జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కోని బొందల గడ్డ దిక్కు బోయిండు. రొండంత్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. ఆకలైతున్నా బేతాలునికి వొండుకోబుద్ది గాలేదు. నాబి కాడ సల్ల బడితె నవాబ్ కైన జవాబ్ జెప్పొచ్చు అనుకోని ఆన్‌లైన్ల చికెన్ బిర్యాని దెప్పిచ్చుకుండు. తిన్నంక కతల వయ్యి సద్వుకుంట గూసున్నడు.
సరింగ నాత్రి ఒకటి గొట్టంగ, విక్రమార్కుడు హారన్ గొట్టిండు. బేతాలు డింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ఎప్పటి లెక్కనే విక్రమార్కుడు మోటర్ నడ్పలేదు. ఎన్కకు దిర్గి సకినాలు, నూల ముద్దలు ఇచ్చిండు.
‘‘గియెందుకిస్తున్నవ్?’’ అని బేతాలుడు అడిగిండు.
‘‘సంక్రాతి పండ్గని.’’
‘‘లీడర్లు బిర్యాని పొట్లాలు ఇచ్చిన తీర్గ ప్రేమతోని నువ్వు గివ్వి నాకిచ్చినందుకు శెనార్తిలు. ఏం పండ్గనో ఏమో! ఒక్క దినం ఏసంకు మూతి మీసం గొర్గిచ్చుకును డెందుకో! అన్ని పండ్గలేమొ గని సంక్రాతి పండ్గకు అందరు సంత ఊర్లకు బోవాలనుకుంటరు. మోకేకా ఫాయిదా ఉటాయించి బస్సు చార్జిలు డబల్, త్రిబల్ జేస్తరు. రేల్ గాడిలల్ల నిలబడెతంద్కు గూడ జాగ దొర్కదు. భారత్ జోడో అన్కుంట రాహుల్ గాంది పాద యాత్ర జేస్తున్నడు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బీహార్ ముక్యమంత్రి నితీశ్ కుమారే గాకుంట యువగళం పేరు మీద లోకేశ్ గుడ్క పాదయాత్రలు జేస్తమంటున్నరు. గాల్ల తీర్గనే పాదయాత్ర జేస్కుంట పండ్గకు ఊర్లకు బోతె బాగుంటదని జెన మనుకుంటున్నరు. యథా లీడర్ తథా క్యాడర్.’’
‘‘ముగ్గుల సంగతేంది?’’
‘‘కిసాన్ సర్కార్ అన్కుంట బీఆర్‌ఎస్, రామరాజ్జెమన్కుంట బీజేపీ, ఇందిరమ్మ సర్కార్ అన్కుంట కాంగ్రెస్ జెనంను ముగ్గుల దించెతంద్కు ఒక్క తీర్గ కోషిస్ జెయ్యబట్టినయి.’’
‘‘పతంగులెక్కిస్తున్నరా?’’
‘‘ఫాంహౌస్‌ల సుతాయించిన మాంజతోని బీఆర్‌ఎస్ పతంగు లెక్కిస్తున్నది. ఈడీ, సీబీఐ మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నది. సర్పంచుల మాంజ సుతాయించి కాంగ్రెస్ పతంగులెక్కి స్తున్నది. మేడినిండియా మాంజ అనుకుంటనే చైన మాంజతోని బీజేపీ పతంగులెక్కిస్తున్నదని అను కుంట ఆల్ పిరీ మాంజతోని ఆప్ పతంగులెక్కి స్తున్నది. సీపీఐ, సీపీఎం తోక పతంగులు ఎక్కిస్తున్నయి. బీఆర్‌ఎస్, బీజేపీ పతంగుల నడ్మనే పేంచి నడుస్తున్నది’’ అని బేతాలుడన్నడు.
‘‘రాజకీయ బోగి మంటలు గిన ఉన్నయా?’’
‘‘ఎందుకు లెవ్వు. లీడర్లు దినాం జెనంల మంటలు బెడ్తున్నరు. గీ నెలల కమ్మంల బీఆర్‌ఎస్ లచ్చల మందిల మంట బెడ్తది. బీజేపీ గుడ్క గిదే నెలల లష్కర్ల లచ్చల మందితోని మంటలు షురువు జేస్తనని జెప్పింది. జన సేన, టీడీపీ గల్సి ఆంద్రల మాటల మంటలు బుట్టిస్తమంటున్నయి. అమెరికల డల్లాస్ల గుడ్క తెలుగోల్ల నడ్మ కులం, రాజకీయ మంటలు లేసినయి.’’
‘‘రాజకీయ కోడి పందాల సంగతేంది?’’
‘‘సంక్రాంతనంగనే కోడి పందాలే యాదికొ స్తయి. కోల్ల కాల్లకు చిన్న కత్తులు గట్టి దంగల కిడుస్తరు. గవ్వి ఒక్క తీర్గ ఫైటింగ్ జేస్తయి. గా కోల్ల మీద కోట్ల రూపాయలు బిట్టు గడ్తరు. గీ నడ్మ ఆన్‌లైన్ కోడి పందాలు షురువు జేసిండ్రు. గివ్వి యాడాదంత నడుస్తనే ఉంటాయి. లీడర్ల నడ్మ దినాం తిట్ల పందా లుంటయి. గీ రాజకీయ కోల్ల నాల్కలే కత్తులు. అసల్ కోడి పందాలల్ల రెండు కోల్లు ఉంటె ఒకటి సస్తది. రాజకీయ కోల్ల పందాలల్ల ఒక కోడి ఓడి పోతె ఇంకొక కోడి గెలుస్తది. గియ్యాల ఓడిన కోడి రేపు గెల్సినా గెలుస్తది. సంక్రాతి దినాలల్ల నోములు జేసేటి ఆడోల్లు వాడకట్టుల సకినాలు, నూల ముద్దలు బంచుతరు. కుర్సి నోములు జేసేటి లీడర్లు కొత్త కొత్త పద్కాలు బెట్టి జెనంకు రూపాయలు బంచుతరు. నిండ ముంచుతరు.’’
‘‘వహవ్వా, ఏం చెప్పినవ్ బేతాలా!’’
‘‘గది గంట్లుండ నియ్యి. ఉప్పరిపల్లి మూసీ నది ఒడ్డుకు మొసల్లు ఎందుకొచ్చినయి. గీ సవాల్కు జవాబ్ ఎర్కుండి గూడ జెప్పకుంటివా అంటె నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతా లుడన్నడు.
‘‘బేతాలా! సంక్రాతిని మకర సంక్రాంతంటరు. మకరము అంటె మొసలి. రాజకీయ మొసల్లు ఎట్లున్నయో అర్సుకునేతంద్కు పండ్గ నాడు అసలు మొసల్లు మూసీ నది ఒడ్డుకొచ్చినయి’’ అని విక్రమార్కుడు జెప్పిండు.
చౌరస్తల రెడ్ సిగ్నల్ బడ్డది. మోటరాగింది. ఎన్క తలుపు దీస్కోని కిందికి దిగిన బేతాలుడు బొందలగడ్డ దిక్కు ఉర్కిండు. (క్లిక్ చేయండి: తమ్ముండ్లూ రాండ్రి! గాలిగొట్టి పోండ్రి!)
- తెలిదేవర భానుమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment