Celebrations of Telangana state formation
-
అంబరాన్నంటేలా సంబురాలు
తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి చందూలాల్ ♦ అన్నిచోట్లా పతాక ఆవిష్కరణలు.. ♦ ప్రముఖులకు సన్మానాలు సాక్షి, హైదరాబాద్: అంబరాన్ని అంటేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర అవతరణ పండుగలో భాగస్వాములను చేసేలా సాంస్కృతిక శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలందరూ పండుగ చేసుకునేలా వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక శాఖపరంగా చేపట్టిన ఉత్సవ ఏర్పాట్లను మంత్రి వివరించారు. వివిధ రంగాల్లోని 62 మంది ప్రముఖులను రాష్ట్రస్థాయిలో, 25 మందిని జిల్లా స్థాయిలో ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రపంచానికి చాటేలా ప్రజలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా అన్ని ప్రాంతాల్లో పతాక ఆవిష్కరణలు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా లుంబినీ పార్కులో అమరవీరుల స్మృతివనం, సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండా నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నగరంలో ఖవ్వాలీ, గజల్, ముషాయిరా.. తదితర సంప్రదాయ క ళలతోపాటు కల్చరల్ కార్నివాల్, కవి సమ్మేళనాలు, పేరిణి నృత్యాలు నిర్వహిస్తున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా జరుపుకుంటున్న ఉత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలన్నారు. సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. వారధి తరపున ప్రతి జిల్లాకు సంబంధించిన సంస్కృతిని, సంప్రదాయాన్ని ఆవిష్కరించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. ఉత్సవాల్లో ఫైర్‌వాల్, కల్చరల్ కార్నివాల్, కొరేకల్స్ రేసింగ్, లైట్పార్క్, ఫుడ్ ఫెస్టివల్స్ వంటివి ఏర్పాటు చేశామని సాం స్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బాగా అలంకరించిన నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశం లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా.. లలిత కళా తోరణంలో ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు డప్పులు, డోళ్లు, పేర్ని మహానృత్యం నిర్వహిస్తారు. పీపుల్స్ ప్లాజాలో వివిధ జిల్లాల కళాకారులతో గోండు, కోయ, లంబాడా.. తదితర నృత్య ప్రదర్శనలు, రవీంద్రభారతిలో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నృత్యరూపకం, బాలల నాటిక ‘దీనబాంధవ’, తెలుగు యూనివర్సిటీలో కవి సమ్మేళనం, హరిహర కళాభవన్‌లో బుద్ధిస్ట్, జైన్, క్రిస్టియన్ కార్యక్రమాలు, కిల్వత్ మైదానంలో ఖవ్వాలీ, ఎల్బీ స్టేడియంలో గజల్స్, కులీ కుతుబ్‌షా స్టేడియంలో ముషాయిరా, ఎల్బీనగర్ జగజ్జీవన్‌రామ్ హాల్లో ఫోక్, కల్చరల్ ఈవెంట్స్, హెచ్ఐసీసీలో సాం స్కృతిక కార్యక్రమాలు, ట్యాంక్‌బండ్‌పై, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ, బోనాలు, కోలాటం తదితర ప్రదర్శనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజాం వారసులకు ఆహ్వానం.. అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలంటూ నిజాం వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో భాగంగా కింగ్‌కోఠిలో నివసిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుడు, మునిమనవడు మీర్జా మొహిబ్ బేగ్‌కు సచివాలయం నుంచి ఆహ్వానం అందింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో మీర్జాకు ఏ1 సిరీస్‌లో సీటు కేటాయించింది. కుటుంబసమేతంగా హాజరవ్వా లంటూ ప్రభుత్వం లేఖ పంపినట్టు మీర్జా తెలిపారు. -
అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
► కలెక్టర్లకు సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం ► జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఆదిలాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మండలం, డివిజన్, మున్సిపల్, జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్పోరేషన్ కార్యాలయాల్లో పతాక అవిష్కరణ గావించాలని, ఆసుపత్రులు, వృద్ద ఆశ్రమాలు, సంక్షేమ వసతి గృహాలలో, మున్సిపాలిటీలలో స్వీట్లు పంచాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి ఎంపిక చేసి నగదు బహుమతితో పాటు ఘనంగా సత్కరించాలని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 100 మంది కళాకారులను జూన్ 1న రాత్రి హైదరాబాద్‌కు పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడానికి బాధ్యతలు అప్పగించామని, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు, క్రీడాపోటీలు నిర్వహిస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ సుందర్ అబ్నార్, డీఆర్వో సంజీవరెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, సీపీవో కేశవ్‌రావు, ఎస్‌ఈపీఆర్ శంకర్, అధికారులు పాల్గొన్నారు. అధికారులతో కలెక్టర్ సమావేశం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అవతరణ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు శాఖల వారీగా అప్పగించి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డీఈవో సత్యనారాయణరెడ్డి, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో జలపతి నాయక్, సోషల్ ఫారెస్ట్ అధికారి గోపాల్‌రావు, అధికారులు పాల్గొన్నారు. -
సూరత్‌లో ఘనంగా తెలంగాణ సంబరాలు
సాక్షి, ముంబై: సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్యసమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూరత్‌లోని ప్రతాప్‌నగర్ ప్రాంతంలోగల శ్రీమార్కండేయ మందిరం ప్రాంగణంలో సోమవారం సాయంత్రం వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డుంబాల్ వార్డు తెలుగు కార్పొరేటర్ పి.వి.యస్. శర్మ, ప్రభుత్వ తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాపోలు బుచ్చిరాములు, సూరత్ పద్మశాలి సమాజం కార్యదర్శి అంకం సోమయ్య, శ్రీ మార్కండేయ మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్‌తోపాటు తెలంగాణ ప్రజలు, స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి శర్మ, రాపోలు బుచ్చిరాములు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించడానికి ముఖ్య భూమిక పోషించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. తదుపరి బాణసంచా కాల్చి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దాల కాలంగా ఎదురు చూసిన తెలంగాణ ప్రజల కల సాకారమైందని, తెలంగాణ అంటే నాలుగు అక్షరాలు కాదని, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు. అటువంటి తె లంగాణను సాధించడానికి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, వందలాది అమరవీరుల త్యాగ ఫలితంగా కళ సాకారమై ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరికీ ఎనలేని సంతోషాన్ని కలుగజేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటైతే సొంత రాష్ట్రానికి వెళ్తామనే ఆశ స్థానికుల్లో ఉందని, తమ పిల్లలకు సొంత రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందనే ఆశ ఉందని, అవన్నీ తెలంగాణలో నెరవేరాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి సూరత్‌లో ఉన్న వలస ప్రజలకు మధ్య స్నేహ వారధిగా ఉపయోగపడుతుందనే ఆలోచనతో, సూరత్‌లోని అన్ని వర్గాల ప్రజల సహాయసహకారాలతో సూరత్ తెలంగాణ వలస ప్రజల ఐక్యసమితిని ఏర్పాటు చేశామని, లక్ష్యం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తామని కార్యనిర్వాహకులు మచ్చ వీరన్న, శంకుపెల్లి బుగులాచారి, శ్రీనివాస్ తెలిపారు. వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో... ముంబైలోని వాషి తెలంగాణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుధీర్గ పోరాటంతో తెలంగాణ, అమరవీరుల త్యాగ ఫలితంగా కల సాకారమైందని వాషి తెలంగాణ సమితి అధ్యక్షుడు సైదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్, గిరి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చి అంధేరీలో.. పశ్చిమ అంధేరీలోని కపాస్వాడి ప్రాంతంలో నివసిస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన తెలుగు ప్రజలు సోమవారం సాయంత్రం తెలంగాణ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. గూడ నారాయణగౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డ్యాన్సులు చేస్తూ, రం గులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కె. చంద్రశేఖర్‌గౌడ్, ఎస్. బందయ్య గౌడ్, ఎం. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలను పంచుకుందాం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘బాధ్యతలను పంచుకుందాం.. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం... ఈ ప్రాంత ప్రజల ఆరు దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్రం నేడు సాకారమైంది.. సుదీర్ఘ పోరాటాలు.. ఎందరో అమరుల త్యాగ ఫలితంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది’ అని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మహోద్యమంలో పాల్గొని అమరులైన వారందరికీ జోహార్లు అర్పించారు. ప్రజల చిరకాల వాంఛ సాకారమైనందున తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌కు, ఆయన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనులకు తెలంగాణ పుట్టినిల్లని, భిన్నజాతులు, కులాలు, వేషభాషలు, సంస్కృతి కలిగిన ప్రజలు ఉన్నారని చెప్పారు. కృష్ణ, గోదావరి, మానేరు, మంజీరా, మూసీ వంటి ఎన్నో నదులు, వాగులు, సహజ వనరులు కలిగిన ఈ ప్రాంతంలో కాకతీయులు తవ్వించిన చెరువులు ఇప్పటికీ రైతుల పాలిట కల్పతరువుగా ఉన్నాయని వివరించారు. అపార ఖనిజ నిల్వలు ఈ ప్రాంతానికి సొంతమని, చేనేత, శిల్పకళ, వెండి నగిషీలు, చిత్రకళ వంటి కళారూపాలు తెలంగాణకు గొప్ప కీర్తిని తెచ్చాయని అన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపాలని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు, ఆలంపురం నుంచి కోటిలింగాల వరకు ఎన్నో దేవాలయాలు పురాణ ప్రసిద్ధి పొందాయని తెలిపారు. దేశమంతటా తమ గొంతుకలు వినిపించిన వేద ఘనాపాటీలు తెలంగాణలో ఉన్నారన్నారు. పలు చారిత్రక కారణాలతో ఈ ప్రాంతం కొంతకాలం పరాయి పాలనలో ఉందని, స్వాతంత్య్రానంతరం నిజాం ప్రభుత్వం నుంచి విమోచనకు ఈ ప్రాంత వాసులు కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించారని గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా అవతరించిందని, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిందని చెప్పారు. తిరిగి 1969లో తెలంగాణ ఉద్యమం రూపుదాల్చిందని, ఆ పోరాటంలో 400 మంది అమరులయ్యారని తెలిపారు. అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయన్నారు. 2001లో కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం ప్రారంభమైందని.. నాటినుంచి నేటివరకు జరిగిన పరిణామాలను సోదాహరణంగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లాకు విశిష్టస్థానం ఉందని, ఉద్యమాల ఖిల్లాగా ఖ్యాతిని ఆర్జించిందని తెలిపారు. 1969లో అన్నాబత్తుల రవీంద్రనాధ్ తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టి ఉద్యమానికి పురుడు పోశారని అన్నారు. ఈ దీక్షతో కవులు, రచయితలు, మేథావులు, కళాకారులు, ఉద్యోగులు, సకలజనులు ఒక్కటై ముందుకు కదిలారని తెలిపారు. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చేనేత, పాడి పరిశ్రమ, బొగ్గు గనులు, విద్యుత్, శిల్ప, స్వర్ణకారుల పరిశ్రమ ఎదగడానికి ఇక్కడ వనరులు ఉన్నాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు నిబద్ధతతో సేవలందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రముఖ స్థానంలో నిలబెట్టేందుకు పూర్తి సహకారం అందించాలన్నారు. కాళోజీ, జయశంకర్ సార్లను స్మరించుకుంటూ ఆదర్శవంతమైన తెలంగాణగా తయారు చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లాలోని అన్ని వర్గాల వారికి ఆయన అభినందనలు తెలిపారు. జేసీ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది చిరకాల స్వప్నం నెరవేరిందని, ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఎందరో త్యాగధనులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ పక్షాల కృషితో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పాల్వంచలో త్వరలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు కు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో బొగ్గుగనులు, హెవీవాటర్ ప్లాంట్, గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అడవులు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందుండేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రణాళికలు రచించుకుని ఆ దిశగా పనిచేయాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సుకు అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలు సాగవుతాయని, ఆ దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాకు రెండు నెలల్లో స్టీల్ ప్లాంట్ వస్తుందని, రూ.30 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చెప్పారు. దీంతో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది రూ.30 లక్షల విలువైన స్టీలు వస్తుందన్నారు. రెండు, మూడేళ్లలో స్టీల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు, రాజీవ్ యువశక్తి లబ్ధిదారులకు క లెక్టర్ రుణాలు అందజేశారు. ఇంకా ఈ సభలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రా జేందర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వర్రావు తదితరులు ప్రసంగించగా, వివిధ శాఖల అధికారులు, జిల్లా ప్రముఖలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.