సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో ఉత్సాహభరితంగా కొనసాగింది. అడుగడుగునా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలతో పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. సాయంత్రం జోడో యాత్ర మార్గంలో వీధిదీపాలు నిలిచిపోవడంతో చీకట్లోనే కొనసాగింది. నగరవాసులు రాహుల్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులు కొనసాగిన యాత్ర మంగళవారం శంషాబాద్ నుంచి ప్రారంభమై నగరంలోని నెక్లెస్ రోడ్ వరకు సాగింది. రాహుల్ గాంధీ కాలేజీ విద్యార్థులతో కలిసి నడక సాగించారు.
►మార్గమధ్యలో ఓ విద్యార్థిని చేసిన భరత నాట్యాన్ని కొద్దిసేపు ఆగి తిలకించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వద్ద యువకులు అథ్లెటిక్ విన్యాసాలు ప్రదర్శించారు. వేముల రోహిత్ తల్లిని కలిసి ఓదార్చారు. గగన్ పహాడ్‌లో స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. డప్పు కళాకారులతో ఆయన సెల్ఫీ దిగారు. మార్గమధ్యలో రాక్ క్రాఫ్ట్ మార్బుల్ దుకాణం ప్రాంగణంలో రాహుల్ టీ తాగి సేదతీరారు.
విద్యార్థులతో ముచ్చట్లు..
వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ రాహుల్‌ను ఆకట్టుకున్నారు. దీంతో ఆయన ముగ్గురు విద్యార్థులను పిలిపించుకుని వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. వ్యవసాయ వర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఇది సరైంది కాదని ప్రైవేటు యూనివర్సిటీలకు ఐసీఆర్ గుర్తింపు ఇవ్వొద్దు అంటూ రాహుల్‌కు విద్యార్థులు వివరించారు. శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద రోడ్డుపక్కన నిల్చున్న వృద్ధుడి చెంతకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
చార్మినార్ వద్ద పతాకావిష్కరణ
భారత్ జోడో యాత్రలో భాగంగా చార్మినార్ కట్టడం వద్ద రాజీవ్ సద్భావన స్తూపంపై పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. సాయంత్రం 4 గంటలకు పురానాపూల్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు నగరవాసులు బోనాలు, శివసత్తులు, పోతురాజులు, కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర కోకాకీతట్టీ, పాల్కీ గార్డెన్, మూసాబౌలి చౌరస్తా, కసరట్టా, లాడ్‌బజార్ ద్వారా చార్మినార్ వరకు కొనసాగింది. కోకాకీతట్టీ వద్ద భవనంపై నుంచి గులాబీలు చల్లి రాహుల్‌గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సుప్రభాత్‌లో తేనీటి రుచి..
చార్మినార్ వద్ద జెండావిష్కరణ అనంతరం గుల్జార్‌హౌజ్ చౌరస్తా దాటి ముందుకు వెళ్లారు. నఫ్రత్ చోడో.. భారత్ జోడో... రాహుల్‌గాంధీ పీఎం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. అఫ్జల్‌గంజ్ వద్ద సదర్ దున్నలను రాహుల్‌కు చూపించి సదర్ ఉత్సవాలపై వివరించారు. నాంపల్లిలో బల్దియా మహిళా కార్మికులతో ముచ్చటిస్తూ రాహుల్ ముందుకు సాగారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుప్రభాత్ హోటల్‌లో తేనీరు సేవించారు. కాంగ్రెస్ శ్రేణులు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో కూడిన ప్లకార్డుల ప్రదర్శించి రాహుల్ దృష్టిని ఆకర్షించారు.
ప్రాచీన నగారా భేరి.. థ్యాంక్స్ భట్టీజీ..
భారత్ జోడో యాత్రలో అంతకుముందు రాహుల్ శంషాబాద్ వద్ద అతి ప్రాచీనమైన నగారా భేరి కళారూపాన్ని ప్రదర్శించారు. కొమ్ము బూరలు ఊదుతూ నగారా భేరీ వాయిస్తున్న కళాకారుల మధ్యలోకి రాహుల్ వెళ్లి డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు. నిజాం నవాబు కాలం నాటి ఈ కళారూపం విశిష్టమైన ‘నగారా భేరి’ని విశిష్ట వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోందని భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విశిష్ట అతిథి (రాహుల్ జీ) మీరే కాబట్టి ఈ కళారూపాన్ని ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క చెప్పడంతో.. థ్యాంక్స్ భట్టీ జీ అంటూ రాహుల్ ప్రశంసించారు. బిర్లా మందిరం ఏర్పడిన స్థానంలో నౌబత్ పహాడ్‌పై నగారా భేరి మోగించి నిజాం బయటికి వస్తున్నారనే సంకేతానికి ఉపయోగించేవారని చెప్పారు.
శంషాబాద్‌లో ఆవు హల్‌చల్...
భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న క్రమంలో శంషాబాద్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలోకి ఆకస్మాత్తుగా ఓ ఆవు దూసుకొచ్చింది. అప్రమత్తమైన నేతలు చెల్లాచెదురుగా పరుగెత్తారు. కాగా.. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రెండో రోజు పాదయాత్ర ఇలా..
నగరంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు బుధవారం 27 కిలోమీటర్ల మేర సాగనుంది. ఓల్ట్ బోయిన్‌పల్లిలోని రాజరాజేశ్వరీ నగర్ గాంధీయన్ ఐడియోలజీ సెంటర్ నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర న్యూ బోయిన్‌పల్లి, ఫిరోజ్‌గూడ, బాలానగర్ మెయిన్ రోడ్, మూసాపేట హబీబ్‌నగర్, కూకట్‌పల్లి సుమిత్రా నగర్, అశోక్‌నగర్, హఫీజ్ పేటల మీదుగా మదీనాగూడకు చేరుకుంటుంది.
అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమై.. మియాపూర్ ఇందిరానగర్, దుర్గా ఎస్టేట్, గౌతమీనగర్ కాలనీ, రాంచంద్రాపురం కాకతీయ నగర్, పటాన్‌చెరు శాంతినగర్ మీదుగా రాత్రి 7 గంటలకు ముత్తంగి హరిదాస్ పాయింట్‌కు చేరుకుంటుంది. అక్కడ కార్నర్ మీటింగ్‌తో నగరంలో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది.
►అడుగుల్లో ఉత్సాహం.. పాదాల్లో ఉల్లాసం.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం.. అంతటా నీరాజనం.. అదే జన సందోహం..
►తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు.. పోతరాజుల విన్యాసాలు.. మేళవించిన సంప్రదాయాలు.. కళాబృందాల ప్రదర్శనలు..
► విద్యార్థులు, యువత, వృద్ధులు.. అన్ని వర్గాల ప్రజలతో మాటాముచ్చటా.. వారి కష్టసుఖాలు తెలుసుకుని నేనున్నాననే భరోసా..
►శంషాబాద్ నుంచి నగరంలోకి అడుగిడి.. చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన స్తూపంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపి..
►ఇలా మంగళవారం శంషాబాద్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిరోజు ‘భారత్ జోడో యాత్ర’ ఘనంగా జనం కేరింతల నడుమ సాగింది.
Comments
Please login to add a commentAdd a comment