సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రం పదో ఏట అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్ సొంత వ్యవహారం చేస్తోంది. ఈ తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఈ నెల 22న ‘దశాబ్ది దగా’పేరిట రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలి. రావణాసురుడి రూపంలో కేసీఆర్ దిష్టిబొ లను తయారు చేసి, పది వైఫల్యాల తలలు పెట్టి ఆ దిష్టిబొ లను దహనం చేయాలి. తర్వాత ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించాలి..’’అని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది.
శనివారం గాం«దీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంశాలపై చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌చౌదరి, విష్ణునాథ్, మన్సూర్‌అలీ ఖాన్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీఏసీ సభ్యులు వీహెచ్, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈసారి ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో, ఏయే సీట్లు ఇస్తారో వెంటనే గుర్తించాలని పీఏసీ భేటీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ కోరినట్టు తెలిసింది. 2018లో చాలా సీట్లు చివరి నిమిషంలో ప్రకటించడంతో నష్టం జరిగిందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఇతర పా ర్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న వారికి పనితీరు, ప్రభావం ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి అన్యాయం జరగకుండా చూడాలని వీహెచ్, రేణుకా చౌదరి సూచించినట్టు తెలిసింది.
పది రోజుల్లో మండల కమిటీలు
పీఏసీ భేటీ తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మండల కమిటీల ఏర్పాటుపై చాలా ప్రతిపాదనలు వచ్చాయని, వీటిపై చర్చించి 10 రోజుల్లోగా ప్రకటిస్తామని చెప్పారు. ‘దశాబ్ది దగా’పేరిట బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లలో ఏయే అంశాలను చేర్చాలన్న చర్చ జరుగుతోందని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో జాతీయస్థాయి నేతలతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటై ఇన్నేళ్లయినా 600 మంది అమరుల కుటుంబాలను గుర్తించలేకపోయారని, బాధ్యత లేని మంత్రుల వ్యవహార శైలితో అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బీజేపీ, తెలంగాణలోని బీఆర్‌ఎస్‌కు దగ్గరి పోలిక ఉందని.. అక్కడ బీజేపీ 40 శాతం కమీషన్ సర్కార్ అయితే, ఇక్కడ బీఆర్‌ఎస్‌ది 30 శాతం కమీషన్ సర్కార్ అని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
అనుబంధ సంఘాల బాధ్యతలు కేటాయింపు
కాంగ్రెస్ అనుబంధ సంఘాల పర్యవేక్షణ బాధ్యతలను పలువురు టీపీసీసీ నేతలకు కేటాయిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. మహేశ్‌కుమార్ గౌడ్ (సేవాదళ్, ఐఎన్‌టీయూసీ), గీతారెడ్డి (మహిళా కాంగ్రెస్), వినోద్‌రెడ్డి (యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ), మద్దుల గాల్‌రెడ్డి (ఎన్‌ఆర్‌ఐసెల్, ఓవర్సీస్)లకు బాధ్యతలను అప్పగించారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, చావా రవి, మాణిక్‌రెడ్డి (యూటీఎఫ్), పోచయ్య (ఎస్‌టీఎఫ్), లింగారెడ్డి (డీటీఎఫ్), మురళీ (టీటీఎఫ్), గోపాల్, రఘునందన్, వెంకటయ్య, రవిశంకర్‌రెడ్డి తదితరులు గాం«దీభవన్‌లో రేవంత్‌ను కలసి ఉపాధ్యాయుల సమస్యలను వివరించారు. సీపీఎస్ రద్దు, ఏటా పదోన్నతులు, బదిలీల అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు చెరో 45 సీట్లు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రజల అభిప్రాయంలో భారీ మార్పు వచ్చిందని, కాంగ్రెస్ నిర్వహిస్తోన్న సర్వేల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పా ర్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చెరో 45 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయని, 15 చోట్ల రెండు పా ర్టీల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పారు.
బీఆర్‌ఎస్‌కు 37 శాతం ఓట్‌షేర్ వస్తే తమకు 35 శాతం వస్తోందని, బీజేపీ బలం 22 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం, బీజేపీ చెరో ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉందన్నారు. పౌరహక్కుల నేత హరగోపాల్‌పై కేసును వెనక్కి తీసుకుంటామన్న ప్రకటనను తాను నమ్మడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. మోసం చేసేందుకే కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేస్తుంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment