సాక్షి, జగిత్యాల: తాళాలు మిస్సింగ్ లాంటి అనేక మలుపుల మధ్య సాగిన ధర్మపురి స్ట్రాంగ్ రూం ఎపిసోడ్ ఓ కొలిక్కికి వచ్చింది. నాలుగున్నరేండ్ల గది తెరిచిన అధికారులు.. సుమారు 17 గంటలపాటు స్ట్రాంగ్ రూమ్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. హైకోర్ట్ ఆదేశాలతో నిన్న (ఏప్రిల్ 23 ఆదివారం) ఉదయం 11 గంటలకు తాళాలు పగులగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవగా.. ఇవాళ(సోమవారం) ఉదయం 4 గంటల 50 నిమిషాలకు డాక్యుమెంట్ల పరిశీలన ముగిసింది.
గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా అధికారులు పరిశీలించారు. సేకరించిన డాక్యుమెంట్స్ ను నివేదిక రూపంలో ఈనెల 26 లోపు హైకోర్టుకు సమర్పించనున్నారు జగిత్యాల జిల్లా అధికారులు. డాక్యుమెంట్ల పరిశీలన ముగింపుతో హైడ్రామాకు తెర పడగా హైకోర్ట్ తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అడ్లూరి అభ్యంతరాలు..
👉హై కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నికల అధికారుల పర్యవేక్షణ లో 17A మరియు 17 c కి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది
👉కౌంటింగ్ సమయంలో రికార్డ్ చేసిన విడియో ఫుటేజ్, సీసీ ఫుటేజ్ లేవు అని అధికారులు చెప్పడం జరిగింది.
👉ఎలక్షన్ పోలింగ్ అయిన తరువాత ఈవీఎంలను ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతంలో ఉంచాలి. కానీ, ధర్మపురి జూనియర్ కాలేజి లో ఈవీఎంలను ఉంచడం జరిగింది. అది ప్రభుత్వం నోటిఫైడ్ చెయ్యని ప్రాంతం!.
👉పోలింగ్ అయిన దగ్గర నుండి ఈవీఎంలను భద్రపరిచే వరకు అధికారులు ఎక్కడ నిబంధనలు పాటించలేదు..
👉 నాలుగున్నర సంత్సరాలుగా స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్ అయిన పరిస్థితి లోపల కోర్టు ఆదేశాల ప్రకారం తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూం ఓపెన్ చేస్తే పోలింగ్ కి సంబంధించిన పత్రలు సీల్ లేకుండా, ఒక క్రమ పద్దతిలో లేకుండా ఉన్నాయి.
👉209 కి సంబంధించిన పోలింగ్ బూత్ కి సంబందించిన 17C డాక్యుమెంట్స్ కి సీల్ వేసి లేదు.
👉ఒక క్యాబినెట్ మంత్రి కి సంబంధించిన ఎన్నికల పోలింగ్ లో ఇన్ని అవకతవకలు జరిగాయి అయినప్పటికీ మేము కోరెది రికౌంటిన్ మాత్రమే..
👉స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి అని అధికారికంగా ప్రకటించారు.దానికి కారణం అయిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,వారి పైన క్రిమినల్ కేసు ఫైల్ చెయ్యాలి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలి.
👉అదే విధంగా 17c కి సంబంధించిన ఈవీఎంలను మళ్ళీ లెక్కించాలి..
👉ఇదంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ కుట్రరపూరితంగ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు..
👉దీనిపై హైకోర్టు కి మా అడ్వకేట్ ద్వారా విన్నవిస్తం.
మరోవైపు కోర్ట్ ఆదేశాల మేరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందని, నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు వెల్లడించిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రతినిధులు.
► గత అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
► కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 10న స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి 17ఏ, 17సీ డాక్యుమెంట్లు, సీసీటీవీ ఫుటేజీలు, సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉండగా, స్ట్రాంగ్ రూం నంబర్ 786051 నంబర్ తాళాలు మిస్ అయినట్లు ఆఫీసర్లు గుర్తించారు.
► సుమారు ఐదు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో తాళాన్ని బ్రేక్ చేయాలని ఆఫీసర్లు నిర్ణయించగా, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఢిల్లీ నుంచి త్రీమెన్ కమిటీ సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీలను సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
► దీంతో రంగంలోకి దిగిన త్రీమెన్ కమిటీ సభ్యులు ఈ నెల 17న కొండగట్టులోని జేఎన్టీయూలో గతంలో కలెక్టర్లుగా పనిచేసిన శరత్, రవితో పాటు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, అరుణశ్రీ, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతిలను ఎంక్వయిరీ చేశారు. ఆ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను వారు కోర్టుకు నివేదించారు.
► దీంతో ఈ నెల 23న ధర్మపురి స్ట్రాంగ్ రూం లాక్ పగలగొట్టాలని లేదా టెక్నీషియన్ తో తీయాలని, ప్రతి ఘటనను కెమెరాలో రికార్డు చేయాలని కోర్టు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 26న కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
► అయితే, ఈ కేసు రెండున్నరేళ్ల పాటు పెండింగ్ లో ఉండగా, ధర్మపురి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ భిక్షపతి కోర్టుకు హాజరుకాకపోవడం.. అరెస్ట్ వారంట్ రావడంతో మళ్లీ కొంత పురోగతి కనిపించింది.
► కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా నూకపల్లిలో వీఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌ను ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ యాస్మిన్ బాషా, ఆయా పార్టీల, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు లాక్ పగలగొట్టి ఓపెన్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, సీసీటీవీ ఫుటేజీలకు చెందిన జిరాక్స్ లను అటెస్ట్ చేసి వాటిని ఈ నెల 26న అధికారులు కోర్టుకు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment