Telidevara Bhanumurthy Write On Munugode Bypoll Result 2022, KA Paul Comments - Sakshi
Sakshi News home page

Munugode Bypoll Result: అయ్యయ్యో! కీసల పైసలు పోయెనే

Published Thu, Nov 10 2022 12:57 PM | Last Updated on Thu, Nov 10 2022 5:48 PM

Telidevara Bhanumurthy Write on Munugode Bypoll Result, KA Paul Comments - Sakshi

జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. గా బంగ్ల ముంగట విక్రమార్కుడు మోటరాపిండు. ఆపి హారన్‌ గొట్టిండు. హారన్‌ సప్పుడినంగనే బేతా లుడు బంగ్లకెల్లి ఇవుతల కొచ్చిండు. మోట రెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసున్నడు.  గూసోంగనే విక్రమార్కుడు మోటర్‌ నడ్ప బట్టిండు. గప్పుడు ఎన్క సీట్ల గూసున్న బేతాలుడు –

‘‘నన్ను గూసుండ బెట్టుకోని గుంతలు, ఎత్తు గడ్డలు, కంకర తేలిన తొవ్వలని సూడకుంట మోటర్‌ నడ్పుతవు. ఒక్కోపారి ట్రాఫిక్ల ఇర్కపోతవు. కోపం గినొస్తె నువ్వు గాన్ని గీన్ని తిట్టొచ్చు. నీకు ఎటూ సుద్రాయించక పోవచ్చు. నీకు యాస్ట రాకుంట ఉండెతంద్కు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను.

‘‘నెల దినాల సంది మునుగోడుల నడ్సిన బైఎలచ్చన్ల బాగో తంకు పర్ద బడ్డది. పది మంత్రులు, తొంబైమంది ఎమ్మెల్యేలే గాకుంట ముక్యమంత్రి గుడ్క బాగోతమాడితె పదివేల చిల్లర ఓట్లతోని టీఆర్‌ఎస్‌ దిక్కుకెల్లి పోటి జేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెల్సిండు. అన్నా! నువ్వు గెల్సినందుకు పటాకులు గాలుస్తం. లడ్లు, కోవపేడలు పంచిపెడ్తం. మందు గొడ్తం. కోల్లు, మేకలు గోసి దావత్‌ జేసుకుంటం. పది లచ్చల రూపాయలు ఇయ్యే అని గాయిన దిక్కుకెల్లి పని జేసిన టీఆర్‌ఎసోల్లు అడిగిండ్ర’’ ని బేతాలుడు అన్నడు.

‘‘గాల్లు అడిగితె కూసుకుంట్ల రూపాయ లిచ్చిండా?’’ అని విక్రమార్కుడు అడిగిండు.

‘‘వందల కోట్ల రూపాయలు కర్సు జేస్తె కింద మీద బడి బై ఎలచ్చన్ల గెల్సిన. ఇంతకుముందు మీరు అడి గట్లిస్తె కడిగి నట్లయింది. ఇంక పైసలు యాడికెల్లి దేవాలె. ఎంత గనం తన్లాడినా కమస్కం నల్ఫై వేల ఓట్ల మెజార్టి రానందుకు కేసీఆర్‌ నారాజైండు అన్కుంట గాయిన మొత్తుకుండు.’’

‘‘బీజేపీ దిక్కు కెల్లి నిలబడ్డ రాజగోపాల్‌ రెడ్డి ఏమన్నడు?’’ 
‘‘కింద బడ్డా మీది కాలు నాదే. న్యాయం నా దిక్కే ఉన్నది. టీఆర్‌ఎస్‌కు ఓటు ఎయ్యకుంటె పింఛన్లు ఇయ్యమని బెదిరిచ్చిండ్రు. తొండి జేసి గెల్సిండ్రు. నిజం జెప్పాలంటె నేనే గెల్సిన అన్నడు.’’

‘‘గీ ఎలచ్చన్ల బాగోతంల బుడ్డర్‌ ఖాన సుంటి కె.ఎ. పాల్‌ ఏమన్న అన్నడా?’’
‘‘నూరుకు అర్వై ఓట్ల లెక్కన నాకు ఓట్లు వొస్తయి. గని టీఆర్‌ఎస్, బీజేపీలు ఈవీఎంల తోని తోతిరి జేసినయి. ఈవీఎంలు వొద్దంటె గా రొండు పార్టిలు అడ్డంబడి నన్ను గెల్వకుంట జేసినయి. నిజాన్కి నేనే గెల్సిన. ఇయ్యాల గాకున్నా రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే అని కె.ఎ. పాల్‌ అన్నడు.

ఎలచ్చన్లు గిప్పటి తీర్గ గాకుంట హర్రాజ్‌ తోని బెట్టాలె. ఎవ్వలు అందరికన్న ఎక్వ కోట్లు పంచి పెట్టుడే గాకుంట కోట్ల రూపాయల మందు బోపిచ్చెతందుకు ముంగట్కి వొస్తరో గాల్లే గెల్సినట్లు సాటి య్యాలని సర్కార్‌ అనుకుంటున్నది. కోట్ల రూపాయలు కర్సు బెట్ట కుండుడే గాకుంట మందు బోపియ్యనోల్లకు ఎలచ్చన్ల పోటి జేసే హక్కు ఉండదని జెబ్దామనుకుంటున్నరు. ఓటుకు నాల్గు వేలు ఇస్త మని మూడు వేలే ఇచ్చిండ్రు. కడ్మ వెయ్యి ఎప్పుడిస్తరని కొందరు లొల్లి బెట్ట బట్టిండ్రు’’
 
‘‘గింతేనా ఇంకేమన్న ఉన్నదా?’’
‘‘సార్‌ మీరు రాజినామ జెయ్యుండ్రి. రాజినామ జేస్తె మును గోడు లెక్క బై ఎలచ్చన్లొస్తయి. సర్కార్‌ పైసలు మంజూరు జేస్తది. దాంతోని మా పరిగి మంచిగైతది అన్కుంట పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డికి ఒకడు ఫోన్‌ గొట్టిండు.

అన్నా! పౌరన్‌ నువ్వు మంత్రి కుర్సికే గాకుంట ఎమ్మెల్యేకు నువ్వు రాజినామ జేసి బై ఎలచ్చన్లు తేయే. నువ్వు రాజినామ జేస్తె ధర్మపురి నియోజక వర్గమే గాకుంట మా బత్కులు బాగై తయే అన్కుంట బతికెపల్లి కెల్లి రమేశ్‌ అనెటోడు మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఫోన్‌ గొట్టిండు. అచ్చెమ్మ పెండ్లి బుచ్చెమ్మ సావు కొచ్చిన తీర్గ మునుగోడు బై ఎలచ్చన్లు మా పానం మీదికొ చ్చిందే అన్కుంట మంత్రి మొత్తుకుండు. మునుగోడు ఎలచ్చన్ల నేనే గెల్సిన అని కూసుకుంట్ల అన్నడు. న్యాయంగ జూస్తె నేనే గెల్సిన అని రాజ గోపాల్‌ రెడ్డి అంటె గీల్లిద్దరు గాదు నేనే గెల్సిన అని కె.ఎ. పాల్‌ అంటున్నడు. ఇంతకు ఎవ్వలు గెల్సిండ్రు. ఎవ్వలు ఓడిపోయిండ్రు . గీ సవాల్కు జవాబ్‌ జెప్పకుంటివా అంటె నీ మోటర్‌ గుంతల బడ్తది’’ అని బేతాలుడన్నాడు.

‘‘మునుగోడుల మందు, మనీ గెల్సింది. జెనం ఓడి పోయిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పిండ్రు. బొందల గడ్డ రాంగనే బేతాలుడు మోటర్‌ దిగి ఇంటికి బోయిండు. (క్లిక్: ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు)


- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement