
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చారిత్రక, పురావస్తు అంశాలపై జరిగే పరిశోధనలు పర్యాటక రంగానికి కొత్తశోభను తెస్తున్నాయని పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ అన్నారు. పరిశోధకులు గుర్తించిన అంశాలను వెలుగులోకి తేవటం ద్వారా పర్యాటకుల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు జరిగే అంతర్జాతీయ పురావస్తు సదస్సును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. సదస్సుల్లో సమర్పించే పరిశోధనాపత్రాల వల్ల తెలంగాణలోని చారిత్రక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోని వారసత్వ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొత్త చట్టాన్ని కూడా తెచ్చిందని ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్‌శర్మ తెలిపారు.
గత సంవత్సరం నిర్వహించిన మొదటి అంతర్జాతీయ సదస్సుకు మంచి స్పందన రావటంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఇందులో 450 పరిశోధనా పత్రాలు దాఖలు కాగా, సమయాభావం వల్ల కొన్నింటినే ఎంపిక చేశామన్నారు. మూడో సదస్సును మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. గతంలో చరిత్రకు వక్రభాష్యం చెప్పారని, తెలంగాణలో లభించిన నాణేల వల్ల ఈ ప్రాంతం ప్రత్యేకత జనబాహుళ్యంలోకి వెళ్లిందని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. తెలంగాణ చారిత్రక, పురావస్తు ప్రాధాన్య ప్రాంతాలకు నెలవని ప్రభుత్వ సలహాదారు పాపారావు అన్నారు. కార్యక్రమంలో హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ విశాలాచ్చి, అధికారులు రంగాచార్యులు, రాములునాయక్, నాగరాజు, పద్మనాభ, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మూడు సెషన్లలో 16 మంది పరిశోధనాపత్రాలను సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment