
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు.
ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు.