సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి లూటీ చేసిన ప్రజాధనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ మిత్రులకు కట్టబెడితే, రాష్ట్రంలో ప్రాజెక్టులపై వస్తున్న కమీషన్లను సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులకు పంచుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కేంద్రంలో మోదీ ఎలా వ్యవహరిస్తున్నారో చూసి.. రాష్ట్రంలో కేసీఆర్ కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
భారత్‌జోడో యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. మధ్యాహ్నం విరామం అనంతరం బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి ముత్తంగి వరకు సుమారు 12 కి.మీ పాదయాత్ర చేసిన రాహుల్ ముత్తంగి వద్ద బహిరంగసభలో ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో ఇద్దరు నేతలూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేశారని విమర్శించారు.
రాత్రి కాగానే ‘ధరణి’లోనే..
సీఎం కేసీఆర్ రాత్రి కాగానే ధరణి పోర్టల్ తెరచి భూములు ఎవరు అమ్మారు.. ఎవ రు కొన్నారో చూస్తుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఉదయం లేవగానే ఏ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేస్తే ఎక్కువ కమీషన్ వస్తుందోనని కేసీఆర్ లెక్కిస్తుంటారని ఆరోపించారు. తెలంగాణలో భూములన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్లాయని ప్రశ్నించిన ఆయన.. ధరణి పోర్టల్‌లో మొదటి స్థానం కేసీఆర్‌దే ఉంటుందని వ్యాఖ్యానించారు.
కేంద్రం బిల్లులకు కేసీఆర్ మద్దతు
రైతుబిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై ఉంటే.. టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఈ బిల్లు విషయంలో నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పలు బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారని విమర్శించారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
దేశ రక్షణ రంగానికి పృథ్వీ, అగ్ని వంటి క్షిపణిలను అందించే బీడీఎల్‌తో పాటు, బీహెచ్‌ఈఎల్, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఆయా ప్రభుత్వం రంగ సంస్థల ఉద్యోగులను కేంద్ర సర్కారు భయాందోళనలకు గురి చేస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజల మూలధనంతో నెలకొల్పిన ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
హింసాద్వేషాల విస్తరణకు వ్యతిరేకంగా
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపైనా రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. దేశంలో హింస, ద్వేషాలను విస్తరింప చేయడానికి వ్యతిరేకంగా తమ భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ రెండూ కూడా దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్‌గాంధీ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా ఓలా, ఉబర్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో చిరువ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలు కుదేలయ్యాయని చెప్పారు.
తనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతల కారణంగా తన పాదయాత్ర అలసట లేకుండా ముందుకు సాగుతోందని చెప్పారు. బహిరంగ సభలో ఏఐసీసీ నేతలు బోసురాజు, కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: పేద ప్రజలకు మోదీయే పెద్ద ఉపద్రవం: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment