రాహుల్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో, మల్లికార్జున ఖర్గే మంత్రాంగంతో ఉప్పు, నిప్పుగా ఉండే దిగ్గజ నేతలు సిద్ధూ, డీకే ఒక్కటయ్యారు. పోస్టర్ల నుంచి ప్రచారం వరకు ఒకే మాట ఒకే బాటగా నడిచారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. మత రాజకీయాలను సమష్టిగా ఎదుర్కొన్నారు. ఫలితంగా కర్ణాటకలో కాంగ్రెస్ అందరికీ కొత్తగా కనిపించింది. అనూహ్య విజయంతో లోక్‌సభ ఎన్నికలకు కావల్సిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది.
అవినీతిపై ప్రచారం
రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. పేటీఎంను గుర్తుకు తెచ్చేలా ‘‘పేసీఎం’’ అంటూ బొమ్మై ముఖం, క్యూఆర్ కోడ్‌తో పోస్టర్లు వేయడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. 40% కమీషన్ సర్కార్ అంటూ ప్రచారాన్ని గ్రామ గ్రామల్లోకి తీసుకువెళ్లారు. గ్రామీణాభివృద్ధి మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్టులో 40% కమీషన్‌ను డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు 40 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం వంటివన్నీ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంది.
సిద్దూ, డీకే కాంబినేషన్
కాంగ్రెస్ పార్టీకి మరే రాష్ట్రంలో లేని విధంగా బలమైన నాయకులు కర్ణాటకలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ జోడు గుర్రాలుగా మారి గెలుపు రథాన్ని పరుగులు పెట్టించారు. ఇద్దరి మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా పని చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ప్రజాధ్వని యాత్ర నిర్వహించారు. ఎన్నికల వ్యూహాల దగ్గర్నుంచి పార్టీ మేనిఫెస్టో వరకు, టిక్కెట్ల పంపిణీ నుంచి బూత్ మేనేజ్‌మెంట్ వరకు సంయుక్తంగా వ్యూహాలు రచించారు. పార్టీలో దిగ్గజ నాయకులిద్దరూ ఒక్కటి కావడంతో నాయకులంతా చేతులు కలపడం రావడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
ఖర్గే అనుభవం
ఏ పార్టీకైనా అనుభవజ్ఞలైన పెద్దలే కొండంత అండ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే 80ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రంలో ఎన్నికల్ని అత్యంత ప్రతిష్మాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో అత్యంత శక్తిమంతమైన నాయకులైన సిద్దరామయ్య, శివకుమార్‌లను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఖర్గే సగం విజయం సాధించారు. టిక్కెట్ల పంపిణీపై ముందస్తుగా కసరత్తు చేసి 124 మందితో తొలి జాబితా విడుదల చేయడం, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తూ నియోజకవర్గాల్లో అసమ్మతి గళాలు లేకుండా చూశారు. అటు అధిష్టానానికి, ఇటు స్థానిక నాయకత్వానికి వారధిగా ఉంటూ నెల రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
సానుభూతే ఆయుధం
బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన కక్షపూరిత రాజకీయాలు కూడా వికటించాయి. ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా పట్టించుకోని వారు కాంగ్రెస్ నాయకులపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధించడం ప్రజల్లో సానుభూతిని పెంచింది. పరువు నష్టం కేసులో రాహుల్ దోషిగా తేలి ఎంపీగా అనర్హత వేటునెదుర్కోవడం, పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌పై సీబీఐ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టడం వంటివి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించడమే దీనికి తార్కాణం.
లింగాయత్ ఓట్లు
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బలమైన మద్దతుదారులైన లింగాయత్ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా చీల్చింది. బి.ఎస్. యడీయూరప్పని సీఎంగా తప్పించడంతో ఆ వర్గాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఎన్నికలకు కాస్త ముందు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాదిలు కాంగ్రెస్ గూటికి చేరడం కలిసొచ్చింది. పీసీసీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ స్వయంగా లింగాయత్ మఠాలన్నీ సందర్శించి తాము అధికారంలోకి వస్తే వారి డిమాండ్లన్నీ తీరుస్తామన్న హామీలు ఇవ్వడంతో ఈ సారి లింగాయత్ ఓటర్లు కాంగ్రెస్‌వైపు మళ్లారు.
‘సార్వత్రిక’ విజయానికి తొలి మెట్టు
‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు తొలి మెట్టు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వొచ్చేమో. బీజేపీయేతర పార్టీలు ఇక త్వరగా ఏకతాటి మీదకు వస్తాయని భావిస్తున్నా. బీజేపీ మత రాజకీయాలను ఓడించిన ప్రజలకు జేజేలు’’
– కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య
లోకల్ వోకల్
కాంగ్రెస్ పార్టీ ఈ సారి స్థానిక సమస్యలపైనే అత్యధికంగా దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో ప్రభావం చూపించే అంశాల జోలికి వెళ్లలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌పై ఆధారపడి బీజేపీ ఎన్నికలకి వెళ్లడాన్ని పదే పదే ప్రశ్నించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఇది రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలే తప్ప ప్రధాని మోదీ గురించి ఎన్నికలు కాదంటూ ప్రతీ సభలోనూ గళమెత్తారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పవర్‌ఫుల్ నాయకులనే ముందుంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకమైపోతూ స్థానిక అంశాలపైనే వారితో ముచ్చటించారు. ఫలితంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా హస్తం గుర్తుకే ఓట్లు గుద్దేశారు.
గ్యారంటీ కార్డుకి కురిసిన ఓట్లు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈసారి ఎన్నికల్లో ఓట్లు కురిపించాయి. అయిదు హామీలతో కాంగ్రెస్ విడుదల చేసిన గ్యారంటీ కార్డులో గృహజ్యోతి (గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్), గృహలక్ష్మి (ఇంటి మహిళా యజమానికి నెలకి రూ.2 వేలు ఆర్థిక సాయం), అన్న భాగ్య (నిరుపేద కుటుంబాలకు నెలకి 10 కేజీల ఉచిత బియ్యం) యువనిధి (నిరుద్యోగ యువతకి రెండేళ్లు ఆర్థిక సాయం) శక్తి (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం) హామీలు ప్రజల్ని విశేషంగా ఆకర్షించి కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి.
మైనార్టీల అండదండ..
పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చడం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అందరూ భావించారు. కానీ మైనార్టీ ఓట్ల ఏకీకరణ జరిగి కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. ఓల్డ్ మైసూరుతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేశారు. హిజాబ్, హలాల్, ఆజాన్ వివాదాలతో ముస్లిం ఓటర్లందరూ ఏకమయ్యారు. ఓల్డ్ మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ముస్లిం ఓట్లు చీలిపోయేవి. కానీ ఈ సారి అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ వెంటే మైనార్టీలు నడిచారు.
జోడో యాత్ర జోష్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా పార్టీ విజయానికి దోహదపడింది. కర్ణాటకలో అత్యధికంగా 24 రోజులు నడిచిన రాహుల్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఎనిమిది జిల్లాల్లో 500 కి.మీ. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్ నడిచారు. 2018 ఎన్నికల్లో ఈ 20 సీట్లలో అయిదు స్థానాలనే గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 15 స్థానాల్లో విజయభేరి మోగించింది.
Karnataka election results 2023: కలసి ఉంటే కలదు సుఖం
Published Sun, May 14 2023 4:30 AM | Last Updated on Sun, May 14 2023 4:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment