నారదుడు తంబూర దీస్కుండు. చిర్తలు గొట్టుకుంట, నారాయన, నారాయన అన్కుంట ఇంద్రుని తాన్కి బోయిండు.
‘ఏం నారదా! యాడికెల్లొస్తున్నవ్’ ఇంద్రుడడిగిండు.
‘బారత దేసం కెల్లి’ నారదుడు జెప్పిండు.
‘గాడ ఎవలన్న యగ్నం జేస్తున్నరా? తపస్సు గిన జేస్తున్నరా?’
ఎవ్వలు తన కుర్సికి ఎసరు బెడ్తరో అని గీయిన బుగులుపడుతుంటడు అని మనసుల అనుకోని –
‘ఎవ్వలు యగ్నం జేస్తలేరు. తపస్సు గుడ్క జేస్త లేరు. గిప్పుడు గాడ ఒక దిక్కు బారత్ జోడో, ఇంకో దిక్కు కాంగ్రెస్ చోడో, తోడో నడుస్తున్నయి’ అని నారదుడన్నడు.
‘కట్టె, కొట్టె, తెచ్చె అంటె నాకేం సమజైతది నారదా! జెర కుల్ల కుల్ల జెప్పు’
‘అపొజిసన్ పార్టిలను ఒక్కటి జేసేతంద్కు బారత్ జోడో అన్కుంట కన్యాకుమారికెల్లి రాహుల్ గాంది పాదయాత్ర షురువు జేసిండు. గాల్లను గీల్లను గల్సుకుంట ఒక్క తీర్గ అయిదు నెలలు కశ్మీర్ దాంక నడుస్తడు. తమిలనాడు కెల్లి నడుస్తుంటె ఒక ముస్లాయిన గాయినకు గండ్లబడ్డడు. మా కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు లీటర్ గోద్మపిండిని 20 రూపాయలకు అమ్మెటోల్లు. గిప్పుడు 40 రూపాయలకు అమ్ముతున్నారని గా ముస్లాయిన తోని రాహుల్ అన్నడు. ఒగామె రాహుల్ నెత్తి మీద తాటికమ్మల టోపి బెట్టింది. జెనంకు టోపి బెట్టెతంద్కు నేను నడుస్తుంటె గీమె నాకే టోపి బెట్టిందని గాయిన మనసుల అనుకుండు.’
‘రాహుల్ ఒక్కడే నడుస్తున్నడా? గాయిన యెంబడి ఎవలన్న ఉన్నరా?’
‘గాయినెంబడి 119 మంది కాంగ్రెస్ ముదుర్లున్నరు. లోకల్ చెంచగాల్లే గాకుంట కడ్మ రాస్ట్రాల చెంచగాల్లు; సర్కార్ కొల్వుల గురించి నడుస్తున్నం అని రాసి ఉన్న టీ షర్టులు దొడుక్కోని కొంతమంది పోరగాల్లు గాయినెంబడి నడ్వబట్టిండ్రు. గుడిసె హోటల్ ముంగటేసిన బెంచిమీద గూసోని ఛాయ్ దాక్కుంట జెనంతోని రాహుల్ ముచ్చటబెట్టబట్టిండు. ఛాయ్ దాక్కుంట జెనంతోని ముచ్చట బెట్టకున్రి ఛాయ్ పే చర్చను నకల్ గొడ్తుండ్రని బిజెపోల్లంటరు అని ఒక కాంగ్రెస్ ముదురు అన్నడు. గీ ముదుర్లు జెయ్యబట్కనే ఎఐసిసి ప్రెసిడెంట్ కుర్సి వొద్దనుకున్న అని రాహుల్ మనసుల అనుకుండు.’
‘రాహుల్ పాదయాత్ర గురించి బిజెపోల్లు ఏమన్నరు?’
‘రాహుల్ 41 వేల రూపాయల టీషర్టు దొడిగిండు. దేఖో భారత్ అని బిజెపోల్లు అంటే ప్రతాని మోదీ 10 లక్షల రూపాయల కోటు దొడుక్కుండు. లచ్చన్నర రూపాయల కండ్లద్దాలు బెట్టిండు. ఒకసారి కండ్లు దెర్సి సూడుండ్రి అని కాంగ్రెసోల్లు అనబట్టిండ్రు. అమిత్ షా కార్టూన్ చపాయించి గా దాని కింద మన దేసం పెద్ద పప్పు అని రాసి ఉన్న తెల్ల రంగు టీషర్టులను దస్రకెల్లి దొడ్గుతమని తృణమూల్ కాంగ్రెసోల్లు అన్నరు.’
‘కాంగ్రెస్ చోడో ఏంది?’
‘ఒక దిక్కు రాహుల్ పాదయాత్ర జేస్తుంటె గోవాల ఎన్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిల దుంకిండ్రు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిజెపీలకు దుంకితె గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్లకెల్లి ఎల్లి ఆజాద్ ఫ్రంట్ పార్టీ బెట్టిండు. రాజస్తాన్ ముక్యమంత్రి అశోక్ గెహ్లత్ ముక్యమంత్రి కుర్సి మీది కెల్లి దించుతె మంచి గుండదని బెదిరిస్తె హన్మంతున్ని జెయ్యబోతె బోడ కోతి అయ్యె గదాని సోనియ మొత్తుకున్నది.’ (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా)
‘గిప్పుడు రాహుల్ యాడిదాంకొచ్చిండు?’
‘ఎంతెంత దూరం శానశాన దూరమన్కుంట కర్నాటకల కొచ్చిండు. మీరు పెండ్లి ఎందుకు జేస్కోలేదని ఒక పొల్ల అడిగింది. సన్నాసైయ్యెబట్కె వాజపేయి ప్రతాని అయిండు. పెండ్లామున్న బైరాగి అయ్యెబట్కె మోదీ ప్రతాని కుర్సి ఎక్కిండు. సన్నాసినైతె ఇయ్యాల గాకున్నా రేపైన నేను ప్రతానినైత అని రాహుల్ అన్నడు. ఒక తాన ఒక ముండమోపిరాలు గాయినను గల్సి గామె కేమన్న జెయ్యమని అడిగింది. ఏం ఫికర్ జెయ్యకు నేను ప్రతానినైనంక నీ మొగన్కి సర్కార్ కొల్వు ఇప్పిస్త అని గాయిన అనంగనే సచ్చినోనికి కొల్వా అని గామె గుల్గింది. రాహుల్ తీరు బేగానీ షాదీమే అబ్దుల్లా దీవానా! వొస్త’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు.
తోక: ‘నమీబియా కెల్లి దెచ్చిన చిర్తపులులకు పేరుబెట్టినోల్లకు ఇనాం ఇస్తనని ప్రతాని అన్నడు. నువ్వైతె ఏం పేరు బెడ్తవ్‌ర?’ అని అడిగితె–
‘ఒకదాని పేరు బేరోజ్గారి. ఇంకొక దాని పేరు గులాంగిరి అని బెడ్త’ అని మా సత్నారి అన్నడు. మావోన్కి ప్రతాని ఇనాం ఇస్తడో ఇయ్యడో గని జెనమైతె తప్పకుంట ఇస్తరు. (క్లిక్ చేయండి: చల్నేదో బాల్ కిషన్)
Comments
Please login to add a commentAdd a comment