‘యుద్ధాలను అంతం చేసే యుద్ధం’గా ఎందరో అభివర్ణించిన తొలి ప్రపంచ సంగ్రామం ముగిసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్‌లో ఆదివారం జరిగిన ప్రపంచాధినేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రాండ్ ‘జాతీయవాదం’పై ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ విరుచుకుపడిన తీరు వర్తమాన ప్రపంచంలోని వైరుధ్యాలకు అద్దం పట్టింది. అక్కడకు ఎందుకు రావలసి వచ్చిందో, దాని ప్రాధాన్యతేమిటో ట్రంప్‌కు బోధపడినట్టు లేదు. కనుకనే మేక్రాన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ముభావంగా ఉండిపోవడమే కాక, నాటి మహా సంగ్రామంలో మరణించిన అమెరికన్ సైనికులకు నివాళులర్పించాల్సిన కార్యక్రమానికి వర్షం వస్తున్నదన్న కారణాన్ని చూపి గైర్హాజరయ్యారు. ఇతర దేశాధినేతలందరూ ఎడతెగకుండా కురుస్తున్న వర్షంలోనే వారి వారి మృతవీరులకు ఘనంగా నివాళులర్పిస్తే ట్రంప్ మాత్రం తనకేమీ పట్టనట్టు ఉండిపోయారు.
ఈ సంగ్రామం ద్వారా యూరప్ దాదాపు ఆత్మహత్య చేసుకున్నదని మేక్రాన్ చేసిన వ్యాఖ్యలో నిజముంది.సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని, ప్రకృతి వనరులను కబళించాలని, మార్కెట్లను చేజిక్కించుకోవాలని, సంపద పోగేసుకోవాలని దురాశపడిన జర్మనీ, రష్యా, బ్రిటన్ వంటి దేశాలు అందుకోసం పోటీలు పడి సైనిక బలగాలను పెంచుకున్నాయి. తమ పౌరుల్లో యుద్ధకాంక్షను పెంచి పోషించాయి. యూరప్ దేశాలన్నిటా పౌరుల్లో యుద్ధోన్మాదం ఆవరించింది. తమకు ముప్పు ముంచుకొచ్చిందని, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనడానికి కలిసికట్టుగా పోరాడి, త్యాగాలకు సిద్ధపడితే తప్ప భవిష్యత్తులేదని ఆనాటి యువత నమ్మింది. సమరోత్సాహంతో ముందుకురికింది. కానీ జర్మనీ, రష్యా, బ్రిటన్‌వంటి కొన్ని దేశాలకు తప్ప ఈ యుద్ధం ఎవరికీ ఏదీ మిగల్చలేదు. చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లాగే ఇది కూడా అత్యంత రక్తసిక్తమైనది. ఇందులో కోటిమంది సైనికులతోపాటు 70 లక్షలమంది పౌరులు నేలకొరిగారు. లక్షలాదిమంది పౌరులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. రైతులను సైతం సైన్యాల్లోకి తరలించడంతో తిండిగింజలు పండించేవారు లేక ఆహార కొరత ఏర్పడింది. అప్పట్లో బ్రిటిష్ వలసగా ఉన్న మన దేశం నుంచి కూడా వేలాదిమంది ఆ యుద్ధంలో పోరాడి అసువులుబాశారు.
అనేక దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశాల మధ్య కుదిరే స్నేహ ఒప్పందాలు శాంతిని తీసుకొస్తాయని అందరూ విశ్వసిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఘర్షణలతో సంబంధం లేని దేశాలను కూడా ఆ ఒప్పందాలు యుద్ధంలోకి ఈడ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఎంత భయానకమైనదో అప్పటి ఫ్రాన్స్ సైనికాధికారి మాటలే చెబుతాయి. ‘‘మానవాళి ఎంత పిచ్చిది? ఘోర నరమేథం అనదగ్గ ఇలాంటి పనికి పాల్పడాలంటే పిచ్చివాళ్లే అయి ఉండాలి. నా భావాలను వ్యక్తం చేయడానికి నాకు మాటలు కూడా దొరకడం లేదు. నరకం కూడా ఇంత భయానకంగా ఉండదు’’ అని ఆనాటి యుద్ధంలో పాల్గొన్న ఫ్రాన్స్ సైనికాధికారి ఆల్ఫ్రెడ్ జౌబరీ చనిపోయే ముందు తన డైరీలో రాసుకున్నాడు. స్వీయ ప్రయోజనాలతో కూడిన జాతీయవాదం అత్యంత ప్రమాదకరమైనదని, అదిప్పుడు తిరిగి తలెత్తుతున్నదని మేక్రాన్ చేసిన హెచ్చరిక ట్రంప్ తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అందరికీ దూరం జరగడం, అన్నిటినుంచీ తప్పుకోవడం, ఆధిపత్యం చలాయించాలని చూడటం భవిష్యత్తరాలకు అపచారం చేయడమేనని మేక్రాన్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ప్రపంచ దేశాల గమనాన్ని నిర్దేశిస్తున్న నిబంధనలను ట్రంప్ గత రెండేళ్లనుంచి తిరగరాసే యత్నం చేస్తున్నారు.
ఆర్థిక రంగంలో, భద్రతా రంగంలో ఏ దేశానికి ఆ దేశం అమెరికా వైఖరిని అలుసుగా తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆడిపోసుకుంటున్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థపై చైనా సాగిస్తున్న ‘అత్యాచారాన్ని’ ఆపుతానని నిరుడు ఆయన హెచ్చరించారు. ఆ దేశం నుంచి దిగుమతయ్యే సరుకుపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు. అలాంటి హెచ్చరికలే భారత్‌కు కూడా చేస్తున్నారు. తమ కంపెనీలు ఉత్పత్తి చేసే సరుకులపై సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. వలసదారులపై రోజుకో రకంగా విరుచుకుపడుతున్నారు. దేశ పౌరుల్లో వారిపై విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. భద్రత కల్పిస్తున్న అమెరికాకు నాటో దేశాలు తగిన మొత్తం ఎందుకు చెల్లించవని ప్రశ్నిస్తున్నారు. ఇరాన్‌తో రెండేళ్లక్రితం అమెరికా చొరవతోనే కుదిరిన అంతర్జాతీయ ఒడంబడిక నుంచి ఏకపక్షంగా బయటికొచ్చారు. పారిస్ వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ ఏకాభిప్రాయానికొచ్చి కుదుర్చుకున్న ఒప్పందం తనకు సమ్మతం కాదంటూ పేచీ పెడుతున్నారు. కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే దాన్నుంచి బయటికొస్తామంటున్నారు. ఇలాంటి చర్యలనే మేక్రాన్ పరోక్షంగా తప్పుబట్టారు. గతాన్ని మరిచిపోరాదని హెచ్చరించారు.
ఆయుధాలకన్నా మనుషులే బిగ్గరగా మాట్లాడేందుకు దోహదపడుతున్న... సంఘర్షణలకన్నా స్నేహాన్నే కాంక్షిస్తున్న...ఒకనాటి శత్రువులు సైతం సంభాషించుకొనేందుకు అవసరమైన సంస్థలు నిర్మించిన ప్రపంచానికి ఇక్కడ చేరిన అధినేతలంతా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న ఆయన మాటలు కాస్త అతిశయోక్తితో కూడుకున్నవే. అలాంటి ఆదర్శాలనే అందరూ త్రికరణశుద్ధిగా ఆచరించి ఉంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రెండు దశాబ్దాల కాలంలోనే రెండో ప్రపంచ యుద్ధం రాకపోయేది. ఆ తర్వాత వియత్నాం, కంబోడియా, లావోస్ తదితర దేశాలపై అమెరికా దండెత్తేది కాదు. ఇప్పుడు పేరుకు ప్రపంచ యుద్ధం లేకపోవచ్చు. కానీ అటువంటి దుష్ఫలితాలను సిరియా, సోమాలియా, ఇరాక్, లిబియా, పాలస్తీనావంటి దేశాల్లో లక్షలాదిమంది పౌరులు నిత్యం చవిచూస్తున్నారు. నిజమైన శాంతి ఏర్పడాలంటే, యుద్ధాలు తలెత్తకూడదనుకుంటే గత సంగ్రామాల దుష్ఫలితాలను అందరూ గ్రహించడమే మార్గం. అందుకు ఈ తరహా సంస్మరణ సమావేశాలు దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment