సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత టీడీపీలో మిగిలిన నేతలను వేళ్ల మీదే లెక్కపెట్టొచ్చనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన ముఖ్య అనుచరులుగా ఉన్న ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పాలేరు, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఫణీశ్వరమ్మ, కోనేరు చిన్ని, హరిప్రియ, సీనియర్ నేత కోనేరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్యతో పాటు ఒకరిద్దరు జడ్పీటీసీలు మాత్రమే పార్టీలో మిగిలారు.
తుమ్మల వర్గంగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదు. కానీ నామా వర్గీయులుగా ముద్రపడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బోడేపూడి రమేశ్‌బాబు, ఒకరిద్దరు జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నేతలు తుమ్మల బాట పట్టారు. పార్టీ తరఫున మొత్తం 19 మంది జడ్పీటీసీలు గెలుపొందగా, అందులో 16 మంది, ఎంపీపీల్లో 16 మంది, దాదాపు 240 మంది ఎంపీటీసీల్లో 165 మంది, 215 మంది సర్పంచ్‌ల్లో 156 మంది, 33 మంది సహకార సంఘాల అధ్యక్షులు అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితో పాటు మెజారిటీ మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా పరిషత్‌చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ అంజయ్య కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ ప్రస్తుతం అథఃపాతాళానికి చేరుకుందని రాజకీయ వర్గాలంటున్నాయి.