ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. మొదటి దఫా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం.. ఫలితం విషయంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండడంతో రెండో దఫా ఎప్పుడుంటుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యాత్ర 2.0 మొదలుకానుందని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారత్ జోడో యాత్ర నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ హెడ్ దిగ్విజయ్ సింగ్.. యాత్ర 2.0 కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర-2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ మెంబర్ ఒకరు చెబుతున్నారు. ఈ అంశాలపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని అంటున్నారాయన.
గాంధీ పుట్టిన గడ్డ నుంచే..
భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022లో కన్యాకుమారి(తమిళనాడు) నుంచి ప్రారంభమై.. జనవరి 30, 2023 శ్రీనగర్(జమ్ముకశ్మీర్)తో ముగిసింది. యాత్రను ప్రారంభించడానికి ముందు అహ్మదాబాద్(గుజరాత్)లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పించాడు కూడా. దీంతో గాంధీ జన్మస్థలం అయిన పోర్‌బందర్(గుజరాత్) నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. అలా.. పోర్‌బందర్ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తలా(త్రిపుర)తో యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తోంది.
జోడో యాత్రలా కాకుండా..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. దీంతో రెండో దఫా యాత్రను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఎంతలేదన్న యాత్రకు ఆరు నెలల టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి.. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని ఓ సీనియర్ నేత అభిప్రాయపడుతున్నారు. అలాగే సార్వత్రి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు. సమయం తక్కువగా ఉండడంతో యాత్రను మొదటి యాత్రలా పూర్తి మార్గం గుండా కాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో(అదీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో) చేసేలా ఏర్పాట్లు చేసుకునే ఆలోచనను భారత్ జోడో యాత్ర నేషనల్ కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment