డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా? | Sakshi Guest Column On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?

Published Tue, Dec 10 2024 12:31 AM | Last Updated on Tue, Dec 10 2024 12:31 AM

Sakshi Guest Column On Pawan Kalyan

‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాలో హీరో సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. ఇందులో ఆఖరులో కొన్ని డైలాగ్స్‌ చెబుతారు. అవి ఇప్పటి పరిస్థితులకు అతికినట్లు ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ‘రేయి నిన్నే... వాడు నీ తల మీద ఎక్కి కూర్చుంటే... పెట్రోల్‌ రేటు పెరిగిపోద్ది. కంది పప్పు పెరిగిపోతుంది. పిల్లల స్కూల్‌ ఫీజులు పెరిగి పోతాయి. బస్సు చార్జీలు పెరిగిపోతాయి. 

ఇవి నీకు ఓకేనా. టైం లేదా నీకు. కొత్త సినిమా రిలీజైతే తెల్లవారు జామున ఐదు గంటలకల్లా క్యూలో నిలుచుంటావే. నీకిష్టమైన హీరో సినిమా పది, ఇరవై సార్లు చూస్తావ్‌. దానికి టైం ఉంటుంది. ఒక్క మ్యాట్నీ వదిలేసి రా ఒక పనైపోద్ది. నీకు హీరో కావాలా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో! మరి ఇంటి కోసం నువ్వేం చేస్తు న్నావు? మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేమీ లేదు రా ఎదవ బానిస సంకెళ్లు తప్ప. రా... రా... వెయిట్‌ చేస్తున్నా రా...’ సినిమాలో గొంతు పెద్దది. ఈ డైలాగ్స్‌ పలి కిన పవన్‌ నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అధికార పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచిపోయి ప్రతి పక్షంపై దాడులకు పూనుకున్న విషయం తెలిసిందే. నడిరోడ్డుపై హత్యలు జరిగాయి. ఇక దౌర్జన్యాలకైతే లెక్కే లేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని ఎన్నోసార్లు ప్రకటించిన పవన్‌ వీటిని ఖండించ లేదు. తన సినిమాలో మాత్రం రా కదలి రా... ప్రశ్ని ద్దామని కన్నెర్ర చేశారు.

సినిమా కోసం రైటర్‌ ఇచ్చిన డైలాగులను బట్టీపట్టి పవన్‌ సినిమాలో చెప్పారు. కానీ అవి భవిష్యత్‌ సంకేతాలుగా నిలిచాయి. చంద్రబాబు గద్దె నెక్కాక ప్రజల జీవనయానంపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా నిత్యా వసరాల ధరలు తగ్గకపోగా ఆకాశన్నంటుతున్నాయి. మద్యం షాపులపై పెట్టిన శ్రద్ధ బడి పిల్లలపై చూప లేదు. యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడు తున్నారు. సంక్షేమ పథకాలకు ఫుల్‌స్టాప్‌ పడి పోయింది. భారత రాజ్యాంగం స్థానంలో నేడు ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందనేది మెజారిటీ ప్రజానీకం అభిప్రాయం.

నేడు కొత్త సినిమా టికెట్ల కోసం లైన్లు తగ్గిపోయాయి. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని ఆ టైంకి వెళ్లిపోతున్నారు. ఓటీటీ పుణ్యాన మార్పులు శర వేగంగా వచ్చాయి. ఇప్పుడు వేరే లైన్లు ఉన్నాయి. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్‌ లబ్ధిదారులూ, రేషన్‌ కోసం మహిళలూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. తాను స్వయంగా చెప్పిన డైలాగులను పవన్‌ మరిచిపోయినట్లున్నారు. 

పోరాడితే పోయే దేమీ లేదు... ఎదవ బానిస సంకెళ్లు తప్ప అని భావించిన చాలామంది రియల్‌ హీరోలు ప్రశ్నించాలంటే మ్యాట్నీలు వదలాల్సిన అవసరం లేదు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలనుకున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సోషల్‌ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇంకేముంది రెడ్‌ బుక్‌ రాజ్యాంగం మేరకు శిక్షలు మొదలయ్యాయి. 

ఈ అన్యాయాలను ప్రశ్నించాల్సిన పవన్‌ మాత్రం నేను సినిమాల్లో మాత్రమే హీరోనని తల పక్కకి తిప్పేశారు. పోరాటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని కోరుకున్న వ్యక్తి అది నిజంగా జరగడాన్ని ఊహించలేదా? లేక తట్టుకోలేకోయారా? తనకు అధికారం ముఖ్యం కాదని గతంలో ఓ సందర్భంలో చెప్పినట్లు గుర్తు. అయితే ఇప్పుడు ఆ పవర్‌ ముఖ్యం కావడంతో నోరు కుట్టేసుకున్నారని సమాజం భావిస్తోంది.

పవన్‌ కాకినాడ పోర్టుకెళ్లి స్టైల్‌గా ‘సీజ్‌ ద షిప్‌’ అనడం... ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో పోస్టులు పెట్టి సంబర పడిపోవడం చకచకా జరిగాయి. అసలు డిప్యూటీ సీఎం అనాల్సిన మాట వేరే ఉంది. 

ఆరు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ‘కదలిరండి.. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’ అనుంటే హాల్లో వినిపించిన చప్పట్ల సౌండ్‌ నిజ జీవితంలో మరింత గట్టిగా వచ్చేది. కానీ పవన్‌ సినిమాటిక్‌గానే వ్యవహరించి డిప్యూటీ సీఎం అనేది చంద్రబాబు దర్శకత్వంలో  చేస్తున్న ఒక పాత్ర మాత్రమేనని చెప్పకనే చెప్పారు.
– వెంకట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement