ఆంద్రప్రదేస్ బోక శానొద్దులైంది. ఒకపారి గా రాస్ట్రం బోయొస్తె బాగుంట దని నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అనుకుంట మొగులు మీద్కెల్లి ఎల్లిండు. నర్కం దిక్కుబోతున్న యముని దున్న పోతు ఎదురుబడ్డది.
‘‘యాడ్కి బోతున్నవు నారదా!’’ అని అడిగింది.
‘‘ఆంద్రప్రదేస్ బోతున్న’’
‘‘ఫుజూల్గ ఎందుకు బోతవు?’’
‘‘నేను బోకుంటె గాడి సంగతులన్ని ఎట్లెర్కైతయి?’’
‘‘గా రాస్ట్రంల ఏమైతున్నదో నేను జెప్త గద.’’
‘‘గట్లయితె మంచిదే. నాకు బోయే బాద దప్పుతది’’ అని నారదుడన్నడు.
‘‘అన్ని నిజాలే జెప్త. అబద్దాలస్సల్ జెప్ప అని గీనడ్మ చెంద్ర బాబు అంటున్నడు’’ అని దున్నపోతు ఇంకేమొ జెప్పబోతుంటె అడ్డం దల్గి–
‘‘గాయిన సంగతి ఎవ్వలికెర్కలేదు. అస్కిని బుష్కిని జేసుడే గాకుంట అబద్దంను నిజమని నమ్మిచ్చెతంద్కు గాయిన ఒకతీర్గ తన్లాడ్తడు’’ అని నారదుడన్నడు.
‘‘అబద్దంను ఊకూకె జెప్తె గది నిజమై గూసుంటది. చెంద్ర బాబు హైటెక్ సిటీనే గాకుంట మహబూబాద్‌ను గుడ్క గట్టిపిచ్చిన్నని అంటున్నడు. ముంజాత గాదాని పేరు మా ‘బాబూ’ బాద్‌ట. మా బాబూబాద్ మెల్లమెల్లగా మహబూబా బాద్ అయ్యిందట. గదే తీర్గ మా బాబూనగర్ మహబూబ్ నగరైందని గాయిన ఒక్కతీర్గ జెప్తున్నడు.
ఎన్కట చెంద్రబాబు గిరిని గాయినే గట్టిపిచ్చిండట. గా చెంద్రబాబు గిరినే గీ జమానల అందరు చంద్రగిరని అంటున్న రట. నాకు ఆక్రి మోక ఇయ్యిండ్రి. మల్లొకపారి ముక్యమంత్రిని జెయ్యిండ్రి. గట్ల జేస్తిరా అంటె కొత్త చరిత్ర రాయిస్త. గిసువంటి నిజాలు జెనంకు ఎర్కయ్యేటట్లు జేస్త అని చెంద్రబాబు అనబట్టిండు’’.
‘‘చెంద్రబాబు ఇంకేం జెప్పిండు?’’
‘‘మా టిడిపి సర్కారుండంగ జన్మభూమి, శ్రమదానం అసుంటి పద్కాలు బెట్టినం. జన్మభూమి కింద చెట్లు నాటేటోల్లు. శ్రమదానం కింద నాటిన చెట్లను పీకెటోల్లం. గీ పద్కాలు జెయ్యబట్కె ఎందరికో పని దొర్కింది. గిప్పుడు మాసరకు గిసువంటి ఒక్క పద్కమన్న ఉన్నదా? నా జమానల రైతులు ఎరు వులు, ఇత్తుల కోసం తిప్పలుబడెటోల్లు గాదు. ఎరువులు, ఇత్తులు గావాలంటె కంప్యూటర్ల డవున్‌లోడ్ జేస్కునేటోల్లు. అన్కుంట చెంద్రబాబు పల్ల పల్ల ఏడ్సిండు’’ అని దున్నపోతు జెప్పింది.
‘‘అంత బాగున్నది గని ఎందుకేడ్సిండు?’’ అని నారదుడు అడిగిండు.
‘‘ముక్యమంత్రి కుర్సి యాదికొచ్చి’’ అని దున్నపోతు జెప్పింది.
‘‘బాబు జెప్పుడేనా? చేసుడేమన్న ఉన్నదా?’’
‘‘పవన్ కల్యాన్‌ను గల్సినంక కూసమిడిచిన పాము తీర్గ బాబు ఆగుతలేడు. గిదేం కర్మ రాస్ట్రంకు పోగ్రాం కింద రొండు గోదావరి జిల్లలల్ల దిరుక్కుంట మీటింగ్లు బెట్టిండు’’ అన్కుంట దున్నపోతు జెప్తుంటె మల్ల నారదుడు అడ్డం దల్గి – ‘‘గిదేం కర్మరా బాబూ! అని అనుకోబట్కెనే ఆంద్ర జెనాలు చెంద్రబాబును ముక్యమంత్రి కుర్సి మీదకెల్లి దించిండ్రు. రాజకీయాలల్ల వజీప దీస్కొని మన్మనితోని ఆడుకోమన్నరు’’ అని అన్నడు.
‘‘గాయిన వజీప దీస్కుంటె పాపం లోకేశ్‌ను ఎవలు గాన్తరు. సైకిల్ల గాలిబోయింది. రొండు పయ్య లూసిపోయినయి. హైండిల్ ఇర్గిపోయింది. ఫిర్బిల్ పనిజేస్తలేదు. ఫైడిల్లు పతా లేకుంట బోయి నయి. ఇగ దాంతోని లోకేశ్ సైకిల్ జోడో యాత్ర జేస్తనంటున్నడు. గిదేం కర్మ రాస్ట్రానికి ప్రోగ్రాం కింద నిడదవోలుల చెంద్రబాబు మీటింగ్ బెట్టిండు. నా ముక్యమంత్రి కుర్సి నాగ్గాకుంట బోంగనే మన రాస్ట్రంకు శని బట్టింది. అంగట్ల అన్ని ఉన్నా అల్లుని నోట్లె శని అంటె గిదే అని అన్నడు’’ అని దున్నపోతు జెప్పింది.
‘‘అంగట్ల అన్ని ఉన్నయి. అల్లుడు శని గూడ ఉన్నడు అంటె బాగుంటది’’ అని నారదుడన్నడు.
‘‘గిదేం కర్మ రాస్ట్రంకు ప్రోగ్రాం కింద తెలుగుదేసం తాడేపల్లి గూడెంల మీటింగ్ బెట్టింది. బుక్కా గులాల్లెక్కగా మీటింగ్ల తెలుగుదేసమోల్లు ఒగల మీద ఒగలు పస్పు జల్లుకున్నరు. టిడిపి జిందాబాద్, గిదేం కర్మ రాస్ట్రంకు అని తెలుగుదేసమోల్లు లాసిగ ఒల్లుతుండంగ చెంద్రబాబు మైకు ముంగట్కి వొచ్చిండు. రొండేల్లు సూబెట్టిండు. పోలవరం నా పానం. మా సర్కారుం డంగ పతొక్క సోమారంను పోలవారం అనుకున్నం. అనుకోని గా దాని గురించే మాట్లాడుకునేటోల్లం. నెలకొక్కపారి నేను పోలవరం ప్రాజెక్టు చూసొచ్చేటోన్ని.
సంటరే గీ ప్రాజెక్టు గటిపిచ్చేదుంటె కమీషన్ల కోసం నేను గాదాన్ని గట్టిచ్చుడు షురువు జేసిన్నని నన్ను బద్నాం జేసిండ్రు. నాకు ఆక్రి మోక ఇయ్యండ్రి’’ అన్కుంట చెంద్రబాబు స్పీచ్ గొట్టిండు. మల్ల గలుస్త అన్కుంట దున్నపోతు నర్కం దిక్కు బోయింది. ఫీచేముడ్ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు.
తోక: పొద్దుమీకింది. ఎప్పటి తీర్గనే పాన్ డబ్బ కాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట, సిగిలేట్లు దాక్కుంట మా దోస్తులు ముచ్చట బెడుతున్నరు. ‘‘ఢిల్లిల జి–20 మీద ప్రతాని మోదీ మీటింగ్ బెట్టిండు. అన్ని రాస్ట్రాల ముక్యమంత్రులను, పార్టీల ప్రెసిడెంట్లను బిల్సిండు. గప్పుడు చెంద్రబాబును జూసి శాన బక్కగైండ్రు అని మోదీ అంటె గీ నడ్మ రాస్ట్రంల బగ్గ దిర్గుతున్న అని బాబు జెప్పిండు’’అని యాద్గిరి అన్నడు. ‘‘చెంద్రబాబు తిరుగుడు తోని బక్కగ గాలేదు. ముక్యమంత్రి కుర్సి మీద ఫికర్‌తోని బక్కగైండు’’ అని సత్నారి జెప్పిండు.
-తెలిదేవర భానుమూర్తి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99591 50491
Comments
Please login to add a commentAdd a comment