అంబరాన్నంటేలా సంబురాలు
తెలంగాణ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి చందూలాల్
♦ అన్నిచోట్లా పతాక ఆవిష్కరణలు..
♦ ప్రముఖులకు సన్మానాలు
సాక్షి, హైదరాబాద్: అంబరాన్ని అంటేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర అవతరణ పండుగలో భాగస్వాములను చేసేలా సాంస్కృతిక శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలందరూ పండుగ చేసుకునేలా వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక శాఖపరంగా చేపట్టిన ఉత్సవ ఏర్పాట్లను మంత్రి వివరించారు. వివిధ రంగాల్లోని 62 మంది ప్రముఖులను రాష్ట్రస్థాయిలో, 25 మందిని జిల్లా స్థాయిలో ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.
సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రపంచానికి చాటేలా ప్రజలు నిర్వహించుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా అన్ని ప్రాంతాల్లో పతాక ఆవిష్కరణలు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా లుంబినీ పార్కులో అమరవీరుల స్మృతివనం, సంజీవయ్య పార్కులో అతిపెద్ద జాతీయ జెండా నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నగరంలో ఖవ్వాలీ, గజల్, ముషాయిరా.. తదితర సంప్రదాయ క ళలతోపాటు కల్చరల్ కార్నివాల్, కవి సమ్మేళనాలు, పేరిణి నృత్యాలు నిర్వహిస్తున్నామన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా జరుపుకుంటున్న ఉత్సవాల స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలన్నారు.
సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. వారధి తరపున ప్రతి జిల్లాకు సంబంధించిన సంస్కృతిని, సంప్రదాయాన్ని ఆవిష్కరించేలా కార్యక్రమాలను రూపొందించామన్నారు. ఉత్సవాల్లో ఫైర్‌వాల్, కల్చరల్ కార్నివాల్, కొరేకల్స్ రేసింగ్, లైట్‌పార్క్, ఫుడ్ ఫెస్టివల్స్ వంటివి ఏర్పాటు చేశామని సాం స్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బాగా అలంకరించిన నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశం లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ తదితరులున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా..
లలిత కళా తోరణంలో ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు డప్పులు, డోళ్లు, పేర్ని మహానృత్యం నిర్వహిస్తారు. పీపుల్స్ ప్లాజాలో వివిధ జిల్లాల కళాకారులతో గోండు, కోయ, లంబాడా.. తదితర నృత్య ప్రదర్శనలు, రవీంద్రభారతిలో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ నృత్యరూపకం, బాలల నాటిక ‘దీనబాంధవ’, తెలుగు యూనివర్సిటీలో కవి సమ్మేళనం, హరిహర కళాభవన్‌లో బుద్ధిస్ట్, జైన్, క్రిస్టియన్ కార్యక్రమాలు, కిల్వత్ మైదానంలో ఖవ్వాలీ, ఎల్బీ స్టేడియంలో గజల్స్, కులీ కుతుబ్‌షా స్టేడియంలో ముషాయిరా, ఎల్బీనగర్ జగజ్జీవన్‌రామ్ హాల్‌లో ఫోక్, కల్చరల్ ఈవెంట్స్, హెచ్‌ఐసీసీలో సాం స్కృతిక కార్యక్రమాలు, ట్యాంక్‌బండ్‌పై, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతుకమ్మ, బోనాలు, కోలాటం తదితర ప్రదర్శనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నిజాం వారసులకు ఆహ్వానం..
అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలంటూ నిజాం వారసులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో భాగంగా కింగ్‌కోఠిలో నివసిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుడు, మునిమనవడు మీర్జా మొహిబ్ బేగ్‌కు సచివాలయం నుంచి ఆహ్వానం అందింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఉత్సవాల్లో మీర్జాకు ఏ1 సిరీస్‌లో సీటు కేటాయించింది. కుటుంబసమేతంగా హాజరవ్వా లంటూ ప్రభుత్వం లేఖ పంపినట్టు మీర్జా తెలిపారు.