ఎస్.రాజమహేంద్రారెడ్డి :
మల్లికార్జున ఖర్గే.. ది గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కొత్త బాస్. గాంధీల ఇంటి పార్టీలాంటి కాంగ్రెస్‌కు గాంధీయేతరులు అధ్యక్షుడు కావడం విశేషం. ఆ పదవికి ఎంపిక కావడమే ఆయన సమర్థతకు నిదర్శనం. అంతగా పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్గే తన ప్రభావాన్ని అంతగా చూపెట్టలేకపోయినప్పటికీ పార్టీని ఏకతాటిపై నడపడంలో తన సమర్థతను చాటాడనే చెప్పుకోవాలి.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముక్తకంఠంతో నిరసన గళాన్ని వినిపించడంలోనూ ఖర్గే తన నాయకత్వ గరిమను రుజువు చేసుకున్నారు. అనర్హత వేటుకు నిరసనగా విపక్షాలన్నింటినీ ఒకే వేదికపై మోహరించడంలోనూ విజయం సాధించారు. పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపైనా, పార్లమెంట్ బయట అనర్హత వేటు పైనా సామూహిక నిరసనలకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే సారథ్యంలోనే నాయకత్వ బాధ్యతను భుజానికెత్తుకుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ పోరుకు నగారా మోగింది.
వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఖర్గేకు ఇది అసలు సిసలైన పరీక్ష. ఒకరకంగా అగ్నిపరీక్ష. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన, ఏకైక లక్ష్యం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంటి పోరులో గెలుస్తారో లేదో మే 13న(కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) తేలనుంది. ఖర్గే హీరోనో లేక జీరోనో అదే రోజు కర్ణాటకతోపాటు దేశానికీ తెలుస్తుంది.
ఇప్పటికే తొలి విజయం
నిజానికి చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోరుకు పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఓ వారం రోజుల ముందే కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. నిత్యం అంతర్గత పోరుతో తలమునకలై ఉండే కాంగ్రెస్ పార్టీకి ఇది శుభ పరిణామం. తొలి జాబితాను ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ప్రకటించడం కచ్చితంగా ఖర్గే వ్యవహార శైలికి అద్దం పడుతుంది.
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ఉన్న చిరకాల భేదాభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారడం ఖాయమనుకున్నారు. ఎన్నికల వేళ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ఖర్గే, ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే వీరిద్దరి సంఘర్షణపై ఓ కన్నేసి ఉంచారు. సరిగ్గా షెడ్యూల్ ప్రకటించే సమయానికి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. మే 10న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగిస్తే ఆ క్రెడిట్ అంతా ఆయనదే అవుతుంది.
జేడీ(ఎస్)తో పొత్తుకు విముఖత
ఒకే గొడుగు కింద వైరి వర్గాల ఘర్షణ ఏ స్థాయిలో ఉంటుందో ఖర్గేకు అనుభవపూర్వకంగా తెలుసు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఖర్గే ఒక్కసారి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కాలేకపోయారు. అవకాశాలు రాక కాదు, అవకాశాలు తలుపుతట్టినా అంతర్గత పోరును తట్టుకొని నిలబడలేకపోయారు. ఒక్కసారి కాదు, ఏకంగా మూడుసార్లు ఆయన నుంచి ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారిపోయింది. 1999లో ఎస్.ఎం.కృష్ణ, 2004లో ఎన్.ధరమ్ సింగ్, 2013లో సిద్ధరామయ్య నుంచి ఎదురైన గట్టి పోటీని ఎదుర్కోలేకపోయారు.
2004లో మిశ్రమ ఫలితం వచ్చినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. దాదాపు ఖాయమైపోయిందనుకున్న తరుణంలో జేడీ(ఎస్) అధినేత దేవెగౌడ అభ్యంతరం చెప్పడంతో తన సహచరుడైన మరో సీనియర్ నాయకుడు ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు. ఈ అనుభవం వల్లే జేడీ(ఎస్)తో ఎన్నికల పొత్తుకు ఖర్గే విముఖంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత సంకీర్ణం తప్పని పరిస్థితి ఎదురైనా జేడీ(ఎస్)తో దోస్తీ కలలోని మాట అని ఖర్గే ఈపాటికే సుస్పష్టంగా చెప్పేశారు. ఈ మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని సైతం ఒప్పించినట్లు వినికిడి.
మది దోచిన సర్వేలు
కింగ్ అయ్యే అవకాశం మూడుసార్లు చేజారిన ఖర్గే ఈసారి కింగ్‌మేకర్ కావాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంటి గెలిచి చూపించి, రచ్చ గెలుపు మీద ఇనుమడించిన ఉత్సాహంతో దృష్టి సారించాలని ఆశిస్తున్నారు. ఇటీవలి కొన్ని సర్వేల ఫలితాలు ఖర్గే మనసు దోచాయి. ఇండియాటుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో కర్ణాటకలో జనవరిలో లోక్‌సభ ఎన్నికలు జరిగి ఉంటే 28 సీట్లకు కాంగ్రెస్ 17 సీట్లను దక్కించుకొనేది అని ఆ సర్వే సారాంశం. కర్ణాటక ఎన్నికల నగారా మోగిన రోజే∙ఏబీపీ–సీ ఓటర్ సర్వే కాంగ్రెస్‌కే విజయాన్ని కట్టబెట్టింది. ఆ పార్టీకి 115–127 సీట్లు వస్తాయంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 117 స్థానాలంటే సంకీర్ణం జోలికెళ్లకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఈ సర్వే ఖర్గే మనసు దోచి ఉంటుంది. ఇక కర్ణాటక ప్రజల మనసులు దోచడానికి ఖర్గే వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment