు. టీడీపీకెల్లి కాంగ్రెస్లకొచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కమిటీలల్ల టీడీపీలకెల్లి వొచ్చి నోల్లకే మోక ఇచ్చిండు. ముంగటి సంది కాంగ్రెస్‌ల ఉన్నోల్లను పక్కకు బెట్టిండు. సేవ్ కాంగ్రెస్ అన్కుంట గాల్లు లొల్లిబెట్టబట్టిండ్రు. ‘హాత్ సే హాత్’ ప్రోగ్రాంకు డుమ్మాగొట్టిండ్రు. ఇగ దాంతోని టీపీసీసీ కుర్సిలకు సీతక్కనే గాకుంట పన్నెండుమంది కాంగ్రెస్ లీడర్లు రాజినామ జేసిండ్రు. కొట్లాడుకుంటున్న కాంగ్రెస్ లీడర్లల్ల కొంతమందిని గుంజి గాల్ల చేతులల్ల తామర పువ్వులు బెట్టెతంద్కు బీజేపీ రడీగున్నది.’’ ‘‘బీఆర్ఎస్ దుక్నం సంగతేంది?’’ ‘‘డిల్లిల బీఆర్ఎస్ హోల్‌సేల్ దుక్నం బెట్టినంక కేసీఆర్ పట్నమొచ్చిండు. రొండు మూడు దినా లైనంక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గాయినను గల్సిండు. ఆంద్రప్రదేస్, పంజాబ్, హర్యానా, మహా రాస్ట్ర, ఒడిసా, కర్నాటక రాస్ట్రాలల్ల బీఆర్ఎస్ దుక్నాలు దెరుస్తమని కేసీఆర్ జెప్పిండు. ఆ దుక్నాల ముంగట ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రాసిన బోర్డులు బెడ్తమని అన్నడు. మల్ల గలుస్త’’ అన్కుంట దున్నపోతు నర్కం దిక్కుబోయింది. నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: మందల బడి మురుస్తాంది గొర్రె) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: మందల బడి మురుస్తాంది గొర్రె
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడు ఉంటు న్నడు. పొద్దుబోకుంటె టివిల ఫుట్‌బాల్ మ్యాచ్ జూస్కుంట గూసున్నడు. ఇంటి ముంగట మోటరాపి విక్రమార్కుడు హారన్ గొట్టిండు. టివి బంద్ జేసి బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. ‘‘ఇగమున్నా, సిగలేటు ముట్టిచ్చెతంద్కు ఇంగలం దొరకకున్నా, ఆనగొట్టి తొవ్వలు చెర్ల తీర్గ అయినా మోటర్ దీస్కోని వొస్తవు. గుంతలు, ఎత్తు గడ్డలని సూడ కుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న సైడియ్యకుంటె నీకు కోపం రావొచ్చు. నీ యాస్టనంత యాది మర్సెతందుకు బీఆర్ఎస్ కత జెప్త ఇను’’ అని అన్నడు బేతాలుడు. ‘‘చెప్పుడు నీ పనైతె ఇనుడు నా పనే గదా’’ అని విక్రమార్కుడు అన్నడు. ‘‘కతంత అయినంక నేనడ్గేటి సవాల్‌కు జవాబ్ జెప్పుడు గుడ్క నీ పనే. బొంతు పుర్గు సీతాకోక చిల్క అయిన తీర్గ టీఆర్ఎస్ పార్టి బీఆర్ఎస్ అయ్యింది. టీఆర్ఎస్ జెండల తెలంగాన నక్ష ఉన్నది గని బీఆర్ఎస్ జెండల బారతదేసం జెండ ఉన్నది. బీఆర్ఎస్ అంటె బరండి, రమ్ము, స్కాచ్ అని కొందరనబట్టిండ్రు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది; బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయితదని రేవంత్ రెడ్డి అసువంటోల్లు అనబట్టిండ్రు.’’ ‘‘ఇంతకు బీఆర్ఎస్ అంటె ఏంది?’’ ‘‘భారత రాష్ట్ర సమితి. ముందుగాల రాస్ట్రం సంగతి జూస్కోవాలె. అటెంకల దేసంను బాగ జేస్త ననాలె. గట్ల గాకుంట కేసీఆర్ ఇల్లు మించిన పందిరేస్తున్నడు. ఎంటిక పోసతోని గుట్టను గుంజాలని సూస్తున్నడు.’’ ‘‘తెలంగాన గురించి కేసీఆర్ ఎన్నిటినో జేస్తె గిట్లంటవేంది?’’ ‘‘శాన జేసిండు. మాటల్తోని కోటలు గట్టిండు. రొండేండ్ల కిందట వాసాల మర్రి ఊరును దత్తు దీస్కుండు. యాడాదిల గా ఊరును బంగారి మర్రి జేస్తనన్నడు. రొండు నూర్ల గజాల వొంతున అందర్కి ఇండ్లు గట్టిపిచ్చి ఇస్తనన్నడు. శ్రమదానం కమిటి, హరిత హారం కమిటి అసువంటి కమిటిలు ఏసిండు. మొగులు మీది సర్గంను కిందికి దించుతనని ఒక్క తీర్గ జెప్పిండు. తొవ్వ ఏసెతంద్కు అడ్డమున్నయని శానమంది ఇండ్లను కూలగొట్టిండ్రు. అంగన్వాడి, బడి, పంచాయతి ఆపిస్, చెర్వులను బాగ జేసెతందుకు 150 కోట్లు కర్సయితదని అప్సర్లు సర్కార్‌కు జెప్పిండ్రు. గని ఇదువర దాంక సర్కార్ ఒక్క రూపాయి గుడ్క మంజూరు జెయ్యలేదు. గిప్పుడు వాసాల మర్రిల వాసాలే మిగిలినయి. కొత్త ఇండ్లేమొగని ఉన్న ఇండ్లు బోయినయి’’ అని బేతాలుడు అన్నడు. ‘‘ఇంతకు కేసీఆర్, బీఆర్ఎస్ జెండను యాడ ఎగిరేసిండు?’’ ‘‘డిల్లిల సర్దార్ పటేల్ మార్గ్‌ల ఒక బంగ్లను కిరాయికి దీస్కుండు. తీస్కునే ముంగట గది వాస్తు ప్రకారం మంచి గున్నదా లేదా అని అర్సుకుండు. పెండ్లాం, పిల్లలను దీస్కోని డిల్లికి బోయిండు. అయ్యగార్లు బెట్టిన మంచి మూర్తంల నవ చండీయాగం జేసిండు. యాగ మైనంక ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని వొచ్చి నోల్లందరు వొర్లుతుండంగ బీఆర్ఎస్ జెండ ఎక్కిచ్చిండు. మంగలార్తి దీస్కోని పార్టి అపిస్లకు బోయిండు.’’ ‘మోదీ జైశ్రీరాం అంటడు. జైశ్రీరాం గాదు జైసియా రాం అనాలని రాహుల్ గాందీ అంటున్నడు. రాంరాం అన్కుంట సీతా మాతను ఇడ్సిపెడ్తె ఎట్లని అడుగు తున్నడు. మన దేసమే గాకుంట దునియంత మంచి గుండెతందుకే రాజ శ్యామల యాగం జేసిననని కేసీఆర్ అంటున్నడు. గీల్లు గిట్లెందుకు జేస్తున్నరు’’ అని విక్ర మార్కుడు అడిగిండు. ‘‘లీడర్లందరు మతం పేరు మీద మాయలు జేస్తుంటరు. గుళ్లు గట్టిస్తరు. దీపాలు ముట్టిస్తరు. జెనా లను గొర్లను జేస్తరు. జెనం గొల్రు గుడ్క లీడర్ల యెంబడి దిరుక్కుంట మురుస్తుంటయి. రేపొద్దుగాల ఏమైతయో మరుస్తుంటయి. దేసంల అన్నిటి కన్న ఎక్వ గొర్లున్న రాస్ట్రం తెలంగాన అని గీనడ్మ ఒక పేపర్ల రాసిండ్రు ఎందుకు? గీ సవాల్‌కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్ప కుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ముందుగాల నీ లెక్కనే నాకు అర్తం గాలేదు. జెర సోంచాయిస్తె అర్తమైంది. ఆడు అబద్దం రాయలేదు. ఉన్న నిజమే రాసిండని’’ విక్ర మార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. తోక:– ‘‘నేను ఇంటర్ల ఫస్ట్ కిలాస్ల పాసైన. గీ సదువుతోని నీకు కొల్వు యాడ దొరుక్తది. డిగ్రి మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జిలు ఏస్కోని బత్కాలె అని మా నాయిన అన్నడు. డిగ్రిల ఫస్ట్ కిలాస్ల పాసైన. కొల్వు దొర్కలే. బిటెక్ మంచిగ సద్వు. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బండి బెట్టుకోని బత్కాలె అని మా కాక అన్నడు. బిటెక్ల మంచి మార్కులొచ్చినయి. కొల్వు దొర్కలే. ఎంబిఏ మంచిగ సదివితివా అంటె సర్కార్ కొల్వు దొరక్తది. మంచిగ సద్వకుంటివా అంటె మిర్చి బజ్జీలు ఏస్కోని బత్కాలె అని మా మామ అన్నడు. ఎంబిఏ గుడ్క మంచి మార్కులతోని పాసైన. ఏం లాబం. కొల్వులు లెవ్వు. మిర్చి బజ్జీలేస్కోని బత్కు అని సర్కా రోల్లు జెప్పిండ్రు. ముప్పై రూపాయలకు నాలుగు మిర్చి బజ్జీలు. మీకెన్ని బజ్జీలు గావాలె.’’ (క్లిక్ చేయండి: బీఆర్ఎస్ అంటే ఏంది?) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మా ‘బాబూ’ బాద్ మెల్లమెల్లగా మహబూబాబాద్ అయ్యిందట!
ఆంద్రప్రదేస్ బోక శానొద్దులైంది. ఒకపారి గా రాస్ట్రం బోయొస్తె బాగుంట దని నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అనుకుంట మొగులు మీద్కెల్లి ఎల్లిండు. నర్కం దిక్కుబోతున్న యముని దున్న పోతు ఎదురుబడ్డది. ‘‘యాడ్‌కి బోతున్నవు నారదా!’’ అని అడిగింది. ‘‘ఆంద్రప్రదేస్ బోతున్న’’ ‘‘ఫుజూల్గ ఎందుకు బోతవు?’’ ‘‘నేను బోకుంటె గాడి సంగతులన్ని ఎట్లెర్కైతయి?’’ ‘‘గా రాస్ట్రంల ఏమైతున్నదో నేను జెప్త గద.’’ ‘‘గట్లయితె మంచిదే. నాకు బోయే బాద దప్పుతది’’ అని నారదుడన్నడు. ‘‘అన్ని నిజాలే జెప్త. అబద్దాలస్సల్ జెప్ప అని గీనడ్మ చెంద్ర బాబు అంటున్నడు’’ అని దున్నపోతు ఇంకేమొ జెప్పబోతుంటె అడ్డం దల్గి– ‘‘గాయిన సంగతి ఎవ్వలికెర్కలేదు. అస్కిని బుష్కిని జేసుడే గాకుంట అబద్దంను నిజమని నమ్మిచ్చెతంద్కు గాయిన ఒకతీర్గ తన్లాడ్తడు’’ అని నారదుడన్నడు. ‘‘అబద్దంను ఊకూకె జెప్తె గది నిజమై గూసుంటది. చెంద్ర బాబు హైటెక్ సిటీనే గాకుంట మహబూబాద్‌ను గుడ్క గట్టిపిచ్చిన్నని అంటున్నడు. ముంజాత గాదాని పేరు మా ‘బాబూ’ బాద్ట. మా బాబూబాద్ మెల్లమెల్లగా మహబూబా బాద్ అయ్యిందట. గదే తీర్గ మా బాబూనగర్ మహబూబ్ నగరైందని గాయిన ఒక్కతీర్గ జెప్తున్నడు. ఎన్కట చెంద్రబాబు గిరిని గాయినే గట్టిపిచ్చిండట. గా చెంద్రబాబు గిరినే గీ జమానల అందరు చంద్రగిరని అంటున్న రట. నాకు ఆక్రి మోక ఇయ్యిండ్రి. మల్లొకపారి ముక్యమంత్రిని జెయ్యిండ్రి. గట్ల జేస్తిరా అంటె కొత్త చరిత్ర రాయిస్త. గిసువంటి నిజాలు జెనంకు ఎర్కయ్యేటట్లు జేస్త అని చెంద్రబాబు అనబట్టిండు’’. ‘‘చెంద్రబాబు ఇంకేం జెప్పిండు?’’ ‘‘మా టిడిపి సర్కారుండంగ జన్మభూమి, శ్రమదానం అసుంటి పద్కాలు బెట్టినం. జన్మభూమి కింద చెట్లు నాటేటోల్లు. శ్రమదానం కింద నాటిన చెట్లను పీకెటోల్లం. గీ పద్కాలు జెయ్యబట్కె ఎందరికో పని దొర్కింది. గిప్పుడు మాసరకు గిసువంటి ఒక్క పద్కమన్న ఉన్నదా? నా జమానల రైతులు ఎరు వులు, ఇత్తుల కోసం తిప్పలుబడెటోల్లు గాదు. ఎరువులు, ఇత్తులు గావాలంటె కంప్యూటర్ల డవున్లోడ్ జేస్కునేటోల్లు. అన్కుంట చెంద్రబాబు పల్ల పల్ల ఏడ్సిండు’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘అంత బాగున్నది గని ఎందుకేడ్సిండు?’’ అని నారదుడు అడిగిండు. ‘‘ముక్యమంత్రి కుర్సి యాదికొచ్చి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘బాబు జెప్పుడేనా? చేసుడేమన్న ఉన్నదా?’’ ‘‘పవన్ కల్యాన్‌ను గల్సినంక కూసమిడిచిన పాము తీర్గ బాబు ఆగుతలేడు. గిదేం కర్మ రాస్ట్రంకు పోగ్రాం కింద రొండు గోదావరి జిల్లలల్ల దిరుక్కుంట మీటింగ్‌లు బెట్టిండు’’ అన్కుంట దున్నపోతు జెప్తుంటె మల్ల నారదుడు అడ్డం దల్గి – ‘‘గిదేం కర్మరా బాబూ! అని అనుకోబట్కెనే ఆంద్ర జెనాలు చెంద్రబాబును ముక్యమంత్రి కుర్సి మీదకెల్లి దించిండ్రు. రాజకీయాలల్ల వజీప దీస్కొని మన్మనితోని ఆడుకోమన్నరు’’ అని అన్నడు. ‘‘గాయిన వజీప దీస్కుంటె పాపం లోకేశ్‌ను ఎవలు గాన్తరు. సైకిల్ల గాలిబోయింది. రొండు పయ్య లూసిపోయినయి. హైండిల్ ఇర్గిపోయింది. ఫిర్బిల్ పనిజేస్తలేదు. ఫైడిల్లు పతా లేకుంట బోయి నయి. ఇగ దాంతోని లోకేశ్ సైకిల్ జోడో యాత్ర జేస్తనంటున్నడు. గిదేం కర్మ రాస్ట్రానికి ప్రోగ్రాం కింద నిడదవోలుల చెంద్రబాబు మీటింగ్ బెట్టిండు. నా ముక్యమంత్రి కుర్సి నాగ్గాకుంట బోంగనే మన రాస్ట్రంకు శని బట్టింది. అంగట్ల అన్ని ఉన్నా అల్లుని నోట్లె శని అంటె గిదే అని అన్నడు’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘అంగట్ల అన్ని ఉన్నయి. అల్లుడు శని గూడ ఉన్నడు అంటె బాగుంటది’’ అని నారదుడన్నడు. ‘‘గిదేం కర్మ రాస్ట్రంకు ప్రోగ్రాం కింద తెలుగుదేసం తాడేపల్లి గూడెంల మీటింగ్ బెట్టింది. బుక్కా గులాల్లెక్కగా మీటింగ్‌ల తెలుగుదేసమోల్లు ఒగల మీద ఒగలు పస్పు జల్లుకున్నరు. టిడిపి జిందాబాద్, గిదేం కర్మ రాస్ట్రంకు అని తెలుగుదేసమోల్లు లాసిగ ఒల్లుతుండంగ చెంద్రబాబు మైకు ముంగట్కి వొచ్చిండు. రొండేల్లు సూబెట్టిండు. పోలవరం నా పానం. మా సర్కారుం డంగ పతొక్క సోమారంను పోలవారం అనుకున్నం. అనుకోని గా దాని గురించే మాట్లాడుకునేటోల్లం. నెలకొక్కపారి నేను పోలవరం ప్రాజెక్టు చూసొచ్చేటోన్ని. సంటరే గీ ప్రాజెక్టు గటిపిచ్చేదుంటె కమీషన్ల కోసం నేను గాదాన్ని గట్టిచ్చుడు షురువు జేసిన్నని నన్ను బద్నాం జేసిండ్రు. నాకు ఆక్రి మోక ఇయ్యండ్రి’’ అన్కుంట చెంద్రబాబు స్పీచ్ గొట్టిండు. మల్ల గలుస్త అన్కుంట దున్నపోతు నర్కం దిక్కు బోయింది. ఫీచేముడ్ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. తోక: పొద్దుమీకింది. ఎప్పటి తీర్గనే పాన్ డబ్బ కాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట, సిగిలేట్లు దాక్కుంట మా దోస్తులు ముచ్చట బెడుతున్నరు. ‘‘ఢిల్లిల జి–20 మీద ప్రతాని మోదీ మీటింగ్ బెట్టిండు. అన్ని రాస్ట్రాల ముక్యమంత్రులను, పార్టీల ప్రెసిడెంట్లను బిల్సిండు. గప్పుడు చెంద్రబాబును జూసి శాన బక్కగైండ్రు అని మోదీ అంటె గీ నడ్మ రాస్ట్రంల బగ్గ దిర్గుతున్న అని బాబు జెప్పిండు’’అని యాద్గిరి అన్నడు. ‘‘చెంద్రబాబు తిరుగుడు తోని బక్కగ గాలేదు. ముక్యమంత్రి కుర్సి మీద ఫికర్తోని బక్కగైండు’’ అని సత్నారి జెప్పిండు. -తెలిదేవర భానుమూర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99591 50491 -
ఛాయ్ అమ్మిన... గుజరాత్ గట్టిన...
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందల గడ్డ దిక్కు బోయిండు. గాడ రెండంత్రాల బంగ్లల బేతా లుడు ఉంటున్నడు. విక్రమార్కుడు మోటరాపిండు. హారన్ గొట్టిండు. బేతాలుడు ఇంట్లకెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. గప్పుడు బేతాలుడు – ‘ఎండలు మండుతున్నా. వానలు దంచిగొడ్తున్నా, సలి ఒక్క తీర్గ వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం మోటర్ దీస్కోని వొస్తవు. ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పు తవు. ఏ బర్రెన్న నీ మోటర్‌కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ దప్పొచ్చు. నువ్వు ఎంత హారన్ గొట్టినా ఎవడన్న సైడియ్యక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. యాస్ట మర్సెతందుకు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను’’ ‘‘చెప్పెతందుకు నువ్వుంటె ఇనెతందుకే నేనున్నా’’ అని విక్రమార్కుడు అన్నడు. ‘‘గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్లు అయితున్నయి. గా రాస్ట్రంల ఇర్వై ఏడేండ్ల సంది బీజేపీ సర్కారే ఉన్నది. ఇంతకుముందు గుజరాత్ల కాంగ్రెస్, బీజేపీ నడ్మనే పోటీ ఉండేది’’ అన్కుంట బేతాలుడు ఇంకేమో జెప్పబోతుంటె – ‘‘గిప్పుడు కొట్లాడ్త లెవ్వా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘నన్ను చిడాయించెతంద్కు నువ్వు గిసువంటి సవాల్లు అడ్గుతుంటవని నాకెర్క లేదనుకుంటున్నవా? గిప్పుడు సుత కొట్లాడ్తున్నయి. గుజరాత్లనే గాకుంట దేసంలున్న అన్ని రాస్ట్రా లల్ల ఎప్పటి సందో బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలచ్చన్ల కొట్లాడ్తనే ఉన్నయి. గీపారి గుజరాత్ అసెంబ్లి ఎలచ్చన్ల దంగలకు చీపిరి కట్ట బట్కోని ఆప్ దిగింది.’’ ‘‘రొండు పెద్ద పార్టిల నడ్మల చిన్న పార్టి ఆప్ నెగులుకొస్తదా?’’ ‘‘ఎంత చెత్త ఉన్నా ఊకేది చీపిరితోనే. గా రొండు పార్టీలను మా చీపిరితోని ఊకి పారేస్తం. ఢిల్లిల గా రొండు పార్టీల మా చీపిరి తోని ఊకినం. పంజాబ్‌ల సుత ఊకి పారేసినం. గుజరాత్లో గుడ్క ఊకి పారేస్తం. ఆప్ సర్కార్ దెస్తం అని కేజ్రీవాల్ అన్నడు. అనుడే గాకుంట ఒక కాయితం మీద రాసిచ్చిండు.’’ ‘‘గుజరాత్ల ఆప్‌కు గెల్సేంత బలమున్నదా?’’ ‘‘బలం లేదు గని మా సర్కార్ గినొస్తె సర్కార్ జీతగాల్ల జీతాలు బెంచుతం. ఫిరీగ కరెంటు ఇస్తం. పాత పింఛను విదానం దెస్తం. రోగాలు గినొస్తె దవకాన్ల ఫిరీగ ఇలాజ్ జేపిస్తం అసువంటి వాగ్దానాలు ఆప్ జేసింది. గంతేగాకుంట చీపిరికట్ట బట్టుకోని కేజ్రీవాల్ గుజరాత్ అంత ఒక్క తీర్గ తిర్గిండు. ఊర్లల్ల కాంగ్రెస్‌కు బలముంటె పట్నాలల్ల బీజేపీకి బలమున్నది. వైసు పోరగాల్లు, పోరిలు ఆప్ అంటె ఇస్టంతోని ఉన్నరని అంటున్నరు.’’ ‘‘కాంగ్రెస్ సంగతేంది?’’ ‘‘ఒకప్పుడు గుజరాత్ల కాంగ్రెస్ సర్కారే ఉండేది. శాన ఏండ్ల సంది మల్ల గా రాస్ట్రంల గెల్సెతంద్కు కాంగ్రెస్ ఒక్క తీర్గ కోషిస్ జేస్తున్నది. మెల్లమెల్లగ సీట్లు పెంచుకొంటున్నది. గుజరాత్ల మొత్తం 182 సీట్లు ఉన్నయి. 2002ల బీజేపీకి 127 సీట్లు వొచ్చినయి. గని 2007ల 117కు, 2012ల 115కు, 2017ల 99 సీట్లకు పడిపోయినయి. బీజేపీకి సీట్లు తక్వ అయితుంటె కాంగ్రెస్‌కు సీట్లు పెర్గినయి. ఎలచ్చన్లు రాంగనే ప్రతాని మోది సెంటిమెంట్ రాజేస్తుండు. గిప్పుడు గాయినకు గా మోక ఇయ్యొద్దని కాంగ్రెస్ అనుకున్నది. భారత్ జోడో యాత్రల రాహుల్ గాంది ఉన్నడు. గాయిన గుజరాత్ల ఊకూకె ప్రచారం జేస్తలేదు. ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ సి.ఎం. అశోక్ గెహ్లత్ కాంగ్రెస్ దిక్కు కెల్లి ప్రచారం జేస్తున్నరు. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఎలచ్చన్లు వొచ్చినా మోది ప్రచారం జేస్తడు. అసెంబ్లి ఎలచ్చన్లు వొచ్చినా ప్రచారం జేస్తడు. రావనాసురుని లెక్క ప్రతానికి పది తల్కా యలున్నయి. గుజరాత్ల చిన్నప్పుడు ఒక రేల్టేషన్ల ఛాయ్ అమ్మిన అని మోది జెప్పిండు. గని గాయిన ఛాయ్ అమ్మిన అని జెప్తున్న జమాన్ల గాడ రేల్టేషనే లేదు. లేని రేల్టేషన్ల మోది ఛాయ్ ఎట్ల అమ్మిండు’ అని ఖర్గే అడిగిండు.’’ ‘‘బీజేపీ ప్రచారం ఎట్ల జేసింది?’’ ‘‘అమిత్ షా మాట్లాడుకుంట గోద్రా అల్లర్లు గుర్తు జేసిండు. మల్ల బీజేపీ వస్తెనే గుజరాత్ల ఎసు వంటి కొట్లాటలు ఉండయని జెప్పిండు. ఉత్తరప్రదేశ్ ముక్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు దెస్తనని జెప్పిండు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఖిలాప్ కొట్లాడిన నర్మదా బచావో లీడర్ మేథాపాట్కర్ రాహుల్ గాందితోని గల్సి భారత్ జోడో యాత్రల నడ్సింది. గుజరాత్ రాస్ట్రం రాకముందు గుజరాతీలు, మహారాష్ట్రుల నడ్మ కాంగ్రెస్ కొట్లాటలు బెట్టింది. మేము గసుంటోల్లం గాదు. జై శ్రీరాం అంటం. కార్పరేట్ సంస్థలకు పెద్ద పీట ఏస్తం. నేను తినను. ఎవ్వర్ని తిననియ్యను. శాన పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ బెట్టి పిచ్చిన. ‘గుజరాత్నంత మీరే గడ్తె కూలిన మోర్బీ ఫూల్ గుడ్క మీరే గట్టిండ్రా?’ అని అడిగితె మోదీ ఏమన్నడు? గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్‌కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘మోర్బీ ఫూల్ నేను గట్టలేదు. కూలోల్లు గట్టిండ్రు అని మోదీ అన్నడు’’ అని విక్రమార్కుడు జెప్పిండు. ఇంతల బొందల గడ్డ వొచ్చింది. బేతాలుడు మోటర్ దిగి ఇంట్లకు బోయిండు. (క్లిక్ చేయండి: కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కొని బొందల గడ్డ కాడ్కి బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. విక్రమార్కుడు మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు బేతాలుడు– ‘‘ఎండ గొడ్తున్నా, ఆనదంచి గొడ్తున్నా, సలి వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం వొస్తవు. గుంతలు, ఎత్తుగడ్డలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న నీ మోటర్‌కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ గాక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. నువ్వు యాస్ట మర్సెతంద్కు ఒక మజేదార్ ముచ్చట జెబ్త ఇను’’ అని అన్నడు. ‘‘చెప్పుడు నీ పని. ఇనుడు నా పని’’ అని విక్ర మార్కుడన్నడు. ‘‘చెంద్రబాబుకు ముక్యమంత్రి కుర్సి ఉన్నా నిద్ర రాదు. లేకున్నా నిద్ర రాదు’’ అన్కుంట బేతా లుడింకేమో జెప్పబోతుంటె అడ్డం దల్గి, ‘‘ఎందుకు రాదు’’ అని విక్రమార్కుడ డిగిండు. ‘‘చెంద్రబాబు ముక్యమంత్రిగ ఉండంగ కుర్సి దిగితె పౌరన్ ఎవలన్న గా కుర్సిల గూసోవొచ్చనేటి బయంతోని నాత్రిపూట గుడ్క నిద్ర పోలేదు. ఏం జేస్తె ముక్యమంత్రి కుర్సి వొస్తదా అని పగటీలి నాత్రి పూట ఒక్క తీర్గ ఆలోచన జేస్తుండ బట్కె గాయినకు నిద్రొస్తలేదు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం గిప్పుడు గాయినేం జేస్తున్నడు?’’ ‘‘గీ నడ్మ గాయిన పవన్ కల్యాన్ తాన్కి బోయిండు. గ్లిజరిన్ కంట్లె ఏస్కుంటె నీకు ఏడ్పొస్తది. గని గ్లిజరిన్ లేకున్నా నాకు ఏడ్పు వొస్తది. నా పెండ్లాంను తిట్టిండ్రనుకుంట అసెంబ్లిల నేను పల్ల పల్ల ఏడ్సిన. నువ్వు నేను గల్సి జెనం తాన్కి ఏడ్సు కుంటబోదాం. మోదీని బత్మిలాడు. గాయినను గుడ్క మనతోని గల్సి రమ్మను. ముగ్గురం గల్సి ఏడిస్తిమా అంటె మన ఏడ్పుల జగన్ సర్కార్ కొట్క బోతది. కాపుదనంకు కమ్మదనం గలిస్తె ఎదురుండదు అని చెంద్రబాబు పవన్తోని అన్నడు. అనుడే గాకుంట గిదే నాకు ఆక్రి మోక అన్కుంట ఒక్క తీర్గ ఏడ్సిండు.’’ ‘‘మల్ల మున్పటి లెక్క టీడీపీతోని సోపతి జెసెతంద్కు బీజేపీ రడీగున్నడా?’’ ‘‘అసల్ లేదు. సైకిల్ బిరక్ ఫేలైంది. పయ్య లల్ల గాలిబోయింది. గిప్పుడు గది శీకట్ల ఉన్నది. తెల్లా రంగనే మా తామరపువ్వు విచ్చుకుంటది. పగటీ లంత గట్లే ఉంటది. శీకట్ల ఉండేటి టీడీపీ తోని మా పార్టి సోపతి జేసే సవాల్ లేదు అని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు అన్నడు. జనసేన తోని పొత్తు గూడ్తం. గా పార్టితోని గల్సి వొచ్చేటి అసెంబ్లి ఎలచ్చన్ల పోటీ జేస్తం. టీడీపీకి మాకు జమా యించదు. చెంద్రబాబును సస్తె నమ్మం అని ప్రతాని అన్నడు.’’ ‘‘చెంద్రబాబు గిన జెనం తాన్కి బోయిండా?’’ ‘‘గీ నడ్మ మూడు దినాలు చెంద్రబాబు కర్నూలు జిల్లల దిర్గిండు. గిప్పుడున్నది శాసనసబ గాదు. కౌరవుల సబ. నేను ముక్యమంత్రినైతె గది పాండవుల సబ అయితది. నేను ముసలోన్ని అయిన. నాకు గిదే ఆక్రి మోక. నన్ను ముక్యమంత్రి కుర్సి మీద గూసుండబెడ్తె అమరావతిని రాజదాని జేస్త. ఇంద్రుని రాజదాని అమరావతి. గదే తీర్గ గీ చెంద్రుని రాజదాని గుడ్క అమరావతే అని చెంద్ర బాబు అన్నడు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం చెంద్రబాబు ఇంకేం జేసిండు?’’ ‘‘బాబు ఒక సన్నాసి తాన్కి బోయిండు. గాయిన కాల్లు మొక్కిండు. మల్ల ముక్యమంత్రిని గావాలంటె ఏం జెయ్యాలని అడిగిండు. దినాం తెల్లారి నాలుగ్గొట్టంగనే నిద్ర లెవ్వాలె. నెత్తిమీది కెల్లి తానం జెయ్యాలె. శివుని గుడికి బోవాలె. లింగంకు అబిసేకం చేసి మారెడాకులతోని పూజ జెయ్యాలె. శ్రీశైలం బోవాలె. వెయ్యిమందికి మెడల ఏస్కునే తంద్కు బంగారి లింగాలు ఇయ్యాలె. పెయ్యికి బూడ్ది బూస్కోవాలె అని జెప్పిండు. సన్నాసి జెప్పిన తీర్గనే చెంద్రబాబు జెయ్య బట్టిండు. గట్ల జేస్తుండంగ ఒక నాత్రి గాయినకు కల బడ్డది. గా కలల శంకరుడు గండ్లబడ్డడు. దేవా! జగన్ సర్కార్‌ను గూలగొట్టెతంద్కు నాకు పాశుపతాస్త్రం ఇయ్యి అని శివున్ని అడిగిండు. గాయినకు శంకరుడా అస్త్రమిచ్చిండా? జవాబు ఎర్కుండి గూడ జెప్పకుంటివా నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘అన్ని అస్త్రాలను మించిన వెన్నుపోటు అస్త్రం నీ తాన ఉండంగ వేరె అస్త్రంతోని పనేంది అని శంకరుడున్నడు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బొందల గడ్డ దిక్కు బోయిండు. తోక: గీ నడ్మ కుల నిర్మూలన సబకు మా సత్నారి బోయిండు. ‘‘సార్! మీ స్పీచ్ అదిరింది’’ అని ఒక పెద్దాయనతోని గాడు అన్నడు. ‘‘ఇంతకు మీరేంటోల్లు’’ అని గాయిన సత్నారి నడిగిండు. (క్లిక్ చేయండి: పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..
లష్కర్ల రేల్ గాడి ఎక్కితె అద్ద గంటల మా వూర్కి బోవచ్చు. మా వూరు బోన్గిరి. బోన్గిరిల బాహర్పేటల మేము ఉండెటోల్లం. ఊల్లె నాకందరు సుట్టాలే. పొట్ట తిప్పలకు పట్న మొచ్చి యాభై ఏండ్లయితున్నది. బోన్గిరిల పోశమ్మ గుడి ఎదురుంగ మా ఇల్లున్నది. మా పక్కింట్ల యాద్గిరి మామ ఉన్నడు. మామ అంటె సంత మామ గాదు. వర్సకు మామ. పనిబడ్తె గాయిన పట్నమొచ్చిండు. పనంత అయినంక ఆనంద్ బాగ్ల ఉంటున్న మా ఇంటికొచ్చిండు. గాయినను సూడంగనే నాకు మా వూరును సూసినట్లనిపిచ్చింది. పట్నం మంచి చెడ్డ లర్సుకునే తంద్కు కుద్దు వూరే నడ్సుకుంట నాతాన్కి వొచ్చినట్లు గొట్టింది. ‘మామా! బాగున్నావె’ అని అడ్గిన. ‘బాగున్నర’ అని యాద్గిరి మామ అన్నడు. గా ముచ్చట గీ ముచ్చటైనంక గాయిన రాజకీయాలల్లకు దిగిండు. ‘ఏం మామా! ఎప్పుడు రాజకీయాలు మాట్లాడ్తవేందే?’ ‘రాజకీయాలు గాన్ది ఏమన్న ఉన్నదా? రామాయనమంత రాజకీయమే. బారతమంత రాజకీయమే’ అన్కుంట యాద్గిరి మామ సిగిలేట్ ముట్టిచ్చిండు. ‘విబీషనుడు గోడ దుంకి రాముని దిక్కుకు వొచ్చిండు. గోడ దుంకె బట్కె అన్న జాగల లంకకు రాజైండు. గదే తీర్గ తెలుగు దేసం కెల్లి టీఆర్ఎస్లకు దుంకిన తలసాని, కాంగ్రెస్ కెల్లి దుంకిన సబితా ఇంద్రారెడ్డి అసుంటోల్లు మంత్రులయ్యిండ్రు. ఎలచ్చన్ల ముంగట గోడ దుంకుట్లు ఎక్వయితయి. గోడ దుంకె టోల్లందరు గల్సి విబీషనునికి గుడి గట్టియ్యాలె. గాయినకు మొక్కి నంకనే పార్టి ఫిరాయించాలె.’ ‘బారతం సంగతేందే?’ ‘గంత ఆత్రమైతే ఎట్లరా? కౌరవులు, పాండవుల నడ్మ జాగ పంచాతి అయింది. గా పంచాతిని తశ్వ జేసెతంద్కు కిష్నుడు ఒక్క తీర్గ కోషిస్ జేసిండు. గాయినెంత కోషిస్ జేసినా సూది మొనంత జాగ గుడ్క పాండవులకిచ్చే సవాల్లేదని దురియోదనుడన్నడు. దాంతోని పాలోల్ల నడ్మ విద్దమొచ్చింది. కర్నున్ని ఎవ్వలు లేని జాగలకు కిష్నుడు దీస్క బోయిండు. నువ్వు సూతుని కొడ్కువు గాదు. కుంతి కొడ్కువు. నువ్వు పాండవుల దిక్కుకొస్తివా అంటె పెద్దన్నా అన్కుంట గాల్లు నీ కాల్లు మొక్కుతరు. నిన్ను రాజును జేస్తరు అని కిష్నుడన్నడు. గాయిన ఎంత గనం జెప్పినా కర్నుడిన లేదు. బీజేపీ దిక్కుకెల్లి ఇద్దరు సన్నాసి గాల్ల తోని ఇంకొకడు మొయినాబాద్ ఫాంహౌజ్కొచ్చిండ్రు. తలా నూరు కోట్ల రూపాయలే గాకుంట గనుల సుంటియి గుత్తకిప్పిస్తం అని ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతా రావు, హర్షవర్దన్ రెడ్డిలను బుద్గ రిచ్చినా గాల్లు గోడ దుంక లేదు. ఇక ముంగట ఎవలన్న గోడ దుంకుమని అంటె చెప్పుతోని కొడ్తమని అనుండ్రి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కేసీఆర్ జెప్పిండ్రు’ అన్కుంట యాద్గిరి మామ గిలాస్ నీల్లు దాగిండు. ‘ఆంద్ర సంగతేంది?’ ‘ఆంద్రప్రదేస్ల పవన్ కల్యాన్ చెప్పు చేత్ల బట్కోని చెంగడ బింగడ ఎగురుతుండు. నాకు తిక్కుంది, గా దాన్కి లెక్క లేదు అన్కుంట శిగమూగుతుండు. విశాకపట్నం, చోళ హోటల్ల ప్రతాని మోదీని గల్సిండు. రొండు చేతులతోని చెప్పులు బట్కోని శిగమూగుత. ఒక చెప్పు మీరియ్యుండ్రి. ఇంకో చెప్పు చెంద్రబాబిస్తడు. చెప్పులను చేతులల్ల బట్టుకుంట. ముక్యమంత్రినైత అని అన్నడు.’ ‘శానేండ్ల కింద ముక్యమంత్రి కుర్సి కోసం చిరంజీవి ప్రజా రాజ్జెం బెట్టిండు. గప్పుడు గాయిన పార్టి గుర్తు సూర్యుడు. అరచేతి నడ్డుపెట్టి సూర్య కాంతి నాపలేరన్నడు. గని గా అరచెయ్యే సూర్యున్ని మాయం జేసింది. ప్రజా రాజ్జెంను దీస్కబోయి కాంగ్రెస్‌ల గల్పిండు. గాయిన తీర్గనే పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో మామా’ ‘కల్పినా కల్పొచ్చురా. పవన్ అనేటి పతంగిని చెంద్రబాబు ఎక్కిస్తున్నడు. వైఎస్సార్సీపీ మోదీ కాల్లు మొక్కుతున్నదని జనసేన లీడర్ బొలివేటి అంటె మల్లీ పారి అంటివా చెప్పు తెగుతది అని మల్లాది విష్ను అన్నడు. వారీ! నువ్వు కొల్వు ఇడ్సి పెట్టి పాత చెప్పుల దుక్నం బెట్టురా! రేల్ గాడికి సైమమైంది. వొస్తరా!’ అన్కుంట మామ బోయిండు. (క్లిక్ చేయండి: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) తోక: మొన్న చాచా నెహ్రూ జయంతి అయ్యింది. ‘బాల్ దివస్ శుభాకాంక్షలు’ అని ఒక లీడర్‌కు జెబ్తె – ‘నా బాల్ (జుట్టు) నల్ల గున్నది’ అని గాయిన అన్నడు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. గా బంగ్ల ముంగట విక్రమార్కుడు మోటరాపిండు. ఆపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతా లుడు బంగ్లకెల్లి ఇవుతల కొచ్చిండు. మోట రెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు ఎన్క సీట్ల గూసున్న బేతాలుడు – ‘‘నన్ను గూసుండ బెట్టుకోని గుంతలు, ఎత్తు గడ్డలు, కంకర తేలిన తొవ్వలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఒక్కోపారి ట్రాఫిక్ల ఇర్కపోతవు. కోపం గినొస్తె నువ్వు గాన్ని గీన్ని తిట్టొచ్చు. నీకు ఎటూ సుద్రాయించక పోవచ్చు. నీకు యాస్ట రాకుంట ఉండెతంద్కు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను. ‘‘నెల దినాల సంది మునుగోడుల నడ్సిన బైఎలచ్చన్ల బాగో తంకు పర్ద బడ్డది. పది మంత్రులు, తొంబైమంది ఎమ్మెల్యేలే గాకుంట ముక్యమంత్రి గుడ్క బాగోతమాడితె పదివేల చిల్లర ఓట్లతోని టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెల్సిండు. అన్నా! నువ్వు గెల్సినందుకు పటాకులు గాలుస్తం. లడ్లు, కోవపేడలు పంచిపెడ్తం. మందు గొడ్తం. కోల్లు, మేకలు గోసి దావత్ జేసుకుంటం. పది లచ్చల రూపాయలు ఇయ్యే అని గాయిన దిక్కుకెల్లి పని జేసిన టీఆర్‌ఎసోల్లు అడిగిండ్ర’’ ని బేతాలుడు అన్నడు. ‘‘గాల్లు అడిగితె కూసుకుంట్ల రూపాయ లిచ్చిండా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘వందల కోట్ల రూపాయలు కర్సు జేస్తె కింద మీద బడి బై ఎలచ్చన్ల గెల్సిన. ఇంతకుముందు మీరు అడి గట్లిస్తె కడిగి నట్లయింది. ఇంక పైసలు యాడికెల్లి దేవాలె. ఎంత గనం తన్లాడినా కమస్కం నల్ఫై వేల ఓట్ల మెజార్టి రానందుకు కేసీఆర్ నారాజైండు అన్కుంట గాయిన మొత్తుకుండు.’’ ‘‘బీజేపీ దిక్కు కెల్లి నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి ఏమన్నడు?’’ ‘‘కింద బడ్డా మీది కాలు నాదే. న్యాయం నా దిక్కే ఉన్నది. టీఆర్ఎస్కు ఓటు ఎయ్యకుంటె పింఛన్లు ఇయ్యమని బెదిరిచ్చిండ్రు. తొండి జేసి గెల్సిండ్రు. నిజం జెప్పాలంటె నేనే గెల్సిన అన్నడు.’’ ‘‘గీ ఎలచ్చన్ల బాగోతంల బుడ్డర్ ఖాన సుంటి కె.ఎ. పాల్ ఏమన్న అన్నడా?’’ ‘‘నూరుకు అర్వై ఓట్ల లెక్కన నాకు ఓట్లు వొస్తయి. గని టీఆర్ఎస్, బీజేపీలు ఈవీఎంల తోని తోతిరి జేసినయి. ఈవీఎంలు వొద్దంటె గా రొండు పార్టిలు అడ్డంబడి నన్ను గెల్వకుంట జేసినయి. నిజాన్కి నేనే గెల్సిన. ఇయ్యాల గాకున్నా రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే అని కె.ఎ. పాల్ అన్నడు. ఎలచ్చన్లు గిప్పటి తీర్గ గాకుంట హర్రాజ్ తోని బెట్టాలె. ఎవ్వలు అందరికన్న ఎక్వ కోట్లు పంచి పెట్టుడే గాకుంట కోట్ల రూపాయల మందు బోపిచ్చెతందుకు ముంగట్కి వొస్తరో గాల్లే గెల్సినట్లు సాటి య్యాలని సర్కార్ అనుకుంటున్నది. కోట్ల రూపాయలు కర్సు బెట్ట కుండుడే గాకుంట మందు బోపియ్యనోల్లకు ఎలచ్చన్ల పోటి జేసే హక్కు ఉండదని జెబ్దామనుకుంటున్నరు. ఓటుకు నాల్గు వేలు ఇస్త మని మూడు వేలే ఇచ్చిండ్రు. కడ్మ వెయ్యి ఎప్పుడిస్తరని కొందరు లొల్లి బెట్ట బట్టిండ్రు’’ ‘‘గింతేనా ఇంకేమన్న ఉన్నదా?’’ ‘‘సార్ మీరు రాజినామ జెయ్యుండ్రి. రాజినామ జేస్తె మును గోడు లెక్క బై ఎలచ్చన్లొస్తయి. సర్కార్ పైసలు మంజూరు జేస్తది. దాంతోని మా పరిగి మంచిగైతది అన్కుంట పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి ఒకడు ఫోన్ గొట్టిండు. అన్నా! పౌరన్ నువ్వు మంత్రి కుర్సికే గాకుంట ఎమ్మెల్యేకు నువ్వు రాజినామ జేసి బై ఎలచ్చన్లు తేయే. నువ్వు రాజినామ జేస్తె ధర్మపురి నియోజక వర్గమే గాకుంట మా బత్కులు బాగై తయే అన్కుంట బతికెపల్లి కెల్లి రమేశ్ అనెటోడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫోన్ గొట్టిండు. అచ్చెమ్మ పెండ్లి బుచ్చెమ్మ సావు కొచ్చిన తీర్గ మునుగోడు బై ఎలచ్చన్లు మా పానం మీదికొ చ్చిందే అన్కుంట మంత్రి మొత్తుకుండు. మునుగోడు ఎలచ్చన్ల నేనే గెల్సిన అని కూసుకుంట్ల అన్నడు. న్యాయంగ జూస్తె నేనే గెల్సిన అని రాజ గోపాల్ రెడ్డి అంటె గీల్లిద్దరు గాదు నేనే గెల్సిన అని కె.ఎ. పాల్ అంటున్నడు. ఇంతకు ఎవ్వలు గెల్సిండ్రు. ఎవ్వలు ఓడిపోయిండ్రు . గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ గుంతల బడ్తది’’ అని బేతాలుడన్నాడు. ‘‘మునుగోడుల మందు, మనీ గెల్సింది. జెనం ఓడి పోయిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పిండ్రు. బొందల గడ్డ రాంగనే బేతాలుడు మోటర్ దిగి ఇంటికి బోయిండు. (క్లిక్: ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్‌ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్‌లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: సిత్రాలు సూడరో శివుడో శివుడా!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు ఎప్పటిలెక్కనే మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగటాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ‘‘నువ్వు ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. బల్రు అడ్డం రావొచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతె నీకు తిక్కలెవ్వొచ్చు. నువ్వు బేచైన్ గాకుంట ఉండెతంద్కు మునుగోడు ముచ్చట జెప్త ఇను’’ అన్నడు. ‘‘ఊకూకె మునుగోడు, మునుగోడు అంట వేంది?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘ఎందుకంటె అందర్కి ఒక్క దినమే దివిలె. ఎలచ్చన్ల జాత్ర జెయ్యబట్కె మునుగోడు జెనంకు దినాం దివిలెనే. దినాం దావత్లే. దినాం మందుల తేలకుంట మున్గుడే. అన్ని పార్టిల లీడర్లు ఒక్క తీర్గ చక్కర్లు గొడ్తున్నరు.’’ ‘‘కల్లమున్న కాడ బిచ్చగాల్లు. ఓట్లున్న కాడ లీడర్లు’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి నిలవడ్డ పాల్వాయి స్రవంతి ప్రచారం జేస్కుంట బోతుంటె బీజేపోల్లు అడ్డమొచ్చి శేర్ పటాకులు గాల్సిండ్రు. కాల్లల్ల కట్టె పెట్టినట్లు జేసిండ్రు.’’ ‘‘కాంగ్రెసోల్లు ఊకున్నరా?’’ ‘‘ఎందుకూకుంటరు. తమ్ల పాకుతోని గీల్లంటె తల్పు చెక్కతోని గాల్లన్నరు. బీజేపీ దిక్కుకెల్లి పోటీ జేస్తున్న రాజగోపాల్‌రెడ్డి జీపు ముంగట కాంగ్రె సోల్లు ఒక్క తీర్గ భూచెక్రాలు గాల్సి అడ్డం బడ్డరు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మందు బోస్తున్నయి. పైసలిస్తున్నయి. నరకాసురుని మీద్కి బానాలిడ్సిన సత్యభామ అసువంటిది మా స్రవంతి అని రేవంత్ రెడ్డి అన్కుంట గామెతోని బీజేపీ, టీఆర్ఎస్ల దిక్కు రొండు రాకిట్లు ఇడిపిచ్చిండు’’. ‘‘టీఆర్‌ఎసోల్లు పటాకులు గాల్వలేదా?’’ ‘‘గాల్సిండ్రు. సంస్థాన్ నారాయన్పురంల 18 వేల కోట్ల స్టిక్కర్ తోని తయారు జేసిన పటాకులను మంత్రి గంగుల కమలాకర్ గాల్సిండు. రాజ గోపాల్‌రెడ్డి బోతుంటె టీఆర్‌ఎసోల్లు అడ్డం దల్గి బాంబులు గాల్సిండ్రు. నాకే అడ్డం దల్గుతరా? మీ తోడ్కల్ దీస్త అన్కుంట గాయిన కప్పగంతులు ముట్టిచ్చిండు. ఇగ టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేస్తున్న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి లక్ష్మిబాంబు బత్తి ముట్టిచ్చిండు. గది ధన్మనకుంట తుస్సు మన్నది’’. ‘‘గీ మూడు పార్టీలే గాకుంట కడ్మోల్ల ప్రచారం సంగతేంది?’’ ‘‘కడ్మోల్లు అంటె ఇండిపెండెట్గ నిలవడ్డ కె.ఎ.పాల్ ప్రచారం గురించి రొండు ముచ్చట్లు జెప్త. గాయిన గుర్తు ఉంగ్రం. ఏలుకున్న ఉంగ్రం సూబెట్టుకుంట ఓట్లడ్గుతుంటె మాకు బంగారి ఉంగ్రం జేపిచ్చిస్తవా అని కొందరడిగిండ్రు. నన్ను గెలిపిస్తె మునుగోడును అమెరిక జేస్త. గాలి మోటర్ అడ్డ బెట్టిపిస్త అని పాల్ అన్నడు. రాంగ్ సైడ్ల కొస్తున్నవని ఒక పోలీసాయిన మోటరాపితె నేనంటె ఎవ్వరనుకుంటున్నావు, కాబోయె తెలం గాన ముక్యమంత్రి ననుకుంట పాల్ బెదిరిచ్చిండు. అందరు సూస్తుండంగ ఇంకోతాన చెంగడ బింగడ డ్యాన్సు జేసిండు.’’ ‘‘మునుగోడు ఎలచ్చన్ల ప్రచారంల కొత్త సంగతేమన్న ఉన్నదా?’’ ‘‘ఇంతకుముందు ఎన్నడు లేని తీర్గ గీ బై ఎలచ్చన్ల పోస్టర్ల జంగ్ నడుస్తున్నది. మీ అభిమాన సత్యం థియేటర్లో నేడే బ్రహ్మాండమైన విడుదల. మునుగోడు కాంతి స్రవంతి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ నీతి నిజాయితీల అడ్డ. దర్శకత్వం: విరాట్ కొహ్లీ అసుంటి రేవత్ రెడ్డి అని కాంగ్రెస్ పోస్టర్ ఏసింది. నేడే విడు దల. అమిత్ షా ప్రొడక్షన్స్ వారి పద్దెన్మిది వేల కోట్ల రూపాయలు. దర్శకత్వం: కోవర్టు రెడ్డి. నర్తకి 70 ఎం.ఎం. థియేటర్ అని టీఆర్ఎస్ పోస్టర్ అంటిచ్చింది. బండి సంజయ్ దర్శకత్వంలో నేడే విడు దల రాజన్న రాజినామా. ముక్యమంత్రి, మంత్రుల బ్యాంకు కాతాలల్ల బడ్డ నిర్వాసితుల బకాయిలు. గొల్రు కొనెతంద్కు గొల్ల కురుమలకు రూపా యలు. కడ్మ సిన్మ ఎండి పర్ద మీద సూడుండ్రి అని బీజేపీ ఏసింది. కానీ గీ ఎలచ్చన్ల ఎవలు గెల్సినా పరకేం బడదు. జెనం బత్కులేం మారయి. పెట్రోలు, గ్యాస్ బండ దరలు మొగులు మీద్కి బోతనే ఉంటయి. రూపాయి బక్కగైతనే ఉంటది. ఎన్కట రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు గదే రూపాయి బిల్ల మీద బొటనేలు బొమ్మ ఎందుకున్నది. గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటే నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఎన్కట అందర్కి బువ్వ దొర్కుతుండె బట్కె రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు బువ్వ దొర్కకుండ బట్కె బొటనేలు చీక్కుంట బత్కుండ్రి అని గిప్పటి రూపాయి బిల్ల మీద బొమ్మ జెప్తున్నది’’ అని విక్రమార్కుడు అన్నడు. ఇంతల బొందల గడ్డొచ్చింది. విక్రమార్కుడు మోటరాపిండు. బేతాలుడు మోటర్ల కెల్లి దిగి బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Munugode Bypoll: సర్కార్ ఎవల్తోని నడుస్తున్నది?
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటర్ ఎన్క సీట్ల గూసుండు. ‘‘ఎత్తుగడ్డలు, గుంతలు సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. బల్రు అడ్డం రావొచ్చు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతే తిక్కలేవొచ్చు. బేచైన్ గాకుంట ఉండెతంద్కు రొండు ముచ్చట్లు జెప్త ఇను’’ అని అన్నడు. ‘‘నువ్వు జెప్తె ఇనకుంట ఉన్ననా?’’ అని విక్రమార్కుడన్నడు. ‘‘మునుగోడు అంటె ఏందో ఎర్కేనా? మును అంటె ముందుగాల, గోడు అంటె గోస. బై ఎలచ్చన్లు వొచ్చె బట్కె సంటర్ మంత్రులు, ముక్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు గదిస్తం గిదిస్త మనుకుంట బొంబై తమాస సూబెడ్తున్నా ఇక ముందుగాల గుడ్క జెనం గోస బదలాయించదు.’’ ‘‘బాగనే ఉన్నది గని ఇంతకు జెనమేమంటున్నరు?’’ ‘‘గిదొక జాత్ర. అందరితాన పైసల్ దీస్కుంటం. మేం జేసేది జేస్తం. తింటం. తాగుతం. ఇంట్ల పంటం. ఏ పార్టి లీడరొస్తె గా పార్టి కండ్వలు గప్పుకుంటం. ఇదువర దాంక ఏ లీడరేం బీకలేదు. ఇంక నాల్గు నెలలల్ల ఏం బీక్తరు. ఫ్లోరైడ్ నీల్లట్లనే ఉంటయి. తొవ్వలల్ల గుంతలట్లనే ఉంటయి’’ అని మునుగోడు జెనమంటున్నరు. ‘‘మునుగోడుల ఎవ్వలెట్ల ప్రచారం జేస్తున్నరు?’’ ‘‘రూపాయలు ఏర్ల లెక్క బారుతున్నయి. మా పార్టి చోటామోటా లీడర్లు, సర్పంచ్‌లు మమ్ములనే డిమాండ్ జేస్తున్నరు... అవుతల లచ్చల రూపాయిల ఆఫర్ ఉన్నదంటున్నరు. గిట్లయితె ఏం జెయ్యాలెరో అని ఒక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుండు.’’ ‘‘రాహుల్ గాంది బారత్ జోడో అసరు మునుగోడు మీద ఏమన్న ఉంటదా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాయిన జోడో అంటె గీల్లు తోడో అన్కుంట కొట్లాడ్తున్నరు. కాంగ్రెస్‌ల ఏ లీడర్ కా లీడర్ తీస్మార్ఖాన్ ననుకుంటడు. మునుగోడుల ప్రచారం జేసెతందుకు నా అసువంటి హోంగార్డుల అవుసరం లేదు. ఎస్పీలే పోతరు. గాయిన మీద నూరు కేసులు పెట్టినా వొచ్చే అసెంబ్లీ ఎలచ్చన్ల గెలిపిచ్చి కాంగ్రెస్‌ను హుకూమత్లకు దెస్తనని ఒక పెద్దమన్సి అన్నడు. గాయిననే మునుగోడుల కాంగ్రెస్‌ను గెలిపిస్తడని గా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బనాయించిండు.’’ ‘‘బీజేపీ, టీఆర్ఎస్ల సంగతేంది?’’ ‘‘బీజేపీ దిక్కుకెల్లి నిలబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రొండెక్రాలల్ల క్యాంప్ ఆపీస్ బెట్టిండు. దినాం మటన్, చికెన్ తోని వెయ్యిమంద్కి దావత్ ఇయ్యబట్టిండు. ప్రచారం జేస్కుంట అవ్వా నీ ఓటు నాకే ఎయ్యాలె అని గాయిన అన్నడు. తప్పకుంట చెయ్యి గుర్తుకే ఓటేస్త అని గామె అన్నది. చెయ్యి గాదు పువ్వు అన్కుంట రాజగోపాల్ రెడ్డి మొత్తుకుండు.’’ ‘‘బండి సంజయ్, కేటీఆర్‌ల సంగతేంది?’’ ‘‘ప్రగతి బవన్ల ఒక మంత్రగానితోని కేసీఆర్ పూజలు జేపిస్తున్నడు అని బండి సంజయ్ అన్నడు. పిచ్చి ముదురుతున్నది, కరుస్తడేమో అని కేటీఆర్ అన్నడు. కావలి కుక్క లెక్క ఉండుమని కుర్సిమీద గూసుండబెడ్తె కచరా కుక్కల్లెక్క, పిచ్చికుక్కల్లెక్క కర్సెతంద్కు ఊరిమీద బడ్డరు అని బండి సంజయ్ అన్నడు. పూజూల్గ గీ లీడర్లు మమ్ములను బద్నాం జేస్తున్నరనుకుంట పట్నంల కుక్కలన్ని రాస్తారోకో జేసినయి.’’ ‘‘చండూరు ర్యాలీ ఎట్లయింది?’’ ‘‘టీఆర్ఎస్ దిక్కుకెల్లి నిలబడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేసన్ ఏసినంక చండూరుల మీటింగ్ బెట్టిండ్రు. కేటీఆర్ పక్కపంటే మైకు బట్కోని, నామినేషన్ కొచ్చిన నందమూరి తారక రామారావు గారికి, తమ్మినేని సీతారాం గారికి అనుకుంట కూసుకుంట్ల మాట్లాడబట్టిండు. యాల పొద్దుగాలే మందుగొట్టినట్లున్నడు అని కేటీఆర్ గాయినను ఎన్కకు బొమ్మన్నడు. ఒక మంత్రి అయితె మన బీఎస్పి పార్టీ అనబట్టిండు. ఇంతకు టీఆర్ఎస్ లీడర్లు పగటీలనే మందు ఎందుగ్గొడ్తున్నరు. గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటె నీ మోటర్‌కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బీఆర్ఎస్ అంటే ఏంది?) ‘‘గీ సర్కార్ ముక్యమంత్రితోని నడుస్త లేదు. మంత్రుల తోని నడుస్త లేదు. ఎమ్మెల్యేలతోని నడుస్త లేదు. పోలీసోల్లతోని నడుస్త లేదు. మందుతోని నడుస్తున్నదని గాల్లు పగటీలనే మందుగొట్ట బట్టిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Telidevara Bhanumurthy: బీఆర్ఎస్ అంటే ఏంది?
ఇయ్యాల ఆనగొట్టింది. రేపు ఎండ గొట్టొచ్చు. ఎల్లుండి సలిబెట్టొచ్చు. దినాలెప్పుడు ఒక్క తీర్గనే ఉండయి. మా తాత జమాన్ల విక్రమార్కుడు నడ్సుకుంట బొందలగడ్డ కాడ్కి బోయెటోడు. బేతాలుడు చెట్టు మీద ఉండెటోడు. గాన్ని బుజం మీదేస్కోని విక్రమార్కుడు నడ్సెటోడు. గాడు జెప్పేటి కత ఇని ఆకర్కి అడిగిన సవాల్‌కు జవాబ్ జెప్పెటోడు. మా నాయిన జమాన్ల విక్రమార్కుడు సైకిల్ మీద బొందలగడ్డ దిక్కుబోతే, సైకిలెన్క గూసోని బేతాలుడు కత జెప్పెటోడు. జమానా బదల్ గయా. గిప్పుడు విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ కాడ్కి బోయి హారన్ గొడ్తున్నడు. గాడ రొండంత్రాల బంగ్లలున్న బేతాలుడు ఇవుతల కొస్తున్నడు. మోటరెన్క సీట్ల గూసుంటున్నడు. గాడు గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్పబట్టిండు. ఎప్పటి తీర్గనే ఎన్క గూసున్న బేతాలుడు కత జెప్పబట్టిండు. మున్పటి లెక్క గాకుంట గాల్లిద్దరు ముచ్చట బెట్టుకుంట మోటర్ల బోబట్టిండ్రు. ‘అయ్యగారు బెట్టిన మూర్తంల దస్రనాడు కేసిఆర్ కొత్త పార్టీ బెట్టిండు’ అని బేతాలుడన్నడు. ‘మల్ల టీఆర్ఎస్ ఏమైంది?’ విక్రమార్కుడు అడిగిండు. ‘టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయింది. ముల్లు బోయి కత్తి వొచ్చె ఢాంఢాం. తెలంగాన బోయి భారతొచ్చె రాంరాం’. ‘గది వీఆర్ఎస్ అయితదా?’ ‘కేటీఆర్ ముక్యమంత్రి గావాలంటె కేసీఆర్‌కు వీఆర్ఎస్ తప్పది. ఎప్పటి సందో ప్రతాని కుర్సి మీద గూసున్నట్లు గాయినకు కలలొస్తున్నయి. తెల్లారి నాలుగ్గొట్టంగ బడేటి కలలు నిజమైతయని ఒక సన్నాసి గాయినకు జెప్పిండు’. ‘కేసీఆర్ ఏం జేసిండు?’ ‘కర్నాటక రాస్ట్రం బోయిండు. కుమారస్వామిని గల్సిండు. వొచ్చె అసెంబ్లీ ఎలచ్చన్ల కోట్లు ఇస్త అన్నడు. గట్ల మాట ఇచ్చినంకనే కేసీఆర్‌తోని కుమారస్వామి ఫోట్వ దిగిండు. గని గాయిన తోని పని గాదు. అడుగు మాడదు, అట్టు పేరదు. బిహార్ ముక్యమంత్రి నితీశ్ కుమార్‌నే గాకుంట లాలూప్రసాద్ యాదవ్‌ను గుడ్క కేసీఆర్ గల్సిండు. చౌతాలను గల్సిండు. అందరం ఒక్కటై బీజేపీతోని కొట్లాడ్దామని అన్నడు. గని అస్సయ్ అంటె అదే సహి, దూలా అంటె ఇదే సహి అనె తంద్కు గాల్లు టీఆర్ఎస్ మంత్రులసొంటోల్లు గారు. కేసీఆర్ కడ్మ రాస్ట్రాల రైతు లీడర్లకు గాడి కిరాయి లిచ్చిండు. గాల్లు పట్నమొస్తె దావత్ ఇచ్చిండు. రైతుబందు పద్కంను తారీఫ్ జెయ్యమన్నడు. దేసమంత గా పద్కం బెడ్తె మంచిగుంటదని గాల్లతోని జెప్పిచ్చిండు’. ‘బేతాలా! ఏ బట్ట కాబట్ట మాస్క అయితెనే మంచి గుంటది. ఒక రాస్ట్రం పద్కం ఇంకొక రాస్ట్రంకు మంచి గుండదు.’ ‘నివొద్దే. మన్మన్ని, పెండ్లాంను దీస్కోని కేసీఆర్ యాద్గిరిగుట్టకు బోయిండు. నర్సిమ్మసామికి కిల పదారు తులాల బంగారమిచ్చిండు. దేవుడా! నన్ను ప్రతానిని జేస్తె నీ గుడినంత బంగారం జేస్త అని మొక్కిండు’ ‘ఇంకేం జేసిండు?’ ‘పట్నంల బిహార్ కూలోల్లు సస్తె గాల్ల కుటుంబాలకు తలా పది లచ్చలు ఇచ్చి వొచ్చిండు. మహారాస్ట్ర బోయి తీస్ మార్కాన్ నన్నడు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టి బెడ్తె టీఆర్ఎస్ లీడర్లు ఏం జేసిండ్రు! కొందరు దేస్ కీ నేతా కేసీఆర్ అని వొల్లిండ్రు. కొందరు గాయిన ఫోట్వలకు పాలతోని అబిసేకం జేసిండ్రు. ఇంకొందరు కోవ పేడలు బంచిండ్రు. పటాకులు గాల్చిండ్రు. వరంగల్ టీఆర్ఎస్ లీడర్ రాజనాల శ్రీహరైతె డిస్కో డాన్సు జేసిండు. హమాలోల్లకు తలా ఒక కోడి, కోటర్ విస్కి సీస ఇచ్చిండు. కేసీఆర్ ప్రతానమంత్రి అయితున్నడని సాటిచ్చిండు. ఇగ కేసీఆర్ ప్రతాని గావాలనుకుంట చౌటుప్పల్‌ల బువ్వ దినే ముంగట మంత్రి మల్లారెడ్డి టీఆర్ ఎసోల్లకు మందు బోసిండు. గాయిన విస్కి సీసలెందుకు బంచిండు? గీయిన మందు ఎందుకు బోసిండు? గీ సవాల్‌కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) ‘బీఆర్ఎస్ అంటె బిరండి, రమ్ము, స్కాచ్ అనుకోని ఒకలు విస్కి సీసలు బంచితె, ఇంకొకలు గిలాసలల్ల మందు బోసిండ్రు’ అని విక్రమార్కుడు జెప్పిండు. సరింగ గప్పుడే బొందల గడ్డొచ్చింది. మోటరాగింది. మోటర్ల కెల్లి దిగి బేతాలుడు ఇంటికి బోయిండు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
రాహుల్ పాదయాత్ర గురించి బిజెపోల్లు ఏమన్నరు?
నారదుడు తంబూర దీస్కుండు. చిర్తలు గొట్టుకుంట, నారాయన, నారాయన అన్కుంట ఇంద్రుని తాన్కి బోయిండు. ‘ఏం నారదా! యాడికెల్లొస్తున్నవ్’ ఇంద్రుడడిగిండు. ‘బారత దేసం కెల్లి’ నారదుడు జెప్పిండు. ‘గాడ ఎవలన్న యగ్నం జేస్తున్నరా? తపస్సు గిన జేస్తున్నరా?’ ఎవ్వలు తన కుర్సికి ఎసరు బెడ్తరో అని గీయిన బుగులుపడుతుంటడు అని మనసుల అనుకోని – ‘ఎవ్వలు యగ్నం జేస్తలేరు. తపస్సు గుడ్క జేస్త లేరు. గిప్పుడు గాడ ఒక దిక్కు బారత్ జోడో, ఇంకో దిక్కు కాంగ్రెస్ చోడో, తోడో నడుస్తున్నయి’ అని నారదుడన్నడు. ‘కట్టె, కొట్టె, తెచ్చె అంటె నాకేం సమజైతది నారదా! జెర కుల్ల కుల్ల జెప్పు’ ‘అపొజిసన్ పార్టిలను ఒక్కటి జేసేతంద్కు బారత్ జోడో అన్కుంట కన్యాకుమారికెల్లి రాహుల్ గాంది పాదయాత్ర షురువు జేసిండు. గాల్లను గీల్లను గల్సుకుంట ఒక్క తీర్గ అయిదు నెలలు కశ్మీర్ దాంక నడుస్తడు. తమిలనాడు కెల్లి నడుస్తుంటె ఒక ముస్లాయిన గాయినకు గండ్లబడ్డడు. మా కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు లీటర్ గోద్మపిండిని 20 రూపాయలకు అమ్మెటోల్లు. గిప్పుడు 40 రూపాయలకు అమ్ముతున్నారని గా ముస్లాయిన తోని రాహుల్ అన్నడు. ఒగామె రాహుల్ నెత్తి మీద తాటికమ్మల టోపి బెట్టింది. జెనంకు టోపి బెట్టెతంద్కు నేను నడుస్తుంటె గీమె నాకే టోపి బెట్టిందని గాయిన మనసుల అనుకుండు.’ ‘రాహుల్ ఒక్కడే నడుస్తున్నడా? గాయిన యెంబడి ఎవలన్న ఉన్నరా?’ ‘గాయినెంబడి 119 మంది కాంగ్రెస్ ముదుర్లున్నరు. లోకల్ చెంచగాల్లే గాకుంట కడ్మ రాస్ట్రాల చెంచగాల్లు; సర్కార్ కొల్వుల గురించి నడుస్తున్నం అని రాసి ఉన్న టీ షర్టులు దొడుక్కోని కొంతమంది పోరగాల్లు గాయినెంబడి నడ్వబట్టిండ్రు. గుడిసె హోటల్ ముంగటేసిన బెంచిమీద గూసోని ఛాయ్ దాక్కుంట జెనంతోని రాహుల్ ముచ్చటబెట్టబట్టిండు. ఛాయ్ దాక్కుంట జెనంతోని ముచ్చట బెట్టకున్రి ఛాయ్ పే చర్చను నకల్ గొడ్తుండ్రని బిజెపోల్లంటరు అని ఒక కాంగ్రెస్ ముదురు అన్నడు. గీ ముదుర్లు జెయ్యబట్కనే ఎఐసిసి ప్రెసిడెంట్ కుర్సి వొద్దనుకున్న అని రాహుల్ మనసుల అనుకుండు.’ ‘రాహుల్ పాదయాత్ర గురించి బిజెపోల్లు ఏమన్నరు?’ ‘రాహుల్ 41 వేల రూపాయల టీషర్టు దొడిగిండు. దేఖో భారత్ అని బిజెపోల్లు అంటే ప్రతాని మోదీ 10 లక్షల రూపాయల కోటు దొడుక్కుండు. లచ్చన్నర రూపాయల కండ్లద్దాలు బెట్టిండు. ఒకసారి కండ్లు దెర్సి సూడుండ్రి అని కాంగ్రెసోల్లు అనబట్టిండ్రు. అమిత్ షా కార్టూన్ చపాయించి గా దాని కింద మన దేసం పెద్ద పప్పు అని రాసి ఉన్న తెల్ల రంగు టీషర్టులను దస్రకెల్లి దొడ్గుతమని తృణమూల్ కాంగ్రెసోల్లు అన్నరు.’ ‘కాంగ్రెస్ చోడో ఏంది?’ ‘ఒక దిక్కు రాహుల్ పాదయాత్ర జేస్తుంటె గోవాల ఎన్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిల దుంకిండ్రు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిజెపీలకు దుంకితె గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్లకెల్లి ఎల్లి ఆజాద్ ఫ్రంట్ పార్టీ బెట్టిండు. రాజస్తాన్ ముక్యమంత్రి అశోక్ గెహ్లత్ ముక్యమంత్రి కుర్సి మీది కెల్లి దించుతె మంచి గుండదని బెదిరిస్తె హన్మంతున్ని జెయ్యబోతె బోడ కోతి అయ్యె గదాని సోనియ మొత్తుకున్నది.’ (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) ‘గిప్పుడు రాహుల్ యాడిదాంకొచ్చిండు?’ ‘ఎంతెంత దూరం శానశాన దూరమన్కుంట కర్నాటకల కొచ్చిండు. మీరు పెండ్లి ఎందుకు జేస్కోలేదని ఒక పొల్ల అడిగింది. సన్నాసైయ్యెబట్కె వాజపేయి ప్రతాని అయిండు. పెండ్లామున్న బైరాగి అయ్యెబట్కె మోదీ ప్రతాని కుర్సి ఎక్కిండు. సన్నాసినైతె ఇయ్యాల గాకున్నా రేపైన నేను ప్రతానినైత అని రాహుల్ అన్నడు. ఒక తాన ఒక ముండమోపిరాలు గాయినను గల్సి గామె కేమన్న జెయ్యమని అడిగింది. ఏం ఫికర్ జెయ్యకు నేను ప్రతానినైనంక నీ మొగన్కి సర్కార్ కొల్వు ఇప్పిస్త అని గాయిన అనంగనే సచ్చినోనికి కొల్వా అని గామె గుల్గింది. రాహుల్ తీరు బేగానీ షాదీమే అబ్దుల్లా దీవానా! వొస్త’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. తోక: ‘నమీబియా కెల్లి దెచ్చిన చిర్తపులులకు పేరుబెట్టినోల్లకు ఇనాం ఇస్తనని ప్రతాని అన్నడు. నువ్వైతె ఏం పేరు బెడ్తవ్ర?’ అని అడిగితె– ‘ఒకదాని పేరు బేరోజ్గారి. ఇంకొక దాని పేరు గులాంగిరి అని బెడ్త’ అని మా సత్నారి అన్నడు. మావోన్కి ప్రతాని ఇనాం ఇస్తడో ఇయ్యడో గని జెనమైతె తప్పకుంట ఇస్తరు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్) -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా
యాల పొద్దుగాల. తుప్పర్లు బడ్తున్నయి. విజయవాడ కండ్లు దెరుస్తున్నది. సీపురు కట్ట బట్కోని సపాయోల్లు తొవ్వలు ఊక్తున్నరు. పాలపాకెట్లు అమ్మెటోల్లు పాలపాకిట్లు అమ్ముతున్నరు. బాసండ్లు తోమెతంద్కు పనిమన్సులు బోతున్నరు. వేరె గల్లి కెల్లి వొచ్చిన కుక్కను జూసి గల్లి కుక్కలు మొర్గుతున్నయి. కొంతమంది లీడర్లు సుత గప్పుడే నిద్ర లేసిండ్రు. మోటర్ల ఎన్క గూసున్నోల్లు గూడ సీటు బెల్టు బెట్టు కోవాలని జెప్తున్నరు. మంత్రి కుర్సికి ఆకర్కి ముక్యమంత్రి కుర్సికి గుడ్క సీటు బెల్టు బెట్టుకుంటె మంచిగుంటదని లీడర్లు అన్కుంటున్నరు. గట్ల జేస్తె సచ్చెదాంక కుర్సిమీద గూసుండొచ్చు. ఎలచ్చన్లు, గిలచ్చన్లు లేకుండబోతె మజా చెయ్యొచ్చని గాల్లు జెప్తున్నరు. తొమ్మిది గొట్టింది. తుప్పర్లు బందైనయి. మబ్బుల సాటుకెల్లి సూర్యుడెల్లిండు. పల్చటి ఎండ గొట్టబట్టింది. టీడీపీ లీడర్ యనమల రామకిష్నుడు కాఫి దాగిండు. ఆరాం కుర్సిల గూసోని పేపర్ సద్వబట్టిండు. ఏం కొంప మున్గిందేమొగని ఒక విలేకరి గాయిన తాన్కి బోయిండు. ‘నమస్తే సార్’ అని అన్నడు. ‘నమస్తే. ఏందివయా యాల పొద్దుగాలే వొచ్చినవ్’ అని యనమల అడిగిండు. ‘బల్క్ డ్రగ్ పార్క్ మా రాస్ట్రంల బెట్టుండ్రి అంటె మా రాస్ట్రంల బెట్టుండ్రనుకుంట పదిహేడు రాస్ట్రాలు దర్కాస్తు బెడ్తె మూడు రాస్ట్రాలల్ల బెట్టెతంద్కు పర్మిషన్ ఇచ్చిండ్రు. గా మూడు రాస్ట్రాలల్ల మన ఆంద్రప్రదేశ్ గూడ ఉన్నది గదా’. ‘అవ్ ఉన్నది’. ‘మన రాస్ట్రంల బల్క్ డ్రగ్ పార్క్ బెట్టొద్దని సంటర్కు కారటెందుకేసిండ్రు’. ‘గదిగిన బెడ్తె కాకినాడ కాడ రైతుల బత్కులే గాకుంట బెస్తోల్ల బత్కులు బండలైతయి. గాలి, నీల్లు కరాబైతయి’. ‘గవి కరాబ్ గాకుంట ట్రీట్మెంట్ ప్లాంట్ బెడ్తరు. గది బెడ్తెనే బల్క్ డ్రగ్ పార్క్‌కు పర్మిషనిస్తరు. గా పార్క్ తోని ఇర్వై వేల మందికి కొల్వులు దొరుక్తయి. గంతేగాకుంట గాదాంట్ల రోగాలు తక్వజేసేటి మందులు తయారు జేస్తరు’. ‘అన్ని రోగాలు తక్వ జేసేటి మందుండంగ గా మందుల్తోని పనేమున్నది. మందుగొడ్తె ముసలోడు గుడ్క మైకేల్ జాక్సన్ లెక్క డాన్సు జేస్తడు. కీసల పైసలేనోడు గూడ అమరావతి బూములు గొంటనంటడు. ఏబీసీడీలు రానోడు సుత అంగ్రేజిల మాడ్లాడ్తడు. మొన్నటిదాంక మా అయ్యన్న పాత్రున్కి విశాక డిస్టిలరి ఉండె. మా వియ్యంకునికి పి.ఎం.కె. డిస్టిలరి ఉన్నది. ఆదికేశవులు నాయుడికి శ్రీకిష్న డిస్టిలరి ఉన్నది. గివన్ని మా చెంద్రబాబు జమానకెల్లే నడుస్తున్నయి. గివన్ని ఉండంగ వేరె బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు? బ్రాంది తాగినోడు బ్రహ్మలోకమున కేగు విస్కిగొట్టినోడు విష్ణువు చెంత జేరు ఏమి తాగనోడు ఎడ్డోడు చెడ్డోడు మందు భాగ్యశీల మరి మాటలేల’ అని యనమల పద్దెం బాడిండు. ‘వహ్వా! వహ్వా! క్యా ఖూబ్’ అన్కుంట విలేకరి బోయిండు. ఒక దిక్కు గిట్లుంటె ఇంకో దిక్కు లోకేశ్, చెంద్రబాబు తాన్కి బోయిండు. ‘నాయినా! నాయినా!’ అని బిల్సిండు. ‘ఏం గావాలె బిడ్డా!’ అని చెంద్రబాబు అడిగిండు. ‘రాహుల్ గాంది బారత్ జోడో యాత్ర జేస్తుండే’. ‘గాయిన జేస్తె నీకేందిరా?’ ‘నేను గూడ ఏపీ జోడో యాత్ర జేస్తనే’. ‘నువ్వు జేసుడెందుకు?’ ‘రాహుల్ గాందిని అందరు పప్పు అంటరు. నన్ను గూడ పప్పనే అంటున్నరు. పెద్ద పప్పు పాదయాత్ర జేస్తుండంగ చిన్న పప్పు జెయ్యకుంటె ఏం బాగుంటదే’. ‘రాజకీయాలు ఎన్నడు నేర్సుకుంటవురా. చెట్టు మనది గాకున్నా పండ్లు మనమే దీస్కోవాలె. పంట మనం పండియ్యకున్నా పంటంత మనదే అనాలె’. ‘గదెట్లనే’. ‘వొచ్చెపారి బాలకిష్ననే ముక్యమంత్రి క్యాండేట్ అనాలె. మా కాక అన్కుంట జూనియర్ ఎన్టీఆర్ గాయిన దిక్కుకెల్లి ప్రచారం జేస్తడు. మల్లొక పారి టీడీపీ సర్కారొస్తది. బాలకిష్న ముక్యమంత్రి అయితడు’. (క్లిక్ చేయండి: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘మా మామ ముక్యమంత్రి అయితె నాకేం ఫాయిద?’ ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు బొడ్సి నేను ముక్యమంత్రిని గాలేదా? నా తీర్గనే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు బొడ్సి నువ్వు ముక్యమంత్రివి గావొచ్చు. షార్ట్‌కట్ ఉండంగ పాదయాత్రలు, గీదయాత్రలు మనకెంద్కు బిడ్డా’ అని చెంద్రబాబు అన్నడు. దాంతోని లోకేశ్ బోది చెట్టు కింది బుద్దుడయ్యిండు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గటు దిక్కు బోవద్దు గన్పతీ!
కైలాసం. శంకరుడు కండ్లు మూస్కోని తపస్సు జేస్తున్నడు. పార్వతి వొంట జేస్తున్నది. అదువరదాక ఎల్కలతోని దాగుడు మూతలాడుకొన్న గన్పతి గామె తాన్కి వొచ్చిండు. ‘‘అమ్మా’’ అని బిల్సిండు. ‘‘ఏంది బిడ్డా! ఆకలైతున్నదా? ఏమన్న బెట్టాల్నా?’’ అని పార్వతి అడిగింది. ‘‘ఏమొద్దమ్మా! చవ్తి పండ్గ దినాలు గదా. ఒకసారి పట్నం బోయొస్తనే.’’ ‘‘యాడికి బోవొద్దురా కొడ్కా! వొద్దు వొద్దంటె పోయిన యాడాది పట్నం బోయినవు. ఇగొస్తడు, అగొస్తడనుకుంట ఎంతగనం ఎందురుజూసినా నువ్వు రాలేదు. మేమంత పరేశానైతిమి. లెంకంగ లెంకంగ ఆకర్కి మూతదెర్సిన మ్యాన్హోల్ల బడ్డ నువ్వు గండ్లబడ్డవు.’’ ‘‘గీపారి గట్లగాదమ్మా.’’ ‘‘గిప్పుడు వానకాలం నడుస్తున్నది. వాన బడ్డదా అంటె పట్నం తొవ్వలల్ల యాడ ఏమున్నదో ఎర్కగాదు.’’ ‘‘వాన కాలం నడుస్తున్నా దినాం వానగొట్టదమ్మా!’’ ‘‘ఎంత జెప్పినా ఇనవైతివి. పోయిరా! జెర పైలం.’’ గన్పతి కైలాసంలకెల్లి ఎల్లిండు. మెల్లగ మబ్బుల పంటి నడ్సుకుంట పట్నం దిక్కు రాబట్టిండు. నడ్మల పట్నంకెల్లి వైకుంటం బోతున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు. ‘‘నారాయణ, నారాయణ, యాడ్‌కి బోతున్నవు గన్పతీ’’ అని నారదుడడిగిండు. ‘‘పట్నం బోతున్న. గాడ పతొక్క వాడ కట్టుల నా బొమ్మలు బెడ్తరు. గవన్ని ఒక్క తీర్గనే ఉండయి. తీరు తీర్లుంటయి. గంతేగాకుంట ఉండ్రాల్లు, పండ్లు, బచ్చాలు, పాసెం, పులిగొర అసుంటియి నాకు బెడ్తరు.’’ ‘‘తప్పి జారి గవి దినేవు!’’ ‘‘ఎందుకు దినొద్దు?’’ ‘‘ఎవలు జేసినయి ఎట్లుంటయో! మొన్న బాసర ఐఐటీ పోరగాల్లు హాస్టల్ల తిన్నంక కడ్పునొస్తున్నదని మొత్తుకున్నరు. కొంతమంది దవకాన్ల షరీకయ్యిండ్రు. పదేండ్ల కిందట రౌతుల్లెక్క ఉన్న ఉండ్రాల్లు దింటుంటె నీ రొండు దంతాలల్ల ఒకటిర్గలేదా? గదంత యాదిమర్సినవా? గింత జెప్పినా తినకుంటె బేచైనైత దనుకుంటే నీ ఇష్టం.’’ ‘‘నువ్వు గింతగనం జెప్పినంక ఎందుకు తింట నారదా?’’ ‘‘పట్నం బోతె బోయినవు గని తప్పి జారి మునుగోడు బోకు గన్పతీ.’’ ‘‘ఎందుకు బోవద్దు నారదా!’’ ‘‘గాడ్కి బోతివా అంటె కాంగ్రెస్ వినాయకునివా అని ఒకడు అడ్గుతడు. బీజేపీ వినాకునివా అని ఒకడు అడ్గితె, టీఆర్ఎస్ వినాయకునివా అని ఇంకొకడు అడ్గుతడు.’’ ‘‘చాక్ పీస్‌ల గన్పతి, గవ్వల గన్పతి, ముత్యాల గన్పతి అసువంటి తీరు తీర్ల గన్పతులను జూసిన. నువ్వు జెప్పిన గన్పతులేంది నారదా?’’ ‘‘మునుగోడుల బైఎలచ్చన్లొచ్చినై. మూడు పార్టీలు పైసలిచ్చి గన్పతులు బెట్టిపిచ్చినయి. కాంగ్రెస్ వినాయకుడు చెయ్యి సూబెడ్తడు. టీఆర్ఎస్ వినాయకుడు మోటర్ల గూసుంటె, బీజేపీ వినాయకుడు తామరపువ్వులుంటడు.’’ ‘‘మునుగోడుల బై ఎలచ్చన్లు ఎందుకొచ్చినయి నారదా?’’ ‘‘రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేసిండు. కాంగ్రెస్లకెల్లి బీజేపీలకు దుంకిండు.’’ ‘‘గాయిన రాజినామ ఎందుకు జేసిండు.’’ ‘‘అడిగితె నియోజక వర్గం అభివృద్ధి కోసమన్నడు.’’ ‘‘గాయిన జెప్పిన దాంట్ల నిజమేమన్న ఉన్నదా?’’ ‘‘ఉన్నది. ఎట్లంటవా ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేస్తే హుజూర్నగర్ల బై ఎలచ్చన్లు అయినయి. గప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఒక్క గా నియోజక వర్గంలనే గొర్లను పంచింది. కొత్తగ దలిత బందు పద్కం బెట్టి ఒకొక్క దలిత కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇచ్చింది.’’ ‘‘మునుగోడుల గుడ్క గట్లే జేస్తదా?’’ ‘‘చేస్తది. మా వూరుకు తొవ్వ లేదు. తొవ్వ ఏపిచ్చినోల్లకే ఓట్లేస్తం అని ఏ వూరోల్లన్న అంటే టీఆర్ఎస్ సర్కార్ తొవ్వ ఏపిస్తది. సూసిండ్రా నేను ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జెయ్యబట్కె మీ వూరికి తొవ్వ వొచ్చిందని రాజగోపాల్ రెడ్డి అంటడు.’’ ‘‘బై ఎలచ్చన్ల కర్సంత జెనం నెత్తిమీదనే బడ్తది గదా.’’ ‘‘అవ్. కొత్త పన్నులేస్తరు. మునుగోడుల కొత్త దుక్నాలు బడ్డయి. గవ్విట్ల సర్పంచులను, గల్లి లీడర్లను అమ్ముతున్నరు. పది వేల రూపాయల వొంతున ఓట్లు గొనెతందుకు పార్టీలు రడీగున్నయి.’’ ‘‘వామ్మో!’’ ‘‘యాడాది కొక్కపారి చవ్తి పండ్గొస్తది. గదే తీర్గ అయిదేండ్ల కొక్కపారి, ఒక్కోపారి అంతకన్న ముందుగాలే ఓట్ల పండ్గొస్తది. ‘జై గణేశ, జై గణేశ, జై గణేశ దేవా’ అన్కుంట జెనం నీకు పూజలు జేస్తరు. ఉండ్రాల్లు బెడ్తరు. మీరే మా దేవుల్లనుకుంట లీడర్లు జెనాలకు బిర్యాని బెడ్తరు. మందు తాపిస్తరు. తొమ్మిది దినాలైనంక నిన్ను నీల్లల్ల ముంచుతరు. ఎమ్మెల్యే కుర్సిలు దొర్కినంక లీడర్లు దినాం జెనాలను నిండ ముంచుతరు’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు గిదంత జెప్పినంక నాకు పట్నం పోబుద్ది అయితలేదు నారదా!’’ అన్కుంట గన్పతి కైలాసం దిక్కు బోయిండు. ‘‘నారాయణ, నారాయణ’’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్