కొత్త యాడాదొచ్చింది. యాడాదే గాకుంట బోన్గిరి కెల్లి మా యాద్గిరి మామ గుడ్క ఇంటికొచ్చిండు. ఎప్పుడు మాట్లాడినా రాజకీయాల గురించే మాట్లాడ్తుంటడు. రామాయనం, బారతం గూడ రాజకీయాలే అంటడు. రామునికి కైక వెన్నుపోటు పొడ్వబట్కె పద్నాల్గేండ్లు అడ్విలల్ల దిర్గిండు. పార్టి ఫిరాయించ బట్కె విబీషనుడు లంకకు రాజైండు. వెన్నుపోటు, గోడదుంకుడు ఎప్పటి సందో ఉన్నయని జెప్తుంటడు. ఊరంత ఒక దిక్కైతె ఊసు కండ్లోడు ఒక దిక్కు. అందరు ఎడ్డెం అంటె గాయిన తెడ్డెం అంటడు.
‘‘హ్యాపీ న్యూ ఇయర్ మామా’’ అన్న. చిన్నగ నగిండు.
‘‘కొత్త యాడాదిల సంతోసంతోని ఉండుమంటె ఎక్కిరిచ్చిన తీర్గ నవ్వుతవేందే?’’ అని అడ్గిన.
‘‘కొత్త క్యాలండర్ రాంగనే అంత యాడనన్న కొత్తగైతదార! సూర్యు డేమన్న కొత్తగున్నడా? మొగులు మీది కెల్లి చెంద్రుడు కిందికి దిగొచ్చిండా?’’
‘‘శానమంది మందు గొట్టిండ్రు. డాన్స్ జేసిండ్రు. కేకులు గోసిండ్రు. అందరు జోష్ మీదుంటె నువ్వు హోష్ గురించి మాట్లాడ్తవేంది?’’
‘‘కొత్త యాడాదిని మనాయించె తంద్కు నడి నాత్రి దన్క పబ్‌లను, బార్లను తెర్సి ఉంటెతంద్కు పర్మిసన్ ఇచ్చిండ్రు. తెలంగాన 215 కోట్ల మందు గొడ్తె ఆంద్రల 142 కోట్ల రూపాయల మందు గొట్టిండ్రు. సర్కార్ ఎవ్వలితోని నడుస్తున్నదో ఎర్కెనార? మందుతోని నడుస్తున్నది.’’
‘‘వహవ్వా! క్యా ఖూబ్’’
‘‘తొమ్మిదేండ్లు చెంద్రబాబు ముక్యమంత్రి కుర్సి మీద గూసున్నడు. ఏడేండ్లు అపొజిషన్ లీడర్ కుర్సి మీద గూసోని రికార్డ్ బిటాయించిండు. ఆక్రి మోక ఇయ్యుండ్రి. మల్ల ముక్యమంత్రిని జెయ్యుండ్రి అన్కుంట జెనంను బత్మిలాడుతున్నడు. గిదేం కర్మ రాస్ట్రంకు అన్కుంట మీటింగ్‌లు బెట్టి పల్ల పల్ల ఏడుస్తున్నడు. గా నడ్మ కందుకూరుల సన్నటి బాటల మీటింగ్ బెట్టిండ్రు. దాంతోని మెస్లెతందుకు గుడ్క జాగ లేక జెనం ఒగల మీద ఒగలు బడి ఎనిమిది మంది సచ్చిండ్రు. గిదే పెద్ద కర్మ రాస్ట్రంకు అయ్యింది. చెంద్రబాబు హన్మంతున్ని జెయ్యబోతె బోడ కోతి అయ్యింది. కొత్త యాడాది పస్టు తారీకు గుంటూర్ల టీడీపీ చెంద్రన్న కానుకలు పంచుడు ప్రోగ్రాం బెట్టింది. చెంద్రబాబు స్టేజి ఎక్కుతున్నప్పుడే గాదాని ఒక తంతె కూలింది. తంతెను బాగ జేసినంకనే గాయిన స్టేజ్ ఎక్కిండు. కానుకల కోసం ఆడోల్లు ఒగల నొగలు నూక్కున్నరు. కొందరు కింద బడ్డరు. కింద బడ్డోల్లను తొక్కుకుంట బోయిండ్రు. దాంతోని ముగ్గురు ఆడోల్లు సచ్చిండ్రు. పోయిన యాడాది ఆక్రిల చెంద్ర బాబు బెట్టిన మీటింగ్‌ల తొమ్మిది మంది సస్తె కొత్త యాడాదిల బెట్టిన మీటింగ్‌ల ముగ్గురు సచ్చిండ్రు. గివన్ని జూస్తె పచ్చ మీటింగ్ల కర్మేంది రాస్ట్రంకు అని జెనం అన్కుంటున్నరు. కొత్త యాడాదొచ్చినా బాబు మారలే. గాయిన కర్మ మీటింగులు సుత మారలే’’
‘‘పప్పు లోకేశ్ సంగతేందే?’’
‘‘అందరు పాదయాత్ర జేస్తున్నరు. ఎన్కట మా నాయిన గుడ్క పాదయాత్ర జేసిండు. బారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది గూడ పాదయాత్ర జేస్తున్నడు. ఇయ్యాల గాకున్నా రేపన్న ముక్యమంత్రిని గావాలంటె పాదయాత్ర జెయ్యాలె. నడిస్తినా అంటే తిన్నది అర్గుతది. బొర్ర రాకుంట ఉంటుంది అని లోకేశ్ అన్కుండు. అయ్యగారి తాన్కి బోయిండు. మంచి మూర్తం బెట్టిచ్చు కుండు. 27 తారీకున కుప్పం కెల్లి ఇచ్చాపురం దాన్క పాదయాత్ర జేస్తనని జెప్పిండు. యువ గలం పేరు మీద 400 దినాలు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర జేస్తనన్నడు. యెంబడి పస్పు బస్తలు గూడ గొంచ బోతనని జెప్పిండు. జెనం మీద పస్పు సల్లుకుంట పాదయాత్ర జేస్తనన్నడు. పాదయాత్ర జేస్కుంట టీడీపీని ‘బలవంతం’ జేస్తడు, గిదేందని అడ్గకురా గాయిన ‘బలవంతం’ అంటె ‘బలోపేతం’ అని అనుకుంటడు.’’ (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!)
‘‘మామా! సలికాలం గూడ ఉబ్బరిస్తున్నదెందుకే?’’
‘‘కొత్త యాడా దొచ్చిందని సలి గూడ మందు గొట్టి గరమైందిరా. రేల్ గాడి సైమమయింది వొస్తరా’’ అన్కుంట యాద్గిరి మామ ఊరికి బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment