సాక్షి, హైదరాబాద్: ‘‘రాహుల్ గాంధీ ఓ రిజర్వ్‌బ్యాంక్ లాంటివారు. రిజర్వ్ బ్యాంకును ఖాళీ చేసేస్తే ఎలా?..’’ అని కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడతను వెంటనే చేపట్టాలని పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు ఆదివారం నాటి సమావేశాల్లో కోరగా.. ‘‘రాహుల్ గాంధీ సేవలను అవసరార్థం వినియోగించుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఖాళీ అయితే ఇబ్బంది కదా.. మీరంతా ఏం చేస్తారు? ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండండి. పార్టీని బలోపేతం చేయండి..’’ అని ఖర్గే హితబోధ చేసినట్టు సమాచారం.
దేశంలో ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉందని, రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీజేపీ ఎజెండా ఉచ్చులో పడకుండా మన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లాలని.. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన అంశంగా ముందుకు సాగాలని మార్గనిర్దేశనం చేసినట్టు సమాచారం.
కట్టు తప్పితే సహించేది లేదు
పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పితే సహించేది లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కినా.. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉంటామని, చర్యలు తీసుకున్నాక నిందించవద్దని పేర్కొన్నారు. ఇక ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అంశాన్ని త్వరగా తేల్చాలని కొందరు సీడబ్ల్యూసీ సభ్యులు కోరగా.. ఆ చర్చ వచ్చినప్పుడు రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రాయాలను, సూచనలను తీసుకుంటానని ఖర్గే హామీ ఇచ్చారు. మీరు చేసే సూచనల మేరకే సీట్ల సర్దుబాటు ఉంటుందని, ఆందోళన వద్దని సూచించారు.
కర్ణాటక మోడల్‌తో ముందుకు..
తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలని, దీనిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించారు. పార్టీ నేతలంతా కలసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. అంతర్గతంగా సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప.. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు.
రజాకార్లు మా ఇంటినీ తగలబెట్టారు
మొదట దేశం మొత్తం స్వాతంత్య్రం లభించినా హైదరాబాద్ స్టేట్‌లోని ప్రజలకు స్వాతంత్రం లభించలేదని.. ఆ సమయంలో నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలు ఆకాశాన్ని అంటాయని మల్లికార్జున ఖర్గే చెప్పారు. తమ ఇంటిని కూడా రజాకార్లు తగలబెట్టారని తెలిపారు. సెప్టెంబర్ 17న నిజాం పాలనకు చరమగీతం పాడటంలో సర్దార్ పటేల్, కాంగ్రెస్ నేతలుకృషి చేశారని చెప్పారు.
సోనియాకు బహుమతి ఇస్తాం: రాష్ట్ర నాయకులు
సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఇచ్చినప్పటికీ.. గత రెండు దఫాలుగా కాంగ్రెస్‌ను గెలిపించి సోనియమ్మకు బహుమతిగా ఇవ్వలేకపోయాం. ఈసారి తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆమెకు బహుమతిగా ఇస్తాం’’ అని పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment