ఎనభై ఏళ్ల క్రితం జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం సెప్టెంబర్ 7న మొదలైంది. దాని స్ఫూర్తితో 2022 సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో’ పాదయాత్రను ప్రారంభించారు.12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనున్న ఈ యాత్ర ప్రజల ఐక్యతను ఇనుమడింపచేసే యాత్ర. విభిన్న సంప్రదాయాలు, ఎన్నో కులాలు, మతాలు, భాషలు ఉన్న ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటే... వారిని విభజించేందుకు ప్రయత్ని స్తున్నాయి మతోన్మాద శక్తులు. ఈ శక్తుల పట్ల ప్రజలను అప్రమత్తులను చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.
దేశంలో అసహన మతోన్మాద విభజన రాజకీయాలు ఒకవైపు, రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు వంటి సమస్యలు మరొకవైపు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న స్థితిలో రాజకీయాల పట్ల ప్రజలని చైతన్య పరుస్తూ సాగుతున్నది యాత్ర. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు సొంతంగా తెలుసు కుంటున్నారు రాహుల్. తాను వెళ్లిన ప్రతిచోటా సాధారణ ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన మేధావి వర్గంతో భేటీ అవుతూ స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు.
రాహుల్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే... దేశాన్ని ఏ శక్తులూ విచ్ఛిన్నం చేయలేవు అని నమ్మకం కలుగుతోంది. భారత రాజ్యాంగ మూల సూత్రాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు విరుద్ధంగా... దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ‘ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను’ నినాదంతో పాలిస్తున్న వారికి వ్యతిరేకంగా ఒక ఆశాకిరణంలా ఈ యాత్రను ప్రజలు విశ్వసిస్తున్నట్లు ఉంది.
ఎనిమిదేళ్ల క్రితం ఎన్నో ఆశలతో కొత్త పాలకుడి కోసం ఎదురు చూసిన యువత ఆశలను మోదీ వమ్ము చేశారు. నిరుద్యోగం, విద్వేషం, విభజన రాజకీయాలు చూసి కుంగిపోయి ఉన్న విద్యార్థి, నిరుద్యోగ యువతకు పునరుత్తేజంగా కనిపిస్తోంది రాహుల్ పాదయాత్ర.
ఆయనలో ఇటీవలి కాలంలో మంచి రాజకీయ పరిణతి కనిపిస్తోంది. అసమర్థుడు అనే ముద్రతో బయలుదేరి అజేయుడుగా అందరి ప్రేమ ఆప్యాయతలు పొందుతూ వడివడిగా కశ్మీర్ వైపు పురోగమిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తన యాత్ర కొనసాగుతోంది. 60 ఏళ్ల పోరాటం, ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జనం ఆశించిన పాలన అందక పోవడంతో... మళ్లీ పిల్లలు, పెద్దలు, విద్యార్థి, నిరుద్యోగ యువత, ప్రజాసంఘాలు, మేధావులు; కుల, మత, రాజకీయాలకు అతీతంగా సరికొత్త ఆశలతో రాహుల్ యాత్రలో భాగం అవుతున్నారు. ఈ యాత్రతో ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఏర్పడ్డ సానుకూల ధోరణిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఆ పార్టీకి ఇక్కడ పోయిన జవసత్వాలు తిరిగి వస్తాయి. (క్లిక్ చేయండి: బాధ్యత తీసుకోవడమూ ఆదర్శమే!)
- వలిగొండ నరసింహ
పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్, ఓయూ
Comments
Please login to add a commentAdd a comment