తెలంగానకు బోక శానొద్దు లైంది. ఒక్కపారి గా రాస్ట్రంకు బోయొస్తె బాగుంటదని నారదుడు అనుకుండు. తిట్టేటి నోరు, తిరిగేటి కాలు ఊకుండయి. నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట నారాయన, నారాయన అనుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. పట్నం దిక్కు గాయిన రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు ఎదురైంది. ‘‘యాడికి బోతున్నవ్ నారదా’’ అని అడిగింది.
‘‘తెలంగాణల ఏమైతున్నదో ఎర్క జేస్కునే తంద్కు బోతున్న. నా సంగతి కేంగని నువ్వు పట్నం ఎందుకు బోయినవు’’ అని నారదుడు అడిగిండు.
‘‘మా దున్నపోతుల సంగం ఎలచ్చన్లు ఉంటె ఒక్క తీర్గ రమ్మని నన్ను బిలిస్తె బోయుంటి.’’
‘‘మీ సంగం ఎలచ్చన్లు ఎట్లయినయి?’’
‘‘సూద్దామని బోయిన నన్ను సుట్ట కుదురును జేసినయి. దున్నపోతుల సంగం ప్రెసిడెంటును జేసినయి.’’
‘‘నర్క లోకం దున్నపోతును ప్రెసిడెంట్ నెట్ల జేస్తరని తెలంగాన దున్నపోతులు లొల్లి బెట్టలేదా?’’
‘‘లొల్లి బెట్టెతంద్కు మా దున్నపోతులేమన్న కాంగ్రెస్ పార్టీయా?’’
‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అసువంటి రాజకీయ పార్టీల గాలి దాక్తె దున్నపోతులల్ల గుడ్క రాజకీయాలు షురువైతయేమో!’’ అని నారదుడు అన్నడు.
‘‘నువ్వు తక్వోనివి గావు నారదా! మా దాంట్ల రాజకీయాలు షురువైతె మేము మేము కొట్లాడు కుంటుంటె సూసి మురుద్దామనుకుంటున్నవు. గీ నడ్మ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొత్త దుక్నాలు దెర్సినయి. ఇంతకుముందు తెలంగానల టీఆర్‌ఎస్ అనేటి కిరాన దుక్నముండేది. గా దుక్నంను హోల్‌సేల్ దుక్నం జేసి డిల్లిల దెర్సిండ్రు. బీఆర్‌ఎస్ అని పేరు బెట్టిండ్రు. దుక్నంల కేసీఆర్ గూసుండు. వాస్తు జూసి మంచి మూర్తంల దుక్నం దెర్వబట్కె గిరాకి మంచి గైతదని గాయిన అనుకుండు. గని గాయిన ఒకటను కుంటె ఒకటైంది. కుమార స్వామి, అఖిలేశ్ యాద వ్‌లే దుక్నం కాడ్కి వొచ్చిండ్రు. గాల్లది ఉద్దెర బ్యారమే. గాల్లు దప్పిడ్సి డిల్లిల ఎవ్వలు గా దుక్నం గురించి ముచ్చట బెట్టలే.’’
‘‘కాంగ్రెస్ దుక్నాల సంగతేంది?’’ అని నారదుడు అడిగిండు.
‘‘గిప్పుడున్న అంగడిల ఒకల్లను జూసి ఒకల్లు ఓరుస్త లేరు. కండ్లల్ల మన్ను బోసుకుంటున్నరు. భారత్ జోడో యాత్ర జేస్కుంట ప్రేమ దుక్నాలు దెరుస్తున్న. గీ దుక్నాలు కడ్మ దుక్నాల సుంటియి గాదు. గిన్వి ఎవ్విటిని అమ్మయి, కొనయి. అందర్కి ప్రేమను పంచిస్తయి. బువ్వబెడ్తె అర్గిపోతది. బట ్టలిస్తె చిన్గిపోతయి. గని నా ప్రేమ అర్గేది గాదు అని రాహుల్ గాంధి అన్నడు.’’
‘‘ఇంతకు గాయిన ప్రేమ నెట్ల పంచుతున్నడు?’’
‘‘కాంగ్రెస్సోల్లు గండ్లబడ్తె గాలియెంబడి ముద్దు లిస్తున్నడు. చిన్న పోరనికి చెప్పులేస్తున్నడు. బుడ్డ పోరగాన్ని ఎత్తుకోని ముక్కు చీమిడి దీస్తున్నడు. కాలేజి పోరగాల్లకు సేకెండిస్తున్నడు. ఛాయ్ దాక్కుంట ముసలోల్ల మంచి చెడ్డ లర్సుకుంటు న్నడు. రాహుల్ గాంధి భారత్ జోడో అన్కుంట పాదయాత్ర జేస్తుంటే పార్టీ తోడో అన్కుంట తెలం గానల కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుకుంటున్నరు’’ అని దున్నపోతు అన్నది.
‘‘ఎందుకు కొట్లాడుకుంటున్నరు?’’ అని నార దుడు అడిగిండు.
‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన కాడికెల్లి తెలంగాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట మండుతున్నరు. మునుగోడుల కాంగ్రెస్ ఓడిపోంగనే గాయిన మీద్కి లేసిండ్రు. టీపీసీసీ కమిటీలు ఎయ్యంగనే రేవంత్‌ను తిట్టుకుంట గాల్లు శిగమూగ బట్టిండ్రు. భట్టి విక్రమార్క ఇంట్ల కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజ నర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ప్రేంసాగర్ రావు అసువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మీటింగ్ బెట్టిండ్రు. టీడీపీకెల్లి కాంగ్రెస్లకొచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కమిటీలల్ల టీడీపీలకెల్లి వొచ్చి నోల్లకే మోక ఇచ్చిండు. ముంగటి సంది కాంగ్రెస్ల ఉన్నోల్లను పక్కకు బెట్టిండు. సేవ్ కాంగ్రెస్ అన్కుంట గాల్లు లొల్లిబెట్టబట్టిండ్రు. ‘హాత్ సే హాత్’ ప్రోగ్రాంకు డుమ్మాగొట్టిండ్రు. ఇగ దాంతోని టీపీసీసీ కుర్సిలకు సీతక్కనే గాకుంట పన్నెండుమంది కాంగ్రెస్ లీడర్లు రాజినామ జేసిండ్రు. కొట్లాడుకుంటున్న కాంగ్రెస్ లీడర్లల్ల కొంతమందిని గుంజి గాల్ల చేతులల్ల తామర పువ్వులు బెట్టెతంద్కు బీజేపీ రడీగున్నది.’’
‘‘బీఆర్‌ఎస్ దుక్నం సంగతేంది?’’
‘‘డిల్లిల బీఆర్‌ఎస్ హోల్‌సేల్ దుక్నం బెట్టినంక కేసీఆర్ పట్నమొచ్చిండు. రొండు మూడు దినా లైనంక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గాయినను గల్సిండు. ఆంద్రప్రదేస్, పంజాబ్, హర్యానా, మహా రాస్ట్ర, ఒడిసా, కర్నాటక రాస్ట్రాలల్ల బీఆర్‌ఎస్ దుక్నాలు దెరుస్తమని కేసీఆర్ జెప్పిండు. ఆ దుక్నాల ముంగట ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రాసిన బోర్డులు బెడ్తమని అన్నడు. మల్ల గలుస్త’’ అన్కుంట దున్నపోతు నర్కం దిక్కుబోయింది.
నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: మందల బడి మురుస్తాంది గొర్రె)
- తెలిదేవర భానుమూర్తి
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment