Nationalism
-
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్‌లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్‌లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్‌లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
జాతీయవాదమా? జాతీయోన్మాదమా?
ఇవాళ వ్యక్తులుగా పౌరులూ, సమాఖ్యలో భాగంగా ఉన్న రాష్ట్రాలూ తమ హక్కులను కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయవాదం పేరుతో జాతీయోన్మాదాన్ని పాలకులు ప్రేరేపిస్తున్నారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తున్నారు.రాజకీయ వ్యతిరేకతను, పౌర సమాజంలో భిన్నాభిప్రాయాలను కలిగివుండి, పాలనను విమర్శించే ప్రతి ఒక్కరినీ ప్రస్తుత భారత పాలక వ్యవస్థ తరచుగా దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించింది. ఈ ద్వేషభావం... అసలు జాతీయవాదం అంటే ఏమిటి, నిజమైన జాతీయవాది ఎవరు అనే మౌలిక ప్రశ్నలను లేవనెత్తింది. జాతీయవాదం అనే పదం విభిన్న రాజకీయ తత్త్వశాస్త్రాల ద్వారా ప్రత్యేకంగా గుర్తించబడింది.జాతీయవాదంపై వలసవాద వ్యతిరేక దృక్పథం... కుల, మత, వర్గ, ప్రాంతీయ అనుబంధాలతో సంబంధం లేకుండా నిర్దిష్ట రాజకీయ భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ తప్పనిసరిగా కలుపుతుంది. శక్తిమంతమైన వలస పాలకుల నుండి భార తదేశం విముక్తి పొందేందుకు అటువంటి జాతీయవాద దృక్పథం చాలా అవసరం. ఆ విధంగా, స్వాతంత్య్ర పోరాటంలో అందరినీ కలుపుకొని పోవడం వల్ల జాతీయవాదపు రాజ్యాంగ దార్శనికత అభివృద్ధి చెందింది. ఇతర సంకుచిత గుర్తింపుల కన్నా మిన్నగా అది పౌరుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తుంది.మతం లేదా జాతి వంటి వివాదాస్పద పరిగణనలపై ఆధారపడిన జాతీయవాద విభజన దృక్పథం తన లోపలే ఒక శత్రువును కనుగొంటుంది. విభజించి పాలించే వలస రాజ్యాల ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకున్న బ్రిటిష్ వలసవాద వారసత్వపు కమ్యూనల్ అవార్డు చరిత్ర దృష్ట్యా, భారతదేశంలోని మతపరమైన మెజారిటీ శక్తులు ఇప్పుడు ముస్లింలను లోపలి శత్రువుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్ వంటివి సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ విభజిత ఎన్నికల చర్చలో ఆధిపత్యం చలా యించాయి. కానీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఇతర జీవనోపాధి సమస్యలు దాని పాలనను సవాలు చేశాయి.జాతీయవాదపు వలసవాద వ్యతిరేక దృక్పథంలోని మరొక కోణం ఏమిటంటే... వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడమే! నిజానికి, భారత రాజ్యాంగం, దానిలోని అనేక నిబంధనలు, దేశ న్యాయశాస్త్రం అనేవి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎల్లప్పుడూ ఆధునిక భారత జాతీయవాదపు కొనసాగుతున్న ఇతివృత్తంగా సమర్థించాయి. దేశం దైవపరిపాలనచే నడుస్తోందనే దృష్టి కోణం ఉద్దేశపూర్వకంగా దేశం, దాని ప్రజల సజాతీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ద్వారా వైవిధ్యాన్ని అణిచివేస్తుంది. జాతీయతలోని అనేక ఉపజాతి విధేయతలు తప్పనిసరిగా పరస్పర విరుద్ధమైనవి కానప్పటికీ, వాస్తవానికి అవి పరి పూర్ణమైనవి అనే వాస్తవాన్ని గుర్తించడానికి ఇది నిరాకరిస్తుంది. ఉదాహరణకు, భాషాపరమైన గుర్తింపులు జాతీయ గుర్తింపుతో విభేదించాల్సిన అవసరం లేదు. స్వాతంత్య్ర పోరాటం భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పోరా టాన్ని హృదయపూర్వకంగా స్వీకరించింది, దాని చట్టబద్ధ మైన ప్రజాస్వామ్య స్వభావాన్ని గుర్తించింది. కానీ, భిన్న త్వానికి విరుద్ధమైన వారు విస్తృతమైన జాతీయ గుర్తింపు పేరుతో సమాజంపై ఏకరూప దృక్పథాన్ని రుద్దడానికి ప్రయ త్నిస్తారు. ఒక దేశం – ఒకే మార్కెట్, ఒక దేశం – ఒకటే భాష, ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు, ఒక దేశం – ఒకటే పన్ను అలాంటి అసహన ప్రయత్నాలకు ఉదాహరణలు. ప్రస్తుత పాలక జాతీయవాద కథనం ప్రజల సామాజిక, ఆర్థిక శ్రేయస్సుతో కూడిన చిహ్నాలతో దేశం గురించిన నైరూప్య ఆలోచనను స్పృహతో ప్రోత్సహిస్తుంది. సాంఘిక, ఆర్థిక అసమానతలను సాధారణ మనిషికి హాని కలిగించేలా చేస్తుంది. కార్పొరేట్ సంపదలో పెరుగుదలను అసహజమైన అసమానతలపై జాతీయ గర్వకారణంగా చూపుతుంది. ఈ దృక్పథం అంతిమంగా కులం, వర్గం, అటువంటి ఆధిపత్య ధోరణులన్నింటినీ శాశ్వతంగా కొనసాగించే లక్ష్యానికే ఉపయోగపడుతుంది.జాతీయవాదానికి సంబంధించి పైన పేర్కొన్న వక్రీకృత దృక్పథం స్వభావం ఏమిటంటే, ప్రక్రియ దిద్దు బాటును ప్రభావితం చేసే లక్ష్యంతో వాస్తవికతపై విమర్శనాత్మక ప్రశంసలను నిరోధిస్తూనే, గతం లేదా వర్తమానాన్ని విమర్శారహితంగా కీర్తించడం! అటువంటి విమర్శనాత్మక దృక్పథాన్ని వృత్తిపరమైన నిరాశా వాదంగా కొట్టివేయడం జరుగుతుంది. కానీ, ఇది యథాతథ స్థితిని మాత్రమే ప్రోత్సహిస్తుంది. దేశ పురోగతిని అడ్డుకుంటుంది. నిరంకుశ జాతీయవాద ఉద్దేశ్యం స్వార్థ ప్రయోజనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. అందు వల్ల, భారతదేశ నాగరికత వారసత్వంగా ఉన్న వాదనా విధానం అణచివేయబడింది. దేశద్రోహం వంటి ప్రాచీన చట్టాల బలిపీఠం వద్ద వాక్ స్వాతంత్య్రాన్ని త్యాగం చేశారు. భిన్నాభిప్రాయాలను దేశ వ్యతిరేకమైనవిగా ముద్ర వేస్తారు. పౌర హక్కులు, స్వేచ్ఛ వంటివి జాతీయవాద ప్రాజెక్టుకు సహించరానివిగా చిత్రీకరించబడ్డాయి. నిజమైన జాతీయవాదం దాని సొంత గుర్తింపును మాత్రమే ప్రోత్సహిస్తుంది, ఆత్మగౌరవాన్ని వేడుక చేసు కుంటుంది. కానీ, జాతీయోన్మాదం బలవంతంగా, అసంకల్పితంగా అటువంటి స్వీయ అహంకారాన్ని దాని పౌరులపై మోపుతుంది. అటువంటి జాతీయోన్మాదాన్ని ప్రశ్నించే ఎవరైనా దేశం పట్ల అసంతృప్తిని ప్రదర్శించే వ్యక్తిగా పరిగణించబడతారు. నిజానికి అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో ఓ అంతర్భాగం. కానీ, మెజారిటీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించే సామాజిక, రాజకీయ శక్తులు చట్టబద్ధమైన జాతీయ గర్వాన్ని తగినంతగా ప్రకటించనప్పుడు జాతీయోన్మాదం విశ్వసనీయతను పొందుతుంది. ఆధునిక భారతీయ జాతీయవాదాన్ని ప్రజాస్వామ్యం, భాష, మతపరమైన బహుళత్వం, వైవిధ్యం, సమాఖ్యవాదం, లౌకికవాదం, సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మొదలైన రాజ్యాంగ విలువలపై తిరుగులేని నిబద్ధతతో నిర్వచించాలి. అందువల్ల రాజ్యాంగ జాతీయవాదం ఆధునిక ప్రజాస్వామ్యాలలో అభివృద్ధి చెందిన పౌరసత్వ భావనపై కేంద్రీకృతమై ఉంది. దీనికి విరుద్ధంగా, విభజన గుర్తింపులపై ఆధారపడిన జాతీయవాదం... రాజ్యాంగవాదానికి వ్యతిరేక సిద్ధాంతం. అందువల్ల, మెజారిటీ గుర్తింపుపై ఆధారపడిన జాతీయవాద కథానాయకుడు రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణాన్ని ద్వేషిస్తాడు. అటువంటి మెజారిటీ జాతీయ వాదం అసంపూర్తిగా ఉన్న ప్రజాస్వామిక ప్రాజెక్టులో కొనసాగుతున్న సామాజిక దోష రేఖలను ఉపయోగించు కోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది.అంబేద్కర్ ‘రాజ్యాంగ నైతికత అనేది సహజమైన భావన కాదు, ఎవరికి వారు పెంపొందించుకోవాల్సినది’ అని గమనించారు. అందువల్ల, మెజారిటీ జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాటం కేవలం నైతిక లేదా నైతిక విమర్శ కాదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో నేటికీ కొనసాగుతున్న సామాజిక లోపాలను సరిదిద్దడానికి కఠిన ప్రయత్నం అవసరం. కొందరిని అతి శక్తిమంతుల్ని చేసే ఘనత వహించిన జాతీయవాదంపై తద్వారానే పోరాడ వచ్చు. కానీ జాతీయవాదపు లౌకిక, ఉదారవాద విమర్శ మెజారిటీ జాతీయవాద సాంస్కృతిక అంశాలపై దృష్టి పెడుతోంది. అసలు జాడ్యాన్ని విడిచిపెట్టి, దాని లక్షణాలపై మాత్రం ఇలాంటి పోరాటం చేస్తే, అది స్వీయ ఓటమినే మిగులుస్తుంది. దానికి బదులు అటువంటి వక్రీకృత జాతీయవాద ప్రపంచ దృక్పథానికి జవజీవాలను అందించే సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోష రేఖలకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగించడమే మార్గం. ప్రొ‘‘ కె నాగేశ్వర్ వ్యాసకర్త ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోంది:అదానీకి హిండెన్‌బర్గ్ కౌంటర్
సాక్షి,ముంబై: అదానీ గ్రూప్-అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ వివాదం మరింత రాజు కుంటోంది. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానికి హిండెన్‌బర్గ్ సోమవారం తిరిగి కౌంటర్ ఇచ్చింది. జాతీయవాదం పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని, చైర్మన్ గౌతం అదానీ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందంటూ దుయ్యబట్టింది. వారి సమాధానంతో ఏకీభవించడం లేదని, అసలు చాలా ప్రశ్నలకు సమాధానమే చెప్పలేదని హిండెన్‌బర్గ్ వాదించింది. Our Reply To Adani: Fraud Cannot Be Obfuscated By Nationalism Or A Bloated Response That Ignores Every Key Allegation We Raisedhttps://t.co/ohNAX90BDf — Hindenburg Research (@HindenburgRes) January 30, 2023 దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటోందని ఆరోపించింది. భారత దేశం శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశమని, అది సూపర్ పవర్‌గా ఎదుగుతోందని, కానీ అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు జాతీయవాదం లేదా తాము లేవనెత్తిన ప్రతి ప్రధాన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కప్పిపుచ్చి మోసాన్ని అడ్డుకోలేరంటూ స్పందించడం గమనార్హం. (రానున్న బడ్జెట్ సెషన్లో అదానీ గ్రూప్ vs హిండెన్‌బర్గ్ సునామీ?) -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
పదిరోజుల్లో జ్ఞానవాపి మసీదు సర్వే
చారిత్రక స్థలాల్లో వివాదం మెజార్టీ ప్రజల్లో జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుందని గుర్తించిన బీజేపీ అందుకు తగినట్లు పావులు కదుపుతోంది. బీజేపీ ప్రణాళికలో భాగంగా అయోధ్యతో ఆరంభమైన అడుగులు తాజాగా వారణాసి వైపు మరలాయి. స్థానిక కాశీ విశ్వనా«థ మందిరం– జ్ఞానవాపి మసీదు వివాదంలో మరో సంచలన తీర్పునకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మసీదు కమిటీ అభ్యంతరాలను పక్కనబెట్టిన స్థానిక కోర్టు మసీదులో సర్వే పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదే శించింది. ఇక తదుపరి న్యాయపోరాటం మధుర శ్రీకృష్ణ జన్మస్థలంపై జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తాజ్‌మహల్‌లో సర్వేకు అయోధ్య బీజేపీ చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించడం గమనార్హం. వారణాసి: జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియోగ్రఫీని నిర్వహించేందుకు నియమించిన అడ్వొకేట్ కమిషనర్‌ను తొలగించాలన్న విజ్ఞప్తిని స్థానిక కోర్టు తోసిపుచ్చింది. జ్ఞానవాపి– శ్రీంగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వేను పదిరోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఈ పని కోసం ఇప్పటికే నియమించిన అడ్వొకేట్ కమిషనర్‌కు సాయంగా మరో ఇద్దరు లాయర్లను జిల్లా కోర్టు నియమించింది. ఈ మొత్తం ప్రక్రియను ఎవరు అడ్డుకున్నా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గత ఆదేశాలకు అనుగుణంగా సర్వే పూర్తి చేయాల్సి ఉండగా మసీదు కమిటీ ఈ పనిని అడ్డుకుంది. మసీదులో సర్వే, వీడియో తీయడాన్ని వ్యతిరేకించింది. కోర్టు నియమించిన కమిషనర్ పక్షపాతం చూపుతున్నాడని మసీదు కమిటీ కోర్టులో అభ్యంతరాలు తెలిపింది. దీంతో సర్వే పనులు ఇటీవల నిలిచిపోయాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ దివాకర్ సదరు అభ్యంతరాలను కొట్టివేశారు. బేస్మెంట్లలో కూడా సర్వే: ఇప్పటికే నియమించిన అడ్వొకేట్ కమిషనర్ అజిత్ కుమార్ మిశ్రాకు సాయంగా విశాల్ సింగ్‌ను స్పెషల్ కమిషనర్‌గా, అజయ్ ప్రతాప్ సింగ్‌ను సహాయ కమిషనర్‌గా కోర్టు నియమించింది. మిశ్రాను తొలగించాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ ముగ్గురూ కలిసి సర్వేపనులు పూర్తి చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జ్ఞానవాపి మసీదు అంతర్భాగంలో వీడియో తీయాలని కోర్టు ఆదేశించినట్లు హిందూ పిటిషనర్ల న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. మసీదుకు చెందిన రెండు బేస్మెంట్లకు తాళాలున్నాయని మసీదు మేనేజ్మెంట్ కోర్టుకు తెలియజేసింది. వీటిలో వీడియో తీయడానికి అభ్యంతరం చెప్పింది. అయితే తాళాలు లేకపోతే పగలకొట్టి సర్వే పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిందని మదన్ మోహన్ చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి అడ్డంకులు కలిగించినవాళ్లను అదుపులోకి తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించిందన్నారు. దీంతో ఇకపై ప్రతిరోజూ ఉదయం 8– 12 మధ్య ఈ సర్వేను పూర్తయ్యేవరకు నిర్వహిస్తారు. మంగళవారం సర్వే ఎంతవరకు జరిగిందని కోర్టుకు నివేదిక సమర్పిస్తారు. కోర్టు తీర్పు అన్యాయమని, అప్పీలుకు వెళ్తామని మసీదు కమిటీ తెలిపింది. ఇలా మొదలైంది.. మసీదు గోడ వద్ద ఉన్న గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని, వీటిని ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని రాకీసింగ్తో పాటు నలుగురు మహిళలు 2021లో స్థానిక కోర్టునాశ్రయించారు. ఇప్పటివరకు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఈ పూజలకు అనుమతిస్తున్నారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు వీడియో సర్వేకు గతనెల ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మే 6న వీడియో సర్వే ఆరంభించారు. అయితే సర్వే కోసం నియమించిన మిశ్రాను తొలగించాలని మసీదు కమిటీ కోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా మసీదులోపల వీడియో తీయమని కోర్టు ఆదేశించలేదని, కేవలం ఛబుత్రా ప్రాంతానికే వీడియో సర్వే పరిమితమని అడ్డుకుంది. శుక్రవారం మిశ్రా ఈప్రాంతంలో ఒక సర్వే నిర్వహించారు. ఈ సమయంలో ఇరుపక్షాల నుంచి పెద్ద ఎత్తున గుమికూడి నినాదాలిచ్చారు. ప్రార్థనా స్థలాల చట్టం వర్తిస్తుందా? ప్రార్థనా స్థలాల చట్టం– 1991 ప్రకారం 1947 తర్వాత ఏ స్థలంలో ఏ ప్రార్థనాస్థలం ఉంటే అదే కొనసాగుతుందని, సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ వాదిస్తోంది. జ్ఞానవాపి మసీదులో కోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామని తెలిపింది. రామజన్మభూమి తీర్పు తర్వాత ఏ ప్రార్థనాస్థలంలోనైనా మార్పులకు కోర్టులు ఆదేశిస్తే, సుప్రీంకోర్టు రామజన్మభూమి తీర్పును అతిక్రమించినట్లేనని పేర్కొంది. అయితే సదరు స్థలం మసీదు లేదా దేవాలయం అని తేలిన తర్వాతే ఆ స్థలానికి ప్రార్థనా స్థలాల చట్టం వర్తిస్తుందని హిందువుల తరఫు న్యాయవాదులు చెప్పారు. 1936 నుంచి ఈ స్థలంపై ఇరుపక్షాల మధ్య కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. 1991 కేసులో సైతం సదరు చట్టం గురించి ప్రస్తావన వచ్చింది. ఇక్కడ మసీదును గుడిపై కట్టినందున సదరు చట్టం వర్తించదని అప్పట్లో హిందువుల తరఫు న్యాయవాదులు వాదించారు. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరి నిలిచిపోయింది. భద్రతపై ఆందోళన ‘‘చిన్న సివిల్ కేసును అసాధారణ కేసుగా మార్చారు. దీంతో అంతటా భయోత్పాత వాతావరణం నెలకొంది. చివరకు నా భద్రతపై నా కుటుంబసభ్యులు, వారి భద్రతపై నేను ఆందోళనపడుతున్నాము. ఇంటి నుంచి బయటకు వస్తే నాకేం జరుగుతుందోనని నా భార్య భయపడుతోంది’’ – జస్టిస్ రవి కుమార్ దివాకర్ తాజ్‌పై పిల్ కొట్టివేత సాక్షి, న్యూఢిల్లీ: తాజ్‌మహల్ చరిత్రపై నిజ నిర్థారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తాజ్ ఆవరణలోని మూసి ఉన్న 22 గదుల కారణంగా తన చట్టబద్ధ హక్కులకు భంగం ఎలా వాటిల్లుతోందో వివరించడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్‌దారు చెబుతున్నట్లుగా ఆర్టికల్–226 ఈ అంశంలో వర్తించదని స్పష్టం చేసింది. శివాలయం ఉన్న తేజో మహాలయను తాజ్‌మహల్‌గా మార్చారని, దాంట్లోని 22 గదుల సమాచారం తెలపాలని ఆదేశాలివ్వాలంటూ బీజేపీ అయోధ్య విభాగం మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజ్నీష్ సింగ్ వేసిన పిల్‌ను గురువారం జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయమై ఆగ్రా జిల్లా కోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ ఉందని, తాజా పిల్ ఈ కోర్టు పరిధిలోని కాదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకొని ‘‘తాజ్‌ను షాజహాన్ నిర్మించలేదని అంటారా? ఎవరు కట్టారు? వయసెంత? అని తీర్పు ఇవ్వడానికి మేమున్నామా.. మీరు నమ్మే చారిత్రక వాస్తవాల్లోకి మమ్మల్ని తీసుకెళ్లొద్దు. నిజాలు తెలుసుకోవాలంటే వెళ్లి పరిశోధన చేయండి.. ఎంఏ, పీహెచ్డీ చేయండి.. ఏదైనా సంస్థ/వర్సిటీ నిరాకరిస్తే అపుడు కోర్టుకు రావొచ్చు’’అని వ్యాఖ్యానించింది. పిల్కున్న ఉద్దేశాన్ని అపహాస్యం చేయొద్దని పేర్కొంది. పిల్‌ను వెనక్కి తీసుకుని, మరో పిటిషన్ వేస్తామంటూ చేసిన వినతిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. -
జాతీయవాదానికి ఊతమిచ్చింది ఇంగ్లిషే
భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ బ్రిటిష్ వారితో పోరాటంలో ఆనాడు కీలక పాత్రను పోషించారు. శతాబ్దాలుగా విద్యకు దూరమైపోయిన శూద్ర, దళితులకు తక్కువ స్థాయిలో అయినా సరే ఇంగ్లిష్ విద్య అందిన నేపథ్యంలోనే జాతీయవాద భావన దేశంలో మోసులెత్తింది. కానీ నెహ్రూవియన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్‌కు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత భారత జాతి భావన ప్రత్యేకించి 19వ శతాబ్దం మధ్యనుంచి మాత్రమే చైతన్య పూరితంగా నిర్మితమవుతూ వచ్చింది. కచ్చితంగానే అంతకు ముందు మనకు జాతిభావన లేదు. మనం నివసిస్తూ వచ్చిన ప్రస్తుత భూభాగం కోసమే ఆధునిక భారత జాతి అనే స్పష్టమైన రేఖకు సంబంధించిన బెంచ్ మార్క్ వ్యవస్థాపితమైంది. బ్రిటిష్ వలస పాల కులకు వ్యతిరేకంగా భారతీయుల ప్రప్రథమ తిరుగుబాటు 1857లోనే జరిగింది. మరి ఆనాడు ఆ తిరుగుబాటును ప్రేరేపించి, అమలు పర్చడానికి తమ భౌతిక, మానసిక శక్తిని వెచ్చించిన శక్తులు ఏవి? బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తి నియంత్రణ నుంచి భూభాగాన్ని కాపాడటానికి తమ భౌతిక శక్తి ద్వారా దోహదం చేసిన శక్తులు ప్రధా నంగా శూద్రులు, దళితులు, ఆదివాసీల్లోనే రూపుదిద్దుకున్నాయి. బ్రిటిష్ సైన్యంలోని వివిధ రెజిమెంట్లలో శూద్రులు, దళిత రైతాంగం, వారి పిల్లలు లేకుండా ఉంటే, 1857 తిరుగుబాటు సాధ్యమయ్యేదే కాదు. వేదాలు, రామాయణం, మహాభారతం వంటి బ్రాహ్మణ పుస్త కాలను పోలిన చరిత్ర రాసిన ఆర్ఎస్ఎస్, హిందుత్వ లేదా వామపక్ష ఉదార ద్విజ రచయితలు కానీ.. ఆవు, పంది కొవ్వు వంటి సెంటి మెంట్లు కానీ ఆనాటి తిరుగుబాటుకు బాధ్యులు కారు. బ్రిటిష్ పన్నుల వ్యవస్థ పీడన, బ్రిటిష్ వలసవాద ప్రభుత్వానికి జీతం రాళ్లకోసం పనిచేస్తూ వచ్చిన అనేక మంది ద్విజ అధికారులతోపాటు, బ్రిటిష్ అధికారులు కలిసి సాగించిన దోపిడీనే... రైతు కమ్యూనిటీలు గ్రామస్థాయి నుంచి తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాయి. బ్రిటిష్ ప్రభుత్వం కోసం ఆ రోజుల్లో ఏ శూద్ర, దళిత, ఆదివాసీ అధికారులూ పనిచేసిన చరిత్ర లేదు. బ్రిటిష్ వారు ఇక్కడికి రాక ముందే మొఘల్ పాలనలోకూడా ముస్లిం అధికారులతోపాటు, ద్విజులు (ప్రధానంగా బ్రాహ్మణులు, కాయస్థులు, ఖాత్రిలు) మాత్రమే అధికారులుగా పనిచేశారు. ముస్లిం రాజరిక పాలన పొడ వునా బనియాలు గ్రామ, పట్టణ స్థాయిలో వ్యాపార కార్యకలాపాల్లో కొనసాగుతూ వచ్చారు. బ్రిటిష్ పాలనలో కూడా వీరు తమ వృత్తికే పరిమితమయ్యారు. వర్ణధర్మ నియమాలను ధిక్కరించి శూద్రులను, దళితులను, ఆదివాసులను విద్యావంతులుగా చేయలేకపోయారు కాబట్టే ఈ మూడు విభాగాలకు చెందినవారు ఆనాడు ప్రభుత్వ ఉద్యో గాల్లోకి అసలు ప్రవేశించలేకపోయారు. భారతదేశంలో అతిపెద్ద మానవ జనాభా శూద్రులదే. భారత రాజ్యాంగ ప్రవేశికలో భారత్ అని పేర్కొన్న పదంలో అధిక భాగం శూద్రులకే వర్తిస్తుంది. వీరు జాతి రక్తమాంసాలుగా నిలిచారు. జాతి మొత్తం శారీరకంగా, మేధోపరంగా ఒక్కటై మానవతావాద తాత్విక పునాదిపై నిలిచి పోరాట రూపాలను, పద్ధతులను రూపొందిం చుకున్నప్పుడే దురాక్రమణ శక్తి నుంచి మన భూభాగాన్ని చేజిక్కిం చుకోవడం సాధ్యపడుతుంది. అప్పుడు మాత్రమే విదేశీ బంధనాల నుంచి మన భూభాగం విముక్తి చెంది జాతిగా మనగలుగుతుంది. విద్యాహక్కుకు దూరమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలు అలాంటి కీలక పాత్రనే ఆనాడు పోషించారు. కానీ, బ్రిటిష్ పాలనాయంత్రాంగం తన పాలన చివరి దశాబ్దాల్లో స్కూల్ విద్యను శూద్ర, దళిత, ఆదివాసీలకు తెరిచి ఉంచింది. దీనివల్లే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బీఆర్ అంబేడ్కర్ మొట్టమొదటి శూద్ర, దళిత మేధావులుగా ఆవిర్భవించి, వెయ్యేళ్లకు పైబడిన పురాతన వర్ణధర్మ దోపిడీని, కుల అణచివేతను సవాలు చేయగలిగారు. ఈ కమ్యూనిటీల సజీవ చరిత్రలో తొలిసారిగా విద్యా వంతులైన మేధావులు ఇంగ్లిష్‌ని చదవడం, రాయడం, అర్థం చేసు కోవడం సాధించగలిగారు. ఇక్కడే వారి తొలి విముక్తి మార్గం ఆరంభ మైంది. కానీ నెహ్రూవియన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ద్వంద్వ విద్య (ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యకు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలకు పట్టం కట్టడం) వల్లే శూద్రుల, దళితుల విముక్తి మార్గం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. ఇందువల్లే మన దేశంలోని ఉత్పాదక శక్తులు ఇప్పుడు జీవితంలోని అన్ని రంగాల్లోనూ అసమాన అస్తిత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్రిటిష్ ఇండియన్ ఇంగ్లిష్ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల పాలక భాషగా 1835లో రూపుదిద్దుకున్న సమయానికి, శూద్ర, దళిత, ఆదివాసీలు విద్యావ్యవస్థకు పూర్తిగా అవతలే ఉండిపోయారు. 1817లో కలకత్తాలో తొలి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభించిన తర్వాత, ఆ వలస భాషకూడా అప్పటివరకు సంస్కృతంపై అదుపు సాధించిన ద్విజుల ఇళ్లలోకే ప్రవేశించింది. బెంగాలీ బ్రాహ్మణ జమీం దారీ కుటుంబానికి చెందిన రాజా రాంమోహన్ రాయ్ (1772– 1833) బ్రిటిష్ అధికారులతో తన కుటుంబ సంబంధాల ద్వారా ఇంగ్లిష్‌ని 18వ శతాబ్ది చివరలోనే నేర్చుకోగలిగాడు. భారత్‌లో సంస్కృత బ్రాహ్మణులకు, గొడ్డు మాంసం ఆరగించే బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడే అధికారులకు మధ్య భాషా బాంధవ్యం అలా ఏర్పడింది. రామ్మోహన్ రాయ్ తండ్రి రమాకాంత్ రాయ్ వైష్ణవ బ్రాహ్మణుడు. అయినా రామ్మోహన్ రాయ్‌ని సంస్కృతంతోపాటు పర్షియన్, ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అనుమతించాడు. రామ్మోహన్ రాయ్‌తో ప్రారం భమైన ఇంగ్లిష్ విద్య తర్వాత బెంగాల్లో మిషనరీగా జీవించిన విలియం కారే, రాయ్ అధ్వర్యంలో పాఠశాల విద్యా వ్యవస్థగా మారింది. ఆధునిక భారతదేశంలో రెండో అతి విశిష్ట వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ (1825–1917). ఇతను పార్సీ జొరాస్ట్రియన్ గుజరాతీ కుటుం బంలో పుట్టాడు. ఎల్ఫిన్‌స్టోన్ ఇనిస్టిట్యూట్ స్కూల్లో చదువు కున్నాడు. ఇది బహుశా బాంబే ప్రావిన్స్‌లోనే మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్ అయివుంటుంది. బరోడా రాజు షాయాజీరావు గైక్వాడ్–3 సంరక్షణలో పెరిగిన నౌరోజీ తర్వాత బరోడా రాష్ట్రానికి దివాన్ అయ్యాడు. పార్సీ కమ్యూనిటీలో చాలాతక్కువ జనాభా ఉన్న ప్పటికీ విద్యలో చాలాముందుండేది. నౌరోజి తర్వాత బ్రిటిష్ పార్ల మెంటు సభ్యుడయ్యారు. తర్వాత 1885లో స్కాటిష్ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి ఏఓ హ్యూమ్‌తో కలిసి భారత జాతీయ కాంగ్రెస్‌ని స్థాపించారు. విద్యావంతులైన భారతీయులతో కలిసి భారత ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని హ్యూమ్ కోరుకున్నారు. నౌరోజీ కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలేకి (1827–1890) దాదాపు సమకాలికుడే కావచ్చు. కానీ నౌరోజీ తన కమ్యూనిటీ విద్యా నేపథ్యం వల్ల బరోడా మహారాజు నుంచే కాకుండా బ్రిటిష్ అధికారులనుంచి కూడా సహాయం పొందగలిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బరోడా మహారాజుది శూద్ర కుటుంబం. కానీ ఆయన రాజరిక స్థానం బట్టి క్షత్రియ ప్రతి పత్తిని కట్టబెట్టారు. ఇలాంటి శూద్ర రాజరికాలన్నీ బ్రాహ్మణ మంత్రులు, పూజారుల ద్వారానే కొనసాగేవి. ఇలాంటి దయామయు డైన రాజు కూడా తన సొంత వర్గానికి చెందిన పిల్లలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు పంపేవారు కాదు. ఉన్నత విద్యకోసం వారిని ఇంగ్లండుకు పంపేవాడు కూడా కాదు. అయితే ఈ బరోడా రాజ కుటుంబమే తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు అమెరికాలోని కొలం బియా యూనివర్సిటీలో చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందిం చింది. అయితే వారి ఆర్థిక ప్రతిపత్తి ఏదైనా సరే శూద్రులను విద్య మాటెత్తితేనే భయపెట్టేవారు. విద్య శూద్రేతరమైనదనీ, శూద్రులు చదివినా, రాసినా దేవతలే ఆగ్రహిస్తారనీ పుకార్లు రేపేవారు. ఈ విధమైన భ్రమలూ, మూఢనమ్మకాలూ హిందూ చారిత్రక వార సత్వంలో భాగమైపోయాయి. విద్య అంటేనే శూద్రులు వణికిపోయే పరిస్థితిని కుల నియంత్రణపై పట్టున్న బ్రాహ్మణ భావజాలం వెయ్యి సంవత్సరాలుగా చొప్పిస్తూ వచ్చింది. విద్యపట్ల భయాన్ని శూద్రులు, దళితులలో మానసికంగానే రూపొందించేశారు. అందుకే బ్రిటిష్ వలసపాలనా కాలంలో కూడా శూద్రులు, దళితులు చదవడానికి, రాయడానికి నోచుకోలేక తమ తమ స్థానిక భాషల్లో మాట్లాడటం వరకే పరిమతమైపోయారు. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై ఆగ్రహం
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. శత్రుత్వం నిండిన సంస్థ మద్దతుగల అంతర్జాతీయ వేదికపై భారత దేశ పరువు, ప్రతిష్ఠలను మంటగలిపేందుకు అన్సారీ ప్రయత్నించారని మండిపడ్డారు. రాజ్యాం గ పదవిని నిర్వహించిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం ఆందోళనకరమన్నారు. కొన్ని పాకిస్తాన్ ప్రాయోజిత సంస్థల భారత వ్యతిరేక కుట్రలో భాగమవుతున్నాయన్నారు. ఈ సంస్థలు భారతదేశ సంస్కృతి, సమగ్రతపై గందరగోళం సృష్టించడానికి కుట్ర చేస్తున్నాయని నఖ్వీ ఆరోపించారు. అన్సారీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతదేశం బలమైన, శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, అందుకు ఇతరుల నుండి సర్టిఫికేట్ అవసరం లేదని పేర్కొన్నది. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ బుధవారం నిర్వహించిన చర్చలో అన్సారీ మాట్లాడుతూ హిందూ జాతీయవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వాసాల ప్రాతిపదికన ప్రజలను వేరు చేసే సాంస్కృతిక జాతీయ వాదం పెరుగుతోందన్నారు. -
కరోనా వ్యాక్సిన్‌పై ‘జాతీయవాదం’ తగదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అంతర్జాతీయంగా కొన్ని వేల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇతర దేశాలకన్నా తమ దేశమే ముందుగా వ్యాక్సిన్‌ను తమ దేశ ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండుసార్లు ప్రకటించారు. తాము కూడా ఇదే వైఖరి అవలంబిస్తామని భారత్, రష్యా దేశాలు కూడా ప్రకటించాయి. ఇలా పలు దేశాల డొమెస్టిక్ మార్కెట్లకు, అంటు సొంత ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని వ్యాక్సిన్ నేషనలిజం (వ్యాక్సిన్ జాతీయవాదం)గా వ్యవహరిస్తారని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ జాతీయవాదం హానికరమైనదని, అమెరికా లాంటి దేశాలకు ఇది మరింత ప్రమాదకరమని సెయింట్ లూహీ యూనివర్శిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ హెల్త్ లా స్టడీస్’ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆన సంతోష్ హెచ్చరించారు. ఇలా సొంత దేశ ప్రజల కోసం ముందుగా వ్యాక్సిన్‌ను దక్కించుకోవాలనుకోవడం వల్ల ప్రయోగాలు విజయవంతం కాకముందే వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. (డెక్సామిథాసోన్ వినియోగం, వాడకానికి డబ్ల్యూహెచ్ఓ ఓకే) జర్మనీకి చెందిన ప్రముఖ డ్రగ్ కంపెనీ ‘క్యూర్‌వాక్’ను గత మార్చి నెలలోనే వైట్‌హౌజ్ ప్రతినిధులు కలుసుకొని వ్యాక్సిన్ విషయమై చర్చలు జరిపారు. ఆ కంపెనీ తయారు చేయనున్న కరోనా వ్యాక్సిన్‌పై తమకు మాత్రమే ప్రత్యేక హక్కులు ఇవ్వాలంటూ బేరమాడారు. ఈ విషయం తెల్సిన జర్మనీ ప్రభుత్వం ‘జర్మనీని అమ్మకానికి పెట్టలేదు’ అంటూ తీవ్రంగా స్పందించింది. అలాగే అమెరికాకు చెందిన ‘బయోమెడికల్ అడ్వాన్స్డ్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ ఫ్రెంచ్ కంపెనీ సనోఫీకి కరోనా వైరస్ కోసం ముందస్తు చెల్లింపులు జరిపింది. దాంతో తాము కనిపెడుతున్న వ్యాక్సిలో ఎక్కువ భాగం ముందుగా అమెరికాకే వెళుతుందని ఆ కంపెనీ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. దాంతో ఆ కంపెనీపై ఫ్రెంచ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కంపెనీ తన వైఖరిని మార్చుకుంది. (కరోనాకు ఇందులో ఏది సరైన మందు?) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సహించే లేదా సిఫార్సు చేసే బయోటెక్ కంపెనీల జోలికి వెళ్లవద్దని అమెరికా, భారత్, రష్యా దేశాలు నిర్ణయించాయి. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఉంది. ఆ వ్యాక్సిన్‌లో అధిక భాగాన్నే దేశీయ అవసరాలకే ఉపయోగించాలంటూ ఇప్పటికే భారత్ ప్రభుత్వం ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇలా ప్రతి దేశం తమ దేశానికి చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే ఫర్వాలేదుగానీ, అభివృద్ధి చెందిన దేశాలతోపాటు వర్ధమాన దేశాలు, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ప్రమాదమని అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. దాని వల్ల అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడలేని దేశాలు బాగా దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ జాతీయవాదం కొత్తగా వచ్చింది కాదని, 2009లో కూడా ఇదే జరిగిందని వారు చెబుతున్నారు. -
జాతీయవాదంపై కాంగ్రెస్ నేతలకు క్లాస్
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయవాదాన్ని పెద్ద ఎత్తున ముందుకు తెచ్చిన పాలక బీజేపీకి దీటుగా కాంగ్రెస్ తమ పార్టీ నేతలకు ఈ అంశంపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయవాదంపై పార్టీ నేతలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాంతీయ స్ధాయిలో శిక్షణా శిబిరాలను నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన పార్టీ రాష్ట్ర శాఖల చీఫ్‌లు, సీఎల్పీ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి నడిపించి, దేశంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయవాద మూలాలపై ఈ శిక్షణలో పార్టీ నేతలకు పూర్తి అవగాహన కల్పిస్తారు. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేరు పడేలా చేయడంలో సఫలీకృతమవడం ద్వారా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన తీరుపై కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో హైలైట్ చేయనున్నారు. వివిధ వర్గాలకు తిరిగి చేరువ కావడం ద్వారా పార్టీ పునాదులను పటిష్టపరచుకోవడంపై కూడా అగ్రనేతలు ఈ శిక్షణా కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. -
గాంధీ కోసం ‘ఐన్‌స్టీన్ చాలెంజ్’
న్యూయార్క్: ప్రపంచంలో ద్వేషం, హింస, బాధలను అంతం చేసేందుకు భుజం, భుజం కలిపి నడుద్దామని విశ్వ మానవాళికి మోదీ పిలుపునిచ్చారు. గాంధీకి ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ను ఉటంకిస్తూ.. ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడు, కష్టాలను తీర్చేవాడు, అహంకారం లేనివాడే నిజమైన మానవుడని ఆ భక్తిగీతం అర్థమని వివరించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ద న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ‘భారత్‌కు, ప్రపంచానికి గాంధీ ఎందుకు కావాలి?’ శీర్షికతో మోదీ ఒక వ్యాసం రాశారు. మహాత్ముడిని అత్యుత్తమ గురువని, దారి చూపే వెలుగని, ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని విశ్వసించే లక్షలాది మందికి ఆయనే ధైర్యమని అందులో ప్రశంసించారు. ఈ సందర్భంగా ‘ఐన్‌స్టీన్ చాలెంజ్’ను మోదీ తెరపైకి తెచ్చారు. ‘ఇలాంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిపై తిరిగాడంటే భవిష్యత్ తరాలు విశ్వసించవేమో’అని మహాత్మాగాంధీ గురించి ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ప్రశంసను ప్రస్తావిస్తూ.. ‘గాంధీకి నివాళిగా, ఐన్‌స్టీన్ చాలెంజ్‌ను ప్రతిపాదిస్తున్నాను. గాంధీ ఆశయాలను ముందు తరాలకు ఎలా అందించగలం? అనేది అంతా ఆలోచించాలి. వినూత్న విధానాలు, ఆవిష్కరణల ద్వారా గాంధీజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లే విషయమై మేధావులు, టెక్ లీడర్లు, పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు కృషి చేయాలి’అని మోదీ కోరారు. గాంధీ ఆశయాల సాధన కోసం తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ‘భారత జాతీయతావాదం భారత్‌కు మాత్రమే పరిమితమైన సంకుచిత వాదం కాదని, విశ్వ మానవాళి సంక్షేమాన్ని కోరే వాదమని గాంధీజీ బలంగా నమ్మారు’అని మోదీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రం అంటే విదేశీ పాలన అంతం కావడం ఒక్కటే కాదని, రాజకీయ స్వాతంత్య్రం, వ్యక్తిగత సాధికారత అందులో ఇమిడి ఉన్నాయన్నారు. ‘ప్రతీ వ్యక్తి గౌరవంగా జీవించే ప్రపంచాన్ని ఆయన కలగన్నారు. పేదల సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని అంతా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ భూమిపై నివసిస్తున్న మనం అవని సంక్షేమానికి, దానిపై ఉన్న వృక్ష, పశు, పక్ష్యాది సమస్త ప్రాణుల సంక్షేమానికి బాధ్యులుగా ఉండాలి’అని పిలుపునిచ్చారు. -
మోదీ మంత్ర
భారతావని కమలవనమయ్యింది. చౌకీదార్ ప్రభంజనం సృష్టించాడు. చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు విసిరిన సవాళ్లు ఈ సునామీలో కొట్టుకుపోయాయి. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలేవీ పని చేయలేదు. మోదీ మంత్రానికి ఓటర్లు ముగ్ఢులైపోయారు. ఎన్డీయేకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. ప్రధానిగా ఎన్నికల బాధ్యత అంతా తన భుజస్కంధాలపైనే వేసుకుని నడిపించి, కేవలం తన వ్యక్తిగత చరిష్మాతో ఎన్డీయేని మరోసారి విజయపథంలో నడిపిన నరేంద్ర మోదీ.. ఇందిరాగాంధీ తర్వాత మళ్లీ అలాంటి ఘనతను సాధించారు. పార్టీకి మరో ఐదేళ్ల అధికారాన్ని కానుకగా ఇచ్చారు. పైకి కన్పించని, నిశ్శబ్ద తరంగంలా వీచిన మోదీ గాలి హిందీ రాష్ట్రాలతో పాటు తూర్పు, పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలనూ కుదిపేసింది. నోట్ల రద్దు, జీఎస్టీ దెబ్బలనుంచి పుంజుకుని.. 2016 నవంబర్‌లో మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రూ.1,000, రూ.500 నోట్లను మార్పిడి చేసుకునేందుకు జనం పరుగులు పెట్టారు. ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బే పడింది. వేరే నాయకులెవరైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కూడా దేశవ్యాప్తంగా గందరగోళం సృష్టించింది. ఈ నిర్ణయానికి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మోదీ వీటన్నిటినీ సమర్ధంగా ఎదుర్కొన్నారు. తర్వాత అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతులకు ఆదాయ కల్పన, భారీ ఆరోగ్య బీమా పథకం, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ వంటి పథకాలు, హామీలు తిరిగి మోదీ పుంజుకునేలా చేశాయి. అవినీతిని అరికట్టే క్రమంలో దేశానికి తాను కాపలాదారు (చౌకీదార్)నని కూడా మోదీ చెప్పుకున్నారు. రాహుల్ వైఫల్యం ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి కాంగ్రెస్‌లో కొత్త ఆశలు నింపింది. ఈ నేపథ్యంలో మోదీ లక్ష్యంగా చౌకీదార్ చోర్ హై (కాపలాదారే దొంగ) అనే నినాదాన్ని, రఫేల్ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. పదే పదే ఇవే అంశాలను వల్లెవేశారు. రఫేల్ కేసులో సుప్రీం క్లీన్చిట్ ఇచ్చినా తీర్పును ‘చౌకీదార్ చోర్ హై’ నినాదానికి తప్పుగా ఆపాదించి చివరకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. ఈ నినాదాలు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను తప్ప మిగతావారిని ఆకర్షించలేక పోయాయి. మరోవైపు రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. ఇదే సమయంలో యూపీఏ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అనే ప్రశ్నకు కూడా కాంగ్రెస్ వద్ద స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. అదే సమయంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తామూ ప్రధాని రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా స్పష్టంగా ప్రకటించలేని కాంగ్రెస్ నిస్సహాయత బీజేపీకి కలిసొచ్చింది. మా వైపు మోదీ.. మీ వైపు ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా బీజేపీ విజయం సాధించింది. అలాగే పొత్తుల విషయంలో కూడా మోదీ పరిణతితో వ్యవహరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో పొత్తు పెట్టుకోవడం ఇందుకు ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూస్తే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమయ్యింది. అలాగే బీజేపీతో ముఖాముఖి పోరు జరిగే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ఆమెను ఒక అతిథి నటి మాదిరిగానే పరిగణించింది తప్ప పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. కేవలం ఉత్తరప్రదేశ్‌లో పట్టు సాధిస్తే చాలన్నట్టుగా వ్యవహరించి దెబ్బతింది. ఉత్తరప్రదేశ్‌లో మహాకూటమి వైఫల్యం కూడా బీజేపీకి లబ్ధి చేకూరేలా చేసింది. రెండుసార్లు ఘన విజయం.. 1984లో లోక్‌సభలో కేవలం రెండు సీట్లు కలిగిన బీజేపీ 2 సార్వత్రిక ఎన్నిక ల్లో ఘన విజయం సాధించడం ద్వా రా భారత రాజకీయాల్లో కాంగ్రెస్ ను తప్పించి సెంటర్ స్టేజిని ఆక్రమించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో 1996లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పడు 13 రోజులపాటు మొద టిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1998లో 13 నెలల పాలన తర్వాత లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ వాజ్‌పేయి నాయకత్వం.. పార్టీపై ఉన్న అస్పృశ్యత ముద్ర పోయి కొత్త కూటముల ఏర్పాటుకు దోహదపడింది. అది ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పా టుకు దారితీసింది. 2014లో బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. అమిత్ షా బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ–షా 18 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఈ ఎన్నికల్లో సైతం 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి దేశంలోనే బలమైన రాజకీయపార్టీగా బీజేపీ అవతరించేలా కృషి చేసింది. దేశభద్రత ప్రధాన అస్త్రంగా.. ఓట్ల లెక్కింపు జరుగుతూ ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతుంటే ఈ అంశాలతో పాటు మోదీ తన ప్రధానాస్త్రంగా చేసుకున్న దేశ భద్రత, జాతీయవాదం దేశవ్యాప్తంగా ఓటర్లను ఏవిధంగా ఆయనవైపు తిప్పాయో స్పష్టమైంది. కొన్ని కీలక రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. భారత్ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందని పలు సూచీలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి బాంబర్ దాడిలో 40 మంది సైనికులు ప్రా ణాలు కోల్పోవడం, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రశిక్షణ శిబిరంపై ఐఏఎఫ్ బాంబుల వర్షం (సర్జికల్ స్ట్రైక్స్) కురిపించిన తర్వాత జాతీయవాదం, దేశ భద్రతను, దేశభక్తిని మోదీ ఎన్నికల అస్త్రాలుగా చేసుకున్నారు. పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటూ ఉగ్రవాదుల శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులు వేయడంతో సమానమని చెప్పారు. రాహుల్ పేదలకు ఆర్థికసాయం అందించే ‘న్యాయ్’ పథకాన్ని ఆలస్యంగా ఎన్నికల ముందు ప్రచారంలోకి తెచ్చారు. దీనివల్ల దాదాపు సగం మంది ఓటర్లకు, ఎవరైతే ఆ పథకం వల్ల లబ్ధి పొందుతారో వారికే దాని గురించి తెలియకుండా పోయింది. -
ప్రేమించడమే నిజమైన జాతీయవాదం
అమేథీ/రాయ్‌బరేలీ: దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన జాతీయవాదమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తూర్పు యూపీ ఇన్చార్జ్ ప్రియాంకా గాంధీ తెలిపారు. కానీ దేశంపై గౌరవం, దేశ ప్రజలపై ప్రేమ బీజేపీలో తనకు ఏమాత్రం కన్పించడం లేదన్నారు. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, అవినీతి, పేదరికం వంటి నిజమైన సమస్యలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ప్రియాంక విమర్శించారు. ప్రజల గొంతుకను, అభిప్రాయాలను అణచివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ(సోనియా గాంధీ), అమేథీ (రాహల్ గాంధీ) లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాదానికి కొత్త నిర్వచనం.. ‘దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమించడమే నిజమైన దేశభక్తి అని నేను నమ్ముతా. కానీ బీజేపీ నేతలు చేస్తున్న పనుల్లో ఇది నాకెక్కడా కన్పించడం లేదు. జాతీయవాదం అంటే ప్రజలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం. నిజమైన దేశభక్తి అంటే ప్రజల బాధలను సావధానంగా వినడం. అంతేతప్ప దేశంలోని వ్యవస్థలను, రాజ్యాంగబద్ధమైన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం కాదు. మోదీ కావొచ్చు, మరే నేతయినా కావచ్చు.. ప్రజాగ్రహాన్ని పట్టించుకోకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్య.. ‘ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజలంతా ప్రేమించే భారత్‌ను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.10,000–రూ.20,000 అప్పు తీర్చలేక ఏటా 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వారి బ్యాంకు ఖాతాలకు రూ.2 వేలు పంపి మోసం చేయొచ్చని మోదీ భావిస్తున్నారు. ఇది నిజంగా రైతులను అవమానించడమే’ అని ప్రియాంక స్పష్టం చేశారు. నేను ఎవ్వరికీ భయపడను.. ‘నేను ఎవ్వరికీ భయపడను. పార్టీ ఆదేశాల మేరకే వారణాసి నుంచి నేను పోటీ చేయలేదు. యూపీలో పార్టీ పటిష్టత కోసమే ప్రచారం చేస్తున్నా. నా కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. అది వారి రాజకీయంలో భాగమే. స్కూలు టీచర్ లేక ప్రతిపక్ష నేత ఎవరైనా సరే వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే లక్ష్యంగా చేసుకుంటారు’ అని అన్నారు. పాములతో ప్రియాంక ఆటలు ప్రియాంక ప్రచారంలో భాగంగా కుచరియా గ్రామంలో పాములోళ్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పామును చేతిలోకి తీసుకుని ఆడించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్త అని హెచ్చరించినప్పటికీ ‘ఏం పర్లేదు’ అని జవాబిచ్చారు. అక్కడి పాములోళ్లతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. తన తల్లి సోనియాగాంధీ హయాంలో రాయ్‌బరేలీలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, 15 ఏళ్లుగా సోనియాగాంధీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా బీజేపీ అభ్యర్థి దినేశ్ప్రతాప్సింగ్తో పోటీ పడుతున్నారు. -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై శ్వేత జాతీయవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఎంత మాత్రం సహించనని స్పష్టం చేసింది. అలగే ఎలాంటి జాతి విద్వేషాన్ని, జాత్యహంకార ప్రకటనలు, ప్రసంగాలతో పాటు వేర్పాటువాద అంశాలను తమ ప్లాట్‌ఫాంపై అనుమతించబోమని వెల్లడించింది. వచ్చేవారం నుండి అమలుకానున్న ఈ నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌కు కూడా వర్తిస్తుందని ఫేస్బుక్ తెలిపింది. వ్యక్తులు, సంస్థలు ఫేస్‌బుక్‌తో తమ వ్యవస్థ, జాతి గొప్పతనం గురించి ప్రకటనలు చేయవచ్చు కానీ ఇవి మరొకరిని కించపరచకూడదని స్పష్టం చేసింది. దీంతోపాటు తీవ్రవాద గ్రూపుల సమాచారాన్ని గుర్తించి బ్లాక్ చేయగల సామర్థ్యాన్ని పెంచుకుంటామని వివరించింది. అలాగే ఇలాంటి వాటి గురించి శోధించే ఖాతాదారుల సమాచారాన్ని టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థలకు అందిస్తామని కూడా ఫేస్బుక్ వెల్లడించింది. న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ మసీద్‌లో శ్వేత జాతి ఉన్మాది సృష్టించిన మారణహోమంపై స్పందించిన ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. 50 మందిని పొట్టనబెట్టుకున్న ఈ కాల్పులను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. దీనిపై న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెన్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై నెలకొన్న ఒత్తిడి నేపథ్యంలో స్పందించిన ఫేస్బుక్ 24 గంటల్లో 1.2 మిలియన్ల వీడియోలను బ్లాక్ చేయడంతోపాటు, 3 లక్షల వీడియోల అప్లోడింగ్ను నిరోధించామని కూడా ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ తీరుపై పరోక్ష యుద్ధం
‘యుద్ధాలను అంతం చేసే యుద్ధం’గా ఎందరో అభివర్ణించిన తొలి ప్రపంచ సంగ్రామం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్‌లో ఆదివారం జరిగిన ప్రపంచాధినేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రాండ్ ‘జాతీయవాదం’పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ విరుచుకుపడిన తీరు వర్తమాన ప్రపంచంలోని వైరుధ్యాలకు అద్దం పట్టింది. అక్కడకు ఎందుకు రావలసి వచ్చిందో, దాని ప్రాధాన్యతేమిటో ట్రంప్‌కు బోధపడినట్టు లేదు. కనుకనే మేక్రాన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ముభావంగా ఉండిపోవడమే కాక, నాటి మహా సంగ్రామంలో మరణించిన అమెరికన్ సైనికులకు నివాళులర్పించాల్సిన కార్యక్రమానికి వర్షం వస్తున్నదన్న కారణాన్ని చూపి గైర్హాజరయ్యారు. ఇతర దేశాధినేతలందరూ ఎడతెగకుండా కురుస్తున్న వర్షంలోనే వారి వారి మృతవీరులకు ఘనంగా నివాళులర్పిస్తే ట్రంప్ మాత్రం తనకేమీ పట్టనట్టు ఉండిపోయారు. ఈ సంగ్రామం ద్వారా యూరప్ దాదాపు ఆత్మహత్య చేసుకున్నదని మేక్రాన్ చేసిన వ్యాఖ్యలో నిజముంది.సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని, ప్రకృతి వనరులను కబళించాలని, మార్కెట్లను చేజిక్కించుకోవాలని, సంపద పోగేసుకోవాలని దురాశపడిన జర్మనీ, రష్యా, బ్రిటన్ వంటి దేశాలు అందుకోసం పోటీలు పడి సైనిక బలగాలను పెంచుకున్నాయి. తమ పౌరుల్లో యుద్ధకాంక్షను పెంచి పోషించాయి. యూరప్ దేశాలన్నిటా పౌరుల్లో యుద్ధోన్మాదం ఆవరించింది. తమకు ముప్పు ముంచుకొచ్చిందని, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కలిసికట్టుగా పోరాడి, త్యాగాలకు సిద్ధపడితే తప్ప భవిష్యత్తులేదని ఆనాటి యువత నమ్మింది. సమరోత్సాహంతో ముందుకురికింది. కానీ జర్మనీ, రష్యా, బ్రిటన్వంటి కొన్ని దేశాలకు తప్ప ఈ యుద్ధం ఎవరికీ ఏదీ మిగల్చలేదు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లాగే ఇది కూడా అత్యంత రక్తసిక్తమైనది. ఇందులో కోటిమంది సైనికులతోపాటు 70 లక్షలమంది పౌరులు నేలకొరిగారు. లక్షలాదిమంది పౌరులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. రైతులను సైతం సైన్యాల్లోకి తరలించడంతో తిండిగింజలు పండించేవారు లేక ఆహార కొరత ఏర్పడింది. అప్పట్లో బ్రిటిష్ వలసగా ఉన్న మన దేశం నుంచి కూడా వేలాదిమంది ఆ యుద్ధంలో పోరాడి అసువులుబాశారు. అనేక దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశాల మధ్య కుదిరే స్నేహ ఒప్పందాలు శాంతిని తీసుకొస్తాయని అందరూ విశ్వసిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఘర్షణలతో సంబంధం లేని దేశాలను కూడా ఆ ఒప్పందాలు యుద్ధంలోకి ఈడ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఎంత భయానకమైనదో అప్పటి ఫ్రాన్స్ సైనికాధికారి మాటలే చెబుతాయి. ‘‘మానవాళి ఎంత పిచ్చిది? ఘోర నరమేథం అనదగ్గ ఇలాంటి పనికి పాల్పడాలంటే పిచ్చివాళ్లే అయి ఉండాలి. నా భావాలను వ్యక్తం చేయడానికి నాకు మాటలు కూడా దొరకడం లేదు. నరకం కూడా ఇంత భయానకంగా ఉండదు’’ అని ఆనాటి యుద్ధంలో పాల్గొన్న ఫ్రాన్స్ సైనికాధికారి ఆల్ఫ్రెడ్ జౌబరీ చనిపోయే ముందు తన డైరీలో రాసుకున్నాడు. స్వీయ ప్రయోజనాలతో కూడిన జాతీయవాదం అత్యంత ప్రమాదకరమైనదని, అదిప్పుడు తిరిగి తలెత్తుతున్నదని మేక్రాన్ చేసిన హెచ్చరిక ట్రంప్ తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అందరికీ దూరం జరగడం, అన్నిటినుంచీ తప్పుకోవడం, ఆధిపత్యం చలాయించాలని చూడటం భవిష్యత్తరాలకు అపచారం చేయడమేనని మేక్రాన్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ప్రపంచ దేశాల గమనాన్ని నిర్దేశిస్తున్న నిబంధనలను ట్రంప్ గత రెండేళ్లనుంచి తిరగరాసే యత్నం చేస్తున్నారు. ఆర్థిక రంగంలో, భద్రతా రంగంలో ఏ దేశానికి ఆ దేశం అమెరికా వైఖరిని అలుసుగా తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆడిపోసుకుంటున్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థపై చైనా సాగిస్తున్న ‘అత్యాచారాన్ని’ ఆపుతానని నిరుడు ఆయన హెచ్చరించారు. ఆ దేశం నుంచి దిగుమతయ్యే సరుకుపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు. అలాంటి హెచ్చరికలే భారత్‌కు కూడా చేస్తున్నారు. తమ కంపెనీలు ఉత్పత్తి చేసే సరుకులపై సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వలసదారులపై రోజుకో రకంగా విరుచుకుపడుతున్నారు. దేశ పౌరుల్లో వారిపై విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. భద్రత కల్పిస్తున్న అమెరికాకు నాటో దేశాలు తగిన మొత్తం ఎందుకు చెల్లించవని ప్రశ్నిస్తున్నారు. ఇరాన్‌తో రెండేళ్లక్రితం అమెరికా చొరవతోనే కుదిరిన అంతర్జాతీయ ఒడంబడిక నుంచి ఏకపక్షంగా బయటికొచ్చారు. పారిస్ వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ ఏకాభిప్రాయానికొచ్చి కుదుర్చుకున్న ఒప్పందం తనకు సమ్మతం కాదంటూ పేచీ పెడుతున్నారు. కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే దాన్నుంచి బయటికొస్తామంటున్నారు. ఇలాంటి చర్యలనే మేక్రాన్ పరోక్షంగా తప్పుబట్టారు. గతాన్ని మరిచిపోరాదని హెచ్చరించారు. ఆయుధాలకన్నా మనుషులే బిగ్గరగా మాట్లాడేందుకు దోహదపడుతున్న... సంఘర్షణలకన్నా స్నేహాన్నే కాంక్షిస్తున్న...ఒకనాటి శత్రువులు సైతం సంభాషించుకొనేందుకు అవసరమైన సంస్థలు నిర్మించిన ప్రపంచానికి ఇక్కడ చేరిన అధినేతలంతా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆయన మాటలు కాస్త అతిశయోక్తితో కూడుకున్నవే. అలాంటి ఆదర్శాలనే అందరూ త్రికరణశుద్ధిగా ఆచరించి ఉంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల కాలంలోనే రెండో ప్రపంచ యుద్ధం రాకపోయేది. ఆ తర్వాత వియత్నాం, కంబోడియా, లావోస్ తదితర దేశాలపై అమెరికా దండెత్తేది కాదు. ఇప్పుడు పేరుకు ప్రపంచ యుద్ధం లేకపోవచ్చు. కానీ అటువంటి దుష్ఫలితాలను సిరియా, సోమాలియా, ఇరాక్, లిబియా, పాలస్తీనావంటి దేశాల్లో లక్షలాదిమంది పౌరులు నిత్యం చవిచూస్తున్నారు. నిజమైన శాంతి ఏర్పడాలంటే, యుద్ధాలు తలెత్తకూడదనుకుంటే గత సంగ్రామాల దుష్ఫలితాలను అందరూ గ్రహించడమే మార్గం. అందుకు ఈ తరహా సంస్మరణ సమావేశాలు దోహదపడతాయి. -
‘జాతీయ’ ముసుగులో నకిలీ వార్తలు
లండన్/ న్యూఢిల్లీ: భారత్‌లో నకిలీ వార్తలు, వదంతుల వ్యాప్తిపై ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ సంచలన విషయాన్ని బయటపెట్టింది. దేశ నిర్మాణం, జాతీయవాద సందేశాలతో ఉన్న నకిలీ వార్తలను భారతీయులు సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారని బీబీసీ తెలిపింది. ఈ సందర్భంగా వీటిలోని నిజానిజాలను పరిశీలించడం లేదని వెల్లడించింది. హింసను రెచ్చగొట్టే సందేశాలను సోషల్‌మీడియాలో పంచుకునేందుకు భారతీయులు ఇష్టపడటం లేదనీ, అదే సమయంలో జాతీయవాద సందేశాలున్న వార్తలను షేర్ చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నారని చెప్పింది. సోషల్‌మీడియాలో నకిలీ వార్తలు వ్యాప్తిచేస్తున్న గ్రూపులకు, ప్రధాని మోదీ మద్దతుదారులకు మధ్య సంబంధముందని పేర్కొంది. భారత్, కెన్యా, నైజీరియాలో నకిలీ వార్తలపై అధ్యయనం చేసిన బీబీసీ సోమవారం తన నివేదికను విడుదల చేసింది. భావోద్వేగాల ఆధారంగా ఈ నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తి చేస్తున్నారని బీబీసీ తెలిపింది. ఈ విషయమై బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూప్ డైరెక్టర్ జేమీ అంగస్ మాట్లాడుతూ.. ‘నకిలీ వార్తలపై పశ్చిమదేశాల్లోని మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో సామాజిక మాధ్యమాల్లో మాత్రం జాతి నిర్మాణం అనే అంశం వాస్తవాలను మరుగున పడేస్తోంది. భారత్‌లో నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలో ట్విట్టర్‌లోని హిందుత్వ గ్రూపులు, వామపక్ష భావజాలమున్న వారికంటే ఎక్కువ సమన్వయంతో పనిచేస్తున్నాయి’ అని వెల్లడించారు. ‘బీబీసీ బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టు’ కింద అధ్యయనం చేపట్టామన్నారు. నకిలీల్ని పూర్తిగా అరికట్టలేం: ట్విట్టర్ నకిలీ వార్తల వ్యాప్తి అన్నది చాలా అంశాలతో కూడుకున్న విషయమనీ, దాన్ని పరిమిత చర్యలతో అడ్డుకోలేమని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న భారత్‌కు చేరుకున్న డోర్సీ.. ఢిల్లీ–ఐఐటీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లా డారు. నకిలీ వార్తలు, వదంతుల తొలగింపులో ట్విట్టర్ నిర్లక్ష్యంగా, నిదానంగా వ్యవహారిస్తోం దని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సహనశీలతే భారతీయత
ప్రణబ్ స్పందించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించినప్పటి నుంచి వస్తున్న వరుస విమర్శలకు నాగపూర్‌లో జూన్ 7వ తేదీననే జవాబిస్తానన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్.. చెప్పినట్లే ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం వేదికగా గురువారం ఆ విమర్శలకు జవాబిచ్చారు. అనుమానాలు తీర్చారు. సహనశీలతే భారతీయ ఆత్మ అని స్పష్టం చేశారు. జాతీయవాదం ఏ మతానికో, జాతికో సొంతం కాదని తేల్చి చెప్పారు. హిందూ, ముస్లిం, సిఖ్, ఇతర అన్ని వర్గాల సిద్ధాంతాల సమ్మేళనమే జాతీయవాదమని నిర్వచించారు. ద్వేషం సమాజ సామరస్యతను నాశనం చేస్తుందని, అభిప్రాయ బేధాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అసహనం, వితండవాదం, మతం ఆధారంగా భారత్‌ను నిర్వచించాలనుకునే ఏ ప్రయత్నమైనా చివరకు దేశ అస్తిత్వాన్నే పలుచన చేస్తుందని హెచ్చరించారు. కోపం, హింస, ఘర్షణల నుంచి శాంతి, సంతోషం, సామరస్యం దిశగా మనమంతా ముందుకెళ్లాలన్నారు. నాగపూర్: ద్వేషం, అసహనం దేశ అస్తిత్వాన్ని బలహీనపరుస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయంలో గురువారం స్వయం సేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు జరిపిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆ తరువాత ప్రణబ్ స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ మన్నించడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. దేశం దృష్టి అంతా ఈ కార్యక్రమం పైనే ఉంది. కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ.. దేశం, జాతీయవాదం, దేశభక్తిపై తన ఆలోచనలను పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. శతాబ్దాల భారత చరిత్ర, ముస్లిం దురాక్రమణలు, వివిధ సామ్రాజ్యాల ఏర్పాటు, బ్రిటిష్ పాలన..తదితర భారత చరిత్రలోని పలు ముఖ్యమైన ఘట్టాలను, ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ► ముందుగా మనం దేశం, జాతీయవాదం, దేశభక్తి అనే మూడు పదాల డిక్షనరీ అర్థాలను తెలుసుకుందాం. ► దేశమంటే.. ఒకే సంస్కృతి, ఒకే భాష, చరిత్ర, అలవాట్లను కలిగి ఉన్న ప్రజల సమూహం. జాతీయవాదం అంటే.. ఒక దేశానికి ఉండే గుర్తింపు, ఆ దేశ ప్రయోజనాలకు ఉండే మద్దతు. దేశభక్తి అంటే ఒకరికి తమ దేశంపై ఉండే ఆత్మసమర్పణ, నిబద్ధత. ► భారత్ ఓ బహిరంగ సమాజం.. పట్టు, సుగంధ ద్రవ్యాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమైంది. వీటి వాణిజ్య మార్గాల ద్వారా మన సంస్కృతి, విశ్వాసం వంటివి వ్యాపారులు, మేధావుల ద్వారా కొండలు, లోయలు, సముద్రాలు దాటి ప్రపంచమంతా వ్యాపించాయి. హిందుత్వంతో సహా బౌద్ధం మధ్య ఆసియా, చైనాలకు పాకింది. మెగస్తనీస్, హుయనుత్సాంగ్ వంటి వారు భారత సమర్థవంతమైన పాలనా విధానం, గొప్ప మౌలికవసతులతో కూడిన వ్యవస్థలను తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. తక్షశిల, నలంద, విక్రమశిల, వలభి, సోమపుర, ఓదంతపురి వంటి విశ్వవిద్యాలయాలు మన పురాతన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. చాణిక్యుడి అర్థశాస్త్రం నాటి పరిపాలన తీరుకు నిదర్శనం. ► ఆ తర్వాత దేశమంతా విస్తరించిన 16 మహాజనపదాలు, చంద్రగుప్త మౌర్యుడు గ్రీకులకు ఓడించి బలమైన భారత సామ్రాజ్యాన్ని నిర్మించడం, తర్వాత అశోకుడు ఆదర్శవంతమైన పాలనను అందించడం.. గుప్తులతోపాటు ఎందరో రాజులు ముస్లిం దురాక్రమణ దారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. 300 ఏళ్లపాటు ముస్లిం పాలకులు దేశాన్ని పాలించడం ఇవన్నీ దేశ చరిత్రలో మైలురాళ్లు. వ్యాపారం కోసం వ చ్చిన బ్రిటిషర్లు 190 ఏళ్లు దేశాన్ని తమ బానిసత్వంలో ఉంచుకోవడం మధ్యలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇవన్నీ మనం మరిచిపోలేం. 2500 ఏళ్ల పాటు దేశంలో ఎన్నో రకాలుగా మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ 5వేల ఏళ్లకు పైగా మన నాగరిత ఇంకా కొనసాగుతుండటమే భారత్ గొప్పదనానికి నిదర్శనం. ► దేశాన్ని ఒక్కటిగా ఉంచడం, జాతీయత భావాన్ని పెంపొందించడంలో జవహార్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాల గంగాధర్ తిలక్ తదితరులను సేవలు మరిచిపోలేనివి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్లే మనమంతా ఒకే ఒకదేశంగా మారాం. ► భారతదేశం గొప్పదనం ఇక్కడి బహుళత్వం, సహనంలోనే ఉంది. శతాబ్దాలుగా మన ప్రజల సహజీవనం నుంచే ఈ బహుళత్వం పుట్టింది. లౌకికవాదం, సమగ్రత మన విశ్వాసాలు. ► మనం 130 కోట్ల మంది భారతీయలం.. 122 భాషల్లో, 1600 యాసల్లో మాట్లాడుకుంటాం. ఏడు ప్రధాన మత విశ్వాసాలను పాటిస్తాం. అయినా, ఒకే వ్యవస్థలో, జీవిస్తాం. ఒకే జాతీయజెండాను గౌరవిస్తాం. భారతీయత అనే ఒకే అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ► వివిధ అంశాలపై మనం వాదించుకోవచ్చు కానీ భిన్నాభిప్రాయాలుండకూడదని చెప్పకూడదు. పరస్పర విరుద్ధ ఆలోచనలున్నప్పటికీ చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలి. ► శాంతిపూర్వకమైన అస్తిత్వం, కరుణ, జీవితంపై గౌరవం, సామరస్యం వంటివి భారత నాగరికతలోని సహజ సూత్రాలు. ► చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగిన ప్రతిసారీ.. భారతమాత ఆత్మ క్షోభిస్తుంది. మన సామరస్యపూర్వక సహజీవనాన్ని అనవసర కోపతాపాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. అహింసాయుత సమాజం మాత్రమే ప్రజలంతా ప్రజాస్వామ్య విధానంలో భాగస్వాములయ్యేలా చేస్తుంది. ప్రత్యేకంగా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మార్గం చూపిస్తుంది. కోపం, హింస, ఘర్షణ నుంచి శాంతి, సామరస్యం, సంతోషం మార్గంలో మనమంతా పయనించాలి. ► దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఇటీవలి అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. సంతోషం. కానీ సంతోషకర సూచీలో మాత్రం మనం ఇంకా వెనకబడే ఉన్నాం. ► ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే రాజు సంతోషంగా ఉంటాడు. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమం. తనకు ఇంపుగా ఉన్నదానికంటే ప్రజలకు మేలు చేసే పనిని చేయడమే రాజు ముఖ్యమైన ధర్మం. ప్రజల విషయంలో రాజు ఎలా ఉండాలనేదాన్ని కౌటిల్యుడు బాగా వివరించారు. ► శతాబ్దాలుగా ఉన్న ఐకమత్యం, ఆత్మీయీకరణ, అందరూ కలిసి జీవిచడమే మన దేశ గుర్తింపు. ► ‘ఒకే భాష, ఒకే మతం, ఒకే శత్రువు అనేది మన జాతీయవాదం కాదు. (ఆరెస్సెస్ ‘ఒకే దేశం– ఒకే సంస్కృతి’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ) ► ప్రతిరోజూ మనచుట్టూ హింస పెచ్చుమీరటాన్ని గమనిస్తున్నాం. హింస, భయం, అవిశ్వాసం ఇవన్నీ మన గుండెల్లో పాతుకుపోతున్నాయి. అందుకే ప్రజలను భయం, శారీరక, మానసిక హింస నుంచి స్వతంత్రులను చేయాలి. ► దేశంలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకువచ్చేందుకు లకి‡్ష్యంచిన హక్కుల పత్రం వంటిది భారత రాజ్యాంగం. ఇది 130 కోట్ల మంది భారతీయులు ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ► మహాత్మాగాంధీ, నెహ్రూలు పేర్కొన్నట్లు మన జాతీయతావాదం ఒక్కరికే పరిమితం కాదు, దూకుడు, విధ్వంసకరమైనది కాదు. అందరినీ కలుపుకుని పోవడమే జాతీయతావాదం. ► ప్రజలు వారి దైనందిన జీవితంలో చేయాల్సిన పనులకు సరైన మార్గదర్శకం చేయాలి. ఇదే సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. దీంతో సహజంగానే జాతీయతావాదం పెరుగుతుంది. ‘సంఘ్’ భారతీయులందరిదీ స్వయంసేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్ భాగవత్ నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని కోరుకుంటోందని, తమకు బయటివారంటూ ఎవరూ లేరని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తమ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవడంపై చర్చించడం అర్థరహితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత కూడా ప్రణబ్ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్ సంఘ్‌గానే ఉంటుందని అన్నారు. ఏటా తమ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, ఆ పరంపరలోనే ఈసారి ప్రణబ్ వచ్చారని అన్నారు. భిన్నాభిప్రాయాలున్నా మనమంతా భరతమాత పిల్లలమే అన్నారు. నాగపూర్‌లో హెడ్గేవార్ నివాసంలో ప్రణబ్, భాగవత్ అందరినీ కలుపుకుపోతున్నాం.. ‘ఆరెస్సెస్ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. మాకు బయటివారంటూ ఎవరూ లేరు. ఆరెస్సెస్ భారతీయులందరిదీ. భారత మాత ప్రతి ఒక్కరికీ తల్లి వంటిది. హిందువులు దేశానికి వారసులు. అందరినీ కలుపుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, దేశం పేరు ప్రతిష్టలను మరింత పెంచే కార్యకర్తలను తయారుచేయడమే ఆరెస్సెస్ లక్ష్యం. కుల,మత, ప్రాంత, వర్గ భేదాల్లేకుండా దేశమంతా ఒక్కటేననే భావనను నెలకొల్పుతున్నాం. అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా క్రమశిక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. ప్రజాస్వామ్య ఆలోచనే ఆరెస్సెస్ అస్తిత్వం. దేశం కోసం పనిచేయడాన్నే మేం విశ్వసిస్తాం. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర సమరంలో జైలుకెళ్లారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాతో కలిసి పనిచేశారు. జాతి నిర్మాణంలో సమాజమంతా భాగస్వామ్యమైనప్పుడే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది’ అని భాగవత్ అన్నారు. భారతమాత గొప్ప పుత్రుడు హెడ్గేవార్ నాగపూర్: ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్.. భారతమాత ముద్దుబిడ్డ అని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. హెడ్గేవార్ పుట్టిన ఇంటిని సందర్శించిన అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో ‘భారతమాత గొప్ప పుత్రుడికి ఘనమైన నివాళులర్పించేందుకు నేను ఇక్కడికొచ్చాను’ అని ప్రణబ్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగపూర్ నగరంలోని ఇరుకు వీధులగుండా హెడ్గేవార్ నివాసానికి ప్రణబ్‌ను దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ప్రణబ్ తన పాదరక్షలు తీసి లోపలకు వెళ్లారు. ఈ సందర్భంగా హెడ్గేవార్‌కు సంబంధించిన వివరాలను ప్రణబ్‌కు మోహన్ భాగవత్ వివరించారు. నాగపూర్‌లోని సంఘ శిక్షావర్గ తృతీయ కార్యక్రమానికి స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక అతిథులుగా ఆరెస్సెస్ ఆహ్వానించింది. ప్రణబ్ సూచనల్ని ఆచరిస్తారా: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ప్రణబ్ ప్రసంగం భారతీయ నాగరిక విలువలతో పాటు బహుళత్వం, లౌకికవాదం, అందర్ని కలుపుకుపోవడాన్ని ఆరెస్సెస్, బీజేపీలకు చూపిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విషయమై కాంగ్రెస్ నేత సూర్జేవాలా స్పందిస్తూ.. ‘ప్రణబ్ చేసిన విలువైన సూచనల్ని అంగీకరించి ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆలోననావిధానం, స్వభావం, ధోరణిని ఈరోజు మార్చుకుంటాయని ఆశిస్తున్నాం. తమ తప్పుల్ని అంగీకరించేందుకు ఆరెస్సెస్ సిద్ధమా? హింసాత్మక, అణచివేత లక్షణాలను విడిచిపెడుతుందా? మహిళలు, పేదలపట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఆరెస్సెస్ వదిలివేస్తుందా?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. నాగపూర్‌లో హెడ్గేవార్ -
జాతీయవాదమంటే దేశభక్తేనా?
జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తిం చడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయవాదమే. యుద్ధం.. యుద్ధ తంత్రంపై సహజంగానే నాకు ఆసక్తి ఎక్కువ. నేను పుట్టి, పెరిగిన పల్లె నేపథ్యమో.. దేశభక్తి భావమో కారణం కావచ్చు. మృగశిర కార్తె కాలంలోనే పుట్టలోంచి ఊసిళ్లు బయటికొచ్చినట్టు.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే ఉగ్రవాదం, దేశభక్తి అంశాలు తెరమీదకు వస్తాయి. హిందూ జాతీయ వాదమే దేశభక్తి అని, శత్రు దేశంపై యుద్ధ వాతావరణంతోనే తరగని ఓటు బ్యాంకు సొంతం చేసుకోవచ్చని కాషాయం నేతలకు బాగా తెలుసు. లౌకిక్ భారత్ అనే మాట చెప్పకపోయినా హిందూ జాతీయ వాదమే దేశభక్తి అనే అంతర్గత వాతావరణాన్ని దేశంలో తీసుకొచ్చారు. ఎక్కడైతే పాలకులు ప్రజా రక్షణను విస్మరిస్తారో.. అక్కడ ప్రజలే ఆయుధాలు పట్టుకుంటారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తరువాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దును అంగీకరించటంతో పాటు ఎలాంటి కాల్పులకు కవ్వింపులకు పాల్పడవద్దని ఒప్పందం చేసుకున్నారు. అయినా అడపా దడపా అక్కడ అల్లర్లు, కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అలాంటి వాతావరణమే ఉంది. అయినా కాశ్మీరీలు మన అంతర్భాగం. పక్కన పాకిస్తాన్ సైనికులతో పోరాడటానికి, భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీరీ తిరుగుబాటుదారులను నిలవరించడానికి మధ్య స్పష్టమైన రక్షణ నిబంధనలు ఉన్నాయి. కళ్లు మూసుకుపోయిన పాము తన పిల్లలనే కొరికి తిన్నట్టుగా, సొంత దేశం పౌరుడినే వాహన బాయ్‌నెట్‌కు కట్టుకొని మన సైన్యాధికారి రక్షణ కవచంగా వాడుకోవడం తీవ్రమైన యుద్ధ నేరం కింద పరిగణించాల్సింది పోయి ఎన్ఎల్ గొగోయ్ అనే సైనిక మేజర్‌కు అవార్డుతో సత్కరించడం కశ్మీరీలను కవ్విం చటమే. దేశభక్తిని ఒలకబోసే బీజేపీ పాలనలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 1999 మే–జూన్ మాసంలో జరిగిన కార్గిల్ యుద్ధం బీజేపీ హయాంలోనే జరిగింది. మొదట దీన్ని కశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా చెప్పారు. భారత వాయుసేనలు వెళ్లి సమీప కొండల మీద పాకిస్తాన్ దళాలు మకాం వేశాయి అని చెప్పేవరకు పాలకులకు తెలి యదు. ఆ యుద్ధంలో మనం గెలిచాం అనిపించినా మన వైపు నుంచి 527 మంది సైనికులు మరణించగా, 1,363 మంది గాయపడ్డారు. అదే ఏడాది డిసెంబర్ మాసంలో నేపాల్ నుంచి ఇండియాకు వస్తున్న విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్ దేశంలోని కాందహార్ అనే ప్రాంతంలో దింపి కరుడు గట్టిన తీవ్రవాదులు మౌలానా మసూద్ అజాద్, ఒమర్ సయీద్ షేక్, హామ్మద్ జర్గర్‌లను స్వయంగా అప్పటి రక్షణ మంత్రి జశ్వంత్ సిన్హా ఉగ్రవాదులకు అప్పగించారు. ఈ ఏడాది కశ్మీర్ అల్లర్లు, రాజ్‌కోట్‌పై దాడి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు. భారతావనికి బలమైన గూఢచర్య వ్యవస్థ ఉంది. ఆర్ఏడబ్ల్యూ(రా) లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవి ఉగ్ర సమాచారాన్ని పసిగట్టి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదులు తండాలకు, తండాలుగా దేశ సరిహద్దుల్లో చొరబడుతుంటే ముందే పసిగట్టి చేసిన హెచ్చరికలను దాచిపెట్టి కాషాయపు దేశభక్తులు మౌనంగా ఉన్న ఫలితమే పై సంఘటనకు కారణం. భారతీయ సమాజంలో కొద్దిమంది మిగతా ప్రజ లంతా ఏం తినాలో.. ఎవరిని పెళ్లి చేసుకోవాలో.. ఏది దేశభక్తో.. ఎంతవరకు మాట్లాడాలో నిర్ణయిస్తున్నారు. ఒపీనియన్ మేకర్స్ వాళ్లే, మిగిలిన సమాజం అంతా వాళ్లకు కోరస్ పాడాలి. ఎక్కడైనా ధిక్కార స్వరం వినిపిస్తే వాడు దేశానికి ద్రోహం చేశాడనే వాతావరణాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారు. కాషాయం రంగు ఒంటి నిండా పులుముకున్న భజనపరులంతా ఏం చేసినా అది జాతీయవాదమేనట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవు, గో మాంసం గురించి మాట్లాడిన ఓ ఎంఐఎం నాయకుడి మీద పోలీ సులు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనకు బెయిల్ ఇప్పించింది పక్కా కాషాయ కండువా కప్పుకున్న న్యాయవాది. ఇక్కడ అది వృత్తి ధర్మం అంటుండొచ్చు. కానీ ఈ అంశంలో వృత్తిని, వ్యక్తిని వేర్వేరుగా చూడటం సాధ్యమేనా? జాతీయ వాదం అంటే సరిహద్దు వలయం అవతలి వైపు ఉన్న శత్రువులను గుర్తించడం మాత్రమేనా? అంతర్గతంగా పౌరుల మౌలిక వసతులు, జీవించే హక్కులను కాపాడటం కూడా జాతీయ వాదమే. సంపద సృష్టించే సామర్థ్యం ఉండి, దారిద్య్ర రేఖకు దిగువనే పేదరికంలో మగ్గిపోతున్న చేతివృత్తుల జాతులకు ఉపాధి కల్పించడం జాతీయవాదమే. తెలంగాణ ప్రాంత ఆచరణాత్మక ఇబ్బం దులను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్రూం, గొర్రెలు, చేపల చెరువుల పునరుద్ధరణ పథకాలు అమలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం హిందుత్వ జాతీయవాద భావజాలం సెంటిమెంటుతో అమిత్‌షా తెలంగాణ గడ్డ మీదకు అడుగుపెట్టారు. రజాకార్ ప్రభావిత గ్రామాల్లో తిరిగి తన పాచిక విసిరే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ సమాజం విభిన్నమైనది, విశిష్టత ఉన్న ప్రాంతం. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ సకల మతాల సాంస్కృతిక కేంద్రం. మత సామరస్యానికి ప్రతీక. ఇది అమిత్‌షా లాంటి వాళ్ల కంటి సైగలకు, ఉడుత ఊపులకు కదిలే ప్రాంతం కాదు. ఇక్కడ కాషాయపు గెంతులు కుప్పిగంతులు కాక తప్పదు. - సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త దుబ్బాక శాసన సభ్యులు, శాసనసభ అంచనాలు–పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
జాతీయవాదమంటే నాజీయిజమే
బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు ఉత్తరాఖండ్: జాతీయవాదం పై ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జాతీయవాదమంటే నాజీయిజమేనన్నారు. ఉత్తరాఖండ్‌లో మంగళవారం ‘జాతీయవాద సిద్ధాంతాలు ప్రపంచ రాజకీయాలపై వాటి పరిణామాలు’ అనే అంశంపై కుమోన్ సాహిత్య ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ సదస్సులో పలువురు వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ మాట్లాడుతూ..‘హిట్లర్, ముస్సోలినిలు తమ ప్రజల్లో ప్రేరేపించిన నాజీయిజం, ఫాసీజం ధోరణులే ఇప్పుడు జాతీయవాదానికి సమానార్థకంగా వాడుతున్నారన్నారు. అసలు జాతీయవాదం అనే పదమే ఖండించాల్సిన పదమన్నారు. నేనెప్పుడు జాతీయవాదం అనే పదాన్ని పలుకలేదని.. దేశ ధర్మమనే పలికాన న్నారు. సైద్ధాంతిక భావజాలం అనేది మనదేశం నుంచి వచ్చిందంటే నేను అంగీకరించను. అది పాశ్చాత్య దేశాలు, కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినదేన’న్నారు. -
'జాతీయ సమగ్రతను ప్రశ్నించడం ఫ్యాషనైపోయింది'
బెంగళూరు: ‘ఇటీవల కాలంలో కొంతమంది వ్యక్తులు, సంస్థలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు పేరుతో జాతీయ సమగ్రతను ప్రశ్నించడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. నేను ఈ పవిత్ర వేదిక నుంచి అటువంటి వారికి ఒకటే చెప్పదలుచుకున్నా... జాతీయ సమగ్రత లేకపోతే రాజ్యాంగమే ఉండదు. ప్రజలు కూడా అటువంటి వారిని దూరంగా ఉంచాలి’ అని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. మంగళూరులో ఆదివారం జరిగిన తిరంగయాత్రలో పాల్గొన్న అనంతరం మంగళూరు వర్శిటీలో జరిగిన సభలో ప్రసంగించారు. మునుపెన్నడూ లేనంతగా భారత దేశం రెండేళ్ల కాలంలో ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తుండడాన్ని ప్రపంచదేశాలన్నీ ఆశ్చర్యంతో చూస్తున్నాయన్నారు. ఇందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న విధానాలే కారణమన్నారు. దేశ భద్రత విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీ పడదన్నారు. దేశ సరిహద్దుల్లో చొరబాటుదారులను ఎదుర్కొనేందుకు గతంలోలాగా ఢిల్లీ నుంచి ఆదేశాలు అందే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. నిరసనల స్వాగతం... తిరంగ యాత్రలో పాల్గొనడానికి మంగళూరు వచ్చిన అమిత్‌షాకు నిరసనల స్వాగతం లభించింది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు మరికొన్ని విద్యార్థి సంఘాలు ఆయన రాకపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి, నల్లటి జెండాలు పట్టుకుని నగర వీధుల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. -
'ఆ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది'
న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగం అసమ్మతిని వ్యక్తపరచడానికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది. కానీ, దేశ విధ్వంసాన్ని అనుమతించదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నమ్మకాలు, మార్గాలకు జాతీయ భావజాలం దిశానిర్ధేశం చేస్తుందని తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని పునరుద్ఘాటించారు. రెండు రోజుల బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. 'భారత్ మాతా కీ జై' స్లోగన్ విషయంలో ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. భారత్ మాతాకీ జై స్లోగన్ విషయంలో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. శనివారం ఈడెన్ గార్డెన్లో జరిగిన పాకిస్తాన్, భారత్ మ్యాచ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. -
జాతీయవాద నిర్వచనానికి ముప్పు: రోమిలా థాపర్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వివాదం నేపథ్యంలో జాతీయవాదంపై జరుగుతున్న చర్చలో జాతీయవాదానికి ఉన్న నిర్వచనాన్ని మసకబార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్ ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయవాదమనేది ఏ ఒక్కరి గత చరిత్రపై ఆధారపడిఉండదని, అది విశ్వసించదగిన చరిత్రపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జేఎన్‌యూలో చరిత్ర-జాతీయవాదంపై జరిగిన చర్చలో ఆమె విద్యార్థుల నుంచి ప్రసంగించారు. చరిత్ర, జాతీయవాదానికి మధ్య ఉన్న సంబంధంపై చర్చకు విశ్వవిద్యాలయాలే సరైన వేదికలని పేర్కొన్నారు. జాతీయవాదమనేది ఏ ఒక్కరి గుర్తింపుపై ఆధారపడి ఉండదని, అది అందరిపై ఆధారపడి ఉంటుందన్నారు. -
'జాతీయతా భావం జెండా పండుగనాడే కాదు..'
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి గల్లీ వరకు మువ్వన్నెల పతాకం రెపరెపలాడే రోజున జాతి జనుల్లో జాతీయభావం పెల్లుబికటం సహజమేనని, అయితే జాతీయ పండుగలనాడేకాక అనునిత్యం పౌరులందరూ ఆ భావనను కలిగిఉండేలా ప్రోత్సహించాలన్నారు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ. 67వ గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఆయన నివాసంలో జెండా ఎగురవేసిన అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడారు. 'ప్రస్తుతం పౌరుల్లో దేశభక్తి పెంపొందించాల్సిన అవసరం ఉంది. రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో దేశభక్తి పెల్లుబికటం సహజమే. అయితే ఆ భావనను మిగతా రోజుల్లోనూ కలిగిఉండాలి. కేవలం కేవలం విద్యా, క్రీడల ద్వారానేకాక ఇతర అన్ని రంగాల ద్వారా ప్రజల్లో జాతీయతా భావాన్ని ద్విగుణీకృతం చేయాలి' అని అద్వానీ అన్నారు. ఎన్డీఏ హయాంలో భావస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందన్న ఆరోపణలపై స్పందిస్తూ 'బ్రిటిష్ వారితో పోరాడిమరీ మనం స్వేచ్ఛను సాధించాం. ఒకవేళ మా ప్రభుత్వమే గనుక స్వేచ్ఛను హరించేప్రయత్నాలు చేస్తే ప్రజలు కచ్చితంగా పోరాడతారు. అయినా ఇప్పుడు భావస్వేచ్ఛకొచ్చిన ప్రమాదమేదీ లేదు. ఏదో జరిగిపోతోందనేది కల్పిత ప్రచారమేకానీ నిజంకాదు' అని తమ ప్రభుత్వం తీరును సమర్థించుకున్నారు బీజేపీ కురువృద్ధుడు. గత ఆదివారం పార్టీ చీఫ్ అమిత్ షా తనను కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, కేవలం ఆశీర్వచనాలు తీసుకునేందుకు షా తన ఇంటికి వచ్చారని అద్వానీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు నజ్మా హెఫ్తుల్లా, రాజీవ్ ప్రతాప్ రూడీ, సీనియర్లు మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత కుమార్ తదితర ముఖ్యనాయకులు అద్వానీ నివాసంలో జరిగిన గణతంత్ర్యవేడుకలకు హాజరైనవారిలో ఉన్నారు. -
బిజెపి నేతల ప్రసంగాలలో కొరవడిన జాతీయత: బొత్స
హైదరాబాద్: బిజెపి నేతల ప్రసంగాలలో జాతీయత కొరవడిందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. నిన్న ఇక్కడ జరిగిన 'నవభారత యువభేరీ' బహిరంగ సభలో బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఆక్షేపించారు. బొత్స ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సైన్యాన్ని కించపరచడమే జాతీయతా? అని ప్రశ్నించారు. భారత సైన్యం సామర్ధ్యాన్ని అవహేళన చేయడం తగదని సలహా ఇచ్చారు. మోడీ పుట్టక ముందే గుజరాత్ అభివృద్ధి చెందిందని చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలకే మోడీ పరిమితమయ్యారన్నారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం గురించి మోడీ మాట్లాడలేదన్నారు.