సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా విద్యుత్ హబ్‌గా వెలుగొందబోతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చే జిల్లాగా రూపుదిద్దుకోబోతోంది. నూతన రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తోడు జిల్లాలో సహజవనరులు అందుబాటులో ఉండడంతో ఏకంగా 5వేల మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తయారయిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు జెన్‌కో వర్గాలు చెబుతున్నాయి. కొత్తగూడెం మండలంలో 4వేల మెగావాట్ల నూతన ప్రాజెక్టుతోపాటు కేటీపీఎస్ విస్తరణను మరో 1040 మెగావాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ఈ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చితే జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో గణనీయమైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. విశేషమేమిటంటే ఈ ప్రాజెక్టులన్నీ సవ్యంగా ఏర్పాటయితే భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సగం జిల్లా నుంచే ఉత్పత్తి కానుంది. అయితే, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి కనీసం నాలుగేళ్లు పడుతుందని అంచనా.
అన్నీ అనుకూలతలే...
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండడమే జిల్లా విద్యుత్ హ బ్‌గా మారేందుకు అవకాశం కల్పించింది. విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్న జిల్లా కావడంతో ప్రభుత్వం ఖమ్మంపై దృష్టి సారించింది. దీంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటే సముద్రతీరం అందుబాటులో ఉండాలి.
తెలంగాణలో సముద్రం లేనందున ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలి. అయితే మచిలీపట్నం పోర్టుకు తెలంగాణలో ఖమ్మం జిల్లానే దగ్గర. ఇక ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు ప్రాంతాల్లో బొగ్గు నిల్వలుండడం, గోదావరి నీరు కూడా అందుబాటులో ఉండడంతో పాటు అవసరమైన మేర ప్రభుత్వ భూమి లభించడం, జిల్లా యంత్రాంగం ఈ భూమి వివరాలను వేగంగా ప్రభుత్వానికి పంపడం.. ఇలా అన్ని సానుకూలతల నడుమ నాలుగేళ్ల తర్వాత ఖమ్మం జిల్లా వెలుగుల జిల్లాగా మారబోతోంది.
8,029 ఎకరాల గుర్తింపు...
తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు జిల్లాలోని కొత్తగూడెం మండలంలో ఏర్పాటు కాబోతోంది. మండలంలోని గునుకుచెలక గ్రామంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న దృష్ట్యా అక్కడ 4వేల మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పడబోతోంది. వాస్తవానికి ఇక్కడ 8,029 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. అయితే, అందులో వెయ్యి ఎకరాలు ఇప్పటికే వివిధ వర్గాలకు ప్రభుత్వం మంజూరు చేసింది. మరో 1700 ఎకరాలు అసైన్‌భూమి ఉంది.
ఈ భూమికి నష్టపరిహారం చెల్లించి మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇక, ప్రభుత్వం గుర్తించిన 8వేలకు పైగా ఎకరాల్లో 2వేల ఎకరాల వరకు అటవీభూమి ఉంది. ఈ భూమిని ప్రాజెక్టుకు కేటాయించడం కష్టమే. అయితే, ఇక్కడ ఉన్న ఒకటి, రెండు సానుకూలతలు ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ భూమి అటవీ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ విషయంలో తుది నోటిఫికేషన్ రాలేదు. అలా రాకుంటే ఆ భూమిని రెవెన్యూకు మార్చేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే తొలి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటుంది.
మరోవైపు ఈ భూమి సేత్వార్‌లో కూడా రెవెన్యూ భూమి అని రాసి ఉండడం ప్రభుత్వానికి కలిసివచ్చే మరో అంశం. ఈ రెండు అంశాల ప్రాతిపదికన ఆ రెండువేల ఎకరాలను కూడా అటవీశాఖ నుంచి తీసేసుకుని గుర్తించిన 8వేలకు పైగా ఎకరాల్లో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కేటీపీఎస్ విస్తరణ 1080 యూనిట్లు...
జిల్లాలో ప్రస్తుతం ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) సామర్థ్యం 1700 మెగావాట్లు. ప్రాజెక్టు ఏడో దశ విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ విస్తరణను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నందున దీనిని నాలుగు యూనిట్లుగా విభజించనున్నారు. ఒక్కో యూనిట్‌ను 270 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 1080 మెగావాట్లుగా ఈ విస్తరణ జరగనుంది. ఇదిలా ఉండగా, మణుగూరు మండలం రామానుజవరంలో కూడా 2వేల ఎకరాలను విద్యుదుత్పత్తికి అనువైన భూమిగా జిల్లా యంత్రాంగం గుర్తించి ప్రభుత్వానికి పంపింది.
అయితే, ఈ భూమి మధ్యలో కొంత ప్రైవేటు భూమితో పాటు కొన్ని నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. ఈ భూమికి పరిహారం చెల్లించి సేకరించేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ప్రస్తుతానికి కీలక విభాగాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పంపాలని జెన్‌కో అధికారులు జిల్లా యంత్రాంగాన్ని కోరినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు కూడా భూసేకరణ సమస్యలు తొలిగితే రామానుజవరంలో కూడా మరో రెండువేల మెగావాట్ల ప్రాజెక్టు వస్తుందని అధికారులు చెపుతున్నారు.
కాంతి గుమ్మం
Published Fri, Sep 12 2014 1:23 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement
Advertisement