ధర్మపురి ఎన్నిక వివాదం.. హైకోర్టు సంచలన ఆదేశాలు | TS High Court Sensational Orders Regarding Dharmapuri Election | Sakshi
Sakshi News home page

ధర్మపురి ఎన్నిక వివాదం.. హైకోర్టు సంచలన ఆదేశాలు

Published Wed, Apr 19 2023 9:10 PM | Last Updated on Wed, Apr 19 2023 9:11 PM

TS High Court Sensational Orders Regarding Dharmapuri Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ సీల్  పగలగొట్టాలని  జిల్లా కలెక్టర​్‌కు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. 2019లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ విజయం సాధించారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదని.. అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతోంది. కాగా, ఈ ఎన్నిక వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ  సందర్భంగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మణ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉద్దేశ పూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. స్ట్రాంగ్‌ రూమ్‌ సీల్‌ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్‌కు అనుమతించింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తెరవాలని సూచించింది. రిటర్నింగ్‌ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్‌స్మిత్‌ సహకారం తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24కి వాయిదా వేసింది.

అంతకు ముందు, ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీ ప్యాట్లు, సీసీ ఫుటేజీ కావాలని లక్ష్మణ్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్‌ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్‌ అధికారి చెప్పడంతో స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచి రిటర్నింగ్‌ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచేందుకు కలెక్టర్‌ ప్రయత్నించారు. మొత్తం 3 గదుల్లో ఎన్నికల సామగ్రి ఉండగా ఒక గది తాళాలు తెరవలేపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement