జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు.
అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు.
తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment