ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు | Teledevara Bhanumurthy Write on Sadar Festival, Munugode Bypoll Campaign | Sakshi
Sakshi News home page

ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు

Published Sat, Nov 5 2022 4:07 PM | Last Updated on Sat, Nov 5 2022 4:07 PM

Teledevara Bhanumurthy Write on Sadar Festival, Munugode Bypoll Campaign - Sakshi

నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది.
‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు.
‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది.

‘‘గాడికెందుకు బోయినవ్‌?’’
‘‘సదర్‌ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’
‘‘పండ్గ మంచిగైందా?’’

‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్‌ఎస్‌ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్‌ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్‌ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’

‘‘సదర్‌ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్‌? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’
‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’

‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’
‘‘గంత గనం బాగుందా?’’

‘‘అవ్‌. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్‌ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్‌ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్‌ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్‌  అన్నడు’’

‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్‌ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’
‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’

‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్‌ లెక్క మునుగోడు బదల్‌ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్‌ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్‌ రూపాయలు ఇచ్చిండ్రు. 
డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్‌ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్‌ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్‌ గల్ల బట్టె రాజగోపాల్‌ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’

‘‘కాంగ్రెస్‌ సంగ తేంది?’’
‘‘కాంగ్రెస్‌ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్‌ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్‌ను బొడ్సి రాజగోపాల్‌ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు.

‘‘కేటీఆర్‌ ఎట్ల ప్రచారం జేసిండు?’’
‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్‌ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్‌ బేకార్‌ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్‌. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్‌ ప్రచారం జేసిండు.’’

‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు.
‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్‌ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!)


- తెలిదేవర భానుమూర్తి
సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement